సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది.
ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది.
ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్‌ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది.
ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్‌వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది.
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
Published Sun, Jul 10 2022 2:46 AM | Last Updated on Sun, Jul 10 2022 2:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment