
10 శాతం ప్లాట్ల ఈసీలు చెక్ చేయాల్సిందే
లేఅవుట్ లేదా ప్లాట్ యజమాని డిక్లరేషన్ ఉంటేనే రిజిస్ట్రేషన్
ఎల్‌ఆర్‌ఎస్ నంబర్, డబ్బు చెల్లింపు రసీదును పరిశీలించాకే తుది నిర్ణయం
సబ్‌రిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్దికరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సర్క్యులర్ పంపారు. ఈ సర్క్యులర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదంచెల చెక్‌లిస్ట్‌ను పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్‌లిస్ట్‌లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ముందుగా ఆ లేఅవుట్‌లో 2020, ఆగస్టు 26 నాటికి 10 శాతం మేర ప్లాట్ల విక్ర యాలు జరిగాయని నిర్ధారించుకునేందుకు గాను ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ల(ఈసీ)ను చెక్ చేయాలి. అదే విధంగా ప్రత్యేక ఫార్మాట్‌లో ఆ 10 శాతం ప్లాట్ల వివరాలను ఇవ్వాలి. 10 శాతం ప్లాట్లు అమ్మిన అనంతరం లేఅవుట్ ప్లాన్ చెక్ చేయాలి. వీటితో పాటు ప్లాట్ లేదా లేఅవుట్ యజమానికి డిక్లరేషన్ ఇవ్వాలి.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు నంబర్‌తో పాటు ప్లాటు యజమాని ప్రభుత్వానికి చెల్లించిన మొత్తానికి రసీదును పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అన్న దానిపై సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
లేఅవుట్ యజమానులు ఇవ్వాల్సిన ప్రత్యేక ఫార్మాట్‌లో పొందుపర్చాల్సిన వివరాలివే..
జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్, లేఅవుట్ విస్తీర్ణం, లేఅవుట్‌లోని మొత్తం ప్లాట్లు, క్రయ, విక్రయ లావాదేవీలు జరిగిన 10 శాతం ప్లాట్లకు సంబంధించి ప్లాట్ల నంబర్లు, రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్లు, సంవత్సరం, ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీ జరిగింది అనే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment