రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి.. సగటున 50 శాతానికి పైగా పెరుగుదల
గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా బాదుడు
పెనుకొండలో ఏకంగా 78 శాతం పెంపు
గిరిజన ప్రాంతమైన పాడేరులో అయితే 73 శాతం..
రాయలసీమలోని అత్యధిక ప్రాంతాల్లో భారీగా వడ్డన
భవనాలు, గుడిసెలను కూడా వదలకుండా పెంపు
భూముల విలువలే కాదు.. నిర్మాణాల విలువలకూ రెక్కలు
రూ.13,500 కోట్ల ఆదాయం కోసం ప్రజల నడ్డివిరిచిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. స్థిరాస్థుల మార్కెట్ విలువలను భారీగా పెంచడం ద్వారా ప్రజల నడ్డివిరుస్తోంది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, నివాస భవనాలను వేటినీ వదలకుండా వాటి విలువల్ని అమాంతం పెంచేసింది. అర్బన్ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇష్టానుసారం సవరించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పెరుగుదల 50 శాతానికి పైగానే ఉండగా కొన్ని ప్రాంతాల్లో 80 శాతానికి దగ్గరగా ఉంది. ఇక శనివారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పెరుగుదల అమల్లోకి వచ్చింది. షాక్ కొట్టేలా పెరిగిన కొత్త మార్కెట్ విలువల ప్రకారమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో జనం లబోదిబోమంటున్నారు. భూముల విలువలే కాకుండా నిర్మాణాల విలువలను (స్ట్రక్చర్ రేట్లు) కూడా పెంచిపారేశారు. ఇళ్లు, అపార్టుమెంట్లు, రేకుల షెడ్లు, పూరిళ్లు, ఖాళీ స్థలాల విలువల్ని పెంచడంతో ప్రజలపై ఇంకా భారం పెరిగిపోయింది.
రాయలసీమ ప్రాంతంలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పెరుగుదలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు జనం వెనుకాడుతున్నారు. ఇందుకు ఉదాహరణే.. శుక్రవారం వరకూ కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శనివారం వెలవెలబోయాయి.
పెనుకొండలో భారీగా..
సత్యసాయి జిల్లా పెనుకొండలో అత్యధికంగా మార్కెట్ విలువల్ని 78 శాతం పెంచారు. మడకశిర ప్రాంతంలో 69 శాతం పెంచారు. గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో 73 శాతం పెరుగుదల ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి డోర్ నెంబర్ల వారీగా అక్కడి విలువల్ని నిర్థారించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయనే నెపంతో కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా రేట్లు పెంచారు. అలాగే, కొత్తగా ఏర్పడిన వాణిజ్య స్థలాల డోర్ నెంబర్లను సేకరించి వాటిపై భారం మోపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూములతోపాటు కొత్తగా వ్యయసాయేతర భూములుగా మారిన వాటి వివరాలు సేకరించి వాటి రేట్లూ పెంచారు.
జాతీయ రహదారులు, ప్రధాన రహదారులే కాకుండా ఓ మోస్తరు రహదారుల వెంట, వాటి చుట్టుపక్కల ప్రాంతాల భూముల విలువలను పెంచారు. ఇందుకోసం ఎన్నడూ లేనివిధంగా భూముల క్లాసిఫికేషన్లు కూడా మార్చారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు అవసరమైతే నాలుగు రేట్లు నిర్థారించారు. వ్యవసాయ భూముల్లో మెట్ట, మాగాణి కాకుండా వాటిలోనూ రెండు, మూడు రేట్లు పెట్టారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా నివాస, వాణిజ్య ప్రాంతాల్లోనూ వీలును బట్టి రెండు, మూడు రేట్లు పెట్టారు. బండి ఆత్మకూరు, బనగానపల్లె, కోయిలకుంట్ల, దువ్వూరు, అవుకు తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల 50 నుంచి 60 శాతానికి పైగా ఉంది. వెంకటగిరి, నందికొట్కూరు, ప్యాపిలి, హిందూపురం, గజపతినగరం, మంగళగిరి, తెనాలి, బాపట్ల, జమ్మలమడుగు, చంద్రగిరి, గూడూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పెంచారు.
గజానికి రూ.5 వేలు పెరిగింది..
⇒ ఇదిలా ఉంటే.. విజయవాడలోని వాణిజ్య ప్రాంతమైన బీసెంట్ రోడ్డు ఏరియాలో గజం విలువను రూ.5 వేలు పెంచారు. గతంలో రూ.1.10 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.1.15 లక్షలకు పెరిగింది.
⇒ గవర్నర్‌పేట ప్రాంతంలోనూ గజం 1.09 లక్షల నుంచి 1.15 లక్షలకు పెరిగింది.
⇒ గాందీనగర్‌లో రూ.58 వేల నుంచి రూ.64 వేలకు పెంచారు.
⇒ గురునానక్ నగర్ కాలనీలో గజానికి రూ.3 వేలు పెంచారు.
⇒ విశాఖపట్నంలోని దేశివానిపాలెంలో గజం రూ.1.19 లక్షల నుంచి నుంచి రూ.1.26 లక్షలకు పెరిగింది. జగదాంబ సెంటర్, వన్‌టౌన్, డాబా గార్డెన్స్, ఎంవీపీ కాలనీ వంటి చోట్లా గజానికి రూ.5 వేలకు పైనే పెరిగింది.
⇒తిరుపతి జిల్లాలోని రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లోనూ గజానికి రూ.2 నుంచి రూ.3 వేలకు పెంచారు.
⇒ కొన్నిచోట్ల 50 శాతం పెరుగుదలతో రూ.30 లక్షలున్న ఆస్థి విలువ రూ.45 లక్షలకు పెరిగింది. దీంతో గతంలో దీనిపై రూ.2.30 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు రూ.3.5 లక్షల వరకు కట్టాల్సి వస్తోంది. అంటే అదనంగా 1.20 లక్షల భారం పడుతోంది.
రూ.13,500 కోట్ల ఆదాయమే లక్ష్యం..
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా ప్రజల నడ్డివిరిచి ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా మార్కెట్ విలువల్ని చంద్రబాబు ప్రభుత్వం సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,500 కోట్ల ఆదాయాన్ని సాధించే లక్ష్యంతో ఈ పెరుగుదలను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం జనవరి నెలాఖరుకు రూ.10,800 కోట్ల ఆదాయం సమకూరాలి. కానీ, రూ.7,500 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచి్చంది. జనవరి వరకే రూ.3,300 కోట్ల లోటు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రాబోయే రోజుల్లోనూ ఆదాయం పెరిగే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు భారీగా మార్కెట్ విలువల్ని పెంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే ప్రజలు ఈ రేట్లు చూసి షాక్‌కు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment