గ్రామ పంచాయతీ పరిధిలోని స్థలాలకు సర్కారు కళ్లెం
రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు
ప్లాట్లను అమ్ముకోలేక సామాన్య ప్రజలకు కష్టాలు
రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గుర్తించిన హెచ్‌ఎండీఏ
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్‌లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.
సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు.
సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.
ఏ చట్టం ప్రకారం చేర్చారు?
జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.
ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్‌ఆర్‌ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment