re-verification
-
నాలుగు నెలలైనా ఈవీఎంలలో తగ్గని బ్యాటరీ లెవెల్ అధికారుల హైడ్రామా..
-
అశోకా.. ఏంటీ లీల!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనట్లు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణురాలైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే జవాబు పత్రాల ఫొటో స్టాట్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో అనామిక పాసైనట్లా.. ఫెయిలైనట్లా..? అన్నది సందిగ్ధంగా మారింది. రీవెరిఫికేషన్ చేసిన తరువాత కూడా ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మెమోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమెకు ఏకంగా 28 మార్కులు పెరిగినట్లు చూపించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కి చెందిన గణేష్‌కుమార్, హారిక దంపతులకు అనామికతో పాటు ఉదయ, సీతల్, భావేష్ అనే పిల్లలున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వీరికి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో అనామిక సికింద్రాబాద్ చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఉమా వద్దే ఉంటూ చదువుకుంది. కింగ్‌కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చదువులోనే కాదు.. ఆటలు, ఎన్సీసీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. నాడు 20.. మెమోలో 48... ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో అనామిక (హాల్‌టికెట్ నంబర్ 1961112037)కు ఇంగ్లీష్– 64, ఎకనామిక్స్–55, సివిక్స్ –67, కామర్స్–75, తెలుగు–20 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు తెలుగులో 20 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిలైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఆమె ఒత్తిడికి గురైంది. అదే బాధతో ఏప్రిల్ 18న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్లు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తంగా 48 మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్లో పేర్కొంది. తమ కుమార్తె పాసైనట్లు తేలడంతో అనామిక కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు మూల్యాంకనాన్ని సరిగ్గా చేపట్టి ఉంటే తమ చిన్నారి బతికి ఉండేదని అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే జావాబు పత్రంలో ఫొటో స్టాట్‌లో మాత్రం అనామికకు 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చనిపోయిన తర్వాత ఫలితాలా? అనామిక పాసైందన్న మెమోను చూసిన తరువాత ఆమె అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన అనామిక పాసైనందుకు ఆమె ప్రాణాలను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ అంశంపై న్యాయం కోసం కోర్టుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉదయ బోరున విలపిస్తూ చెప్పింది. ఫలితాలు ముందే సరిగ్గా వచ్చి ఉంటే అనామిక బతికేదని, ఇంటర్ బోర్డు అధికారులు తమ పిల్లను పొట్టనబెట్టుకున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అనామిక పాస్ కాలేదు: ఇంటర్ బోర్డు ఆరుట్ల అనామిక పాస్ కాలేదని ఇంటర్ బోర్డు సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అనామిక సోదరి ఆరుట్ల ఉదయ ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగానే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఖండించారు. ఈ విషయంలో తాము హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించామని, రీ వెరిఫికేషన్‌లో అనామికకు కేవలం 20 నుంచి ఒకే ఒక్క మార్కు పెరిగి 21 వచ్చాయని తెలిపారు. కానీ, క్లరికల్ మిస్టేక్ వల్ల ఫలితాల వెల్లడిలో 48 మార్కులు వచ్చినట్లు చూపించిందని వివరించారు. ఈ మేరకు అశోక్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అనామిక రాసిన 24 పేజీల బుక్‌లెట్‌ను కూడా జత చేశారు. -
తప్పెవరిది.. శిక్ష ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్లో భారీగా మార్కుల్లో తేడాలు బయటపడ్డాయి. మొదట ఫెయిలైన విద్యార్థులకు ఒక మార్కు నుంచి 49 మార్కుల వరకు పెరిగాయి. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులై, తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గరిష్టంగా 60 మార్కుల వరకు అదనంగా వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలు బయటపడ్డాయి. గ్లోబరీనా సంస్థ కారణంగా జరిగిన సాంకేతిక తప్పిదాలు, మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది తప్పిదాల కారణంగా జరిగిన ఈ తప్పులకు బోర్డు ఎవరిని బాధ్యులను చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రీవెరిఫికేషన్‌తో బయటపడిన మరిన్ని వైఫల్యాలు.. రీవెరిఫికేషన్‌తో మారిన మార్కులు ఇంటర్ బోర్డు వైఫల్యాలను బయటపెట్టింది. సాంకేతిక సమస్యలే కాదు.. మూల్యాంకన లోపాలు, లెక్కించడంలో సిబ్బంది చేసిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. వాస్తవంగా విద్యార్థులు రాసిన జవాబులకు, మెమోల్లో వచ్చిన మార్కులకు పొంతన లేకుండా తప్పిదాలు దొర్లాయి. రీవెరిఫికేషన్ తరువాత తమకు వచ్చిన మార్కులను చూసి విద్యార్థులే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులన్న అంశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పక్కన పడేసింది. మూల్యాంకనం చేసిన లెక్చరర్లు, మార్కులు లెక్కించిన సిబ్బంది, ఆన్లైన్లో ప్రాసెస్ తప్పులు చేసిన ఏజెన్సీ.. ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితిలో పడింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే వీలున్నా.. బోర్డు నిబంధనల ప్రకారం పేపర్ వ్యాల్యుయేషన్‌లో తప్పు చేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లేదంటే వారి మూల్యాంకనం విధుల నుంచి కనీసం రెండేళ్లపాటు బహిష్కరించవచ్చు. అలా చేస్తే భవిష్యత్‌లో జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనల్లో బోర్డు వర్గాలు ఉన్నాయి. ఇక సాంకేతిక తప్పిదాలకు కారణమైన డాటా ప్రాసెస్ చేసిన సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అన్నది ప్రశ్న. డాటా ప్రాసెస్‌లో పొరపాట్లు చేసిన సంస్థకు మూడేళ్లపాటు పనులను అప్పగించారు. ఇప్పుడు ముగియకుండా వారి టెండరును రద్దు చేసే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. ఇవీ లోపాలకు ఉదాహరణలు.. - ఇంటర్లో ఫెయిలైన వారికి పెరిగిన మార్కులు 1 నుంచి 48 కాగా, ఉత్తీర్ణులై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారికి గరిష్టంగా పెరిగిన మార్కులు 60. - ఫలితాల్లో ఒక విద్యార్థి మొదట ఫెయిల్ కాగా.. తరువాత వచ్చిన మార్కులు 91. - కామర్స్‌లో ఒక విద్యార్థికి మొదట వచ్చిన మార్కులు 12.. రీవెరిఫికేషన్ తరువాత లభించిన మార్కులు 62. - ఓ విద్యార్థికి సంస్కృతంలో మొదట వచ్చిన మార్కులు 5.. రీవెరిఫికేషన్లో వచ్చిన మార్కులు 50. - ఇంకో విద్యార్థికి తెలుగులో తొలిసారి వచ్చిన మార్కులు 18...తరువాత వచ్చినవి 41 మార్కులు. - ఆంగ్లంలో ఓ విద్యార్థికి 25 మార్కులొస్తే.. రీవెరిఫికేషన్లో లభించిన మార్కులు 43. - ఫెయిలైన విద్యార్థుల్లో ఒకరికి కెమిస్ట్రీలో మొదట వచ్చిన మార్కులు 15.. తరువాత లభించిన మార్కులు 25. -
ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఫెయిలైన 3.82 లక్షల మంది జవాబు పత్రాలను బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు కొంతమంది పాసైనా తక్కువ మార్కులు రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వారి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే వారిలో కొందరు ఇంప్రూవ్మెంట్ రాయాలని భావిస్తున్నారు. వారికి ఇప్పుడు బోర్డు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది తేల్చడం లేదు. బోర్డు పొరపాట్ల కారణంగా తాము ఫెయిల్ అయ్యామని, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బోర్డు అధికారులు మాత్రం సెకండియర్ విద్యార్థుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేవారు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా అవే మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కులు కోల్పోతారు కాబట్టి సెకండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకారని చెబుతున్నారు. 585 మందికి అవకాశం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన 585 మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వారికి మాత్రం ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. -
రీవెరిఫికేషన్లో 1137మంది విద్యార్ధులు ఉత్తీర్ణత
-
ఇంటర్మీడియట్లో మరో 1,137 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్ కాగా, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది. 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను మినహా మిగతావారి జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో (http://bie.telangana.gov.in/)అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ స్కానింగ్ కాపీలను మంగళవారం ఉదయంలోగా వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. మిగిలిన 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలోనూ జవాబుపత్రాల పరిశీలన జరిపినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న 23 మందిలో 20 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైనట్టు తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులు అంతకుముందే ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. ఒక విద్యార్థి 3 పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆ మూడు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిందని వివరించింది. జూన్ 12 తర్వాత ఫీజు వెనక్కి... ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించిన 21,537 విద్యార్థుల ఫీజులను వచ్చే నెల 12వ తేదీ తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల అందరి జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగానే చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఫీజులను తిరిగి ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. తక్కువ మార్కులు వచ్చాయని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను మూడు రోజుల్లో తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది. కాగా, రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగి పాస్ అయిన విద్యార్థులే కాకుండా మొదట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగినా పాస్ కాని విద్యార్థులు వేలల్లో ఉంటారని తల్లిదండ్రులు అంటున్నారు. అలా ఎంతమందికి మార్కులు పెరిగాయో, వారి వివరాలను కూడా బోర్డు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంతమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయో తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు తాజా ఫలితాల వెల్లడిలోనూ కొంచెం గందరగోళం చోటుచేసుకుంది. ఫలితాల్లో కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లు రెండుమూడు సార్లు పునరావృతమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
27న పోలీసు పరీక్షల తుది ‘కీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ పోలీసు ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ ఆధారిత తుది ‘కీ’ని(ఆబ్జెక్టివ్ టైప్) ఈ నెల 27న తమ వెబ్సైట్ www. tslprb. in లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీటీ ఎస్ఐ, ఎస్సీటీ ఎస్ఐ ఐటీఅండ్‌సీ, ఎస్సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ, ఎస్సీటీ పీసీ, ఎస్సీటీ పీసీ ఐటీ అండ్ సీ, ఎస్సీటీ పీసీ డ్రైవర్, ఎస్సీటీ పీసీ మెకానిక్ పోస్టులకు టీఎస్ఎల్పీఆర్బీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ లాగిన్ ఏరియాల్లో ఆబ్జెక్టివ్ టైప్‌లో రాసిన పరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల వ్యక్తిగత ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసిన కాపీలను ఉంచుతామని పేర్కొన్నారు. తమ యూజర్ అకౌంట్ల నుంచి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి స్కాన్ కాపీలను యాక్సెస్ చేయొచ్చని తెలిపారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈనెల 28వ తేదీ ఉదయం 8 నుంచి మే 30వ తేదీ రాత్రి 8 గంటల వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క పేపర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం రూ.2 వేలు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు), రూ.3 వేలు (ఇతరులు, స్థానికేతరులతో సహా) సర్వీసు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కులం, వయసు, స్థానిక అభ్యర్థి, ఎక్స్ సర్వీస్‌మెన్, అకడమిక్ అర్హతలకు సంబంధించి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. -
కొనసాగుతున్న ‘ఇంటర్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పులతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు బోర్డు నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తులను స్వీకరించిన బోర్డు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతోంది. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అనేక మంది విద్యార్థుల నుంచి డబ్బు లు కట్ అయినా వారి అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. కనీసం బోర్డు హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి తెలుసుకుందామన్నా అదీ పని చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని బోర్డు వెబ్సైట్లో సూచించింది. కానీ అది పని చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ఇంటర్ బోర్డుకు వస్తే అక్కడా లోపలికి రానివ్వకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా అనేక మంది విద్యార్థులకు ఈ సమస్య రావడంతో రీవెరిఫికేషన్ అవుతుందా లేదా అని గందరగోళంలో పడ్డారు. చివరకు హెల్ప్‌డెస్క్ మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినా కనీసం దానికి కూడా స్పందన లేదు. పేపర్ వెరిఫికేషన్ కోసం దాదాపు 42 వేల మంది దరఖాస్తు చేసుకుని రుసుం చెల్లించారు. డబ్బులు కట్ అయినా అప్లికేషన్ నంబరు జనరేట్ కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడ్డారు. తమ జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తారా.. లేదా అన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. -
అవన్నీ అపోహలే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులు వచ్చినందుకే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఒకరి మార్కులు ఇంకొకరికి వేశారన్న వాదనలోనూ నిజం లేదని తెలిపింది. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని, మూడు స్థాయిల్లో పరిశీలన తర్వాతే ఫలితాలను నిర్ధారిస్తామని పేర్కొంది. మూల్యాంకన ప్రక్రియలో సాఫ్ట్వేర్ సంస్థలకు ఎలాంటి ప్రమేయం ఉండదని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, వారి ఆత్మహత్యలకు కారణాలేంటనే దానిపై లోతుగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇంటర్ ఫలితాల వెల్లడిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు బోర్డు ఆదివారం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన సారాంశం ఇదీ... ప్రజలకు నిజాలు చెప్పదలిచాం... పరీక్షలు సరిగా రాయలేదని, ఫలితాల్లో తప్పులు వచ్చాయంటూ 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపట్ల అనేక వదంతులు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలకు నిజాలు చెప్పి వాటిని నిలువరించాలని భావిస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఫలితాల ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హాల్‌టికెట్ల జంబ్లింగ్ ద్వారా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. పలు మాధ్యమాల్లో వస్తున్నట్లు పరీక్ష కేంద్రాలను మాన్యువల్‌గా కేటాయించామనడంలో నిజం లేదు. ఈ బా«ధ్యతలను ఓ సాఫ్ట్వేర్ ఏజెన్సీకి అప్పగించి పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్‌టికెట్ల పంపిణీ చేశాం. ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం... పరీక్షల తర్వాత మూల్యాంకన ప్రక్రియ మార్చి 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 12 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఎగ్జామినర్ల ద్వారానే మూల్యాంకనం చేయించాం. బోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ప్రభుత్వ, రెసిడెన్షియల్, సంక్షేమ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులను ఎగ్జామినర్లుగా బోర్డు నియమించింది. మూల్యాంకన ప్రక్రియ అంతా బోర్డు ద్వారా జరిగింది తప్ప సాఫ్ట్వేర్ ఏజెన్సీలకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సమాధాన పత్రాలకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు నిపుణులు వాటిని ర్యాండమ్‌గా పరిశీలించారు. అతితక్కువ, అతిఎక్కువ మార్కులు రావడంతోపాటు కొద్ది తేడాతో ఫెయిల్ మార్కులు వచ్చిన పేపర్లను కూడా పరిశీలించారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల్లో బోర్డు నియమించిన స్క్రూటినైజర్లు కూడా అన్ని పేపర్లూ పరిశీలించారు. అంటే ఒక్కో పేపర్‌ను మూడు స్థాయిల్లో పరిశీలన జరిపించాం. అయితే 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వచ్చిన ఘటన ఈ ప్రక్రియలో జరగలేదు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే. మొత్తం 54 లక్షల స్క్రిప్టుల్లో తప్పు జరిగింది కేవలం ఒక్క పేపర్ విషయంలోనేనని అందరూ గమనించాలి. ఒకరి మార్కులు ఇంకొకరికి సాధ్యం కాదు... ఒకరికి వచ్చిన మార్కులు ఇంకొకరికి వేశారనే అపవాదు బోర్డుపై వచ్చింది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మార్కులు బార్‌కోడ్‌కు లింక్ అయి ఉంటాయి. ఈ బార్కోడ్.. ఫలితాల ప్రకటన సమయంలో హాల్‌టికెట్ నంబర్‌కు లింక్ అవుతుంది. దీన్ని అనేకసార్లు పరిశీలించాం. సక్రమంగా ఉందని గుర్తించాం. ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఫలితాల్లో గందరగోళం తర్వాత కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను మళ్లీ అదే సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చామనే ఆరోపణ కూడా ఉంది. కానీ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో భాగస్వాములయ్యేది ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లే. ఇందులో సాఫ్ట్వేర్ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఈ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో సాఫ్ట్వేర్ సంస్థ పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఫలితాల ప్రాసెసింగ్‌ను ప్రస్తుత సాఫ్ట్వేర్ సంస్థతోపాటు మరో స్వతంత్ర సంస్థతో కూడా చేయించాలని, ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలు సరిపోలాకే ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. అందుకే ఇప్పుడు టెండర్ ద్వారా డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్వతంత్ర సంస్థను టీఎస్టీఎస్ ఎంపిక చేసింది. ఈ నెల 10కల్లా ఫలితాలు... హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనల ప్రకారం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 10కల్లా ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల సమాధాన పత్రాలను 15 రోజులపాటు డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పిస్తాం. ఫలితాల ప్రకటనలో పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేస్తామని ప్రజానీకానికి బోర్డు తెలియజేస్తోంది. మీడియా, ప్రజలు, పౌరసమాజం కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వదంతులకు అవకాశం లేకుండా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఆ విద్యార్థుల జవాబు పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించాం... ఫలితాల్లో నెలకొన్న గందరగోళం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు. ఫలితాలు వచ్చిన ఒక్క రోజులోపే జరిగిన పొరపాట్లన్నింటినీ సవరించాం. చనిపోయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ప్రత్యేకంగా పరిశీలన జరిపించాం. సబ్జెక్టు నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలన చేయించాక కూడా ఏ ఒక్క విద్యార్థికీ ఫెయిల్ మార్కుల నుంచి పాస్ అయ్యే మార్కులు రీ వెరిఫికేషన్‌లో రాలేదు. చనిపోయిన వారిలో 14 మంది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఒక్క విద్యార్థి మాత్రం 85 శాతం మార్కులతో ఏ గ్రేడ్‌లో పాసైనా చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుల గురించి నిపుణుల కమిటీ చేత లోతుగా విశ్లేషణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు బాధలో ఉన్నందున వారి సమాధాన పత్రాలను బయటకు వెల్లడించట్లేదు. అయితే అకాడమిక్‌గా ఉపయోగించుకునేందుకు లేదా ఈ మరణాలపై అధ్యయనం చేసేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటే బోర్డుకు తెలియజేసి వారి సమాధాన పత్రాలను పొందొచ్చు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు వల్లే... మూల్యాంకన ప్రక్రియ తర్వాత ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్–3 ద్వారా బోర్డుకు మార్కుల సమాచారం అందుతుంది. దీన్ని మాత్రమే సాఫ్ట్వేర్ రీడ్ చేస్తుంది. ఇక్కడి నుంచే మళ్లీ సాఫ్ట్వేర్ పాత్ర ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రతి 15 పేపర్ల బండిల్లో ఏవైనా తప్పులుంటే మళ్లీ గుర్తిస్తుంది. ఈ తప్పులను కూడా గుర్తించాక ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి ఫలితాలు ప్రచురించాం. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో తప్పు జరిగిన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్ష రాసినా ఆబ్సెంట్గా వచ్చింది. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జరిగిన సాఫ్ట్వేర్ తప్పిదం కారణంగా కొందరు విద్యార్థులకు వారు చదువుతున్న కళాశాలనే పరీక్ష కేం ద్రంగా కేటాయించారు. ఈ తప్పిదాన్ని ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించి వారికి వేరే కళాశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించి బఫర్ బార్కోడ్ నంబర్ ఆధారంగా పరీక్షలు రాయించాం. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల సమాచారం బఫర్కోడ్ ఆధారంగా కొత్త పరీక్ష కేంద్రం నుంచి వచ్చింది. అలాగే పాత కేంద్రాల్లో ఆ విద్యార్థులు హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్ అని వచ్చింది. ఈ తప్పిదాన్ని ఫలితాలు ప్రకటించిన గంటలోపే గుర్తించాం. అయితే అప్పటికే ఫలితాల సీడీలు ప్రైవేటు ఏజెన్సీ, వెబ్సైట్లకు వెళ్లిపోవడంతో సరిచేయలేకపోయాం. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఆ విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం. -
రీ వెరిఫికేషన్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రంలోని 12 మూల్యాంకన కేంద్రాల్లో జరుగుతోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రీ వెరిఫికేషన్‌తో గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపిస్తారన్నారు. ఇలా వచ్చిన మార్కులతో ఫలితాల ప్రాసెసింగ్ చేయడానికి త్రిస భ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ సంస్థ ద్వారా ‘డేటాటెక్ మెథడెక్స్’అనే ఓ కంప్యూటర్ ఏజెన్సీని ఎంపిక చేశామన్నారు. ఈ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండూ వేర్వేరుగా జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తాయని తెలిపారు. -
రీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్‌కు స్వతంత్ర సంస్థ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయి లైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేయా లని నిర్ణయించిన బోర్డు.. వాటి ప్రాసెసింగ్ కోసం మరో స్వతంత్ర సంస్థను నియమించనుంది. ప్రస్తు తం ఫలితాల ప్రాసెసింగ్ చేస్తున్న గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా మరో సంస్థ చేత రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్ చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌కు (టీఎస్టీఎస్) అప్పగించింది. ఈ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. భారీ కసరత్తు చేయాల్సిందే... ఇంటర్ పరీక్షల్లో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు మార్కులు వచ్చినా సున్నాలు పడటం, పరీక్షలకు హాజరైనా ‘ఆబ్సెంట్’ అని రావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. దీంతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామనే బాధతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుంది. పొరపాట్లు దొర్లడం వాస్తవమని గుర్తించిన కమిటీ... ఫెయిలైన విద్యార్థులందరి జవా బు పత్రాలనూ రీ వెరిఫికేషన్ చేయాలని సూచించింది. దీంతో 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కు లు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మరో 10,576 మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన 1,13,339 జవాబు పత్రాలను కూడా రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. మొత్తంగా 3,76,960 మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. లెక్చరర్ల ఆధ్వర్యంలో పది రోజులకుపైగా జరిగే రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక గ్లోబరీనాతోపాటు కొత్త కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో సమాంతరంగా రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్‌ను బోర్డు చేపట్టనుంది. -
జూన్ 15 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
♦ ఈనెల 26 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ♦ పది రోజుల్లో మార్కుల జాబితాలు ♦ విత్ హెల్డ్‌లో 900 మంది ఫలితాలు ♦12 రోజులపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 15 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు ఈనెల 26వ తేదీలోగా సంబంధిత ప్రధానోపాధ్యాయుల వద ్ద పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా వాటి ఫలితాల కోసం ఎదురుచూడకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చని సూచించారు. ఇక సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఈనెల 27లోగా ట్రెజరీలు/ఎస్బీహెచ్/ఎస్బీఐల్లో చెల్లించాలని ఆదేశించారు. 30వ తేదీలోగా కంప్యూటరైజ్ చేసి ముద్రించిన నామినల్ రోల్స్‌ను డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 12 రోజుల వరకు విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఎస్బీహెచ్/ఎస్బీఐలో చలానా (డీడీ స్వీకరించరు) రూపంలో చెల్లించాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లోనే రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ దరఖాస్తులు ఈసారి రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటోకాపీ కోసం దరఖాస్తుల స్వీకరణను జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు ఫారం నమూనాను తమ వెబ్సైట్ నుంచి (www.bsetelangana.org) డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలపై సంబంధిత ప్రధానోపాధ్యాయుడిచే ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీని జత చేసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించవద్దని సూచించారు. రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలని పేర్కొన్నారు. గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువపత్రాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు. పది రోజుల్లో మార్కుల జాబితాలు టెన్త్ విద్యార్థుల మార్కుల జాబితాలను పది రోజుల్లోగా పంపించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణులైనవారు ఈ జాబితాల ఆధారంగా జూనియర్ కాలేజీల్లో చేరవచ్చన్నారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లను త్వరలోనే పాఠశాలలకు పంపిస్తామన్నారు. ఇక ఫెయిలైన విద్యార్థుల నామినల్ రోల్స్ పట్టికలను సంబంధిత పాఠశాలలకు ఈనెల 21 నాటికి పంపిస్తామన్నారు. పాఠశాలల నుంచి, సంబంధిత పరీక్ష కేంద్రాల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉన్నందున దాదాపు 900 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని... ఆ సమాచారం వచ్చిన వెంటనే వారి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. మొత్తంగా ఈసారి టెన్త్ పరీక్షలకు 1,620 మంది గైర్హాజరు కాగా, 73 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. గతంతో పోల్చితే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరైన వారిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 6,021 మంది ఎక్కువగా ఉండగా... ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 9,979 మంది తగ్గారు. -
ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు 22 వేల దరఖాస్తులు
హైదరాబాద్: 22 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మరో 2 వేల మంది విద్యార్థు లు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రీకౌంటింగ్‌లో మార్కులు సరిగ్గా వేశారా? లేదా? అన్నది చూసి కౌంటింగ్ చేసి ఫలితాలు ఇస్తారని పేర్కొన్నారు. అదే రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు చేసుకున్నవారు ప్రశ్నలకు రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు వేశారా? లేదా? అన్నీ కౌంట్ చేశారా? లేదా? అన్నది పరిశీలించి, అన్ని సరిచేసి తాజా మార్కులతోపాటు మూల్యాంకనం చేసిన జవాబుపత్రం కాపీని అందజేస్తారని వివరించారు. కెమిస్ట్రీలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక తరగతులకు స్పందన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకుహాజరు కానున్న విద్యార్థులకు ఇంటర్ విద్యా శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన లభిస్తోందని ఇంటర్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకొని తరగతులకు హాజరవుతున్నారన్నారు. ఒక్కో కేంద్రంలో 15 నుంచి 20 మంది లెక్చరర్లు బోధిస్తున్నారని తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్, సివిక్స్ వంటి సబ్జెక్టులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలకు ఉచిత భోజన, నివాస వసతిని వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ ఈ నెల 22 వరకు కొనసాగుతుందన్నారు. -
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 12 రోజుల గడువు
టెన్త్‌లో తప్పిన విద్యార్థులు వెంటనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు కట్టాలి సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నుంచి 12 రోజులు గడువు ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి తెలిపారు. గురువారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం వేచి ఉండకుండా వెంటనే అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు కట్టాలని సూచించారు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 ఫీజును డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తును హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌కు పంపించాలని సూచించారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 ఫీజు చలాన్ రూపంలోనే కట్టాలి. డీడీలను అంగీకరించరు. www.bsep.org వెబ్సైట్లో దరఖాస్తు నమూనా పొందవచ్చు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.