ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు 22 వేల దరఖాస్తులు
హైదరాబాద్: 22 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మరో 2 వేల మంది విద్యార్థు లు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రీకౌంటింగ్‌లో మార్కులు సరిగ్గా వేశారా? లేదా? అన్నది చూసి కౌంటింగ్ చేసి ఫలితాలు ఇస్తారని పేర్కొన్నారు. అదే రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు చేసుకున్నవారు ప్రశ్నలకు రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు వేశారా? లేదా? అన్నీ కౌంట్ చేశారా? లేదా? అన్నది పరిశీలించి, అన్ని సరిచేసి తాజా మార్కులతోపాటు మూల్యాంకనం చేసిన జవాబుపత్రం కాపీని అందజేస్తారని వివరించారు. కెమిస్ట్రీలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేక తరగతులకు స్పందన
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకుహాజరు కానున్న విద్యార్థులకు ఇంటర్ విద్యా శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన లభిస్తోందని ఇంటర్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకొని తరగతులకు హాజరవుతున్నారన్నారు. ఒక్కో కేంద్రంలో 15 నుంచి 20 మంది లెక్చరర్లు బోధిస్తున్నారని తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్, సివిక్స్ వంటి సబ్జెక్టులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలకు ఉచిత భోజన, నివాస వసతిని వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ ఈ నెల 22 వరకు కొనసాగుతుందన్నారు.