ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాల్సిందే.. | KTR Fires on Congress Govt Over LRS | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాల్సిందే..

Published Tue, Mar 5 2024 1:53 AM | Last Updated on Tue, Mar 5 2024 1:53 AM

KTR Fires on Congress Govt Over LRS - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్‌

కాంగ్రెస్‌ సర్కారు మాట నిలబెట్టుకోవాలి: కేటీఆర్‌ 

అప్పట్లో ఎల్‌ఆర్‌ఎస్‌తో దోచుకుంటున్నారని మమ్మల్ని 

తప్పుబట్టి ఇప్పుడు మీరు దోపిడీ చేస్తున్నారా? 

25 లక్షల కుటుంబాలపై రూ.20 వేల కోట్ల 

భారం మోపితే ఊరుకోం 

ఎల్‌ఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి వేసిన కేసు ఏమైంది? 

రేవంత్, భట్టి, ఉత్తమ్, సీతక్కల మాటలు ఏమయ్యాయి? 

ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నట్టు వెల్లడి 

6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు.. 7న కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ...  

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్‌ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్‌ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్‌ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బులు కట్టవద్దు. 

ఆ మాటలేవీ గుర్తులేవా? 
తమ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్‌ఆర్‌ఎస్‌ – నో బీఆర్‌ఎస్‌’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్‌ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు.

మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్‌ఆర్‌ఎస్‌పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు.

ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే 
‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రెండు లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో కేటీఆర్‌ సమావేశమై.. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్‌ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం 
ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్‌తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం.    – కేటీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement