Elementary schools
-
100 శాతం జీఈఆర్.. తొలి మండలంగా తెనాలి అర్బన్
ఈ చిత్రంలోని బాలుడి పేరు.. ఆదిముళ్ల నాగచైతన్య. గుంటూరు జిల్లా తెనాలి ఇందిరానగర్ కాలనీలో ఇతడి కుటుంబం ఉంటోంది. ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్న మున్సిపల్ హైస్కూలులో ఐదో తరగతి చదువుతూ మధ్యలో మానేశాడు. చదువుపై ఆసక్తి లేదని చెప్పడంతో తల్లిదండ్రులూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సచివాలయం నుంచి ఒక విద్యా కార్యదర్శి వచ్చి పిల్లాడిని చదివించాలని వారికి నచ్చజెప్పారు. ఫీజులు కట్టలేమని చెబితే దగ్గర్లోని కాన్వెంటులో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పిల్లాడూ సరేనన్నాడు. ఇప్పుడు రోజూ కాన్వెంటుకు వెళుతున్నాడని బాలుడి తల్లి సౌజన్య సంతోషంతో చెబుతున్నారు. తెనాలి: బడి బయట ఉన్న పిల్లలను, మధ్యలో బడి మానేసినవారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 2005 సెప్టెంబర్ 1–2018 ఆగస్టు 31 మధ్య పుట్టినవారంతా సెప్టెంబర్ 4 నాటికి ఏదో ఒక స్కూల్/కాలేజీలో నమోదై ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైనా బడి/కాలేజీకి దూరంగా ఉంటే వారిని చేర్పించాలని ప్రభుత్వం.. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా తెనాలి అర్బన్ మండలం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించిన తొలి మండలంగా అవతరించింది. ఈ మండలంలో బడి బయట చదువుకు దూరంగా ఉన్న మొత్తం 935 మందిని పాఠశాల/కాలేజీలో చేర్పించారు. జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్.. గ్రామ/ వార్డు సచివాలయాల సహకారంతో పాఠశాల విద్యాశాఖ నూరు శాతం జీఈఆర్ సాధనకు జూలై మొదటి వారం నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో 47 సచివాలయాలు కలిగిన తెనాలి అర్బన్ మండలం 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోల పర్యవేక్షణలో వలంటీర్లు, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు ఇంటింటా సర్వేను ఒక ఉద్యమంలా చేపట్టారు. ఒక్కో సచివాలయం పరిధిలో వందలాదిమంది బడి ఈడు పిల్లల సమాచారాన్ని సేకరించారు. విద్యాశాఖ.. వార్డు/ గ్రామ వలంటీర్లకు అందజేసిన యాప్‌లో వారి వివరాలను పొందుపరిచారు. పదో తరగతిలోపు విద్యార్థులను వారు కోరుకున్న ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలకు పంపారు. స్థోమత లేని పేదింటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అందుకు ఇష్టపడని పిల్లలను తల్లిదండ్రుల అభిమతం ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఇంటర్ ఫెయిలైనవారు, మధ్యలో మానేసినవారిని కాలేజీ/ఐటీఐ/ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేర్చారు. మరికొందరిని వారు కోరినట్టుగా కోచింగ్ క్లాసులకు పంపారు. ఈ విధంగా తెనాలి అర్బన్ మండలంలో 935 మంది మళ్లీ బడి/కళాశాల బాటపట్టారు. కాగా అర్బన్ మండలంతోపాటు తెనాలి రూరల్ మండలం కూడా నూరు శాతం జీఈఆర్ లక్ష్యాన్ని సాధించింది. ఇక్కడ కూడా బడి బయట ఉన్నట్టు గుర్తించిన 355 మంది పిల్లలను బడి/కళాశాలల్లో చేర్పించారు. కోరిన పాఠశాలల్లోనే చేర్పించాం.. రాష్ట్రంలో నూరు శాతం జీఈఆర్ సాధించిన తొలి మండలంగా తెనాలి అర్బన్ నిలవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. అందరి సమన్వయంతో రూరల్ మండలంలోనూ ఈ లక్ష్యాన్ని సాధించాం. పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకున్న విద్యాసంస్థల్లోనే చేర్పించాం. – మేకల లక్ష్మీనారాయణ, మండల విద్యాశాఖాధికారి, తెనాలి, గుంటూరు జిల్లా చాలా సంతృప్తిగా ఉంది.. కరోనా తర్వాత మైగ్రేషన్, డేటాలో వయసు తప్పు వంటి సాంకేతిక సమస్యలను అధిగమించి మా సచివాలయం పరిధిలో 563 మందిని సర్వే చేశాం. చదువుకు దూరంగా ఉన్న ఇద్దరు పేద పిల్లలను గుర్తించి వారిని ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేర్పించాం. చాలా సంతృప్తిగా ఉంది. – గంగవరపు స్వాతి, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, 35వ సచివాలయం, తెనాలి, గుంటూరు జిల్లా -
మూత‘బడి’ దిశగా..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో చిన్నబడులను మూసేయడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది. రేషనలైజేషన్‌తో జిల్లాలో 50 పాఠశాలలు మూతబడనున్నాయి. గ్రామంలోని బడి ఎత్తివేతతో విద్యార్థులకు చదువు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. –నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటిని సమీపంలోని బడుల్లో విలీనం చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. 10 మందికన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఇప్పటికే అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పాఠశాలలను మూసేయడానికి సిద్ధమవుతున్నారు. 50 పాఠశాలలపై ప్రభావం జిల్లాలో 776 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 10 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న స్థానిక సంస్థల పాఠశాలలు–31, ప్రభుత్వ విభాగం పాఠశాల –1, మండల ప్రజాపరిషత్ పాఠశాలలు–18 ఉన్నాయి. వీటిలో చదువుతున్న సుమారు 315 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 63 మంది టీచర్లను ఇతర పాఠశాలలకు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలలను గుర్తించి నివేదికలు కూడా సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా పదిమంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో ఆర్మూర్, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, నందిపేట, నవీపేట, నిజామాబాద్‌రూరల్, రెంజల్, వర్ని మండలాల్లో ఒక్కొక్క పాఠశాల చొప్పున గుర్తించారు. భీమ్‌గల్‌లో–6, బోధన్‌లో–3, ధర్పల్లి–7, డిచ్పల్లి–5 , ఇందల్వాయిలో–2, కోటగిరి–4, మాక్లూర్–2, మోపాల్–5, సిరికొండ–5, వేల్పూర్–3 పాఠశాలలను గుర్తించారు. వీటిని మూసివేయాలని నిర్ణయించారు. పాఠశాల డైరెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే మూసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థుల సంఖ్య సున్నా.. జిల్లాలో ఆరు పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. బోధన్ మండలంలోని హంగర్గ, సాలూర, భీమ్‌గల్ మండలంలోని వంచాయ్తండా, కోటగిరి మండలంలోని దేవునిగుట్ట, మోపాల్ మండలంలోని హనుమాన్‌తండా, నందిపేట మండలంలోని ఇంద్రనగర్ పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ‘పది’లోపు పాఠశాలలు 44.. పదిమందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు జిల్లాలో 44 ఉన్నాయి. డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ముగ్గురు, ఇదే మండలంలోని ఆరేపల్లిలో నలుగురు, భీమ్‌గల్ మండలం పెద్దకండీ తండాలో ఐదుగురు చొప్పున విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా పాఠశాలలలో ఆరుగురు నుంచి 10 మందిలోపు విద్యార్థులే ఉన్నారు. అంతేకాకుండా 20 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల గుర్తింపు, పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బడులు మూసేస్తే.. హేతుబద్ధీకరణ పేరుతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను మూసివేస్తే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలుంటాయి. మూసివేత జాబితాలో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చిన్న పిల్లలు కొంత దూరం నడిచివెళ్లి చదువుకునే పరిస్థితులుండవు. మారుమూల ప్రాంతాల్లో ఇంటికి సమీపంలో బడి ఉన్నప్పుడే డ్రాపవుట్లు ఉంటున్న పరిస్థితుల్లో బడి దూరమైతే విద్యార్థులు చదువు కొనసాగించడం కష్టమనే భావిస్తున్నారు. అందరికీ విద్య అన్న సర్కారు లక్ష్యం పాఠశాలల హేతుబద్ధీకరణ వల్ల నీరుగారిపోయే ప్రమాదం ఉంది. బడులను మూసివేయకుండా వసతులను మెరుగుపర్చి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బడులను మూసివేయలేదు జిల్లాలో పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించాం. తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిర్ణయం తీసుకుంటాం. – నాంపల్లి రాజేశ్, డీఈవో -
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జాప్యం
విజయనగరం అర్బన్: అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యా సంచాలకుల నుంచి వారం రోజుల క్రితం అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఉత్వర్వులు వచ్చాయి. ఈ మేరకు జిల్లాకు 264 పోస్టులు మంజూరు చేశారు. ఆదేశాలు రావడమే తడవుగా అనంతపురం, ప్రకాశం వంటి జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టారు. ఉపాధ్యాయుల కొరత వల్ల జిల్లాలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని ఒకవైపు విద్యావేత్తలు, తల్లిదండ్రులు గగ్గోలు పెడుతుంటే జిల్లా యంత్రాంగం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జాప్యం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 624 ప్రాథమిక పాఠశాలలు ఒక్కొక్క ఉపాధ్యాయునితో నడుస్తున్నాయి. వాటిలో తక్షణమే రెండో పోస్టు అవసరమున్న పాఠశాలలు 574 వరకు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన జీఓ 55 మేరకు రేషనలైజేషన్ ప్రక్రియ అమలు చేసి కుదించినా... జిల్లాలో ఇంకా దాదాపు 350 ఎస్జీటీ పోస్టులకు తాత్కాలిక ప్రత్యామ్నాయ పోస్టుల అవసరం ఉంటుంది. పోస్టులు అవసరమున్న పాఠశాలలెక్కువ, అవసరం లేని పాఠశాలలు తక్కువగా ఉన్నాయి. దీంతో పోస్టుల పంపకం కత్తిమీద సాములా మారింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు.. ఈ పోస్టులపై అధికార పార్టీ నాయకులు దృష్టి పడింది. దీంతో నియామకాలలో జాప్యం జరుగుతోందని తెలిసింది. నిబంధనల మేరకు మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఎస్జీటీలు, డిప్యూటీ డీఈఓల నుంచి స్కూల్ అసిస్టెంట్, భాషా పండిత పోస్టులలో అత్యవసరంగా భర్తీ చేయవలసిన ఖాళీలున్న పాఠశాలల వివరాలు సేకరించారు. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి కోసం కలెక్టర్‌కు ఫైలు పంపారు. అయితే ఆ జాబితాను మార్చి తాము చెప్పిన పాఠశాలలకే పోస్టులు కేటాయించాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు పోస్టుల కొరతతో ఎలా పంపకం చేయాలో అర్థంకాకపోవడంతో భర్తీ చేయడంలో జాప్యం నెలకొంది. ఎంపిక ప్రక్రియ బాధ్యత ఎస్‌ఎంసీలదే! జిల్లాకు మంజూరైన 264 అకడమిక్ పోస్టులలో ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు 162, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 77, భాషాపండిత పోస్టులకు 25 వినియోగించుకోవాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం అభ్యర్థులు డిగ్రీతోటు బీఈడీ, డీఈడీ విద్యార్హత కలిగిఉండాలి. కేవలం మూడు నెలల కాలపరిమితికి మాత్రమే నియామకాలు చేపడుతున్నారు.ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్కూల్ యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఏ పంచాయతీకి చెందిన అభ్యర్థులు అదే పంచాయతీలో పాఠశాలకు దరఖాస్తు చేసుకోవాలి. రోస్టర్ మేరకు అభ్యర్థులు రాకపోతే ఎస్టీ అభ్యర్థులను ఎస్సీ వర్గంలోనూ, ఎస్సీ నుంచి బీసీ, బీసీ నుంచి ఓసీ అభ్యర్థులకు కేటాయించి, స్కూల్ యాజమాన్య కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలలో రూ. 7 వేలుగా నెల వేతనం చెల్లిస్తారు. త్వరలో నోటిఫికేషన్: డీఈఓ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మంజూరైన పోస్టుల సంఖ్యకు అణుగుణంగా అవసరమున్న పాఠశాలలకు కేటాయించడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. త్వర లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.