♦ ఈనెల 26 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
♦ పది రోజుల్లో మార్కుల జాబితాలు
♦ విత్ హెల్డ్‌లో 900 మంది ఫలితాలు
♦12 రోజులపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే నెల 15 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు ఈనెల 26వ తేదీలోగా సంబంధిత ప్రధానోపాధ్యాయుల వద ్ద పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా వాటి ఫలితాల కోసం ఎదురుచూడకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చని సూచించారు. ఇక సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఈనెల 27లోగా ట్రెజరీలు/ఎస్‌బీహెచ్/ఎస్‌బీఐల్లో చెల్లించాలని ఆదేశించారు. 30వ తేదీలోగా కంప్యూటరైజ్ చేసి ముద్రించిన నామినల్ రోల్స్‌ను డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ
ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 12 రోజుల వరకు విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఎస్‌బీహెచ్/ఎస్‌బీఐలో చలానా (డీడీ స్వీకరించరు) రూపంలో చెల్లించాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లోనే రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ దరఖాస్తులు
ఈసారి రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటోకాపీ కోసం దరఖాస్తుల స్వీకరణను జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు ఫారం నమూనాను తమ వెబ్‌సైట్ నుంచి (www.bsetelangana.org) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలపై సంబంధిత ప్రధానోపాధ్యాయుడిచే ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీని జత చేసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించవద్దని సూచించారు. రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలని పేర్కొన్నారు. గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువపత్రాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు.
పది రోజుల్లో మార్కుల జాబితాలు
టెన్త్ విద్యార్థుల మార్కుల జాబితాలను పది రోజుల్లోగా పంపించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఉత్తీర్ణులైనవారు ఈ జాబితాల ఆధారంగా జూనియర్ కాలేజీల్లో చేరవచ్చన్నారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లను త్వరలోనే పాఠశాలలకు పంపిస్తామన్నారు. ఇక ఫెయిలైన విద్యార్థుల నామినల్ రోల్స్ పట్టికలను సంబంధిత పాఠశాలలకు ఈనెల 21 నాటికి పంపిస్తామన్నారు. పాఠశాలల నుంచి, సంబంధిత పరీక్ష కేంద్రాల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉన్నందున దాదాపు 900 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని... ఆ సమాచారం వచ్చిన వెంటనే వారి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. మొత్తంగా ఈసారి టెన్త్ పరీక్షలకు 1,620 మంది గైర్హాజరు కాగా, 73 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. గతంతో పోల్చితే ఈసారి టెన్త్ పరీక్షలకు హాజరైన వారిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 6,021 మంది ఎక్కువగా ఉండగా... ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 9,979 మంది తగ్గారు.
జూన్ 15 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
Published Thu, May 12 2016 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement