
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు కళాశాల వసతి గృహంలో ఉంటూ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
మహబూబ్‌నగర్: అనారోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఓ విద్యార్థి కళాశాల తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో తరగతి గదిలో ఉండే ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలరాజు(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు కళాశాల వసతి గృహంలో ఉంటూ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్ తర్వాత కళాశాలలు ప్రారంభించడంతో ఇటీవలే తిరిగి కళాశాలలో చేరాడు. ఆరోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
ధన్వాడ: మండలంలోని చర్లపల్లికి చెందిన విద్యార్థి బాలరాజు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉరేసుకొని మృతిచెందిన వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలప్ప, చంద్రమ్మ దంపతుల రెండో కుమారుడు బాలరాజు. కొంత కాలం క్రితమే విద్యార్థి తల్లి చంద్రమ్మ సైతం మృతిచెందింది. దీంతో ఉన్న రెండు ఎకరాల పొలం సాగు చేస్తూ తండ్రి వీరిని పోషిస్తున్నాడు. ఇన్నాళ్లు తమ మధ్యే తిరిగిన బాలరాజు అకస్మాత్తుగా మృతిచెందడంతో బంధువులు, అతని స్నేహితులు విషాదంలో మునిగారు.