విజయనగరం అర్బన్: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లను నియమించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యా సంచాలకుల నుంచి వారం రోజుల క్రితం అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఉత్వర్వులు వచ్చాయి.
ఈ మేరకు జిల్లాకు 264 పోస్టులు మంజూరు చేశారు. ఆదేశాలు రావడమే తడవుగా అనంతపురం, ప్రకాశం వంటి జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టారు. ఉపాధ్యాయుల కొరత వల్ల జిల్లాలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని ఒకవైపు విద్యావేత్తలు, తల్లిదండ్రులు గగ్గోలు పెడుతుంటే జిల్లా యంత్రాంగం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జాప్యం చేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 624 ప్రాథమిక పాఠశాలలు ఒక్కొక్క ఉపాధ్యాయునితో నడుస్తున్నాయి. వాటిలో తక్షణమే రెండో పోస్టు అవసరమున్న పాఠశాలలు 574 వరకు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన జీఓ 55 మేరకు రేషనలైజేషన్ ప్రక్రియ అమలు చేసి కుదించినా... జిల్లాలో ఇంకా దాదాపు 350 ఎస్జీటీ పోస్టులకు తాత్కాలిక ప్రత్యామ్నాయ పోస్టుల అవసరం ఉంటుంది. పోస్టులు అవసరమున్న పాఠశాలలెక్కువ, అవసరం లేని పాఠశాలలు తక్కువగా ఉన్నాయి. దీంతో పోస్టుల పంపకం కత్తిమీద సాములా మారింది.
అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు..
ఈ పోస్టులపై అధికార పార్టీ నాయకులు దృష్టి పడింది. దీంతో నియామకాలలో జాప్యం జరుగుతోందని తెలిసింది. నిబంధనల మేరకు మండల విద్యాశాఖ అధికారుల నుంచి ఎస్జీటీలు, డిప్యూటీ డీఈఓల నుంచి స్కూల్ అసిస్టెంట్, భాషా పండిత పోస్టులలో అత్యవసరంగా భర్తీ చేయవలసిన ఖాళీలున్న పాఠశాలల వివరాలు సేకరించారు. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి కోసం కలెక్టర్‌కు ఫైలు పంపారు. అయితే ఆ జాబితాను మార్చి తాము చెప్పిన పాఠశాలలకే పోస్టులు కేటాయించాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. మరో వైపు పోస్టుల కొరతతో ఎలా పంపకం చేయాలో అర్థంకాకపోవడంతో భర్తీ చేయడంలో జాప్యం నెలకొంది.
ఎంపిక ప్రక్రియ బాధ్యత ఎస్‌ఎంసీలదే!
జిల్లాకు మంజూరైన 264 అకడమిక్ పోస్టులలో ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు 162, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 77, భాషాపండిత పోస్టులకు 25 వినియోగించుకోవాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కోసం అభ్యర్థులు డిగ్రీతోటు బీఈడీ, డీఈడీ విద్యార్హత కలిగిఉండాలి. కేవలం మూడు నెలల కాలపరిమితికి మాత్రమే నియామకాలు చేపడుతున్నారు.ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్కూల్ యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ల ఆధ్వర్యంలోనే జరుగుతుంది.
ఏ పంచాయతీకి చెందిన అభ్యర్థులు అదే పంచాయతీలో పాఠశాలకు దరఖాస్తు చేసుకోవాలి. రోస్టర్ మేరకు అభ్యర్థులు రాకపోతే ఎస్టీ అభ్యర్థులను ఎస్సీ వర్గంలోనూ, ఎస్సీ నుంచి బీసీ, బీసీ నుంచి ఓసీ అభ్యర్థులకు కేటాయించి, స్కూల్ యాజమాన్య కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలలో రూ. 7 వేలుగా నెల వేతనం చెల్లిస్తారు.
త్వరలో నోటిఫికేషన్: డీఈఓ
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. మంజూరైన పోస్టుల సంఖ్యకు అణుగుణంగా అవసరమున్న పాఠశాలలకు కేటాయించడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. త్వర లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జాప్యం
Published Sat, Sep 13 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement
Advertisement