Textbooks
-
ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం
పాఠశాలలు ప్రారంభించి 15 రోజులవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే కొన్ని చాప్టర్లకుసంబంధించిన పాఠాలు పూర్తయ్యాయి. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క పాఠం కూడా ఉపాధ్యాయులు బోధించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే... ఇప్పటికీ 15 వేలకు పైగా స్కూళ్ళలో ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో జూలై నెల ప్రారంభమైనా ఇంకా పునఃశ్చరణకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. –సాక్షి, హైదరాబాద్ హెచ్ఎంలకు బిల్లులు ఇవ్వకపోవడంతో.. వాస్తవానికి స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే పుస్తకాల ముద్రణపైనా దృష్టి పెట్టారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను స్కూళ్ళు తెరిచేలోగానే జిల్లా కేంద్రాలకు పంపారు. కానీ వాటిని వేసవి సెలవులు ముగిసేలోగా స్కూళ్ళకు చేరవేయడంలో సర్కారు విఫలమయ్యింది. ప్రతి ఏటా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్ళకు పుస్తకాలు చేరవేసే వాళ్ళు. ఇందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేది. అయితే గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో హెచ్ఎంలు ఈ ఏడాది మొండికేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం వరకు పుస్తకాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో రవాణా కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని విద్యాశాఖ ఆదేశించినా, ఈ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అయ్యింది. టెండర్ల ఖరారులో ఆలస్యం.. పుస్తకాలను స్కూళ్లకు రవాణా చేసేందుకు ప్రతి జిల్లా డీఈవో పరిధిలో టెండర్లు పిలిచారు. అయితే స్కూళ్ళు తెరిచిన తర్వాత టెండర్లు పిలవడంతో వాటిని ఖరారు చేసేవరకే జూన్ నెలాఖరు అయ్యింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. పుస్తకాల రవాణా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని టెండర్లు దక్కించుకున్న సంస్థలు చెబుతున్నాయి. పంపిణీ పూర్తయినా కొరతే.. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, 1,57,48,270 పుస్తకాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించి, జిల్లా కేంద్రాలకు కూడా చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వాటి పంపిణీ పూర్తి చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత తప్పేట్టు లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చే నెలాఖరు వరకూ కూడా పుస్తకాలు అందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలి.. పుస్తకాల పంపిణీ ఆలస్యమై ఇప్పుడిప్పుడే పాఠశాలలకు చేరుతుండటంతో.. ప్రస్తుతం చాలావరకు ప్రాథమిక పాఠశాలల్లో గతేడాది మొదలు పెట్టిన తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలు, హైస్కూల్స్‌లో పునఃశ్చరణ చేస్తున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన అభ్యసన నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రక్రియ అనివార్యమని విద్యాశాఖ భావించింది. అయితే దీన్ని అదనపు గంటల్లో చేపట్టి, రెగ్యులర్ క్లాసులు మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’!
సాక్షి, హైదరాబాద్: స్కూళ్లు తెరిచేలోగా పాఠశా లలకు పాఠ్య పుస్తకాలు చేరుస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు ఆమడ దూరంలో ఉంది. మరో రెండురోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా పాఠశాళలకు చేరలేదు. ముద్రణ పూర్తయిన పుస్తకాలు ఎక్కడిక క్కడే ఉండిపోయాయి. వాటిని విద్యార్థులకు అందించే బాధ్యత హెచ్‌ఎంలదే అని విద్యాశాఖ చెబుతుండగా తమకేం సంబంధం లేదని హెచ్ఎంలు స్పష్టం చేస్తుండటంతో పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. పుస్తకాలను గుట్టలుగా పడేయడంతో కొన్నిచోట్ల ఎలుకలు కొడుతున్నాయి. సరైన సదు పాయం లేని స్కూళ్లలో వర్షం వస్తే తడిసిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోనుండగా ఇప్పుడు హడావుడి చేసినా నెలాఖరుకు కూడా వాటిని పంపడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 100 శాతం పూర్తికాని ముద్రణ విద్యాశాఖ అడకమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 15 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, ఇంకా 1,57,48,270 పుస్తకాలు అందించాలి. ఇందులో ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించారు. వీటిని జిల్లా కేంద్రాలకూ చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాల ముద్రణ పూర్తి కావలసి ఉండటంతో.. ఇప్పుడున్నవి పంపిణీ చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత ఏర్పడనుంది. రవాణా టెండర్లు ఏమయ్యాయి? ముద్రణ అనంతరం జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకా లను హెచ్ఎంలు తమ పాఠశాలలకు తీసుకు వెళతారు. ఇందుకయ్యే ఖర్చంతా ముందుగా హెచ్ఎంలే భరించి ఆ తర్వాత విద్యాశాఖకు బిల్లులు పెట్టి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని హెచ్ఎంలు అంటున్నారు. ఈ కారణంగా వారు పుస్తకాలు తీసుకెళ్లట్లేదు. దీంతో పుస్తకాల రవా ణాకు టెండర్లు పిలవాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. టెండర్లు ఆహ్వానించే గడువు కూడా ఈ నెల 15 వరకూ పెట్టారు. అయితే ఇప్పటివరకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా టెండర్లు పిలవలేదు. దీంతో టెండర్లు దాఖలయ్యేదెప్పుడు? ఖరారు చేసేదెప్పుడు? టెండర్ దక్కించుకున్న సంస్థ పుస్తకాలు చేరవేసేదెప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు తెరిచాక పుస్తకాలు అందించకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పుస్తకాలు లేకుంటే ఎలా..? పుస్తకాల చేరవేతకు టెండర్లు పిలవమని ఉన్నతాధికారులు చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. జూన్ 12న స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు అందకపోతే బోధనకు ఇబ్బంది అవుతుంది. డీఈవోలు తక్షణమే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలి. వంద శాతం పుస్తకాలు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. –పి.రాజా భానుచంద్ర ప్రకాశ్ (తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు) -
కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు
సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పాఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్‌ను బాలలకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ వివరించింది. ఈ పుస్తకాలు ప్లే బుక్‌ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్ఈపీ మార్గదర్శకాలు ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్సీఈఆర్టీ పరిశీలిస్తోంది. -
స్కూళ్లలో ఇకపై రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2 సెమిస్టర్ల విధానంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 – 24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు ఈ పాఠ్య పుస్తకాలు అందిస్తారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పాఠ్య పుస్తకాలు అందుతాయి. వీటిని మిర్రర్ ఇమేజ్‌లో బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో ముద్రించి ఇస్తారు. ఇలా రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు ఇవ్వడం వల్ల విద్యార్థుల బ్యాగు బరువు సగం మేర తగ్గుతుంది. విద్యార్థులు కూడా సులభంగా చదువుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ దశలవారీగా సిలబస్, పాఠ్య పుస్తకాలను సవరిస్తోంది. దీని కోసం దేశ, విదేశాల్లో ఉన్నత విధానాలపై అధ్యయనం చేసింది. ఎన్సీఈఆర్టీ, ఇతర రాష్ట్ర బోర్డుల పాఠ్యాంశాలు, సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్కరణలు తీసుకువచ్చారు. 2020 – 2021 విద్యా సంవత్సరం నుండి ’ట్రైమెస్టర్ (మూడు) సిస్టమ్‌తో ద్విభాషా ఆకృతిలో 1 నుండి 5వ తరగతులకు పాఠ్యపుస్తకాలను, రెండు సెమిస్టర్ విధానంలో 6వ తరగతి పాఠ్య పుస్తకాలను అందించారు. 7, 8 తరగతులకు కూడా 2021 – 22 విద్యా సంవత్సరం నుండి రెండు సెమిస్టర్ విధానంలో పుస్తకాలు ఇచ్చారు. అయితే, వివిధ వర్గాలు, నిపుణుల అభిప్రాయాలను అనుసరించి క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలన చేసి టర్మ్ ఆధారిత సిలబస్ పాఠ్య పుస్తకాలలో ఏకరీతి నమూనాను అనుసరించాలని ఎస్సీఈఆర్టీ ఓ నివేదిక ఇచ్చింది. ఈ విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎస్సీఈఆర్టీ నివేదిక అన్ని తరగతులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించారు. రెండు సెమిస్టర్ల పుస్తకాలను ఒకేసారి పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. -
పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్‌తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు. గతంలో ఎన్నో ఇబ్బందులు గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్.. గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు. దీక్ష యాప్ లేకున్నా.. తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్‌ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ఎంతో ఉపయుక్తం క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. – సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు కొత్తగా.. ఆసక్తిగా ఉంది క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. – గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్ -
ప్రైవేటు విద్యార్థులకు చౌకగా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కుల పేరిట జరుగుతున్న దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. తల్లిదండ్రులపై ఏటా వేలాది రూపాయల భారం పడకుండా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్కులు తదితరాలను ప్రభుత్వమే ముద్రించి పంపిణీ చేసే విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ధరకు నాణ్యతతో కూడిన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు ఈ పాఠశాలల విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ఆయా యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి తీసుకొని అందించే విధానాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్మి, తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు దండుకొనేవి. కొన్ని పాఠశాలల విద్యార్థులు షాపుల్లో అధిక ధరలకు కొనేవారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలైతే ఒకటో తరగతి నుంచే పాఠ్య పుస్తకాలకోసం రూ.5 వేల వరకు వసూలు చేసేవి. పై తరగతులకు వెళ్తున్నకొద్దీ ఈ వ్యయం రూ.10వేలకు పైనే ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పబ్లిషర్ల పుస్తకాలను కూడా ఈ స్కూళ్లు బలవంతంగా అంటగట్టేవి. ఈ పుస్తకాల నుంచి ఏదైనా బోధిస్తారా అంటే అదీ ఉండదు. ఆయా సంస్థలు రూపొందించే స్టడీ మెటీరియల్‌ను అనుసరించి బోధన, పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి మళ్లీ అదనంగా వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ ముకుతాడు వేస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల సంఖ్యను అనుసరించి ముందుగా ఇండెంటు తీసుకొని 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రైవేటు పాఠశాలల్లో 24, 44,942 మంది విద్యార్థులుండగా వాటి నుంచి 18,02,879 మంది విద్యార్థులకు సరిపడా ఇండెంటు వచ్చింది. వీరికి ఆయా తరగతులు, టైటిళ్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించి 1.83 కోట్ల పాఠ్యపుస్తకాలను విద్యా శాఖ, ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం సిద్ధం చేశాయి. పంపిణీకి ఏర్పాట్లు చేపట్టాయి. తరగతులు, స్టూడెంట్లవారీగా సెట్ల కింద అందిస్తున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు నిర్దేశిత గేట్‌వే ద్వారా డబ్బులు చెల్లిం చగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా అం దిస్తారు. పాఠ్య పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది. -
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్‌గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్‌బుక్... ఇవిగాక స్పెషల్ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి. -
కావాల్సినవి 3.50 కోట్లు ముద్రించింది 20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు బడిబాట మొదలైంది.. స్కూళ్లు తెరిచే సమయం సమీపిస్తోంది. మరోవైపు పాఠ్యపుస్తకాల కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.50 కోట్ల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ ముద్రించింది కేవలం 20 లక్షలే. ఈ అరకొర పుస్తకాలను పంచాలో, భద్రంగా దాచిపెట్టాలో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వడంలేదని, ఇవి తరగతిలో కనీసం పదిమందికి కూడా అందే అవకాశం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలా చేస్తే స్థానికంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలకు వచ్చిన పుస్తకాలను ముం దుగా సొంత డబ్బులతో స్కూళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోందని టీచర్లు చెబుతున్నారు. దీంతో ఆ పుస్తకాలను జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలలకు చేరవేసేందుకు హెచ్ఎంలు ముందుకురావడం లేదు. పేపర్ వచ్చేదెప్పుడు? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 24 లక్షల మందికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న మరో 30 లక్షల మంది విద్యార్థులకు నిర్ణయించిన ధరకు పుస్తకాలు అందించాలి. అన్ని ప్రభుత్వస్కూళ్లల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. దీంతో పుస్తకంలో ఒకవైపు ఇంగ్లిష్‌లో, మరోవైపు తెలుగులో పాఠాన్ని ముద్రించాల్సి ఉంది. ఇలా పుస్తకం బరువు పెరుగుతుండటంతో దాన్ని రెండు భాగాలుగా విడగొట్టి సమ్మెటివ్ అసెస్మెంట్స్ ఒకటి, రెండుగా ముద్రిస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాలు 2.10 కోట్లు, ప్రైవేటు స్కూళ్లకు అమ్మే పుస్తకాలు 1.40 కోట్లు ముద్రించాలి. అంటే గతంలో కంటే పేపర్‌ను అధికంగా వాడాలి. వర్షాకాలం మొదలైతే పేపర్ రవాణా కూడా కష్టమవుతుందని అధికారులు అంటున్నారు. తమిళనాడు, చండీగఢ్ ప్రాంతాల నుంచి పేపర్ రావాల్సి ఉంది. పేపర్ ఎప్పుడు వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పేర్కొంటున్నారు. నిధుల కొరతే కారణమా? పాఠ్యపుస్తకాలకు పేపర్ అందించే మిల్లు యజమానులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధరపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలిసింది. దీంతో నాణ్యతలేని పేపర్‌ను తెలంగాణ ముద్రణాలయానికి పంపుతున్నారని తెలుస్తోంది. పుస్తకాల ఖర్చు గతంలో రూ.60 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.120 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కోవిడ్ మూలంగా మిల్లుకు సరిపడా గుజ్జు రావడం తగ్గిందని, దీంతో రెండేళ్లుగా వ్యాపారం పడిపోయి, నిర్వహణ ఖర్చులు పెరిగాయనేది మిల్లర్ల వాదన. అయితే, వారు కోరిన మొత్తం ఇవ్వడానికి విద్యాశాఖకు నిధుల సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. పేపర్ వల్లే ఆలస్యం.. ప్రింటింగ్‌కు వాడే పేపర్ రాష్ట్రానికి రావడం ఆల స్యం అవుతోంది. అందుకే ముద్రణ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటివరకూ 20 లక్షల మేర ముద్రించి జిల్లాలకు పంపాం. వీలైనంత వరకూ ఈ నెలాఖరుకు అన్ని పుస్తకాలు ముద్రించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ముద్రణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పంపిణీ ప్రారంభించడం మంచిది. – ఎస్.శ్రీనివాసాచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ లేకపోవడం వల్లే.. ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని తెలిసిన ప్పుడు పుస్తకాల ముద్రణ ముందే చేపట్టాలని అధికారులకు తెలియాలి. సరైన ప్రణాళిక లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదు రవు తాయి. స్కూళ్లు తెరిచినా, పుస్తకాలు లేకు ంటే ప్రయోజనం ఏమిటి? అసలెప్పుడొస్తా యో స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. – బి.రాజాభానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ పథకాల వైపే అందరి అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీని సందర్శించి ఆయా పథకాలు అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మెచ్చుకోవడమే కాకుండా ఆ రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఏపీలో అమలవుతున్న బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు)ను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించడానికి సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్య పుస్తకాలను తమ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ఇటీవల వారి అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అమల్లో ఉండేది. దీంతో ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యలో, ఉద్యోగావకాశాల్లో వెనుకబాటుకు గురయ్యేవారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనందున ఆయా సంస్థలు వీరివైపు దృష్టి సారించేవి కావు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్.. దూర దృష్టితో ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కింద అందించే కిట్లలో డిక్షనరీని కూడా చేర్పించారు. ఆంగ్ల భాషా పదాలు సులభంగా అర్థమవ్వడంతో పాటు ఆ సబ్జెక్టు అంశాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకొనేందుకు తెలుగు మాధ్యమంలో కూడా అవే పాఠాలు ఒకే పుస్తకంలో అందేలా ఏర్పాట్లు చేయించారు. టెక్టŠస్ పుస్తకంలో పాఠ్యాంశం ఒక పేజీలో ఆంగ్లంలో, మరోవైపు తెలుగులో (మిర్రర్ ఇమేజ్) ఉండేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. పాఠ్య పుస్తకాలు తక్కువ బరువుతో ఉండేలా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో మాదిరిగా పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానంలో ముద్రించి ఇస్తున్నారు. 2020–21లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు, 2021–22లో ఏడవ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. డిగ్రీలోనూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఇంగ్లిష్–తెలుగు) పాఠ్య పుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్ పుస్తకాలను ఈ విధానంలో ముద్రించారు. మన నాడు–నేడుపై తెలంగాణ మక్కువ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమే కాకుండా, సర్వాంగ సుందరంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఈ పథకాన్ని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తోంది. ఈ పథకానికి వినియోగించిన సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ప్రధాన కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఏపీ ఆ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు అందించడమే కాకుండా ఇతరత్రా సహకారం అందించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈ ఏడాది మార్చి 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మన ఊరు – మనబడి పేరుతో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. 26,065 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో మహర్దశ రాష్ట్రంలో నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్లతో సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కింద పనులు చేపట్టనున్న స్కూళ్లు, వ్యయం వివరాలు ఇలా ఉన్నాయి. -
నాణ్యమైన బోధన అందేలా పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు నాణ్యమైన, సరళమైన బోధన అందేలా పాఠ్య పుస్తకాలను రూపొందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. సచివాలయంలో ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాల రూపకల్పనపై జరిగిన ప్రాథమిక సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విద్యా రంగంలోని సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా బైలింగువల్ లాంగ్వేజ్‌లో రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాలు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. అమ్మ ఒడి, నాడు–నేడు ఇంగ్లిష్ మీడియం విద్య తదితర పథకాలతో పేదలకు మెరుగైన విద్య అందుతోందన్నారు. సీబీఎస్ఈ సిలబస్‌కు తగ్గట్టుగా విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన 13 జిల్లాలకు చెందిన దాదాపు 130 మంది రచయితలు, పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాలకు 1.12 కోట్ల పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మొదలైంది. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నా, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే పనిలో విద్యా శాఖ నిమగ్నమైంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం. అందులో 1.12 కోట్ల పుస్తకాలు జిల్లాలకు పంపినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 30 లక్షల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. రాజమండ్రి నుంచి పుస్తకాలకు అవసరమైన పేపర్ హైదరాబాద్‌కు రాకపోవడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైందని పాఠశాల విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పేపర్ తెప్పించి నెలాఖరులోగా ముద్రించి జిల్లాలకు పంపుతామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలకు పంపించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరినట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలలకు రావట్లేదు. దీంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. 9, 10వ తరగతి విద్యార్థులందరికీ వేగంగా పుస్తకాలు అందజేయాలని కోరింది. దీంతో కొన్నిచోట్ల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు 1.25 కోట్ల పుస్తకాలు.. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారమే పుస్తకాల ముద్రణ చేస్తారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 32 లక్షల మంది ఉంటారు. వారికోసం 1.25 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. వాటిని ప్రైవేట్ ముద్రణా సంస్థలు సిద్ధం చేస్తాయి. ఆరు శాతం రాయల్టీతో ముద్రణా సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఆ రూపేణా ప్రభుత్వానికి ఈ ఏడాది దాదాపు రూ.4 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రైవేట్ స్కూళ్లు పుస్తకాలను ఆయా ముద్రణా సంస్థల వద్ద నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తాయి. అయితే ఈసారి చాలా స్కూళ్లు పూర్తిస్థాయిలో పుస్తకాలు కొనట్లేదని ముద్రణా సంస్థలు చెబుతున్నాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే వింటుండటంతో చాలామంది స్కూళ్లకు వచ్చి కొనుగోలు చేయట్లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు తప్ప మిగిలిన వారు అంతగా ఆసక్తి చూపించట్లేదు. తమ పాఠశాలలో ఇంకా పుస్తకాలు రాలేదని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బి.సహన చెబుతోంది. -
బడిసంచి ఇక తేలిక
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్‌కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్వీఎస్, సీబీఎస్ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్ పాలసీ–2020’ని వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్‌ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ (ఏవోటీఏ), అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్ ఉండాలని సూచించాయి. ద అమెరికన్ చిరోప్రాక్టీస్ అసోసియేషన్ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది. మన దేశంలో పరిస్థితి ఇలా.. స్కూల్ బ్యాగ్ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది. పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు లంచ్‌బాక్స్ – 250 గ్రా. నుంచి 1 కిలో వాటర్ బాటిల్ – 200 గ్రా. నుంచి 1 కిలో బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కొత్త విధానంలో పలుసూచనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. – బ్యాగ్‌ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి. – స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలి. – నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్, కంప్యూటర్, మోరల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి. – స్కూలు బ్యాగ్ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి. – ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి. – పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా టైమ్‌టేబుల్ రూపొందించాలి. – 1, 2 తరగతులకు ఒకే నోట్ పుస్తకం అమలుచేయాలి. – 3, 4, 5 తరగతులకు రెండు నోట్ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్‌లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి. – 6, 7, 8 తరగతుల వారికి లూజ్ పేపర్లలో క్లాస్‌వర్క్ చేసేలా ఫైల్‌ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి. – పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు. – స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది. ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్ బ్యాగ్ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి. – ప్రొఫెసర్ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్‌డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్‌ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్‌తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్‌లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్‌లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్‌బుక్స్‌ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మామూలు డాల్ఫిన్ బొమ్మ కాదండోయ్...ఇదో ‘చదివే’ బొమ్మ! దీని పేరు డాల్ఫియో. 6, 7, 8వ తరగతి తెలుగు, ఆంగ్ల పాఠ్య పుస్తకాలను ఇది అనర్గళంగా, ఉచ్ఛారణ లోపాల్లేకుండా చదివేయగలదు! ఏమిటిది ? ఇదో టాకింగ్ పెన్, మల్టీమీడియా ప్రింట్ రీడర్. ఇందులో ముందే లోడ్ చేసిన ఆడియో ఫైళ్లతో కూడిన మెమొరీ చిప్ ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్ ద్వారా పనిచేసే డాల్ఫియోలో పాఠాలు వినబడేలా ఓ స్పీకర్ కూడా ఉంటుంది. ఎలా పనిచేస్తుంది.. డాల్ఫియోలో ఒక సెన్సర్ ఉంటుంది. దీన్ని పాఠ్య పుస్తకం తాలూకూ బార్కోడ్లపై ఉంచితే సెన్సర్ వాటిని స్కాన్ చేసి సంబంధిత ఆడియో ఫైళ్లను యాక్టివేట్ చేస్తుంది. పాఠంలోని అక్షరాలపై డాల్ఫియోను కదుపుతూ వెళ్తుంటే వాటిని అది చదువుతూ వెళ్తుంది. ఎందుకు, ఎవరు తెచ్చారు...? విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు పాఠశాల విద్యాశాఖ ‘టాకింగ్ బుక్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యునిసెఫ్ సహకారంతో రాష్ట్రంలోని 600 పాఠశాలలకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. పుస్తకాల్లోని పాఠ్యాంశాలపై రీడింగ్ డివైస్ పెడితే ఆ పాఠ్యాంశాలు వాయిస్ రూపంలో విద్యార్థులకు వినిపిస్తాయి. అంతేకాదు బొమ్మలపై పెట్టినా ఆ బొమ్మకు సంబంధించిన కథనాన్ని మొత్తం వివరిస్తుంది. అందుకే వాటికి లైఫ్ స్కిల్ టాకింగ్ బుక్స్‌గా యునిసెఫ్ పేరు పెట్టింది. ఏయే స్కూళ్లకు? డాల్ఫియో బొమ్మలను 417 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ),35 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 37 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, ఉట్నూరులోని 111 ఆశ్రమ పాఠశాలలకు అందించనున్నారు. లాభం ఏమిటి? బాలికల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరుచడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో వంద కథలతో ఈ టాకింగ్ పుస్తకాలను యునిసెఫ్ పాఠశాలలకు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధి సుకన్య సుబ్రమణ్యన్ సహకారంతో వీటిని పాఠశాలలకు అందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. కథలతో పాఠాలు... పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికత, బాల కార్మిక, బాలల హక్కులు తదితర అంశాలకు సంబంధించిన పాఠాలను మంచి కథలతో రూపొందించినట్లు విజయ్‌కుమార్ వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సులభశైలిలో ఈ కథలు ఉన్నట్లు వెల్లడించారు. 6, 7,8 తరగతులకు చెందిన బాలికలకు వీటితో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వీటి ద్వారా జీవన నైపుణ్యాలతోపాటు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడటం, చదవడం, రావడం నేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతాయని యూనిసెఫ్ కన్సల్టెంట్ సదానంద్ వివరించారు. – సాక్షి, హైదరాబాద్ -
వడివడిగా.. బడి ఒడికి..
