
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్
ఏయూ వీసీగా ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ రాజశేఖర్
జేఎన్‌టీయూ కాకినాడ వీసీగా వరంగల్ నిట్ ప్రొఫెసర్ ప్రసాద్
త్వరలో మరో 8 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ (చాన్సలర్) ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాంకేతిక విద్యా సంస్థలు, సెంట్రల్ వర్సిటీల్లో పనిచేస్తున్న వారికి వీసీలుగా ప్రాధాన్యం కల్పించారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక విభాగంలో వారినే వీసీలుగా ఎంపిక చేశారు.
తాజాగా నియమించిన 9 మంది వీసీల్లో ఐదుగురు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఢిల్లీ సాంకేతిక వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్య కార్యదర్శి కోనశశిధర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా వర్సిటీల్లో పని చేస్తున్న ఇన్‌చార్జీ వీసీలను రిలీవ్ చేశారు.
మరో 8 వర్సిటీలకు..
గతంలో 17 వర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సెర్చ్ కమిటీల భేటీ అనంతరం తొలివిడతగా 9వర్సిటీలకు వీసీలను నియమించారు. మిగిలిన 8 వర్సిటీలకు వీసీ నియమించాల్సి ఉండగా ద్రవిడియన్, ఉర్దూ వర్సిటీలకు ఇంకా సెర్చ్ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. వాస్తవానికి గతంలోనే ద్రవిడియన్ వర్సిటీ వీసీ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలను కూటమి ప్రభుత్వం ప్రభావితం చేసేందుకు యత్నించింది.

ఈ క్రమంలోనే ద్రవిడియన్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశంలో ఉన్నత విద్యా మండలికి చెందిన ఉన్నత స్థాయి అధికారి ఓ వర్గానికి చెందిన వ్యక్తికి వీసీ పోస్టు రిజర్వ్ చేయాలని సూచించడంతో యూజీసీ నుంచి సెర్చ్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ నుంచి వీసీ పోస్టు రిజర్వ్ చేయమని జీవో ఉంటే చూపించాలని కోరడంతో పాటు వీసీ ఎంపికలో దొర్లుతున్న తప్పులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సమావేశాన్ని నిలిపేశారు.
ఇప్పటి వరకు మళ్లీ సెర్చ్ కమిటీ సమావేశానికి తేదీ ప్రకటించకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పైగా సదరు వర్సిటీలోనే అర్హత లేని వ్యక్తుల పేర్లు వీసీ పోస్టుకు ప్రతిపాదించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment