ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి.. ఆందోళన చెందకుండా నిర్భయంగా పరీక్ష రాయాలి’ అని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి దస్రునాయక్ అన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులుంటే తమను సంప్రదించాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు సంబంధించి మరిన్నీ విషయాలను డీఐఈవో సాక్షి ఇంటర్వ్యూలో తెలిపారు.
సాక్షి : పరీక్షలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఎంత మంది హాజరుకానున్నారు.?
డీఐఈవో : ఈనెల 27 నుంచి మార్చి 13 పరీక్షలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 6,163 మంది, వోకేషనల్‌లో 749 హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 7,193 మంది, వోకేషనల్ కోర్సులో 595 మంది, ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) 653 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో మొత్తం 15,353 మంది పరీక్షలు రాయనున్నారు.
- సాక్షి : పరీక్ష నిర్వహణకు ఎంత మంది అధికారులను నియమిస్తున్నారు.?
- డీఐఈవో : జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 28 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, ఐదుగురు కస్టోడియన్‌లను, 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమిస్తాం.
- సాక్షి : గతంలో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాశారు.. ఈసారీ అదే పరిస్థితి ఉంటుందా.?
- డీఐఈవో : ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. ఏ ఒక్కరు కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- సాక్షి: పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.?
- డీఐఈఓ : పరీక్ష కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్యశాఖ ద్వారా ఏఎన్‌ఎంలు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉంచుతాం.
- సాక్షి : ఇబ్బందులుంటే ఎవరిని సంప్రదించాలి.?
- డీఐఈవో : జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 08732–223114, 9848781808 నంబర్లలో సంప్రదించవచ్చు.
- సాక్షి : మాస్ కాఫీయింగ్ నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?
- డీఐఈవో : పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఒక ఫ్‌లైయింగ్ స్కాడ్ బృందం, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ పరీక్ష కేంద్రానికి జియోట్యాగింగ్ అనుసంధానం చేస్తాం. పరీక్ష కేంద్రంలోకి అధికారులు, ఇన్విజిలేటర్లకు, విద్యార్థులకు సెల్‌ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబడదు. నిఘా నీడలో నిర్వహించబడుతాయి. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాల ముందు ప్రశ్న పత్రాలు తెరుస్తాం.
- సాక్షి: విద్యార్థులకు మీరు ఇచ్చే సలహ?
- డీఐఈవో: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి.. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి. కష్టపడి చదివి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలి. కాపీయింగ్‌పై ఆధారపడవద్దు. ఉన్న సమయం సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment