సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీనితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీనం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను అనుమతించనున్నట్టు తెలిసింది.
ప్రస్తుతానికి ఆ ప్లాట్లకు ఫస్ట్ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment