Intermediate board exams
-
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్‌గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది. 2023, మార్చ్ 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి మే రెండో వారం దాకా ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి. -
మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 3.76 లక్షల మంది విద్యార్థులు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. (చదవండి: సర్కారు వారి పాట) -
పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 1.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో 234 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూట్ బస్ పాస్ ఉన్న విద్యార్థులు ఆ రూట్లలోనే కాకుండా హాల్ టికెట్, బస్ పాస్ కలిపి చూపించి వేరే మార్గాలలోనూ ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ షాపులను మూసివేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సూర్యలత, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి వడ్డెన్న, అడిషనల్ డీసీపీ ప్రసాద్, పొలీస్ ఇన్స్పెక్టర్ రామచంద్రం, విద్యుత్ శాఖ అధికారి స్రవంతి, వాటర్ వర్క్స్ స్వామి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ రావు, పోస్టల్ శాఖ సిబ్బంది శశాంత్ కుమార్, ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ జానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఓయూ@105) -
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్: మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు. పదో తరగతి పరిక్షల షెడ్యూల్: టెన్త్ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు. -
అంతా సక్రమంగానే చేశాం
సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం... ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
ఇంటర్ ఫస్టియర్: టైంటేబుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు శక్రవారం ఓ ప్రకటనలతో తెలిపింది. దీంతో నవంబర్ 2తో ముగియాల్సిన పరీక్షలను ఇంకోరోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: మొదటి సంవత్సరం పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు దోబూచులాడుతోంది. కరోనా కారణంగా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాయకుండా, ద్వితీయ సంవత్సరానికి వెళ్లిన విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపాదనలు సైతం బోర్డుకు పంపినట్టు చెప్పారు. ఇంటర్ బోర్డు మాత్రం దీనిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దసరా సెలవుల తర్వాత పరీక్షలు ఉండొచ్చని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నా, ప్రభుత్వం అనుమతించిన తర్వాతే షెడ్యూల్ ఖరారు చేస్తామంటున్నారు. బోర్డు కాలయాపన కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ద్వితీయ సంవత్సరం అకడమిక్ కేలండర్ ఇప్పటికే ప్రకటించారు. మార్చిలో వార్షిక పరీక్షలు ఖరారు చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంత ఒత్తిడిలో మొదటి ఏడాది పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో పరీక్షలు పెట్టి ఉంటే కొంత సమయం ఉండేదని అంటున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కోవిడ్ మళ్లీ వస్తే ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండదంటోంది. మొదటి ఏడాది మార్కులు లేకుండా, ఎలా పాస్ చేస్తామంటోంది. ఫస్టియర్ పరీక్షలు పెట్టి ఆ మార్కులను ప్రామాణికంగా తీసుకునే వీలుందని చెబుతోంది. రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిం దని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులోనే స్పష్టం చేసిందని, దీని ఆధారంగానే పరీక్షల నిర్వహణపై కసరత్తు జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం అనుమతించినా షెడ్యూల్ ఇవ్వడానికి 2 వారాల సమయం పడుతుందని, దసరా తర్వాతే ఫస్టియర్ పరీక్షల నిర్వహణ సాధ్యమన్నారు. కానీ ఈ సమయంలో పరీక్షలు పెట్టడం సరికాదని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు సెప్టెంబర్‌లో ...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ రెండవ వారంలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు. మరో వారంలో పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్లో చేరిన వారు దాదాపు 4.70 లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో వీరికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి. కరోనా కార ణంగా వీలు కాకపోవడంతో వారందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అయితే, పరీక్షలు లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన కొందరు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కోరుకునే వారికి కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పరీక్షలు పెడతామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గిందని ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ద్వితీయ సంవత్సరం సిలబస్ చాలా వరకు పూర్తయిందని, ఈ సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్లడం కష్టమనే వాదన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. పరీక్షలు జరపాలంటే కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్ ఇవ్వాలి. నిబంధనల ప్రకారం షెడ్యూల్ తర్వాత పరీక్షలకు నెల రోజుల గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పరీక్షలు ఇంకా ఆలస్యమైతే తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
AP: రైతు ఇంట మెరిసిన విద్యా‘మణి’
పులివెందుల టౌన్ (వైఎస్సార్ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాకు చెందిన దేవమణి మంచి ప్రతిభ కనబరిచింది. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 991 సాధించింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుడిపల్లెలో నివాసముంటున్న రైతు మధుసూదన్‌రెడ్డి, వరలక్ష్మి దంపతులకు వెంకట జితేంద్రారెడ్డి, దేవమణిలు సంతానం. దేవమణి పట్టణంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. తండ్రి కష్టాన్ని వృథా పోనివ్వకుండా దేవమణి అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. -
Telangana: ఇంటర్ పరీక్ష గంటన్నరే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సెకండియర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్ చేశారు. మరి ఫస్టియర్ విద్యార్థులకు ఏ ప్రాతిపదిక లేకపోవడం, 35 శాతం మార్కులు తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలను రద్దు చేసి, సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఒకవేళ ఈ ఏడాది మళ్లీ వైరస్ విజృంభించి మరోసారి పరీక్షలను రద్దు చేయాల్సి వస్తే పరిస్థితి గందరగోళంగా మారనుంది. అదీగాక వీరికి మార్కులు కేటాయించడమూ కష్టమే. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉండటంతో సెకండియర్ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. -
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
నేరేడ్మెట్:కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ,బీపీసీ(జనరల్)లతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసిందని శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎం.కిషన్ పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. వచ్చే నెల 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు తిరిగి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా? -
ఈసారి ఇంటర్లో ఆ పరీక్ష లేదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఈసారి ఎన్విరాన్మెంటల్, హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్ పరీక్షలు ఉండవు. అసైన్మెంట్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు అసైన్మెంట్లు ఇచ్చి ఇంటి వద్ద వాటికి సమాధానాలు రాసి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ బోర్డు రూపొందించిన అకడమిక్ కేలండర్లో ఈ మేరకు ప్రతిపాదించింది. ఇక మిగతా వాటికి ప్రతి సబ్జెక్టులో 70 శాతం సిలబస్‌తో, 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రాక్టికల్స్ ఉండే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో.. థియరీ పరీక్షలకు 70, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉండేలా ప్రతిపాదించింది. అదే విధంగా... ఈసారి ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను పెంచుతోంది. మరోవైపు ప్రాక్టికల్స్‌కు ప్రశ్నపత్రాలను బోర్డు నుంచి పంపించకుండా, కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు రూపొందించి పరీక్షలు నిర్వహించి మార్కులను బోర్డుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అకడమిక్ కేలండర్పై ఈనెల 27వ తేదీన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మూడు రకాలుగా తరగతులు ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధనను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు బోర్డు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కాలేజీల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రణాళికలను రూపొందించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రస్తుతం ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా విద్యార్థుల సంఖ్య ఉంది. 404 ప్రభుత్వ కాలేజీలను చూస్తే వేయికి పైగా విద్యార్థులు కలిగిన కాలేజీలు 12 ఉన్నాయి. అందులో కొన్నింటిలో 2 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు కాలేజీలు 1,600 వరకు ఉండగా, అందులో ఎక్కువ కాలేజీల్లో 500 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో షిఫ్ట్ విధానంలో బోధన చేపట్టనున్నారు. బాగా తక్కువ విద్యార్థులు ఉన్న కాలేజీల్లో మామూలుగానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు తరగతులుంటాయి. అంతకంటే ఎక్కువ, వేయిలోపు విద్యార్థులున్న కాలేజీల్లో మాత్రం ఒక రోజు ఫస్టియర్, మరొక రోజు సెకండియర్ విద్యార్థులకు విద్యా బోధన చేపట్టే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్లో మార్పులుంటాయా? ఈసారి ఇంటర్ పరీక్షలను మే 3వ తేదీ నుంచి ప్రారంభించేలా బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగిసేలా, పరీక్షలన్నీ మే 24వ తేదీవరకు ముగిసేలా ప్రతిపా దించింది. అయితే ఇప్పటికే టెన్త్ పరీక్షలను మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను మరో రెండు మూడ్రోజులు ప్రీపోన్ చేసే అవకాశముంది. లేదం టే టెన్త్ పరీక్షల షెడ్యూల్ మార్పు చేయాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థుల ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగుస్తాయి కనుక టెన్త్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై 27వ తేదీన విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ప్రాక్టికల్స్ బదులు ప్రాజెక్ట్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు, థియరీ పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో సగం మందితో ఆఫ్‌లైన్, మిగతావారికి ఆన్లైన్లో బోధన సాగేలా బోర్డు అన్ని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పలు కాలేజీలు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ నిలిపేసి ఫీజుల వసూలుకు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తుండడంతో.. అలా కుదరదని, రెండు రకాల బోధన కొనసాగించాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. అయితే కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం బోర్డు తర్జనభర్జనలు పడుతోంది. ప్రాక్టికల్స్ స్థానంలో అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి ప్రాక్టికల్స్ నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రాక్టికల్స్‌కు కొన్ని కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులందరినీ జంబ్లింగ్ విధానంలో ఆయా కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు అనుమతిస్తారు. కోవిడ్ వల్ల విద్యార్థులు ఆయాకేంద్రాలకు చేరుకోవడం ఒక ఇబ్బంది అయితే ల్యాబ్ రూములు చిన్నవిగా ఉన్నందున అక్కడ అందరూ గుమిగూడి ప్రయోగాలు నిర్వహించడం కూడా సరికాదని బోర్డు భావిస్తోంది. ఈ ప్రాక్టికల్స్‌కు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో రోజూ మార్చే విధానం అమలు చేస్తున్నారు. వైరస్ నేపథ్యంలో ఈ విధానం అనవసర సమస్యలకు దారితీసే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు బదులు అవే అంశాలపై ప్రాజెక్టు వర్కులను ఇచ్చి ఎవరికివారే వాటిని పూర్తిచేసి సమర్పించేలా చేయాలని ఆలోచిస్తున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులకే థియరీ పరీక్షలు కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరాంతంలో నిర్వహించాల్సిన థియరీ పరీక్షల్లో కొన్ని మార్పులు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టలేదు. ఆన్లైన్ ప్రవేశాలపై చాలాకాలం కిందటే ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. జూనియర్ కాలేజీల్లోని సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సీబీఎస్ఈ మాదిరి 40కి పరిమితం చేస్తూ ప్రభుత్వం జీవో 23 ఇచ్చింది. వీటిపై కొన్ని కాలేజీలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆ జీవో అమలు, ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయాయి. ఫస్టియర్ ప్రవేశాలు ఇంకా చేపట్టనందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగాల్సిన థియరీ పరీక్షలను ఈ విద్యాసంవత్సరం వరకు సెకండియర్ విద్యార్థులకే పరిమితం చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరం తరగతులు జరుగుతున్న సమయంలోనే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వరకు పాతపద్ధతిలోనే ప్రవేశాలు జీవో 23ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ముందుకు సాగలేదు. దీనిపై ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్లాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పై కోర్టుకు వెళ్లి, తరువాత ప్రవేశాలు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమైనందున ఈ విద్యాసంవత్సరం వరకు ఫస్టియర్ ప్రవేశాలను గతంలో మాదిరి ఆఫ్‌లైన్‌లో పూర్తిచేయడం మంచిదని బోర్డు భావిస్తోంది. ఆన్లైన్ ప్రవేశాలపై ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బోర్డు ఆదేశాలు జారీచేయడంతో పాటు దానికి విస్తృత ప్రచారం కూడా కల్పించారు. అన్ని కాలేజీల వసతి ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆన్లైన్లో ఫొటోలు, ఇతర పత్రాలను కూడా అప్లోడ్ చేయించారు. అయినా కొంతమంది ప్రచారం చేయలేదని, ఆన్లైన్ ప్రవేశాలపై జీవో ఇవ్వలేదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ప్రవేశాలు నిలిచిపోయాయి. వాస్తవానికి బోర్డు స్వయం ప్రతిపత్తి ఉన్నది కనుక జీవోలతో సంబంధం లేకుండానే తన కార్యకలాపాలను సాగించే అవకాశముంది. అయినా ఆ కారణాలనే చూపుతూ న్యాయస్థానం ఆన్లైన్ ప్రవేశాలను నిలిపేసినందున ప్రస్తుతానికి పాత విధానంలోనే వాటిని పూర్తిచేయాలని బోర్డు భావిస్తోంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలకు బదులు ప్రాజెక్టు వర్కులు ఇవ్వాలని, థియరీ పరీక్షలు సెకండియర్ విద్యార్థులకే నిర్వహించాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఫస్టియర్ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసిన తరువాత పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలను నివేదించాం. ప్రభుత్వ ఆమోదానంతరం చర్యలు చేపడతాం. ఫస్టియర్ ప్రవేశాలపైనా ప్రభుత్వ సూచనలను అనుసరించి ముందుకు వెళ్తాం. – రామకృష్ణ, బోర్డు కార్యదర్శి -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మెరుగైన పద్ధతులను అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దానికి నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా 040–24601010, 040–24732369, 040–24655027 నెంబర్లలో సంప్రదించాలని, నోడల్ అధికారి పరిష్కరిస్తారన్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ధ వహించాలని ఆదేశించారు. çపరీక్షా కేంద్రాలన్నింటిలోనూ కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. 20లోగా నివేదిక ఇవ్వండి జిల్లాల్లో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై చెక్ లిస్టు ప్రకారం ఈనెల 20లోగా నివేదికలు అందజేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కోరారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలకు సరైన భద్రత కల్పించే విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. 9,65,840 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ ప రీక్షలకు 1,339 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో 50 ప్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 24,750 మం ది ఇన్విజిలేటర్లు పాల్గొంటారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియెట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే ఇంటర్మీడియెట్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను శుక్రవారం ఉదయం 11.00 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం, https://www.sakshi.com/ https://www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. -
విద్యార్థులకు తొలి ‘పరీక్ష’
ఇంటర్ విద్యార్థులకు ‘తొలి’ రోజే పరీక్ష తప్పలేదు. అసౌకర్యాల నడుమ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేశారు. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్ష సమయం అవుతున్నా ఏర్పాట్లు చేస్తూ కనిపించారు. పలు కేంద్రాల్లో తాగునీటికి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థ పడడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏఎన్ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అంతంత మాత్రంగానే ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేయడంతో విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎంత ముందుగా బయలుదేరినా.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీఆర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, మెజార్టీ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సరిగా వెలుతురు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటిలోనే పరీక్ష రాసిన పరిస్థితి నెలకొంది. కొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా ఒక లైటు బిగించి చేతులు దులుపుకున్నారు. ప్రతి రూముకు తాగునీటి వసతి కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. చాలా కేంద్రాల్లో పరీక్షకు అరగంట ముందుగా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ కేంద్రలో పరీక్షకు అరగంట ముందు సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రూముల్లో కూడా కుర్చీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ సిబ్బంది వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు వైద్య కిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా అవి కనిపించలేదు. పరీక్ష ప్రారంభమైనా కూడా ఏఎన్ఎం ఎవరూ రాకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు సైతం నామమాత్రపు విధులు నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు మాత్రమే ఒక కానిస్టేబుల్ రావడం విశేషం. నెల్లూరులో ట్రాఫిక్ కష్టాలు అభివృద్ధి పేరుతో అధికారులు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేశారు. ఏ ప్రాంతంలోనూ పూర్తిస్థాయిలో పనులు చేసిన పరిస్థితి లేదు. దీంతో ఉదయం సమయంలో ఒకవైపు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో వాహనాలు, మరో వైపు పాఠశాలలకు విద్యార్థులను తీసుకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు టెన్షన్ పడ్డారు. ప్రధానంగా స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్, వీఆర్సీ, ఆర్టీసీ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆయా కూడళ్లలో పోలీసులు కనిపించలేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసుశాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పరీక్ష ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. చాలా మంది తల్లిదండ్రులు బైక్‌లతోనే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కేంద్రాల వద్ద కోలాహలం.. ఆలయాలు, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. దేవాలయాల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, బంధువులు కూడా రావడంతో రద్దీగా కనిపించింది. విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లను కళాశాల బయట డిస్ప్లేలో ఉంచారు. ఈ నేపథ్యంలో నంబర్లు చూసుకునేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గమిగూడారు. విద్యార్ధులు పరీక్ష రాసేందుకు గదిలోకి వెళ్లగా తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల వద్ద బయట నిరీక్షించారు. మాస్ కాపీయింగ్ ఆరోపణలు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మాస్ కాపీయింగ్క పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలే మాస్ కాపీయింగ్‌కు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, తోటపల్లిగూడూరు, చేజర్ల, అల్లూరు, సౌత్‌మోపూరు, రాపూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిసింది. 820 మంది విద్యార్థులు గైర్హాజరు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90 కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 27610 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 26790 మంది హాజరయ్యారు. 820 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 26510 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 25793 మంది హాజరయ్యారు. 717 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఒకేషనల్‌కు సంబంధించి 1100 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 997మంది హాజరయ్యారు. 103 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ సత్యనారాయణ డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలలతో పాటు మరో రెండు కళాశాలలను తనిఖీలు నిర్వహించారు. సిటింగ్, స్క్వాడ్ అధికారులు జిల్లాలో 63 కేంద్రాలను పరిశీలించారు. -
తొలిరోజు ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నగరవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, అరబిక్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఒక్క నిమిషం అలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధన కారణంగా విద్యార్థులు ఉరుకులు పరుగులు తీసి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని కళాశాల విద్యార్థులకు దూరప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో ఇబ్బందులకు గురయ్యారు. మొదటి రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మొత్తం 4593 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షల నేపథ్యంలో అక్రమాలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. హాల్ టికెట్లు నెట్లో డౌన్లోడ్ చేసుకున్న వాటినీ అనుమతించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 78,010 మంది విద్యార్థులకు గాను 75,418 మంది పరీక్షలకు హాజరయ్యారు. మిగిలిన 2592 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 60,117 మంది విద్యార్థులకు గాను 58,116 మంది హాజరయ్యారు. 2001 మంది గైర్హాజరయ్యారు. మొదటి రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్ విద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 36,362 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం 16,823 మంది ఉండగా, ద్వితీ య సంవత్సరం 19539 మంది ఉన్నా రు. మొత్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్ష సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపించారు. ప్రశ్నపత్రాలను మాత్రం సంబంధిత కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. మొదటి రోజు బుధవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండ్ లాగ్వేజీ(తెలుగు) 1వ పేపర్ రాయనున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల్లో అవసరమైన వసతులను కల్పించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన బెంచీలను సమకూర్చారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకురానున్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. బుధవారం జరిగే పరీక్షకు సంబంధించి మంగళవారం సాయంత్రం వరకు నంబరింగ్‌ను పూర్తి చేశారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు విద్యార్థులు పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరు. దీనిని దృష్టిలో పెట్టుకుని గంటముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. ఉదయం 8గంటల నుంచే పరీక్షకేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తున్నందున ముందే చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు ముందుగానే చేరుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. ఉదయం హైదరాబాద్‌లో ప్రశ్నపత్రం ఎంపిక ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌కు ఏ, బీ, సీ అనే మూడు ప్ర శ్నపత్రాలను తయారు చేసి ఇప్పటికే అ న్ని కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో భద్రపర్చారు. బుధవారం జరిగే పరీక్షకు సంబంధించి హైదరాబాద్‌లో ఉదయం 8.30గంటలకు విద్యాశాఖ మంత్రి, ఇం టర్ విద్యా కమిషనర్, ఇతర అధికారులు ఏ, బీ, సీ ప్రశ్నపత్రాల్లో ఏ దో ఒకదానిని డ్రా ద్వారా తీస్తారు. అందులో వచ్చిన ప్రశ్నపత్రం వివరాలను పరీక్ష కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు ఎస్ఎంఎస్, వైర్లెస్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ఆయా ఆ ప్రశ్నపత్రాలనే పరీక్ష కేంద్రాలకు 15 నిమిషాల్లో చేరవేస్తారు. కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే స్క్వాడ్లు కేసులు బుక్ చేయనున్నారు. బయటి నుంచి చిట్టీలు అందిస్తే పోలీసులు వారిపై కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. -
నిమిషం ఆలస్యమైనా ఇంటికే..
నార్నూర్(ఆసిఫాబాద్): ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకాను న్నాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి ప్రతీ పరీక్ష కేంద్రాన్ని నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుం డా వసతులు కల్పిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అయితే విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 15,347 మంది పరీక్ష రాయనున్నారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు జిల్లాలో అన్ని వసతులు కలిగిన 28 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 15,347 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి సైతం కింద కూర్చోకుండా బెంచీలు ఏర్పాటు చేశారు. పక్కా భవనాలు కలిగిన చోటనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య సిబ్బంది, తాగునీరు ప్రతీ కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పరీక్షల్లో ఎలాంటి మాస్‌కాఫీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించనున్నారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఇస్తారు. మాస్‌కాఫీయింగ్‌ను ప్రోత్సహించే వారిపై చర్యలు ఉంటాయి. జిల్లాలో రెండు ప్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి పోలీసు భద్రత నడుమ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు కేంద్రాలకు వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలి. 8.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి పరీక్ష నిర్వహణ మొదలై 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థికి అనుమతి ఉండదు. ఎట్టి పరిస్థితిల్లోనైనా విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు హాల్‌టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంటర్నెట్లో ప్రత్యేక వెబ్సైట్ ఉంది. హాల్‌టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. ఫీజుల కోసం ఎవరైనా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సీసీ కెమెరాల నిఘాలో.. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే కొన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు లేవు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను కెమెరాల పర్యవేక్షణలోనే తెరవడం, జవాబు పత్రాలను మూయడం జరుగుతుంది. ఇదంతా ఐదు రోజులకోసారి సీడీలో రికార్డు చేసి భద్రపర్చనున్నారు. 28 కేంద్రాల్లో చీప్ సూపరింటెండెంట్లు, డీవోలతోపాటు ప్రతీ 20 మందికి ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. పకడ్బందీగా నిర్వహిస్తాం జిల్లాలో ఈసారి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మొత్తం 28 సెంటర్లు కేటాయించాం. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంది. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసిఉంచాలి. మాస్ కాఫీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు చేశాం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి. – దస్రునాయక్, డీఐఈవో ఆదిలాబాద్ -
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ మీడియెట్ వార్షిక పరీక్షలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 26,001 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో కొన్ని సమస్యాత్మక కళాశాలలను ఎంపిక చేసి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. 22 ప్రభుత్వ కళాశాలలకు ప్రభుత్వమే కెమెరాలను అందించింది. నిమిషం నిబంధన ఇంటర్ పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన పకడ్బందీగా అమలు చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8గంటలకే చేరుకోవాలి. 8.30 గంటలకు తమకు కేటాయించిన సీటులో కూర్చుని, 8.45 నుంచి 9గంటల వరకు పరీక్షకు సంబంధించి ప్రక్రియ మొదలు చేయాల్సి ఉంటుంది. ఇక చివరగా 9గంటల్లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన కేంద్రంలోని విద్యార్థులను అనుమతించరు. ఏర్పాట్లు పూర్తి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరీక్ష కేంద్రాలకు పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు ప్రత్యేక భద్రత మధ్య కేంద్రాల వద్దకు తీసుకెళ్తారు. అంతేకాకుండా పరీక్షల్లో కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఫ్లయింగ్ స్వా్కడ్లుగా 2 టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక జూనియర్ లెక్చరర్, ఒక రెవెన్యూ అధికారి, పోలీస్ శాఖనుంచి సీఐ స్థాయి అధికారులు జిల్లా వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలను ప్రతి రోజు తనిఖీ చేస్తారు. వీరితో పాటు సిట్టింగ్ స్వా్కడ్లుగా 3 టీంలను ఏర్పాటు చేశారు. వీరిలో ఇద్దరి చొప్పుడు జూనియర్ లెక్చరర్లు తనిఖీలు చేస్తారు. పరీక్షల సమయంలో చుట్టుపక్కన జిరాక్స్ సెంటర్లు తెరవకుండా అధికారులు చర్యలు తీసుకోవడం, పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించనున్నారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ అధికారులు, విద్యుత్ అంతరాయం లేకుండా పూర్తిచర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల కోసం అదనంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ముందుకు వచ్చారు. సీసీ కెమెరాలు తప్పనిసరి గత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వం సీసీ కెమెరాల వినియోగం ఖచ్చితం చేసింది. ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షను పారద్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ప్రశ్నపత్రాల సీల్కవరు తెరవడం మొదలు, పరీక్ష అనంతరం జవాబు పత్రానుల సీల్ చేసేంత వరకు కూడా అన్ని ప్రక్రియలు సీసీ కెమెరాల నిఘాలోనే జరగాల్సి ఉంది. దీనివల్ల ప్రైవేటు కళాశాలల్లో మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.æ కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికి అవి ప్రస్తుతం పనిచేయడంలేదని తెలిసింది. వాటిని సకాలంలో రీపేరు చేయించాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా చాలా పరీక్ష కేంద్రాల్లో వసతుల కొరత ఉంది. దీంతో అధికారులు సదుపాయాల కల్పన కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. బేంచీలు ఇరత ఫర్నీచర్లు కొరత ఉన్న చోట అద్దెకు తీసుకువచ్చి ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు సూచనలు పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్, పరీక్ష ప్యాడ్, ఐడీకార్డు, బ్లూ, బ్లాక్ పెన్నులు అందుబాటులో ఉంచుకోవాలి. ఫిజిక్సు, మాథ్స్ పరీక్ష సమయంలో స్కేల్లు, పెన్సిళ్లు, ఎరైజర్, గణితానికి సంబంధించిన పరికరాలు తీసుకెళ్లవచ్చు. పరీక్ష ప్రారంభమయ్యే సమయం 9గంటలకు అయినా 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలో ఉండాల్సి ఉంటుంది. 9గంటలు దాటితే అనుమతించరు. పరీక్ష కేంద్రంలో సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇంతర ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాలు ఎటువంటి పరిస్థితిలో దగ్గర ఉంచుకోకూడదు. ఉంటే మాల్ ప్రాక్టిస్ కింద బుక్ అయ్యే అవకాశం ఉంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించం నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ అన్నారు. మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45లోపు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. సుదూర ప్రాంతాలనుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు సకాలంలో బస్సులు నడిపే విధంగా సూచించామని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రశ్నాపత్రాలు తెరవడం, సీల్ చేయడం వంటి అన్ని అంశాలు కూడా సీసీ కెమోరాల ముందే చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా హాల్‌టికెట్లు ప్రైవేటు కళాశాలల్లో పొందని విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్‌టికెట్ పొందే విధంగా అవకాశం కల్పించామని తెలిపారు. -
నిర్భయంగా పరీక్ష రాయండి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భయం వీడి పరీక్షలకు సిద్ధం కావాలి.. ఆందోళన చెందకుండా నిర్భయంగా పరీక్ష రాయాలి’ అని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి దస్రునాయక్ అన్నారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులుంటే తమను సంప్రదించాలన్నారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు సంబంధించి మరిన్నీ విషయాలను డీఐఈవో సాక్షి ఇంటర్వ్యూలో తెలిపారు. సాక్షి : పరీక్షలు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఎంత మంది హాజరుకానున్నారు.? డీఐఈవో : ఈనెల 27 నుంచి మార్చి 13 పరీక్షలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 6,163 మంది, వోకేషనల్‌లో 749 హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 7,193 మంది, వోకేషనల్ కోర్సులో 595 మంది, ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) 653 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో మొత్తం 15,353 మంది పరీక్షలు రాయనున్నారు. సాక్షి : పరీక్ష నిర్వహణకు ఎంత మంది అధికారులను నియమిస్తున్నారు.? డీఐఈవో : జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ఐదుగురు కస్టోడియన్లను, 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమిస్తాం. సాక్షి : గతంలో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాశారు.. ఈసారీ అదే పరిస్థితి ఉంటుందా.? డీఐఈవో : ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. ఏ ఒక్కరు కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.? డీఐఈఓ : పరీక్ష కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేస్తాం. వైద్యశాఖ ద్వారా ఏఎన్ఎంలు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుతాం. సాక్షి : ఇబ్బందులుంటే ఎవరిని సంప్రదించాలి.? డీఐఈవో : జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 08732–223114, 9848781808 నంబర్లలో సంప్రదించవచ్చు. సాక్షి : మాస్ కాఫీయింగ్ నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.? డీఐఈవో : పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఒక ఫ్లైయింగ్ స్కాడ్ బృందం, రెండు సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ పరీక్ష కేంద్రానికి జియోట్యాగింగ్ అనుసంధానం చేస్తాం. పరీక్ష కేంద్రంలోకి అధికారులు, ఇన్విజిలేటర్లకు, విద్యార్థులకు సెల్ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబడదు. నిఘా నీడలో నిర్వహించబడుతాయి. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాల ముందు ప్రశ్న పత్రాలు తెరుస్తాం. సాక్షి: విద్యార్థులకు మీరు ఇచ్చే సలహ? డీఐఈవో: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి.. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి. కష్టపడి చదివి ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. కాపీయింగ్‌పై ఆధారపడవద్దు. ఉన్న సమయం సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. -
17 నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈనెల 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే వారు కూడా నిర్ణీత తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించారు. ఫీజు చెల్లింపు తేదీలు.. 17–9–2018 నుంచి 24–10–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు 25–10–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు 9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు 27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు 12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు ఫీజు వివరాలు.. జనరల్, వొకేషనల్ థియరీ పరీక్షల ఫీజు రూ.460 థియరీ, ప్రాక్టికల్ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620 బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.170 బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120 మ్యాథ్స్/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460 హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఫీజు రూ.1,050 ఇదివరకే పాసైన సైన్స్ గ్రూపుల వారు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఫీజు రూ.1,200 -
ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు 22 వేల దరఖాస్తులు
హైదరాబాద్: 22 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మరో 2 వేల మంది విద్యార్థు లు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రీకౌంటింగ్‌లో మార్కులు సరిగ్గా వేశారా? లేదా? అన్నది చూసి కౌంటింగ్ చేసి ఫలితాలు ఇస్తారని పేర్కొన్నారు. అదే రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు చేసుకున్నవారు ప్రశ్నలకు రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు వేశారా? లేదా? అన్నీ కౌంట్ చేశారా? లేదా? అన్నది పరిశీలించి, అన్ని సరిచేసి తాజా మార్కులతోపాటు మూల్యాంకనం చేసిన జవాబుపత్రం కాపీని అందజేస్తారని వివరించారు. కెమిస్ట్రీలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక తరగతులకు స్పందన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకుహాజరు కానున్న విద్యార్థులకు ఇంటర్ విద్యా శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన లభిస్తోందని ఇంటర్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకొని తరగతులకు హాజరవుతున్నారన్నారు. ఒక్కో కేంద్రంలో 15 నుంచి 20 మంది లెక్చరర్లు బోధిస్తున్నారని తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్, సివిక్స్ వంటి సబ్జెక్టులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలకు ఉచిత భోజన, నివాస వసతిని వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ ఈ నెల 22 వరకు కొనసాగుతుందన్నారు.