తెనాలిలోని పినపాడు మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాల
ఈ చిత్రంలోని బాలుడి పేరు.. ఆదిముళ్ల నాగచైతన్య. గుంటూరు జిల్లా తెనాలి ఇందిరానగర్ కాలనీలో ఇతడి కుటుంబం ఉంటోంది. ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న మున్సిపల్ హైస్కూలులో ఐదో తరగతి చదువుతూ మధ్యలో మానేశాడు. చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో తల్లిదండ్రులూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సచివాలయం నుంచి ఒక విద్యా కార్యదర్శి వచ్చి పిల్లాడిని చదివించాలని వారికి నచ్చజెప్పారు. ఫీజులు కట్టలేమని చెబితే దగ్గర్లోని కాన్వెంటులో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాడూ సరేనన్నాడు. ఇప్పుడు రోజూ కాన్వెంటుకు వెళుతున్నాడని బాలుడి తల్లి సౌజన్య సంతోషంతో చెబుతున్నారు.
తెనాలి: బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో బడి మానేసినవారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2005 సెప్టెంబర్ 1–2018 ఆగస్టు 31 మధ్య పుట్టినవారంతా సెప్టెంబర్ 4 నాటికి ఏదో ఒక స్కూల్/కాలేజీలో నమోదై ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా బడి/కాలేజీకి దూరంగా ఉంటే వారిని చేర్పించాలని ప్రభుత్వం.. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అర్బన్ మండలం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిన తొలి మండలంగా అవతరించింది. ఈ మండలంలో బడి బయట చదువుకు దూరంగా ఉన్న మొత్తం 935 మందిని పాఠశాల/కాలేజీలో చేర్పించారు.
జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్..
గ్రామ/ వార్డు సచివాలయాల సహకారంతో పాఠశాల విద్యాశాఖ నూరు శాతం జీఈఆర్ సాధనకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో 47 సచివాలయాలు కలిగిన తెనాలి అర్బన్ మండలం 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోల పర్యవేక్షణలో వలంటీర్లు, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు ఇంటింటా సర్వేను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఒక్కో సచివాలయం పరిధిలో వందలాదిమంది బడి ఈడు పిల్లల సమాచారాన్ని సేకరించారు.
విద్యాశాఖ.. వార్డు/ గ్రామ వలంటీర్లకు అందజేసిన యాప్‌లో వారి వివరాలను పొందుపరిచారు. పదో తరగతిలోపు విద్యార్థులను వారు కోరుకున్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు పంపారు. స్థోమత లేని పేదింటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు ఇష్టపడని పిల్లలను తల్లిదండ్రుల అభిమతం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలకు పంపారు.
ఇంటర్ ఫెయిలైనవారు, మధ్యలో మానేసినవారిని కాలేజీ/ఐటీఐ/ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేర్చారు. మరికొందరిని వారు కోరినట్టుగా కోచింగ్ క్లాసులకు పంపారు. ఈ విధంగా తెనాలి అర్బన్ మండలంలో 935 మంది మళ్లీ బడి/కళాశాల బాటపట్టారు. కాగా అర్బన్ మండలంతోపాటు తెనాలి రూరల్ మండలం కూడా నూరు శాతం జీఈఆర్ లక్ష్యాన్ని సాధించింది. ఇక్కడ కూడా బడి బయట ఉన్నట్టు గుర్తించిన 355 మంది పిల్లలను బడి/కళాశాలల్లో చేర్పించారు.
కోరిన పాఠశాలల్లోనే చేర్పించాం..
రాష్ట్రంలో నూరు శాతం జీఈఆర్ సాధించిన తొలి మండలంగా తెనాలి అర్బన్ నిలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందరి సమన్వయంతో రూరల్ మండలంలోనూ ఈ లక్ష్యాన్ని సాధించాం. పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకున్న విద్యాసంస్థల్లోనే చేర్పించాం.
– మేకల లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి, తెనాలి, గుంటూరు జిల్లా
చాలా సంతృప్తిగా ఉంది..
కరోనా తర్వాత మైగ్రేషన్, డేటాలో వయసు తప్పు వంటి సాంకేతిక సమస్యలను అధిగమించి మా సచివాలయం పరిధిలో 563 మందిని సర్వే చేశాం. చదువుకు దూరంగా ఉన్న ఇద్దరు పేద పిల్లలను గుర్తించి వారిని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. చాలా సంతృప్తిగా ఉంది.
– గంగవరపు స్వాతి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, 35వ సచివాలయం, తెనాలి, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment