intermediat students
-
టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రభుత్వ సత్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు బొత్స ప్రకటించారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు చెప్పారు. విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రోత్సహించేందుకే.. ఈ నెల 23న నియోజకవర్గ స్థాయిలో సత్కార వేడుక నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని బొత్స తెలిపారు. మే 27న జిల్లా స్థాయిలో సత్కారంలో విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు నగదు అందచేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తామని వెల్లడించారు. ఈనెల 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆర్.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
Inter Results: కరోనా చదువు ‘ప్రాణాల’మీదకొచ్చింది
సాక్షి, వరంగల్/నెట్వర్క్: ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విద్యార్థుల్లో కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 శాతం మంది ఫెయిలవడంతో కలవరపడుతున్నారు. ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఏమంటారో.. ఊళ్లో చులకనగా చూస్తారేమో.. ఇలా ఎన్నో ఆలోచనలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. దీంతో మనస్తాపానికి లోనై ఉసురు తీసుకోవాలని తలపోస్తున్నారు. శుక్రవారం వివిధ ప్రాం తాల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం పొంద గా, పలుచోట్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరీక్ష తప్పిన విద్యార్థులు కలవరపడకుండా.. రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలని సూచిస్తున్నారు. చురుకైన విద్యార్థి తప్పాడు నిజామాబాద్ అర్బన్: నగరంలోని అర్సపల్లిలో ఇంటర్ విద్యార్థి యశ్వంత్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన యశ్వంత్ రాత్రి 8.30 సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎప్పటిలాగే యశ్వంత్ టీవీ చూడ టంగానీ, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం గానీ చేస్తుంటాడని అతడి తల్లి భావించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె తలుపు తీసేందుకు వెళ్లగా గడియవేసి ఉంది. పిలిచినా స్పందన రాలేదు. అనుమానం వచ్చిన ఆమె పొరుగువారితో కలిసి తలుపులు బద్దలు కొట్టగా యశ్వంత్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే యశ్వంత్ చదువులో చురుకైన విద్యార్థి అని, పదో తరగతిలోనూ 9.0 గ్రేడ్ మార్కులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వంత్ మరణంపై పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వరంలో నిజామాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. రైలుకు ఎదురుగా వెళ్లి.. నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వాలుగొండ హరికృష్ణ కూతురు జాహ్నవి (16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. అందులో 75 మార్కులకుగాను 13 మార్కులు వచ్చాయి. వేల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తే ఇలా ఫెయిల్ అయితే ఎలా? అని తండ్రి మందలించారు. గురువారం రాత్రంతా జాహ్నవి బాధపడడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఇకనైనా బాగా చదువుకో అని ధైర్యం చెప్పారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు జాహ్నవి ఇంట్లో నుంచి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్సై కోటేశ్వర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాహ్నవి మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో 56 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. భూపాలపల్లి జిల్లాలో... చిట్యాల: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కొల్లూరి వరుణ్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చల్లగరిగ గ్రామానికి చెందిన బాబు–పూలమ్మ దంపతుల కుమారుడు వరుణ్ హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలవడంతో మనస్తాపానికి గుర య్యాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిజిక్స్‌లో ఫెయిలయ్యానని.. కమలాపూర్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో ఓ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. దామెర మండలం పసరగొండకు చెందిన దామెర లత (17) కమలాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌లో ఫిజిక్స్‌లో లతకు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ భవనం పైకెక్కి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.అనిత తెలిపారు. లతకు ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. లత హాస్టల్ భవనం పైకెక్కి కిందికి దూకేందుకు సిద్ధమైన తరుణంలో లహరి, సోమేశ్వరి అనే విద్యార్థినులు చూసి దూకొద్దని హెచ్చరించారు. అయినా వినకుండా లత కిందికి దూకగా ఆ విద్యార్థినులు తమ రెండు చేతులను అడ్డుపెట్టి ఆమెను ఒడిసిపట్టేందుకు యత్నించారు. అయినా లత తమ చేతుల్లో నుంచి కిందకు పడిపోయిందని వారు చెప్పారు. కుషాయిగూడలో అదృశ్యం కుషాయిగూడ: ఇంటర్ తప్పడంతో ఓ విద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన ఆరే తరుణ్ (17)కుషాయిగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిలవడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరీక్షలనూ జయించొచ్చు ఆన్లైన్ చదువుల వల్ల ప్రతి విద్యార్థి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు బాగా అలవాటుపడ్డారు. అయితే రెగ్యులర్‌గా కళాశాలలు లేకపోవడంతో ఒక్కసారిగా గతంలో ఉన్న పాత వాతావరణానికి అలవాటుపడేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో అనుకున్నమేర ప్రదర్శన చేయలేకపోయారు. అయితే కరోనా తెచ్చిన ఈ విభిన్న వాతావరణం నుంచి బయటపడేందుకు ప్రణాళిక రూపొందించుకుని కసరత్తు చేయాలి. పరీక్షలు జయించడమనేది పెద్ద లెక్క కాదు. –అనూష వినయత, రైజ్‌అప్ ఫౌండేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రిపరేషన్ సమయం ఇవ్వలేదు కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు అంతంత మాత్రమే జరిగాయి. స్మార్ట్ఫోన్లు లేని వారికి అసలే అందలేదు. టెన్త్ నుంచి ఇంటర్లో అడుగిడాక ప్రత్యక్ష బోధనే జరగలేదు. వారికి ఇంటర్ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన రాలేదు. కోవిడ్‌తో పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. దీంతో పరీక్షలు ఉండవనే భావన విద్యార్థుల్లో ఏర్పడింది. హడావుడిగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. సిలబస్ తగ్గించినా ప్రిపరేషన్‌కు సయయం ఇవ్వలేదు. –బాబురావు, రిటైర్డ్ లెక్చరర్, హనుమకొండ ప్రభుత్వ కళాశాల -
తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య
మహబూబ్‌నగర్: అనారోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఓ విద్యార్థి కళాశాల తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో శుక్రవారం తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో తరగతి గదిలో ఉండే ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలరాజు(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు కళాశాల వసతి గృహంలో ఉంటూ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లాక్డౌన్ తర్వాత కళాశాలలు ప్రారంభించడంతో ఇటీవలే తిరిగి కళాశాలలో చేరాడు. ఆరోగ్య సమస్యలతో పాటు చదువుపై ఆసక్తి లేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు ధన్వాడ: మండలంలోని చర్లపల్లికి చెందిన విద్యార్థి బాలరాజు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉరేసుకొని మృతిచెందిన వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలప్ప, చంద్రమ్మ దంపతుల రెండో కుమారుడు బాలరాజు. కొంత కాలం క్రితమే విద్యార్థి తల్లి చంద్రమ్మ సైతం మృతిచెందింది. దీంతో ఉన్న రెండు ఎకరాల పొలం సాగు చేస్తూ తండ్రి వీరిని పోషిస్తున్నాడు. ఇన్నాళ్లు తమ మధ్యే తిరిగిన బాలరాజు అకస్మాత్తుగా మృతిచెందడంతో బంధువులు, అతని స్నేహితులు విషాదంలో మునిగారు. చదవండి: సీనియర్ నటుడిపై కుమార్తె ఫిర్యాదు -
ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిలైన వారు పాస్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్–2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్ కేటగిరీలో పాసైనట్లుగా రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్–19 నేపథ్యంలో రద్దు చేసి ‘ఆల్‌పాస్’గా ప్రభుత్వం ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్ కేటగిరీలో పాస్ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. అలాగే ఫస్టియర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో రాసుకోవాలన్నారు. సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ సబ్జెక్టులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఇద్దరు ఉద్యోగులపై తెలంగాణ ఇంటర్ బోర్డు వేటు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా 00 గా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్ ఉమాదేవికి అయిదువేలు జరిమానాతో పాటు ఉద్యోగం నుంచి తొలగించగా, లెక్చరర్ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో తప్పిదాల కారణంగా సుమారు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ విషయం తెలిసిందే. -
నిర్భయంగా పరీక్ష రాయండి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి.. ఆందోళన చెందకుండా నిర్భయంగా పరీక్ష రాయాలి’ అని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి దస్రునాయక్ అన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులుంటే తమను సంప్రదించాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు సంబంధించి మరిన్నీ విషయాలను డీఐఈవో సాక్షి ఇంటర్వ్యూలో తెలిపారు. సాక్షి : పరీక్షలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఎంత మంది హాజరుకానున్నారు.? డీఐఈవో : ఈనెల 27 నుంచి మార్చి 13 పరీక్షలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 6,163 మంది, వోకేషనల్‌లో 749 హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 7,193 మంది, వోకేషనల్ కోర్సులో 595 మంది, ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) 653 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో మొత్తం 15,353 మంది పరీక్షలు రాయనున్నారు. సాక్షి : పరీక్ష నిర్వహణకు ఎంత మంది అధికారులను నియమిస్తున్నారు.? డీఐఈవో : జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఐదుగురు కస్టోడియన్లను, 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమిస్తాం. సాక్షి : గతంలో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాశారు.. ఈసారీ అదే పరిస్థితి ఉంటుందా.? డీఐఈవో : ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. ఏ ఒక్కరు కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.? డీఐఈఓ : పరీక్ష కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్యశాఖ ద్వారా ఏఎన్ఎంలు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుతాం. సాక్షి : ఇబ్బందులుంటే ఎవరిని సంప్రదించాలి.? డీఐఈవో : జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 08732–223114, 9848781808 నంబర్లలో సంప్రదించవచ్చు. సాక్షి : మాస్ కాఫీయింగ్ నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.? డీఐఈవో : పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఒక ఫ్లైయింగ్ స్కాడ్ బృందం, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ పరీక్ష కేంద్రానికి జియోట్యాగింగ్ అనుసంధానం చేస్తాం. పరీక్ష కేంద్రంలోకి అధికారులు, ఇన్విజిలేటర్లకు, విద్యార్థులకు సెల్ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబడదు. నిఘా నీడలో నిర్వహించబడుతాయి. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాల ముందు ప్రశ్న పత్రాలు తెరుస్తాం. సాక్షి: విద్యార్థులకు మీరు ఇచ్చే సలహ? డీఐఈవో: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి.. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి. కష్టపడి చదివి ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. కాపీయింగ్‌పై ఆధారపడవద్దు. ఉన్న సమయం సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. -
చెప్పని పాఠాలకు పరీక్ష
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంటారు.. విద్యార్థులకు ఏ మేరకు చదువు అర్థమవుతుందో దీంతో తెలిసిపోతుంది. విద్యా సంవత్సరమంతా చెప్పిన పాఠాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే..ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి పరిస్థితి భిన్నం గా ఉంది. చెప్పని చదువుకు పరీక్షలు నిర్వహిస్తుండటం, వాటిపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వారు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరీక్ష రాయని విద్యార్థులు మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనప్పటికీ ఈ పరీక్షలు రాయకుంటే ఫెయిల్ అయినట్లే. వీరికి లాంగ్‌మెమోలు రాకపోవడం, డిగ్రీ ప్రవేశానికి ఆన్లైన్లో వివరాలు నమోదు కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నా రు. అవగాహన లేమితోనే ఈ తంటాలు వారికి తప్పడంలేదు. జిల్లాలో ఏటా 10 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయడంలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో మొత్తం 48 ఇంటర్మీడియెట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ కళాశాలలు, 16 ప్రైవేట్, 6 మోడల్ స్కూళ్లు, 6 ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, 2 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, 1 మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల, 2 వృత్తి విద్యా కోర్సు కళాశాలలు, 2 కస్తూర్భా బాలికల విద్యాలయాల్లో ఇంటర్ విద్యాబోధన జరుగుతోంది. ప్రథమ సంవత్సరంలో 6,950 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 7,788 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలు అనే సబ్జెక్టులను బోధించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని కళాశాలల్లో ఈ రెండు సబ్జెక్టుల పాఠాలు చెప్పడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలోనే ఈ సబ్జెక్టులు ఉన్నాయనే విషయం వారికి తెలుస్తోంది. సంవత్సరమంతా ఆ సబ్జెక్టులకు సంబంధించిన బుక్కులు తెరవని విద్యార్థులు పరీక్షల్లో ఏమి రాయాలో తెలియక కొంతమంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా గైర్హాజరైన వారు పరీక్షల్లో మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినా ఈ రెండు సబ్జెక్టులు రాయకపోవడం వల్ల ఫెయిల్ అయిన కిందకే వస్తారని అధికారులు చెబుతున్నారు. వారికి లాంగ్ మెమోలు రాకపోవడంతో డిగ్రీ విద్యను అభ్యసించలేకపోతున్నారు. దీంతో విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. అవగాహన లేమితోనే.. విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ గురించి తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రెండు సబ్జెక్టులను ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశపెట్టింది. ఉద్దేశం మంచిదే అయినా.. ఆయా కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండడంతోపాటు విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ఈ సబ్జెక్టులను విద్యార్థులకు బోధించకపోవడమే కాకుండా వాటి గురించి అవగాహన కల్పించకపోవడమే దీనికి ముఖ్య కారణమవుతోంది. కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యమో, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారుల అలసత్వమేమో కానీ విద్యార్థులకు మాత్రం శాపంగా మారుతోంది. పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు గైర్హాజరవుతున్నట్లు సమాచారం. నేడు ఎథిక్స్, 31న పర్యావరణ విద్య పరీక్షలు నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య.. అనే అంశాలపై ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం నైతిక విలువలు (ఎథిక్స్), ఈనెల 31న పర్యావరణ విద్యపై పరీక్షలు జరగనున్నాయి. ఆయా కళాశాలల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న కళాశాలల్లోనే పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 6,950 మంది హాజరు కావాల్సి ఉందని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షల్లో పాసైతేనే.. లాంగ్ మెమో ఎథిక్స్, పర్యావరణ విద్య అనే సబ్జెక్టుల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు హాజరుకావాలి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నాం. గైర్హాజరైన విద్యార్థులు మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ఫెయిల్ అయిన కిందికే వస్తుంది. దీంతో డిగ్రీ ప్రవేశాల కోసం వారికి లాంగ్ మెమో జారీ చేయడం జరగదు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్షలకు హాజరుకావాలి. – దస్రు, డీఐఈఓ, ఆదిలాబాద్ -
ఇంటర్ విద్యార్థులకు ఫీజు పరీక్ష
ఇంటర్ విద్యార్థులకు పరీక్షల ముందే ఫీజుల రూపంలో అగ్ని పరీక్ష ఎదురవుతోంది. పరీక్ష ఫీజులను ఏకంగా 30 శాతం వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు వెలువరించింది. పైగా ఫీజు చెల్లింపునకు కేవలం 12 రోజులు మాత్రమే గడువు ఇచ్చిన బోర్డు ఆ తర్వాత అపరాధ రుసుం పేరుతో విద్యార్థులపై పెనుభారం మోపింది. రూ.5 వేల వరకు అపరాధ రుసుంగా నిర్ణయించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. అనాలోచిత నిర్ణయాలకు పెట్టింది పేరైన ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ,పుత్తూరు/మదనపల్లె సిటీ : విద్యార్థులను ఎలా ఇబ్బంది పెట్టాలో ఇంటర్మీడియట్ బోర్డుకు తెలిసినంతగా మరొకరికి తెలియదనే నానుడి ఉంది. దీన్ని నిజం చేస్తూ మరోసారి ఇంటర్మీడియట్ బోర్డు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజులను 15 నుంచి 200 శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణంగా ఏడాదికి పది శాతం లోపు పరీక్ష ఫీజును పెంచుతుంటారు. అలాంటిది ఈ ఏడాది భారీగా పెంచడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అరకొర వసతుల నడుమ ఉపకార వేతనాలపై ఆధారపడే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పెనుభారంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుత్తూరులో రెండు ప్రభుత్వ జూనియ ర్ కళాశాలలు, ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరిధిలో సుమారు 6 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పెంచినఫీజుల భారం ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులపై పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసే అవకాశాలున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అపరాధ రుసుంపైనే దృష్టి.. ఫీజులను భారీగా పెంచిన ఇంటర్ బోర్డు చెల్లింపునకు కేవలం 12 రోజులే గడువు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అసలే ఫీజులు పెరగడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపునకు తక్కువ సమయం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 24వ తేదీన పెంచిన ఫీజులకు సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. ఫీజు చెల్లింపునకు నవంబర్ 5వ తేదీ తుది గడువుగా పేర్కొనడంతో విద్యార్థులు విస్తుపోతున్నారు. గడువు లోపు చెల్లించని విద్యార్థులకు రూ.120 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. అపరాధ రుసుం వసూలు చేసేందుకే ఇంటర్మీడియ ట్ బోర్డు తక్కువ సమయం కేటాయించిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో బోర్డు వ్యాపారం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీజులను పెంచిన ఇంటర్ బోర్డు అందుకు తగ్గట్టుగా చెల్లింపునకు కనీసం నెల రోజులు గడువు ఇచ్చి ఉంటే కొంతలోకొంత ఉపశమనంగా ఉండేదని అంటున్నారు. పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇంటర్ ఫీజుకు నాలుగురోజులే గడువు
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): 2018 –19 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో విద్యార్థులు అప్రమత్తమవ్వాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆదేశిస్తున్నారు. ఇంటర్మీడియేట్ కోర్సుకు పరీక్ష ఫీజును చెల్లించాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో నాలుగు రోజులే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 5వ తేదీ ఫీజు కట్టేందుకు తుది గడువుగా నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్ఐవో కార్యాలయానికి, కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత జాప్యమయ్యే కొద్దీ అపరాధ రుసుం మోత మోగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంత వీలైతే అంత త్వరగా పరీక్ష ఫీజును చెల్లిస్తే మంచిదన్న అభిప్రాయం జూనియర్ కళాశాలల వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 2019 జనవరి 22 వరకు ఆఖరి గడువు ఉన్నా అపరాధ రుసుం మాత్రం రూ.5 వేలు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తుగానే ఫీజు చెల్లించి ఉత్కంఠకు లోను కాకుండా సాఫీగా పరీక్షలకు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 312 జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో ఆదర్శ కళాశాలలు నాలుగు, సాంఘిక, ట్రైబల్, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలు 25, ఎయిడెడ్ 16, ప్రభుత్వ కళాశాలలు 43 ఉండగా, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో 49 కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలలు 179 ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 54,031 మంది, ద్వితియ సంవత్సరం 50,765 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రానున్న మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) రాయాలంటే దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజును తప్పని సరిగా చెల్లించాలి. అపరాధ రుసుం ఇలా.. ఒకవేళ విద్యార్థులు నిర్ణీత గడువు నవంబరు 5వ తేదీ లోపు చెల్లించకుంటే, ఈ నెల 14 వరకూ రూ.120 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 26 వరకు రూ.500, డిసెంబర్ ఆరు వరకూ రూ.1000, డిసెంబరు 20 వరకు రూ.2 వేలు, డిసెంబరు 31 నాటికి రూ.3 వేలు అపరాధ రుసుం చెల్లించాలి. 2019 జనవరి 22 నాటికి ఆఖరి అవకాశంగా రూ.5 వేల గరిష్ట ఫైన్‌తో పరీక్ష ఫీజును ఆయా యాజమాన్యాలు తీసుకోవచ్చు. గడువులోపు చెల్లించాలి పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను చైతన్యం చేయాలని సూచించాం. కేవలం పరీక్ష ఫీజు మాత్రమే వసూలు చేయాలి.– టేకి వెంకటేశ్వరరావు, ఆర్ఐవో,ఇంటర్‌బోర్డు, రాజమహేంద్రవరం ఫీజుల వివరాలు ఫస్టియర్ పరీక్ష దరఖాస్తు ఫీజు రూ.10, సాధారణ కోర్సులకు రూ.480, ఒకేషనల్ కోర్సులకు రూ.660, బ్రిడ్జి కోర్సులకు రూ.125, బ్రిడ్జి కోర్సుల్లో బైపీసీ తీసుకుని గణితం ప్రాక్టికల్స్ ఉన్న వారికి రూ.125 చొప్పున ఫీజు చెల్లించాలి. సెకండియర్ విద్యార్థుల దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజుతో కలుపుకొని సాధారణ కోర్సులకు రూ.660, ఫస్టియర్‌లో పేపర్లు రాసేందుకు రూ.480, మొదటి, రెండు సంవత్సరాలత్లో సబ్జెక్టులున్న వారికి ప్రాక్టికల్స్‌తో కలిపి రూ.1140, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.660 వంతున ఫీజుగా ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. -
రాయితీలిస్తాం.. మా కాలేజీలో చేర్చండి
వజ్రపుకొత్తూరు: పదో తరగతి చదువుతున్న విద్యార్థులను తమ కాలేజీలో చేర్చుకునేందుకు కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు అప్పుడే వల విసురుతున్నాయి. రాయితీలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తూ తల్లిదండ్రులపై పీఆర్వోలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పదోతరగతిలో మంచి గ్రేడ్ పాయింట్లు తెచ్చుకుంటే మరింత రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి ఆగడాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 469 ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 20 కేజీబీవీ, 14 మున్సిపల్ హైస్కూల్స్, మరో 14 ఆంధ్రప్రదేశ్ మోడల్ హైస్కూల్స్ ఉన్నాయి. ఇదికాక 193 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది దాదాపు 63,000 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం వీరి వివరాలు సేకరించి పీఆర్వోలను రంగంలోకి దింపి ఇళ్లకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే ఇప్పటికే తమ వద్ద ఉన్న విద్యార్థులు ఎటూ చేజారిపోకుండా 10వ తరగతి ఫీజు కట్టినపుడే.. ఇంటర్‌కు అడ్వాన్స్ ఫీజు చెల్లిస్తే అప్పటి ధరలో పదో వంతు రాయితీ ఇస్తామంటూ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏరియాకు ఒకరు చొప్పున కమీషన్ పద్ధతిలో పీఆర్ఓలను నియమించి విద్యార్థుల కోసం గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల మార్కుల లిస్ట్, టీసీ ఇచ్చేది లేదని తమ కళాశాలలోనే పిల్లలను ఉంచాలని ఒత్తిడి చేస్తున్నాయి. కళాశాలలో పని చేసే ఉపాధ్యాయుల నుంచి అటెండర్ల వరకు ప్రతి ఒక్కరూ నెలకు కచ్చితంగా ఇద్దరిని చేర్చాలని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆదివారం పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌లు, రాయితీలు వివరిస్తున్నారు. పదోతరగతిలో అర్థ సంవత్సరం (సమ్మెటివ్–2) పరీక్షలు జరగక ముందే ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాకినాడ ఆర్ఐఓ కార్యాలయం సైతం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలలను పాఠశాలలకు వచ్చి విద్యార్థులను పలోభ పెడితే ప్రధానోపాధ్యాయులు తీవ్రంగా పరిగణించి వారిని నిరోధించాలని వజ్రపుకొత్తూరు విద్యాశాఖాధికారి పి.కృష్ణప్రసాద్ అన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ణిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
మెరుగనిపించారు!
► ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ► ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 69 రాషస్థ్రాయిలో జిల్లాకు 7వ స్థానం ► పరీక్ష రాసిన వారు 30,270 ► ఉత్తీర్ణులైన వారు 20,999 ► బాలుర ఉత్తీర్ణత శాతం 66 ► బాలికల ఉత్తీర్ణత శాతం 73 కర్నూలు(జిల్లా పరిషత్) : ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ సారి సత్తా చాటారు. అ‘ద్వితీయ’ ఫలితాలతో మెరిశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థుల్లో 30,270 మందికి గాను 20,999 మంది(69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 16,200 మందిలో 10,663 మంది(66శాతం), బాలికలు 14,070 మందిలో 10,336(73శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటుగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో 6,759 మందికి గాను 2,216(33శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ర్టవ్యాప్తంగా జిల్లాకు 7వ స్థానం దక్కింది. గత ఏడాది జిల్లా 9వ స్థానంలో నిలిచింది. వొకేషనల్‌లో... 1,893 మందికి గాను 1,290(68శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు 1,477 మందికి గాను 997(68 శాతం), బాలికలు 416 మందికి గాను 293(70శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటుగా రాసిన వారిలో మొత్తం 334 మంది దరఖాస్తు చేసుకోగా 128మంది(38శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో... జిల్లాలోని 41 ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 6,317 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,345 మంది(69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,448 మందికి గాను 2,438(70.71శాతం), బాలికలు 2,869 మందిలో 1,907(66.47శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో బాలికల కంటే బాలురే ఈసారి నాలుగు శాతానికి పైగా అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కాలేజిల్లో... జిల్లాలోని ఎయిడెడ్ కాలేజిలో 1,540 మందికి గాను 880 మంది(57శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురల్లో 788 మందికి గాను 382 మంది(48.48శాతం), బాలికల్లో 752 మందికి గాను 498(66.22శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.