సీఎం జిల్లాపై పట్టెవరిది? | Sakshi
Sakshi News home page

సీఎం జిల్లాపై పట్టెవరిది?

Published Wed, May 1 2024 5:31 AM

Palamuru position is prestigious for Revanth

పాలమూరు స్థానం రేవంత్‌కు ప్రతిష్టాత్మకం

ప్రజాక్షేత్రంలో నిత్యం తిరుగుతున్న బీజేపీ అభ్యర్థి 

సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నం

గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. పోటాపోటీగా పావులు  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  పాలమూరులో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుత లోక్‌సభ పోరు కూడా ఆసక్తికరంగానే మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీకే.అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్‌), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) నువ్వా..నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అ్రస్తాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. 

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా.. పదిసార్లు కాంగ్రెస్, మూడు దఫాలు బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌), తెలంగాణ ప్రజాసమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కోసారి మాత్రమే విజయం సాధించాయి. 

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కూడా ఈ పార్లమెంట్‌ పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానంలో విజయం సాధించి కాంగ్రెస్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకొని, తిరిగి పట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ సర్వశక్తులొడ్డుతోంది. 

కాంగ్రెస్‌: కొడంగల్‌ స్కీం, ముదిరాజ్‌లపై ఆశలు
మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు పర్యాయాలు పర్యటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.4వేల కోట్లతో చేపట్టిన మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌’పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన విషయాన్ని పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు.

 పార్లమెంట్‌ పరిధిలో అధిక శాతం ఓటర్లుగా ఉన్న ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిన ఆయన.. పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురాకపోవడం, తగిన నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

 ఈ అంశాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయనే ధీమా కాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవ ర్గా ల్లోని పలు మండలాల్లో నాయకులు, కేడర్‌ మధ్య సమన్వయం కొరవడినట్టు తెలుస్తోంది. చేరికల క్రమంలో పాత, కొత్త నేతల మధ్య వైరం ముదిరినట్టు సమాచారం. 

బీజేపీ: మోదీ చరిష్మా, కేంద్ర పథకాలపై.. 
బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్‌ మహిళానేత డీకే.అరుణ రెండోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. ‘విజయ్‌ సంకల్స్‌ యాత్ర’పేరుతో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసిన ఆమె.. నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. 

మోదీ చరిష్మా, కేంద్ర పథకాలు తన గెలుపునకు దో హదం చేస్తాయని బలంగా చెబుతున్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుల సాధనలో తనదే ముఖ్యపాత్ర అని ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు. అధికసంఖ్యలో ఉన్న ఎస్సీ సా మాజికవర్గ ఓట్లు తనకు కలిసివస్తాయనే ఆశతో ఉ న్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ విమర్శలకు దీటు గా సమాధానం చెబుతూ తనదైన శైలిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే జితేందర్‌రెడ్డి, జలంధర్‌ రెడ్డి వంటి నాయకులు బీజేపీ ని వీడి కాంగ్రెస్‌లో చేర డం, ఆమెకు కొంత మైనస్‌గా మారినట్టు తెలుస్తోంది. 

బీఆర్‌ఎస్‌: కేసీఆర్‌పైనే భారం 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి రెండోసారి బరిలో నిల్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఇతర పార్టీల కంటే ఆలస్యం కాగా.. ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. అయితే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగడం.. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌కు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో ‘గులాబీ’శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. 

కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని..అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ తనదైన పంథాలో విమర్శలు గుప్పిస్తూనే..ఈ పార్లమెంట్‌ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు టార్గెట్‌గా ప్రసంగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొందని.. అందరూ కృషి చేస్తే మన్నె శ్రీనివాస్‌రెడ్డి గెలుపు తథ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

ప్రభావం చూపే అంశాలు.. 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా 
అచ్చంపేట–తాండూరు, కృష్ణా–వికారాబాద్‌ రైల్వే లేన్‌ పెండింగ్‌ 
గద్వాల–మాచర్ల లేన్‌కు అడుగులు పడకపోవడం 
నారాయణపేటకు మంజూరైన సైనిక్‌ స్కూల్‌ తరలిపోవడంపై నిరసన  
గద్వాల, నారాయణపేటలో చేనేతలకు టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు  

డీకే అరుణ (బీజేపీ)

వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్‌) 

శ్రీనివాస్‌రెడ్డి  (బీఆర్‌ఎస్‌) 

2019 ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లు.. 
టీఆర్‌ఎస్‌ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
4,11,402 (41.78 శాతం)
బీజేపీ – డీకే అరుణ
3,33,573 (33.88 శాతం)
కాంగ్రెస్‌ – చల్లా వంశీచంద్‌రెడ్డి
1,93,631 (19.67 శాతం)

Advertisement
 
Advertisement