![LIC Bima Sakhi Yojana is quite promising Within just one month of its launch has garnered over 52,000 registrations](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/9/lic01.jpg.webp?itok=jXpXe6ZX)
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఇటీవల ప్రారంభించిన బీమా సఖి యోజనలో నెలలోపే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పథకంలో నమోదైన 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టారని పేర్కొంది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం లక్ష్యంగా ఎల్‌ఐసీ గతంలో తెలిపింది.
ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకం
దేశవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో బీమా సఖీలుగా పిలువబడే ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణ ఇస్తారు. దాంతో వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
లక్ష్యాలు, ప్రయోజనాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను పెంపొందించడం బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana) ప్రాథమిక లక్ష్యం. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను, వచ్చే మూడేళ్లలో 2,00,000 మంది మహిళలను ఈ పథకంలో భాగం చేయడం దీని లక్ష్యం. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి బీమాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఈ పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. దాంతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందకుండా మహిళలు తమ శిక్షణపై దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక వెసులుబాటు సహాయపడుతుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.
ఇదీ చదవండి: ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితా
అర్హతలు ఇవే..
కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మారి వారు విక్రయించే పాలసీల ఆధారంగా కమీషన్లు(Commissions) పొందవచ్చు. బీమా సఖి యోజన ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నెలలోనే 50,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరిలో 27,695 మంది మహిళలకు అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయగా, 14,583 మంది ఇప్పటికే పాలసీలను విక్రయించడం ప్రారంభించారు. ఏడాదిలోగా దేశంలోని ప్రతి పంచాయతీకి కనీసం ఒక బీమా సఖిని అందించాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామ్‌లో చేరిన గ్రాడ్యుయేట్ మహిళలను భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment