Mahbubnagar districts
-
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు
-
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు
సాక్షి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటీవలే పార్టీ కార్యకర్త వరద భాస్కర్‌ను పోలీసులు కొట్టారనే ఆరోపణపై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మరో పదిహేను మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ మహబూబ్‌నగర్ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగుతూ.. పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రాక
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. మధ్యా హ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని జిల్లా సమీకత కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు.ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు వివిధ అభివద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా ప్రగతి, వివిధ అభివద్ధి పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితర అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కష్ణారావు, జిల్లా ఇన్చార్జి దామోదర రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారు లతో సమీక్షించనున్నారు. సమావేశం అనంతరం భూత్పూర్ రోడ్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతిని ధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు. -
సీఎం జిల్లాపై పట్టెవరిది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుత లోక్‌సభ పోరు కూడా ఆసక్తికరంగానే మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీకే.అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్) నువ్వా..నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అ్రస్తాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. పదిసార్లు కాంగ్రెస్, మూడు దఫాలు బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్), తెలంగాణ ప్రజాసమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకొని, తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్: కొడంగల్ స్కీం, ముదిరాజ్‌లపై ఆశలుమహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు పర్యాయాలు పర్యటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.4వేల కోట్లతో చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్’పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురాకపోవడం, తగిన నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అంశాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవ ర్గా ల్లోని పలు మండలాల్లో నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చేరికల క్రమంలో పాత, కొత్త నేతల మధ్య వైరం ముదిరినట్టు సమాచారం. బీజేపీ: మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ మహిళానేత డీకే.అరుణ రెండోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. ‘విజయ్ సంకల్స్ యాత్ర’పేరుతో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసిన ఆమె.. నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. మోదీ చరిష్మా, కేంద్ర పథకాలు తన గెలుపునకు దో హదం చేస్తాయని బలంగా చెబుతున్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుల సాధనలో తనదే ముఖ్యపాత్ర అని ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు. అధికసంఖ్యలో ఉన్న ఎస్సీ సా మాజికవర్గ ఓట్లు తనకు కలిసివస్తాయనే ఆశతో ఉ న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు దీటు గా సమాధానం చెబుతూ తనదైన శైలిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే జితేందర్‌రెడ్డి, జలంధర్ రెడ్డి వంటి నాయకులు బీజేపీ ని వీడి కాంగ్రెస్‌లో చేర డం, ఆమెకు కొంత మైనస్‌గా మారినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్: కేసీఆర్‌పైనే భారం బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి రెండోసారి బరిలో నిల్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఇతర పార్టీల కంటే ఆలస్యం కాగా.. ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం.. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో ‘గులాబీ’శ్రేణుల్లో జోష్ నెలకొంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని..అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ తనదైన పంథాలో విమర్శలు గుప్పిస్తూనే..ఈ పార్లమెంట్ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు టార్గెట్‌గా ప్రసంగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొందని.. అందరూ కృషి చేస్తే మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు తథ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.ప్రభావం చూపే అంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా అచ్చంపేట–తాండూరు, కృష్ణా–వికారాబాద్ రైల్వే లేన్ పెండింగ్ గద్వాల–మాచర్ల లేన్‌కు అడుగులు పడకపోవడం నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్ తరలిపోవడంపై నిరసన గద్వాల, నారాయణపేటలో చేనేతలకు టెక్స్టైల్ పార్కు ఏర్పాటు డీకే అరుణ (బీజేపీ)వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్) శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్) 2019 ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు.. టీఆర్ఎస్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి4,11,402 (41.78 శాతం)బీజేపీ – డీకే అరుణ3,33,573 (33.88 శాతం)కాంగ్రెస్ – చల్లా వంశీచంద్‌రెడ్డి1,93,631 (19.67 శాతం) -
ఎంవీఎస్ కాలేజ్ లో ని మార్నింగ్ వాకర్స్ తో డీకే అరుణ ప్రచారం
-
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
పెళ్లింట విషాదం
భూత్పూర్: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు. ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐగా పనిచేస్తున్నారు. కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అతివేగమే కారణం.. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
కమలం కసరత్తు తెలంగాణ నుంచే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. 29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు. టికెట్లకు పోటీ ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్‌లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో 1.40కి మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటారు తర్వాత హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు. రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. -
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికలు ఫలితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజయం
జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి గెలుపు మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకిటి శ్రీహరి గెలుపు దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కే. రాజేశ్ రెడ్డి గెలుపు 32000 పైచిలుకు ఓట్లతో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు, రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి 4,389 ఓట్ల ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధి బర్రెలక్క ముందంజ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల గెలుపోటముల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. క్ర.సం నియోజకవర్గం భారాస కాంగ్రెస్ భాజపా ఆధిక్యం గెలుపు 1 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మిథున్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 2 జడ్చర్ల చర్లకోల లక్ష్మారెడ్డి అనిరుధ్ రెడ్డి చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ కాంగ్రెస్ 3 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 4 కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆల్లెని సుధాకర్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ 5 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కే. రాజేశ్ రెడ్డి దిలీప్ చారి కాంగ్రెస్ కాంగ్రెస్ 6 అచ్చంపేట (SC) గువ్వల బాలరాజు చిక్కుడు వంశీ కృష్ణ దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ కాంగ్రెస్ 7 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జి చిన్నారెడ్డి అశ్వత్థామ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 8 గద్వాల బండ్ల కృష్ణమోహన్డ్డి సరితా తిరుపతయ్య బోయ శివ భారాస భారాస 9 అలంపూర్ (SC) విజేయుడు ఎస్ఏ. సంపత్ కుమార్ రాజగోపాల్ భారాస భారాస 10 నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి డా. పర్ణికా చిట్టెం రెడ్డి కేఆర్ పాండురెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 11 కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి బంతు రమేష్‌కుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ 12 షాద్ నగర్ అంజయ్య యాదవ్ యెల్గనమోని శంకరయ్య అందె బాబయ్య కాంగ్రెస్ కాంగ్రెస్ 13 కల్వకుర్తి జైపాల్ యాదవ్ కశిరెడ్డి నారాయణరెడ్డి తల్లోజు ఆచారి కాంగ్రెస్ కాంగ్రెస్ 14 మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి వాకిటి శ్రీహరి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ -
మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాటు చేశాం: కలెక్టర్ రవినాయక్
-
ఏ పార్టీకీ పార్టీ టైమ్ కాదు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికలు హోరాహోరీగానే సాగనున్నాయి. ఈసారి ఏకపక్షంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండుసార్లు గులాబీ జెండా ఎగరేసిన బీఆర్ఎస్కు ఈసారి గట్టి పోటీనే ఉంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందగా..ఈసారి అంత సులువుగా గట్టెక్కే పరిస్థితులు లేవు. మెజారిటీ స్థానాల్లో నువ్వా.. నేనా అన్న విధంగా పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంటే.. అవినీతి ఆరోపణలు మరికొందరి విజయంపై ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ జిల్లాకు చెందిన నాయకుడు కావడం, కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారన్న ప్రచారం రాజకీయాలను ప్రభావితం చేస్తోందని అంటున్నారు. బీజేపీ ప్రధానంగా మక్తల్, మహబూబ్‌నగర్, కల్వకుర్తిపైనే ఆశలు పెట్టుకుంది. మిగిలినచోట్ల ఆ పార్టీకి పెద్దగా కలిసొచ్చే స్థానాలు లేవనే పరిస్థితే ప్రస్తుతానికి ఉంది. మహబూబ్‌నగర్ త్రిముఖ పోరు మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీజితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గత కొంత కాలం క్రితం వరకు బీజేపీ గాలి వీచినా, ప్రస్తుతం ఆ పార్టీలో కొంత స్తబ్ధత నెలకొంది. అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో సహజంగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. బీఆర్ఎస్ పాలన అంతా బెదిరింపులు, కేసులు, భూకబ్జాలు అంటూ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం ప్రధానాస్త్రంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అలంపూర్ అండ ఎవరికి? అలంపూర్‌లో ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం వర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్కే చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చెంతకు చేరారు. మరికొందరు ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇది సంపత్ కుమార్‌కు అనుకూలించే అంశం. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్ కూడా బరిలో ఉండడం, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉండడం ప్రధాన అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. మక్తల్ ముగ్గురు.. మక్తల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి, బీజేపీ అభ్యర్థి జలంధర్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, బీకేఆర్, నర్వ పీఏసీఎస్ మాజీ చైర్మన్ లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు పలువురు బడా నేతలు హస్తం గూటికి చేరారు. ఇది బీఆర్ఎస్కు మైనస్‌గా మారగా, కాంగ్రెస్‌కు ప్లస్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి దాదాపు 37 వేల ఓట్లు సాధించడంతో ఆయనపై సానుభూతి పెరిగింది. రెడ్డి సామాజికవర్గం ఆయన వైపు చూస్తుండడంతో పోరు కీలకం కానుంది. అంతేగాక ఆ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండటం, ఇటీవలే ప్రధాని మోదీ, మందకృష్ణమాదిగ పాల్గొన్న సభ నేపథ్యంలో మక్తల్ ఎన్నికల్లో జలంధర్‌రెడ్డికి కలిసొచ్చే అంశాలు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో జలంధర్‌రెడ్డి సమావేశం అవుతున్నారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులూ పోటాపోటీగా విజయం కోసం పోరాటం చేస్తున్నారు. గద్వాల ఎవరి అడ్డానో.. గద్వాలలో డీకే అరుణ పోటీలో లేకపోవడంతో ఎన్నికల్లో ప్రధాన పోటీ కాస్త బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కొనసాగుతోంది. బీజేపీ నుంచి బోయ శివారెడ్డి బరిలో ఉన్నా, బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుర్వ సామాజిక వర్గానికి చేరిన సరిత మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ బీసీ వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్లపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన అనుచరుల దందాలను కాంగ్రెస్ ప్రధానాస్త్రంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. అయితే బీఆర్ఎస్కు అన్ని మండలాలు, గ్రామాల్లో బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉండడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. నాగర్‌కర్నూల్ నువ్వానేనా.. నాగర్‌కర్నూలులో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనసేన నుంచి వంగ లక్ష్మణ్‌గౌడ్ బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వడంతో అసంతృప్తికి గురైన బీజేపీలోని ప్రధాన నాయకులు, అనుచరులు ఎక్కువగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో చేరారు. నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ పోరు నెలకొంది. జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ అభ్యర్థికి ఒకింత అనుకూలంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉండటంతో గట్టి పోటీ నెలకొంది. నారాయణపేట పోటాపోటీ నారాయణపేటలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ చిట్టెం ఫరిణికారెడ్డి, బీజేపీ నుంచి రతంగ్‌పాండురెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మ«ధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి ప్రజల్లో కాస్త్త మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఫరిణికారెడ్డికి ఉన్న కుటుంబ నేపథ్యబలం ప్రధాన భూమిక పోషిస్తోంది. అచ్చంపేట అమీతుమీ అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, బీజేపీ నుంచి సతీశ్ మాదిగ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే నెలకొంది. నియోజకవర్గంలో ప్రభుత్వంపై అసంతృప్తితోపాటు ఎమ్మెల్యేపై సైతం వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని మెజారిటీ మండలాల్లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరడం, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దేవరకద్ర ద్విముఖ పోరు దేవరకద్రలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండాప్రశాంత్రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా... బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోరు కొనసాగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అభివృద్ధి పనుల పేరిట కొందరు రూ.కోట్ల మేర కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ఈ అంశాలనే ప్రధానంగా తీసుకుని ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని... కాంగ్రెస్‌తోనే అందరికీ సంక్షేమం అంటూ మధుసూదన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. జడ్చర్ల జైకొట్టేదెవరికి? జడ్చర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే ఆయన అనుచరులైన జడ్చర్ల మున్సిపాలిటీ పాలకమండలి కొందరు సభ్యుల అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, మైనస్‌గా నిలుస్తున్నాయి. వీటినే కాంగ్రెస్ అభ్యర్థి అనిరుథ్‌రెడ్డి ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్ గాలి కలిసి వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే ఆయనకు అన్ని మండలాలపై పట్టు లేకపోవడం, ప్రచారంలో వెనుకబడడం మైనస్ అని చెప్పవచ్చు. కొల్లాపూర్ త్రిముఖ పోటీ కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా ఎల్లేని సుధాకర్‌రావు ఎన్నికల బరిలో ఉన్నారు. సుధాకర్‌రావు ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపులో ప్రభావం చూపనున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. షాద్‌నగర్ ఇద్దరి మధ్యే.. షాద్‌నగర్‌లో అధికార బీఆర్ఎస్కి గట్టి పట్టు ఉంది. అధికార పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్, ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు. అధికారపార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు, బీఆర్ఎస్ నుంచి కొనసాగిన వలసలు తనకు కలిసి వస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి వీర్ల శంకర్ భావిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన అందె బాబయ్య మోదీ బొమ్మతో పాటు తన సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకున్నారు. మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కీలకమైన పోటీ నెలకొంది. వనపర్తి నువ్వానేనా.. వనపర్తిలో బీఆర్ఎస్ నుంచి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరి అనూహ్య పరిస్థితుల్లో టికెట్ దక్కించుకున్న తూడి మేఘారెడ్డి, బీజేపీ నుంచి అనూజ్ఞారెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ ప్రభావం అంతంతే కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు హోరాహోరీగా ఉండనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డికి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశారనే పేరుంది. అయితే ఆయన వ్యవహార శైలిపై ప్రజలతోపాటు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దీంతో అహంకారానికి, ఆత్మగౌరవానికి పోరు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై వ్యతిరేకత ఇక్కడ ప్రధానాంశంగా నిలుస్తోంది. కొడంగల్ పాతకాపుల దంగల్ కొడంగల్‌లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి బంటు రమేష్ పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుంది. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు. పైగా కాంగ్రెస్ గెలిస్తే రేవంతే సీఎం అన్న ప్రచారం ప్రజల్లోకి వెళుతోంది. యూత్‌లో ఆయన పట్ల క్రేజ్ ఉండడంతోపాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి వంటి నాయకులు ఆయనకు మద్దతుగా అన్నీ తామై నిలుస్తుండడం, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండడం రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. కల్వకుర్తి ట్రయాంగిల్ కల్వకుర్తిలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీజేపీ నుంచి తల్లోజు ఆచారి బరిలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు జైపాల్‌యాదవ్‌పై సైతం వ్యతిరేకత ఉంది. ఇప్పటికే ఆయనకు చెందిన ముఖ్యమైన కేడర్ కాంగ్రెస్‌లో చేరారు. ఇది కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి కలిసి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు సాగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ మహబూబ్‌నగర్‌లో పరిస్థితి పోటాపోటీగా ఉంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టణాన్ని బాగానే అభివృద్ధి చేశారు. అయినా, ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే పోటీ. – వెంకటేశ్, మహబూబ్‌నగర్, ఆటో డ్రైవర్ రైతుబంధు బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశం అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. రైతుబంధు వల్ల రైతులు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మిగిలిన వర్గాలు ఏం చేస్తాయో చెప్పలేను. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. – వెంకటయ్య, రైతు, గోపులాపురం(దేవరకద్ర) ఇంటికొక ఉద్యోగం ఏమైంది? ఈ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి నెరవేర్చలేదు. పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక ఆగమవుతున్నారు. పరిస్థితి మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య పోటాపోటీగానే ఉంది. – కృష్ణమ్మ, రైతు, మరికల్ (నారాయణపేట) దళితబంధు కొందరికే ఇవ్వడంతో అసంతృప్తి గద్వాల నియోజకవర్గంలో ఇంకా ఎవరు గెలుస్తారో అప్పుడే చెప్పలేం. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగైనా మారిపోవచ్చు. అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. దళిత బంధు కొందరికి మాత్రమే రావడం పట్ల ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. పిల్లల ఉద్యోగాల విషయంలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. – వసంత్, రైతు, తప్పెట్లముర్స్ (గద్వాల) మక్తల్‌లో సానుభూతి పనిచేస్తుందా.. మక్తల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అంతు పట్టడం లేదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జలంధర్‌రెడ్డిపై సానుభూతి ఏమైనా పని చేస్తుందా అన్నది చూడాలి. – దేవదాసు, పెట్రోల్‌బంక్ పంపు బాయ్, మూలమల్ల (మక్తల్) -ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బొల్లోజు రవి -
జాతి కోసమే బతికిన నేతల ఆశయమేదీ?
దేశ స్వాతంత్య్రోద్యమంలో ఉన్నత పదవులే కాదు, ఉన్నదంతా ధారపోసిన మహానుభావులున్నారు. ఈ పోరాట స్ఫూర్తిలోంచే విలువలతో కూడిన రాజకీయం ఆవిర్భవించింది. ప్రజాసేవే లక్ష్యంగా...పైసాకి కూడా వెతుక్కునే గొప్ప నాయకులను భారతావని అందించింది. ఇవన్నీ చెబితే ఈ తరం నమ్ముతుందా? అవేవో పుక్కిట పురాణాలు అనుకుంటారు ప్రజలు. నేటితరం రాజకీయాలు వ్యవస్థను అలా తయారు చేశాయంటారు సీనియర్ నేత డీకే సమరసింహారెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నుంచి తిరుగులేని నేతగా సుదీర్ఘకాలం గెలిచిన శాసనసభ్యుడాయన. హోం, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ సహా కీలక మంత్రి పదవుల్లో సమర్థత నిరూపించుకున్న వ్యక్తి ఆయన. అసెంబ్లీ సమావేశాల ఉన్నతిలో ఆయన పాత్ర స్పష్టంగా కన్పిస్తుంది. రాష్ట్ర ఎన్నికల వేళ ఆయనను కలిసినప్పుడు ఎన్నో విషయాలు నెమరువేసుకున్నారు. అందులోంచి కొన్ని ఆయన మాటల్లోనే... రాజకీయాల్లో దూషణలు..అసభ్య పదజాలం.? ఒకరిపై ఒకరు దూషణలు.. అసభ్య పద ప్రయోగం..అనుచిత వ్యాఖ్యలు... ఇవీ నేటి రాజకీయాల్లో కనిపించేవి..బాధేస్తుంది..జాలేస్తోంది. అరే.. విధానపరమైన విమర్శలు చేస్తే తప్పేంటి? దీన్ని నేతలు ఎందుకు స్వీకరించడం లేదు. ప్రతి విమర్శలు గాడి తప్పుతున్నాయి. సిద్ధాంతపరమైన విమర్శలే రాజకీయాల్లో ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శనావాదం వచ్చేసింది. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. నేతలు ధన రాజకీయాల వైపే వెళ్తున్నారు. తేలికగా డబ్బు సంపాదిస్తున్నారు. దాన్ని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. సభా మర్యాద ముఖ్యం.. చట్టసభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నికయ్యే ప్రతీ ఎమ్మెల్యే దాన్ని గుర్తించాలి. చట్టసభల విలువలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేం అసెంబ్లీకి వెళ్తు న్నామంటే దృష్టంతా దానిపైనే ఉండేది. మంత్రిగా సమాధా నంచెప్పాల్సివస్తే..ముందే విద్యార్థిలా ప్రిపేర్ అయ్యేవారం, చాలామంది మంత్రులు అసెంబ్లీలో అధికారులపై ఆధారపడకుండానే సమాధానమిచ్చే వారు. తమ శాఖలపై అంత కమాండ్ ఉండేది. అసెంబ్లీ నియమాలు..ఏ అంశాన్ని ఏ రూల్ కింద లేవనెత్తాలి... వాకౌట్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ పార్లమెంటరీ నిబంధనలు చదివినప్పుడే తెలుస్తాయి. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదివేవారం. అసెంబ్లీలో చిన్నమాట తప్పుగా మాట్లాడినా పెద్ద వివాదమయ్యేది. మాట్లాడేప్పుడు అది గుర్తుండేది. కానీ ఇప్పుడేంటి? దారుణమైన భాష మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో ప్రజలు లైవ్‌లో చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ముందుగా నైతిక విలువలు నేర్చుకోవాలి. ఎవరెటో చెప్పలేని స్థితి ఓ నాయకుడు ఫలానా పార్టీ అని చెప్పడం కష్టంగా ఉంది. ఎప్పుడు మారతాడో తెలియదు. ఎందుకు మారతాడో అసలే తెలియదు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారని అందరికీ తెలుసు. పైకి మాత్రం ప్రజాభీష్టమంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని ఎప్పుడూ ఊహించలేదు. ఇదో దురదృష్టకర పరిణామమే. నేతల్లో విలువలు పెరగాలి. ఎన్నికల్లో పార్టీలిచ్చే హామీలు వినసొంపుగా ఉంటున్నాయి. కానీ వాటి అమలే ప్రశ్నార్థ్థకంగా ఉంటు న్నాయి. ఎవరు ఏమిచ్చినా..తిరిగి ఏదో రూపంలో ప్రజల నుంచే రాబడతారనేది అందరూ గుర్తించాలి. తెలంగాణ అభివృద్ధి చెందిందా అంటే... చెందిందనే చెబుతాను. కాకపోతే జరగాల్సిన అభివృద్ధి జరగలేదనేదే నా వాదన. గాడి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టగలిగే సామర్థ్యం ప్రజలకే ఉంది. అది ప్రజాస్వామ్యం ప్రజలకిచ్చిన ఓటు హక్కు. ఇప్పటికైనా ప్రజలు రాజకీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే నేతలనే గుర్తించి, చట్ట సభలకు పంపాలి. బ్యూరోక్రాట్స్ సాగిల పడటమేంటి? ప్రజాస్వామ్య పరిరక్షణలో ఐఏఎస్, ఐసీఎస్లది కీలక పాత్ర. వారు దీన్ని మరిచిపోయారేమో అన్పిస్తోంది. సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నా. బ్యూరోక్రాట్స్ ఇంత సాగిలపడటం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను. దశాబ్దకాలంగా ఇది మరింత దిగజారింది. బ్యూరోక్రాట్స్ సరిగ్గా పనిచేస్తే, రాజకీయ వ్యవస్థ ఇంత భ్రషు్టపడుతుందా? కట్టడి చేయగల సామర్థ్యం వాళ్లకు మాత్రమే ఉంది. నేతలు ఐదేళ్లే అధికారంలో ఉంటారు. అధికారులు సుదీర్ఘ కాలం సర్విస్ చేస్తారు. ఇది తెలిసీ నాయకులకు ఎందుకు సాగిలపడుతున్నారు..? మా అప్పుడు ఇలా లేదు. మేం చెప్పేదాంట్లో తప్పుంటే అభ్యంతరం చెప్పేవారు. ఖర్మ కాకపోతే... ఓ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్యే చెప్పినట్టు వినడమేంటి? అయితే ఈ మధ్య కాలంలో యువ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నిక్కచ్చిగా ఉంటున్నారు. వాళ్లలో ఆశయం కన్పిస్తోంది. ఇది శుభ పరిణామమే. -వనం దుర్గా ప్రసాద్ -
పాలమూరుపై పట్టు ఎవరిది?
వలసలు, కరువే కాదు.. విభిన్న రాజకీయ పరిణామాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న పాలమూరుపై ప్రధాన రాజకీయ పక్షాలు ప్రత్యేక నజర్ వేశాయి. కృష్ణానది చెంతనే ఉన్నా చుక్క నీరు రాక విలవిల్లాడుతున్న పాలమూరు ప్రజల దీనగాధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ గొంతుకై దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో ‘కారు’కు అండగా నిలిచింది. ఈసారి ఎన్నికల్లోసైతం సత్తా చాటేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. పూర్వ వైభవం సాధించే దిశగా కాంగ్రెస్.. ఈసారైనా ఉనికి చాటాలనే లక్ష్యంతో కమలనాథులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) 7, కాంగ్రెస్ 5, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందాయి. నారాయణపేటలో టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కారెక్కగా.. బీఆర్ఎస్ బలం తొమ్మిదికి చేరింది. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందగా.. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతర పరిణామాల క్రమంలో ఆయన సైతం బీఆర్ఎస్లో చేరారు. పెరిగిన ‘కారు’ స్పీడ్ ఉమ్మడి జిల్లాలో అలంపూర్ మినహా 13 మందికి బీఫారాలు సైతం అందజేశారు. అక్కడ ఎమ్మెల్యే అబ్రహంపై అసంతృప్త జ్వాలలు ఎగిసిపడటం.. ఆయనకు బీ–ఫారమ్ ఇవ్వకపోవడం.. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు విజయుడి పేరు తెరపైకి రావడం.. ఆయనపై సైతం పార్టీ శ్రేణుల్లో విముఖత వ్యక్తం కావడం గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై వ్యతిరేకత.. టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరటం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బేనని రాజకీయవర్గాలు విశ్లేíÙస్తున్నాయి. షాద్‌నగర్, మక్తల్, అచ్చంపేటలో సైతం బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. చేరికలతో ‘చేయి’కి జీవం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికల పోరులో వరుస పరాజయాలతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు ఇటీవల ఉమ్మడి జిల్లా నుంచి కీలక నేతల చేరికలు జీవం పోశాయి. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, డాక్టర్ రాజేశ్ రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గద్వాలలో జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, వనపర్తిలో ఎంపీపీ మేఘారెడ్డి చేరడం పార్టీలో జోష్ నింపింది. అయితే కొల్లాపూర్‌లో చింతలపల్లి జగదీశ్వర్‌రావు రూపంలో అసమ్మతి భగ్గుమంటోంది. తాజాగా నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నాగంను బీఆర్ ఎస్‌లోకి ఆహ్వానించారు. జడ్చర్ల, నారాయణ పేటల టికెట్ నుంచి ఆశించి గపడిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారు ఏదైనా పార్టీ లేదా స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ నామమాత్రమేనా..? ఉమ్మడి జిల్లాలో బీజేపీ. గత రెండు ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. అయితే కల్వకుర్తిలో గతంలో స్వల్ప ఓట్లతో ఆచారి ఓటమి పాలు కాగా.. దీంతో ఈసారి ఈ స్థానంతోపాటు పట్టున్న మక్తల్, నారాయణపేటపై పార్టీ ఆశలు పెట్టుకుంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిణామాలు, ఇప్పటివరకు కొల్లాపూర్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ మినహా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తాజాగా మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాజకీయాస్త్రంగా ‘పాలమూరు’.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం రాజకీయాస్త్రంగా మారింది. 2014 ఎన్నికల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మించి.. కృష్ణా నీటితో రైతుల కాళ్లు కడుగుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే కేసులు తదితర కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అదే రోజు కొల్లాపూర్‌లో.. ఆ తర్వాత ఈ నెల 18న జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు సైతం ఒకటే మోటార్ ప్రారంభించి ప్రాజెక్ట్ పూర్తయినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు గుప్పించాయి. దీంతో ఈ ఎన్నికల్లో ‘పాలమూరు’ రాజకీయాస్త్రంగా మారినట్లు స్పష్టమవుతోంది. పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. - కిషోర్ కుమార్ పెరుమాండ్ల -
రూ.500 కోసం బాలుడి హత్య
మహబూబ్‌నగర్ క్రైం: కేవలం ఐదే ఐదు వందల రూపాయల కోసం ఓ బాలుడిని హత్య చేసిన దారుణ ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది. టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ చెప్పిన వివరాల మేరకు.. న్యూటౌన్‌లోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తున్న ఫరూక్‌నగర్‌కు చెందిన మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్ ఆగస్టు 20న స్థానికంగా పండ్లు విక్రయించే సయ్యద్ ఖదీర్ వద్ద సెల్‌ఫోన్ విక్రయించి రూ.2వేలు తీసుకున్నాడు. మరుసటిరోజు మళ్లీ ఖదీర్ వద్దకెళ్లి మరో రూ.200 ఇవ్వాలని అడిగాడు. సెల్‌ఫోన్ చార్జర్ ఇస్తే..డబ్బులు ఇస్తానని ఖదీర్ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన షహిరియార్(16).. తాను గతంలో ఇచ్చిన రూ.500 తిరిగి ఇవ్వాలని మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్‌ను అడిగాడు. తాను హోటల్లో పనికి వెళ్లడం లేదని, తన దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. జేబులో నుంచి రూ.300 తీసుకున్నాడని.. కాగా, షహిరియార్‌కు ఫోన్ ఇచ్చి షాసాబ్‌గుట్టలో ఉండే తన రూంకు పంపిస్తే ఫోన్‌కు సరిపడా చార్జర్ చెక్ చేసి ఇస్తానని ఖదీర్‌కు చెప్పాడు. ఈ క్రమంలో రూం వద్దకు వెళ్లిన షహిరియార్ చార్జర్ తీసుకున్న తర్వాత ఉల్లాఖాన్ జేబులో ఉన్న రూ.300 తీసుకున్నాడు. నాకు రూ.500 ఇవ్వాలి కదా.. ఈ రూ.300మినహాయించుకో అని చెప్పాడు. అయితే నా జేబులో నుంచే డబ్బులు తీసుకుంటావా అని ఆగ్రహంతో ఊగిపోయిన ఉల్లాఖాన్ ’నిన్ను చంపితే రూ.500తో పాటు సెల్‌ఫోన్ మిగిలిపోతాయ’ని అంటూ షహిరియార్ గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. పదిరోజుల కిందట అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడు మహ్మద్ సిద్ధిక్ ఉల్లాఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యచేసినట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
'చీజ్' బడీహై మస్త్ మస్త్!
అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ. 30 నుంచి 300కు పైగా.. మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్నగర్లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది. పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ప్రత్యేక షెడ్.. దాణా.. మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్.. ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్‌కు తరలిస్తే లీటర్‌కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు. బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా.. మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు. ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
మహబూబ్‌నగర్: ఉల్లి ధరలు పడిపోవడంతో ఆందోళనలో రైతులు
-
పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘హస్తరేఖలు, పుట్టు మచ్చల ఆధారంగా ఉన్నది ఉన్న ట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ మహిళలకు పలువురు జ్యోతిష్కులు మాయ మాటలు చెప్పి నగ్న చిత్రాలు సేకరించారు. ఈ ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూడగా.. తవ్విన కొద్దీ వారి లీలలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, వికారాబాద్ జిల్లా ఆమన్‌గల్, రంగారెడ్డి జిల్లాలో కొందరు జ్యోతిష్కులు జ్యోతిష్యకేంద్రాలు తెరిచారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే మహిళలకు వల వేశారు. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫొటోలను పైకి పంపిస్తామని.. అక్కడ అమ్మ వారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందనీ.. అప్పుడే మాకు కొంత ముట్టజెప్పాలని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. అలా కొంతమంది మహిళల వద్ద న్యూడ్ ఫొటోలను సేకరించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు మగవారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్‌తో బయటికొచ్చిన బాగోతం జాతకం పేరిట న్యూడ్‌ఫొటోలు సేకరించిన అక్రమార్కులు చివరికి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన ఖాకీలు జైనుద్దీన్, రాములు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వీరిని పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీనియర్ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పూడ్చలేనంత పెరిగిన గ్యాప్.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్ఎస్లో చేరడంతో సీన్ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్ పూడ్చలేనంతగాపెరిగింది. ఏకం చేసే దిశగా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్ ఘటనను ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్ఎస్ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?) -
టీఆర్ఎస్లో పీక్ స్టేజ్‌కు పాలిటిక్స్.. మంత్రితో జెడ్పీ చైర్మన్ వాగ్వాదం!
వనపర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు మరో సారి బయటపడ్డాయి. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతలుగా జిల్లాకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం హెల్త్ సెక్టార్ గ్రాంట్స్ రూ.84 లక్షలు, రూ.2.10 కోట్ల నిధుల కేటాయించగా.. వాటిని వినియోగించే అంశంలో జెడ్పీ సమావేశంలో మంత్రి అధికారులు సూచనలు చేశారు. అయితే ‘మా ప్రమేయం లేకుండా పనుల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ చేస్తే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు జనం గౌరవం ఏముంటుంది. ఈ పాటిదానికి గ్రాంట్ జెడ్పీకి ఇవ్వటం దేనికి.. నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసి మీరే పనులు చేయిస్తే.. సరిపోతుంది కదా.’ అని జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి నిలదీశారు. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ప్రభుత్వం నిధులతో పాటు ఇచ్చిన నిబంధనలను పాటించి నిధుల కేటాయింపులు, ఖర్చులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ.. గ్రాంట్ విడుదలైన తర్వాత నాలుగుసార్లు నిధులను వెచ్చించే నిబంధనలను మార్చుతూ.. సర్క్యులర్ పంపించారు. ఎంత వరకు సమంజసం అంటూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశంలో కూర్చోవాలా.. వెళ్లిపోనా.. అంటూ జెడ్పీ చైర్మన్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయన నిమ్మకుండిపోయారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల జిల్లాఅధికారుల ఎదుట మంత్రి, జెడ్పీ చైర్మన్ విభేదించుకోవటం చూసి నివ్వెరపోయారు. కొద్దిసేపటికే.. మంత్రి సమావేశం నుంచి మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందంటూ.. వెళ్లిపోయారు. -
పాలమూరుకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరుకు రానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వచ్చి బస్టాండు సమీపంలో నిర్మించిన జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పాలకొండ వద్ద రూ.52 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు మహబూబ్‌నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిది ద్దారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. సీఎం ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభ తర్వాత కేసీఆర్ సాయంత్రం హెలికాప్టర్లో తిరుగు పయనమవుతారు. -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాతీయ నూతన విద్యావిధానంతో మేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా జాతీయ నూతన విద్యావిధానం దేశంలో అమల్లోకి రానున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మాతృభాషలో విద్యనందిస్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లిలో గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) మూడో స్నాతకోత్సవానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ బీజే రావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానాల వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తేనుందని.. దీని ద్వారా మాతృభాషకు ప్రాధాన్యం పెరిగి విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశంలో ఇంకా పేదరికం, అవినీతి, అనారోగ్య సమస్యలున్నాయని.. వీటిని రూపుమాపే పరిశోధనలకు నూతన విద్యావిధానం పునాది వేస్తుందని ఆకాంక్షించారు. క్లిష్టమైన సమయంలో కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొని భారత్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని నిరూపించిందన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాలేదు. అదనపు కలెక్టర్ సీతారామారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. 1893లో స్వామి వివేకానంద, జంషెడ్ టాటా ఒకే ఓడలో కెనడాలోని వాంకోవర్‌కు బయల్దేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో టాటా.. బ్రిటీష్ ఇండియాకు స్టీల్ ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తున్న విషయం వారి మధ్య చర్చకు వచ్చిందని చెప్పారు. భారత్‌లోనే సైన్స్ ఆఫ్ స్టీల్‌కు సంబంధించిన పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని టాటాకు వివేకానంద సూచించారన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న టాటా 1898లో బెంగళూరులో టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుగురికి పీహెచ్డీ, 72 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. -
Mahbubnagar: పాగా వేసేందుకు ఎవరి వ్యూహం వారిదే.. వేడెక్కిన రాజకీయాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలన్నీ అప్పుడే హడావుడి ప్రారంభించాయి. హ్యాట్రిక్ కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కమలం, హస్తం పార్టీలు కూడా పాలమూరులో పాగా వేసేందుకు కుస్తీలు పడుతున్నాయి. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజనలో షాద్‌నగర్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. కొడంగల్ సెగ్మెంట్లోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసాయి. చదవండి: బీజేపీ క్లియర్‌కట్ మెసేజ్.. పట్టు దొరికిందా? తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల హవా నడిచింది. బీజేపీ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు సెగ్మెంట్లలో ఉనికి చాటుకునేది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రామమోహన్‌రెడ్డి, నారాయణపేట నుంచి టీడీపీ టిక్కెట్ మీద గెలిచిన రాజేందర్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం తొమ్మిదికి చేరింది. రెండు ఎంపీ సీట్లలో ఒకటి టీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 2018 ఎన్నికల్లో 13 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. కొల్లాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత ఆయన కూడా కారు ఎక్కేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ. మరో ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంటామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సర్వేలో సగం మంది గెలుపు కష్టమని తేల్చినట్లు సమాచారం. దీంతో ఎవరి సీటు పోతుందో అన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అనుమానం ఉన్నవారు సొంత సర్వేలు చేయించుకుని జాతకాలు పరీక్షించుకుంటున్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి పథకాలను ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళుతున్నారు. అయితే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష రూపాయల రుణమాఫీ, కొత్త పెన్షన్లు, దళితబంధు పథకాల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా నిరుద్యోగుల్లో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ప్రభుత్వం మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత కలహాలు, అసంతృప్తులతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే...తర్వాత పార్టీలో ఉంటారో లేరో అన్న అనుమానంతో ఓటు వేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, సీనియర్ నేతలు మల్లు రవి, నాగం జనార్థనరెడ్డి వంటి ఎందరో సీనియర్లు జిల్లా నుంచి ఎదిగినవారే. అయినా టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. పైగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడానికి కూడా పెద్దగా ప్రయత్నించడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్లలో పోటీ చేయడానికి బలమైన నాయకులు కూడా లేనంత దుస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక...ఆయన సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఆందోళనలతో కేడర్‌లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కార్యకర్తల ఉత్సాహాన్ని సక్రమ మార్గంలో నడిపించేవిధంగా పార్టీ అడుగులు పడటంలేదు. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అధ్యక్షుల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ఇక కేంద్రంలో ఉన్న అధికారంతో దూకుడు మీదున్న కమలం పార్టీ జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి కాషాయ సేనలో చేరడంతో ఆ పార్టీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ బహిరంగ సభ కూడా పార్టీకి మంచి ఊపు తెచ్చింది. అంతేగాకుండా జాతీయ సమావేశాలకు వచ్చిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదారు అసెంబ్లీ సీట్లు గెలవాలని లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో వేడెక్కిన రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికి వారు తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి లక్ష్యాలకు అనుగుణంగా కార్యరంగంలోకి అడుగుపెడుతున్నారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా? తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి: బండి సంజయ్
నారాయణపేట: సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి.. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్‌ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండమని దుయ్యబట్టారు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చని కానీ కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు. కేంద్రం నిధులిస్తే.. కేసీఆర్ దారి మళ్లించిండు. ఈరోజు వ్యాక్సిన్‌ను ఉచితంగా మోదీ అందించడంవల్లే అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. గడీల రాజ్యం పోయి గరీబోళ్ల ప్రభుత్వం రావాలన్నారు. బాంచన్ బతుకులు కావాలా? పేదల ప్రభుత్వం రావాలన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఏం చేసిండు?, ఆత్మహత్యలు ఆగినయా?, నీళ్లు వచ్చినయా?, బస్టాండ్ వచ్చిందా? ఏం సాధించామని అన్నారు. అమెరికా పోయి బార్లలో, పబ్బుల్లో తిరిగేటోడికి ఈ రోజు రాష్ట్ర మంత్రి అయ్యారంటే అది బీజేపీ వేసిన భిక్ష అని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజ్ అని గుర్తు చేశారు. -
ప్రభుత్వ పాఠశాల టీచర్ కు అరుదైన గౌరవం
-
పేదలకు సకాలంలో అందని వైద్యం
-
మన్నెంకొండ సమీపంలో రోడ్డుపై చిరుత మృత్యువాత
-
ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
-
బాలుడికి ఉరేసి..బావిలో పడేసిన దుండగులు
-
తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: అనారోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఓ విద్యార్థి కళాశాల తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో తరగతి గదిలో ఉండే ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలరాజు(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు కళాశాల వసతి గృహంలో ఉంటూ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లాక్డౌన్ తర్వాత కళాశాలలు ప్రారంభించడంతో ఇటీవలే తిరిగి కళాశాలలో చేరాడు. ఆరోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు ధన్వాడ: మండలంలోని చర్లపల్లికి చెందిన విద్యార్థి బాలరాజు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉరేసుకొని మృతిచెందిన వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలప్ప, చంద్రమ్మ దంపతుల రెండో కుమారుడు బాలరాజు. కొంత కాలం క్రితమే విద్యార్థి తల్లి చంద్రమ్మ సైతం మృతిచెందింది. దీంతో ఉన్న రెండు ఎకరాల పొలం సాగు చేస్తూ తండ్రి వీరిని పోషిస్తున్నాడు. ఇన్నాళ్లు తమ మధ్యే తిరిగిన బాలరాజు అకస్మాత్తుగా మృతిచెందడంతో బంధువులు, అతని స్నేహితులు విషాదంలో మునిగారు. చదవండి: సీనియర్ నటుడిపై కుమార్తె ఫిర్యాదు -
మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య నిలిచిన పలు రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంకొండ వద్ద పట్టాలపై ట్రాక్‌మిషన్ ఒరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేవరకద్ర మండలం కౌకుంట్ల వద్ద గుంటూరు ప్యాసింజర్, దేవరకద్ర వద్ద తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలుగా అవస్థలు పడుతున్నారు. అయితే ట్రాక్‌ను క్లియర్ చేయడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ రూట్లో నడిచే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. -
15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం సాయంత్రం జడ్చర్లలోని చంద్రగార్డెన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విశ్వాసం ఉంచి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. అయితే సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నారని, ఆయన తమ ఉద్యమానికి ముందు నుంచి మద్దతు పలకడం వల్ల ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. పార్లమెంట్ పరిధిలో ఎమ్మార్పీఎస్ తరపున కిషన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. అలాగే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాదిగ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యను తప్పించి మాల వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇచ్చినందున మద్దతు ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో నిమగ్నమైనందున ఆలస్యంగా వచ్చి ముఖ్యకార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ప్రకటన చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వ్యక్తి ఎంపీగా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో మల్లు రవికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించామన్నారు. గతంలో మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారని, అలాంటి స్థానం నుంచి తాము మల్లు రవికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఆ పార్లమెంట్లో బరిలో ఉన్న ఇద్దరు మాదిగల్లో ఎవరికి మద్దతు ఇస్తామనేది ఈ నెల 9న ప్రకటిస్తామన్నారు. ఏపీలో తాము నోటాకు ఓటేస్తున్నామని, అన్ని పార్టీలు తమను మోసం చేసినందుకే అలా చేస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందు ఆయన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య, వెంకటయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీను, జాతీయ నాయకులు నిరంజన్, శివ, విష్ణు, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్‌లో.. వలస జీవుల తీర్పెటో..?
హలో..! నేను.. మాట్లాడుతున్న. ఎలా ఉన్నారు..? అక్కడ ఏం పని చేస్తున్నరు..? మనోళ్లు ఎంత మంది ఉంటరు..? అందరికీ పని దొరుకుతుందా..? ఏప్రిల్ 11న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలున్నయ్ తెలుసు కదా. తప్పకుండా రావాలి మరీ. వచ్చి ఓటు రూపంలో నన్ను ఆశీర్వదించండి. రవాణా ఖర్చులకు ఇబ్బందిపడకండా మనోళ్లు చూసుకుంటరు. అక్కడ మీ బాధలు నాకు తెలుసు. నేను గెలిస్తే మీకు ఇక్కడే ఉపాధి కల్పిస్తా.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, మిగతా సాగునీటి పథకాలకు నిధులు తెచ్చి వాటిని పూర్తి చేస్తా. సాగునీటి ఇబ్బందులు తీర్చి మీ చేనులను సస్యశ్యామలం చేస్తా. ఓటు వేసేందుకు తప్పకుండా రండి. మీ ఒక్క ఓటు నా గెలుపునకు ముఖ్యం. మరిచిపోవద్దు. ప్లీజ్..’అంటూ ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు ఇతర ప్రాంతాల్లో ఉంటోన్న వలస ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న తీరు ఇది. సాక్షి , మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే. వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశా మలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఏం చేద్దాం! ఓటర్లకు గాలం వేద్దాం?
పాలమూరు: పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టాలనే పంథాను ఆచరణలో పెడుతున్నారు. ఊరూరా తిరగడం కష్టమని భావించి గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు పార్టీలో సీనియర్ల సలహాలు, సహకారం తీసుకుని కుల సంఘాల మద్దతును కోరుతూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహిస్తూనే తీరిక వేళల్లో కులపెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో సుమారు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఈ తరహా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిఘా ఉన్నా.. కానరాని నియంత్రణ నిబంధనల ప్రకారం కుల సంఘాలతో నిర్వహించే సమావేశాల నిర్వహణ విషయమై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులను మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారనే నెపంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీలు ఏ రకంగా ఓటర్లకు చేరువవుతున్నాయనే విషయమై మరింత నిశితంగా పరిశీలనలు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా తీరుని పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యంలో ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేయించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు ఓటర్లను అందించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీసుకొచ్చిన తాయిలాలను, నజరానాలను పలుచోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ మరింత పకడ్బందీగా తనిఖీలను చేపట్టడంతో పాటు అభ్యర్థుల ప్రచారాల తీరుతెన్నులపై వారు చేస్తున్న ఖర్చులపై పరిశీలకులు దృష్టిసారించాల్సి ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మరింత పక్కాగా నిఘాను పెంచాల్సిన అవసరముంది. అదే పద్ధతి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొన్ని పార్టీలు సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మండలం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థిత్వానికి బలం చేకూరేలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో అభ్యర్థుల అనుచరులు నేరుగా కుల సంఘాలను కలుస్తూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతి అనుకూలించిన విషయం తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ గంపగుత్తగా ఓట్లకు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెబితే ఓట్లు ఎక్కువగా పడతాయో వారిని గుర్తించి వ్యూహరచన చేస్తున్నారు. పడే ఓట్లకే డబ్బుల పంపిణీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లే అవకాశం, సమయం ఉండదు. ఈ క్రమంలో గ్రామానికి ఒకరిద్దరు రెండో కేడర్ నాయకులకు డబ్బులు పంచే బాధ్యతలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీ నుంచి డబ్బులు తక్కువగా వస్తాయి.. భవిష్యత్‌లో మీకు అధికారం, ఉన్నత అవకాశాలు.. చేసుకోవడానికి పనులు కావాలంటే ఖర్చు పెట్టండి అంటూ ఆఫర్లు ఇస్తే వారితోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పోలింగ్ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకపోతే ఎవరు బాధ్యులన్న ప్రశ్నలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాఇ. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు వెంటాడుతోంది. -
కృష్ణా ప్రాజెక్టులకు గోదావరి నీరు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో చేపట్టి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏదైనా సందర్భంలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు నీరు లభ్యం కాకపోతే గోదావరి నీటిని అందించేందుకు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రతి ప్రాజెక్టును నిర్మించడంతో పాటు, నిర్వహణ కోసం అవసరమైన ప్రాజెక్టు ఆపరేషన్ మాన్యువల్ రూపొందించుకోవాలన్నారు. మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలపై సీఎం ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులతో మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాద వ్, రాజేందర్‌రెడ్డి, అబ్రహం, రామ్మోహన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియానాయక్, రాములునాయక్ పాల్గొన్నారు. జిల్లా అంతటికీ సాగునీరు.. ‘ఖమ్మం జిల్లాను ఆనుకునే గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ జిల్లాలో అడువులు, వర్షపాతం ఎక్కువ. దుమ్ముగూడెం వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. గరిష్టంగా 195 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తే జిల్లా అంతా సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ని అనుకూలతలున్నా ఖమ్మం జిల్లాలో కరు వు తాండవం చేయడం క్షమించరాని నేరం. ఖమ్మం జిల్లా అంతటినీ సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దుమ్ముగూడెం వద్ద నుంచి గోదావరి నీటిని బయ్యారం చెరువు వరకు ఎత్తిపోసి జిల్లా అంతటికీ సాగునీరు అందించాలి. అవసరమైన చోట రిజర్వాయర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులతో నీరు అందని ప్రాంతాలను గుర్తించి, స్థానిక వనరులతో సాగునీరు అందించాలి. ఆర్వోఎఫ్ఆర్, అసైన్డ్ భూములకు సైతం సాగునీరు అందించాలి. సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా మహబూబ్‌నగర్. ఒక్క జూరాల నీటితోనే ఎక్కువ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వల్ల నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం వనరులతో నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పూర్తి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా ఎక్కడికక్కడ అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలి. చెరువులను నింపే ప్రణాళిక రూపొందించాలి. పాలమూరు జిల్లాలో చెన్నోనిపల్లి రిజర్వాయర్‌ను ఉపయోగంలోకి తెచ్చే విధానం రూపొందిస్తాం’ అని సీఎం వివరించారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో అంతే!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రిజిస్ట్రేషన్ల శాఖ తీరు మారడం లేదు. ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా శాఖ ఉద్యోగులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షలు స్టాంపు డ్యూటీ ఎగవేసిన ఘటన ఇటీవల వెలుగు చూడడమే దీనికి నిదర్శనం. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించకుండా స్థల మార్పిడి చేసిన అధికారులపై మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం సంచలనాన్ని కలిగించింది. అసలేం జరిగిందంటే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని సర్వే నంబర్ 163లో 605 చదరపు గజాల స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. వ్యవస్థలోని లొసుగులు ముఖ్యంగా ‘ఎనీ వేర్ రిజిస్ట్రేషన్’ పద్ధతి ద్వారా ఇదంతా నడిచినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని స్థలాన్ని ఏకంగా అలంపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. స్థలాన్ని చదరపు గజాల్లో కాకుండా గుంటల్లో చూపిస్తూ ఏకంగా ప్రభుత్వ ఖజానాకు రూ.20లక్షల వరకు గండి కొట్టినట్లు చెబుతుండగా.. దీనిపై మూసాపేట మండలం సంకలమద్ది కి చెందిన సింగిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో స్పందించి.. సమగ్ర దర్యాప్తు జరపాల్సిదిగా పోలీసు శాఖను ఆదేశించింది. ఈ మేరకు సంబంధమున్న వారిపై మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీసులు ఈనెల 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందు లో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారితో పాటు ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న మరో ప్రాంత సబ్ రిజిస్ట్రార్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతా వారిదే హవా.. విలువైన పత్రాలు స్కానింగ్ జరిగే కంప్యూటర్ గదిలో రియల్ వ్యాపారులు, బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లదే పైచేయి. వీరితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీసుకెళ్లిన డాక్యుమెంట్లు అయిన తర్వాతే మిగతావి స్కానింగ్. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారుల కనుసన్నల్లో ఈ ప్రక్రియ నిత్యకృత్యం. కంప్యూటర్ గదిలో డాక్యుమెంట్ రైటర్లు కంప్యూటర్లపై కూర్చుని డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తతంగం తో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్యాలయంలోని ఇద్దరు సబ్రిజిస్ట్రార్ల క్యాబిన్లకు ముందు భాగంలో ఉన్న కంప్యూటర్ గదిలోనే ఇదంతా జరుగుతున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఊసే లేదు.... ప్రభుత్వం సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ విధానం అమలు కాకపోగా దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవగాహన కూడా కల్పించడం లేదు. అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ విధానం ద్వారా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినా అమలు కావడం లేదు. జూలై 24న ప్రభుత్వం పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టంను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ లు కాకపోవడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర స్వరూపం
మహబూబ్‌నగర్ కలెక్టర్: రొనాల్డ్‌రాస్ ఫోన్: 98499 04188 ఎస్పీ: రమా రాజేశ్వరి 9440795700 ఇతర ముఖ్య అధికారులు జేసీ: శివకుమార్‌నాయుడు (9440903166) డీఆర్వో: భాస్కర్ (9849904194) మహబూబ్‌నగర్ ఆర్డీవో: లక్ష్మీనారాయణ (9000101500) నారాయణపేట ఆర్డీవో: శ్రీనివాస్ (9000101503) రెవెన్యూ డివిజన్లు (2): మహబూబ్‌నగర్, నారాయణపేట, మున్సిపాలిటీలు: 3 (మహబూబ్‌నగర్, నారాయణపేట, బాదేపల్లి) మండలాలు: 26 మూసాపేట, భూత్పూర్, హాన్వాడ, కోయిలకొండ, మహబూబ్‌నగర్ అర్బన్, మహబూబ్‌నగర్ రూరల్, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండిడ్, దేవరకద్ర, మిడ్జిల్, అడ్డాకుల, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూర్, నర్వ, మాగనూర్, కష్ణ, మక్తల్, చిన్నచింతకుంట, గ్రామపంచాయతీలు: 543 జిల్లా విస్తీర్ణం: 5,062 చదరపు కిలోమీటర్లు మొత్తం జనాభా: 14,85,567 పరిశ్రమలు: జడ్చర్ల ప్రత్యేక సెజ్. ఫార్మా కంపెనీలు నీటి పారుదల: కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాలు ఎంపీ: ఎ.జితేందర్‌రెడ్డి, (మహబూబ్‌నగర్.. ఫోన్ 9848030036) ఎమ్మెల్యేలు: మహబూబ్‌నగర్: వి.శ్రీనివాస్‌గౌడ్ 9949994039 జడ్చర్ల: లక్ష్మారెడ్డి (9441869699) దేవరకద్ర: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (9440769873) మక్తల్: చిట్టెం రామ్మోహన్‌రెడ్డి(9440014941) నారాయణపేట: ఎస్.రాజేందర్‌రెడ్డి 9845239749 పర్యాటకం: 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి, మన్యంకొండ, గంగాపురంలోని చెన్నకేశవస్వామి, చిన్నచింతకుంట మండలోని కురుమూర్తి స్వామి దేవాలయాలు జాతీయరహదారులు: నంబర్ 44 రైల్వే లైన్లు: జిల్లాలోని బాలానగర్ నుంచి కౌకుంట్ల వరకు 90 కిలోమీటర్ల రైల్వేలైన్ హైదరాబాద్ నుంచి దూరం: 98 కిలోమీటర్లు -
డీసీఎంలు ఢీ..ఒకరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వేకువజామున జాతీయ రహదారిపై రెండు డీసీఎంలు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక డీసీఎం క్లీనర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన చంద్రశేఖర్(30) చనిపోయాడు. గాయపడిన మరో ఇద్దరిని 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపించారు. -
కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతుల దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఎర్రప్ప (42), పెద్దబావి వీరన్న(40) అ’ఏ రైతులు పత్తి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి మోటారు ఆన్ చేస్తుండ గా కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గట్టు సబ్ఇన్స్పెక్టర్ రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
పడకేసిన పారిశుద్ధ్యం
పబలుతున్న రోగాలు పందుల సైరవిహారం పట్టించుకోని పాలకులు, అధికారులు కొత్తకోట పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన వెదజల్లుతోంది. దీనికితోడు పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులపాలవుతున్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో 26వేల మంది జనాభా నివసిస్తున్నారు. పలు కాలనీల్లో డ్రెయినేజీ సౌకర్యం లేక రోడ్ల పైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరికొన్ని కాలనీల్లో ఇళ్లమధ్యనే దుర్గంధపునీరు చెరువులా నిల్వ ఉంటున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండు,పాత పోలీస్‌స్టేషన్,మటన్ మార్కెట్,శంకరసముద్రం కాలువలు మరింత దుర్గంధంగా మారాయి. దీంతో దోమలు వద్ధి చెంది రాత్రి పూట నిద్రపోనివ్వడంలేదని పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజుకు వంద మంది అస్వస్థత వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందాయి. పారిశుద్ధ్యలోపం, పందులు, దోమలబెడదతో ప్రజలు చలిజ్వరం, వాంతులు, బేదులు, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు.ప్రతి రోజూ వందకు పైగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. రోగులతో ప్రభుత్వ,ప్రై వేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం డ్రెయినేజీలో మురుగునీరు నిల్వ ఉన్నా, రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరినా స్పందించడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ చెన్నకేశవరెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ
ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి కాన్వాయ్‌ని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కోదండరాం ప్రభుత్వంపై సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
తెలంగాణలో ఎర్రచందనం దుంగల డంప్ వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంట్లో ఎర్రచందనం దుంగలు నిల్వ ఉంచిన సమాచారంతో బుధవారం పోలీసులు వాటిని గుర్తించారు. సుమారు 20 నుంచి 30 దుంగల వరకు ఉన్నట్టు సమాచారం. అటవీ అధికారులు వచ్చి ధ్రువీకరించాల్సి ఉంది. -
కిడ్నాపైన బాలిక ఆత్మహత్య
హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన లలిత(13) అనే బాలిక సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బాలికను కిడ్నాప్ చేసి కారులో తరలిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. అనంతరం పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డ మండలం బొమ్మన్‌పాడు గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తర్వాత ఏమైందో తెలీదు కానీ.. బాలిక సోమవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనపడింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన సెల్ ఛార్జింగ్
గట్టు మండలం రాయపురం గ్రామంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ షాక్‌కు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన నల్లారెడ్డి గురువారం ఉదయం తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛార్జి పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
నేడు కొల్లాపూర్ మినీస్టేడియం ప్రారంభోత్సవం
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పద్మారావుతో పాటు ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ హాజరుకానున్నారు. -
ఆస్పత్రి ఆవరణలో పసికందు లభ్యం
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఏరియా ఆస్పత్రి ఆవరణలో 9 రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆస్పత్రి ఆవరణలోని వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆడశిశువు ఉండటాన్ని వైద్యులు గమనించారు. దాంతో పసికందుకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో పసికందును ఆస్పత్రికిలోకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు. వారం రోజుల క్రితమే బొడ్డు కొసినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఆ పసికందును ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. కావాలని ఎవరో వదిలివెళ్లారని భావిస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన దేవేందర్(16) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
చెరువులో పడి బాలుడి మృతి
చెరువు వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంగ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యోగి(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈరోజు చెరువు వద్దకు వెళ్లి కాలుజారి అందులో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం మద్దెలబీడ్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేటకు చెందిన ఆర్టీసీ బస్సు మద్దూరు నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా... అతివేగం కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు 30 మంది బస్సులో ఉన్నారు. వీరితోపాటు మరో 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఓ పది మందికి కొంచెం బలమైన గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బస్సులో 52 కిలోల వెండి స్వాధీనం
ఓ ప్రైవేటు బస్సులో 52 కిలోల వెండి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో గోవా నుంచి లిక్కర్ రవాణా అవుతుందన్న సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజ్ వద్ద ఎక్సైజ్ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బస్సులో ఒక ప్రయాణికుడు 52 కిలోల వెండి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని జడ్చర్ల వాణిజ్య పన్నుల శాఖ అధికారి వద్దకు తరలించారు. -
ఆశా వర్కర్ల అరెస్ట్ - పరిస్థితి ఉద్రిక్తం
డిమాండ్ల సాధనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు వెళుతున్న ఆశా వర్కర్లను మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు శివారులోని నందిగామ వద్ద సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిఘటించిన ఆశా వర్కర్లపై లాఠీచార్జి చేశారు. మహిళలని చూడకుండా ఈడ్చి అవతల పారేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రఘును అరెస్ట్ చేశారు. వంద మంది ఆశా వర్కర్లను కూడా వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో కొత్తూరు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
రుణమాఫీ వాయిదా చెల్లించాలని రైతుల ధర్నా
రుణ మాఫీ పథకం కింద రైతులకు మొదటి విడత మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని మండలానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. దీంతో బ్యాంకు అధికారులు రైతులతో చర్చలు నిర్వహిస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్
నల్లగొండ జిల్లాలోని మూడు మండలాల్లోని 9 గ్రామాల్లో పంచాయతి ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలీంగ్ ఉండంతో.. పోలీంగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. 9 గ్రామాల్లో 94 వార్డులు, 9 సర్పంచ్ స్థానాల కోసం జరుగుతున్న ఈ పోటీలో 245 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో వైపు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కానేరమ్మపేట మేజర్ గ్రామపంచాయతికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రానికి ఈ గ్రామ పంచాయితీల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. -
నైట్‌వాచ్‌మెన్ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా పెదకొత్తపల్లి ఎంపీడీవో కార్యలయంలో నైట్‌వాచ్‌మెన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన నర్సింహ గౌడ్(55) ఎంపీడీవో కార్యాలయంలో నైట్‌వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసిశాడు. అనంతరం అక్కడే ఉన్న కంప్యూటర్ వైర్లతో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
మూలాలు కనుక్కోండి: రాఘవాచారి
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మూలాలను కనుక్కొని వారి కుటుంబాలను ఆదుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం అచ్చంపేట టీఎన్జీవో భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలు, ప్రజా ప్రతినిధులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపై కథనాలు, వార్తలను మీడియాలో రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే నెల 13న నిర్వహించ తలపెట్టిన పాలమూరు రైతు గోస సభకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. -
ఆమె కూడా చనిపోయింది..
మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో తన ఇద్దరు పిల్లల గొంతుకోసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన శ్రీమతమ్మ(27) ఈనెల 6వ తేదీ రాత్రిఇంట్లోనే తన ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేసింది. అనంతరం గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్థరాత్రి ఆమె ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. -
మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకరమ్మ(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పొలంలో ఉరేసుకున్న అన్నదాత...
కళ్లముందే పంట ఎండిపోవడంతో కలత చెందిన ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా గోపాలపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పానుగంటి పెంటయ్య(62) తనకున్న పొలంలో అప్పులు చేసి వరి, మొక్క జొన్న పంటవేశాడు. వర్షభావంతో పంట ఎండిపోయింది. ఎండిన పంట చూసి.. కలత చెందిన రైతు బుధవారం ఉదయం తన పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీకెనాల్లో పడి అక్కాచెల్లెళ్లు మృతి
ప్రమాద వశాత్తు కేసీకెనాల్ లో పడి ఇద్దరు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఆలంపూర్ మండలం ర్యాలంపాడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ర్యాలంపాడు గ్రామానికి చెందిన సాలెహ(14), సాదిత(10) కేసీకెనాల్ వద్ద బట్టలు ఉతుకుతుండగా పొరపాటున బకెట్ కెనాల్లో పడిపోయింది. బకెట్ కోసం అక్క నీళ్లలో దిగగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. అక్కను కాపాడబోయి చెల్లెలు సాజిత కూడా మునిగిపోయింది. చెల్లెలు సాదిత మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. అక్క సాలెహ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతోన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
సర్పంచ్ భర్త ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ భార్య గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల భారం తాళలేక
పానగల్(మహబూబ్‌నగర్) అప్పుల బాధ తాళలేక మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘనట మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలం మల్లాయపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సాయిరెడ్డి(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పుల బాధ తాళలేక...
అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం అజిల్లాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బంగారి ఎల్లయ్య 47 తనకున్న ఏడు ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు కోసం కొత్తగా అప్పు తెచ్చి రెండు బోర్లు వేశాడు.. కానీ వాటిలో నీళ్లు పడకపోవడంతో.. పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమారూ రూ. 5 లక్షల వరకు అప్పులు ఉండటంతోటే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
ఈత సరదా ప్రాణం తీసింది
ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూరులో జరిగింది. పండగ రోజు సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అవంచలో రైతు ఆత్మహత్య
అప్పుల బాదతాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో బుధవారం జరిగింది. అవంచ గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ (38) పంట సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల బాధ తాళలేక బుధవారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కూతళ్లు ఉన్నారు. పెద్దకూతరు పూజితకు పెళ్ళి చేశాడు. రెండో కుమార్తె అశ్విని పదో తరగతి చదువుతోంది. పండగ పూట ఇంటి పెద్ద చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మట్టదొడ్డి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మప్ప(45) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
గంగదేవి పల్లి స్పూర్తితో
ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఊరూ శుభ్రంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆ గ్రామస్తులు పాటించారు. వారికి అధికారుల సాయం అందింది. ఊరూవాడా కదిలింది....ఆ పల్లె కళకళలాడింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం నిజాలాపూర్ గ్రామం ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామ మహిళలు.. ఇటీవల గంగదేవిపల్లి, హాజిపల్లి గ్రామాలను సందర్శించి వచ్చారు. తమ గ్రామం కూడా వాటిలాగే పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోవడమే ఆలశ్యం... శ్రమదానంతో ఊరంతా శుభ్రం చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టారు. గ్రామంలో బుధవారం 200 మంది మహిళలు శ్రమదానం చేశారు. వీధులు, రోడ్లను శుభ్రం చేశారు. వీరికి పురుషులు కూడా కలిశారు. ఎవరి ఇంటి ముందు రోడ్లను వారే నిత్యం శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రమదానానికి రాని వారికి జరిమానా వేశారు. ఇకమీదట ప్రతినెలా 14వ తేదీన ఊరంతా శ్రమదాన దినంగా పాటించాలని నిర్ణయించారు. పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఈ గ్రామానికి ప్రభుత్వం కూడా చేయూత నిచ్చింది. మరుగుదొడ్లు మంజూరు చేసింది. దీంతో గ్రామంలో ఒకే సారి 170 మరుగుదొడ్ల నిర్మాణం మొదలైంది. వీటి నిర్మాణం కోసం మహిళా సంఘాలు సిమెంట్ ఇటుకలను గ్రామంలోనే తయారు చేస్తున్నారు. -
తగ్గుతున్న ఉల్లి మంట
-దేవరకద్ర మార్కెట్లో క్వింటా గరిష్ట ధర రూ. 2, 400 జనం కళ్ల వెంట నీళ్లు తెప్పించిన ఉల్లి ఘాటు తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర ఉల్లి మార్కెట్ లో గత వారం వేలంలో పలికిన ధరకన్నా.. ఈ వారం కొద్ది మేర తగ్గింది. బుధవారం మార్కెట్ లో జరిగిన వేలంలో గరిష్టంగా క్వింటాల్ ఉల్లిధర 2,400 పలుకగా.. కనిష్టంగా.. రూ 1,100 గా ఉంది. సీజన్ ప్రారంభంలో 4000 రూపాయలు ఉన్న ఉల్లి.. రెండు వారాలుగా తగ్గుముఖం పట్టింది. వర్షాలు కురవడం వల్ల మార్కెట్ కు వచ్చిన ఉల్లి పచ్చిగా ఉన్నా.. వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా.. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గడం వల్లనే ఉల్లి ధర తగ్గుదల కనిపించిందని వ్యాపారులు అంటున్నారు. బుధవారం మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మాకానికి వచ్చింది. నిల్వ చేసుకోడానికి కావలసిన ఉల్లి రాక పోవడంతో కొనుగోలు దారులు ధరలు పెంచడానికి ఇష్టపడలేదు. బయట వ్యాపారులు స్థానిక వ్యాపారుల మధ్య కొంత వరకు పోటీగా వేలం సాగినా ధర మాత్రం అంతంత మాత్రమే దక్కింది. -
భార్యకు ఉరి వేసిన భర్త
తాగిన మత్తులో భార్య గొంతు పిసికి ఉరేశాడో తాగుబోతు భర్త. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగరాయపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రాంచందర్(38), బుజ్జమ్మ(30)లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రాంచందర్ బుధవారం రాత్రి పీకల దాకా తిగి వచ్చి నిద్రిస్తున్న భార్యను గొంతు నులిమి చీరతో ఉరేసి హతమార్చాడు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా.. తనే ఆత్మహత్య చేసుకుందని బుకాయించాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేవంత్‌రెడ్డి అన్న మృతి
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే, ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(62) గుండెపోటుతో మృతి చెందారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని తన నివాసంలో సోమవారం ఉదయం కృష్ణారెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయన్ని కుటుంబ సభ్యులు కల్వకుర్తిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసేలోపే ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కృష్ణారెడ్డి భార్య వనజ గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.