సాక్షి, అమరావతి: విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేవి కావు. తరగతిలో 20 మంది ఉంటే.. పది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండేది. మిగిలిన వారికి ఆ తరువాత ఎప్పుడో వస్తే ఇచ్చేవారు. ఒక పుస్తకాన్ని నలుగురైదుగురు కలిపి చదువుకునే పరిస్థితి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. తరగతుల్లోని ప్రతి విద్యార్థి చేతిలో అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు తెరవగా.. ఇప్పటికే రాష్ట్రంలోని 95 శాతానికి పైగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. అమ్మ ఒడి పథకం, ఇతరత్రా కారణాలతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా శాఖ 5 శాతం పుస్తకాలను అదనంగా అందిస్తోంది. 46 వేలకు పైగా స్కూళ్లు.. 39 లక్షలు దాటిన విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ప్రస్తుతం 46,786 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 39,04,141 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం దాదాపు రూ.96 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.65 కోట్ల వరకు నిధులను పేపర్ కొనుగోలు, సరఫరాకు వెచ్చిస్తుండగా మిగతా మొత్తాన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వమే పేపర్ కొనుగోలు చేసి ప్రింటర్లకు అందిస్తోంది. వీటి ముద్రణను ఏటా డిసెంబర్ లేదా జనవరి నెలల్లోనే ప్రారంభించాల్సి ఉంటుంది. గతంలో ముద్రణ టెండర్ల వ్యవహారాన్ని ఏప్రిల్, మే వరకు ఖరారు చేసేవారు కాదు. పేపర్ కొనుగోలు, ముద్రణ టెండర్లకు సంబంధించి లోపాయికారీ ఒప్పందాలు తేలిన అనంతరం కానీ అనుమతి వచ్చేది కాదు. గడచిన విద్యా సంవత్సరంలో ఏకంగా మే మూడో వారంలో కానీ ముద్రణ టెండర్లను ఖరారు చేయలేదు. పుస్తకాల పంపిణీకి అధికారులు నానాయాతన పడాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. ఫలితంగా గతంలో లేనివిధంగా పాఠశాలలు తెరవటానికి ముందే పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. 7 మాధ్యమాల్లో.. 329 పీఠికలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ, ఒరియా మాధ్యమాలకు సంబంధించి 329 పీఠిక (టైటిల్స్)లతో 2,27,77,774 పుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ప్రింటర్ల నుంచి ఇప్పటికే 2,02,83,760 పాఠ్య పుస్తకాలు అందగా.. పాత స్టాకు 14,16,899 కలిపి మొత్తం 2,17,00,659 పాఠ్య పుస్తకాలను మండలాలకు తరలించారు. అక్కడి నుంచి గతంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనికి సమయం పడుతుండటంతో ఈసారి ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సుల్లో పాఠశాలలకు పంపించారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల చెంతకు 2,02,74,313 పాఠ్య పుస్తకాలు చేరాయని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ కృష్ణారెడ్డి వివరించారు. విద్యార్థుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు అదనంగా 5 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాల వారీగా పాఠ్య పుస్తకాల వివరాలు -
బాలగంగాధర్ తిలక్.. ‘ఫాదర్ ఆఫ్ టెర్రరిజం’!
జైపూర్: గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్‌ను ‘ఉగ్రవాదానికి మూలపురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయితే, 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది. -
త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. ఈ కోడ్‌ను విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నెట్లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
అమెరికాలో హిందువుల విజయం
వాషింగ్టన్ : అమెరికాలోని హిందూ బృందాలు కాలిఫోర్నియా కేసులో కీలక విజయాన్ని సాధించాయి. అమెరికాలోని పాఠ్యాంశాల్లో భారతదేశం, హిందూమతం గురించి ఖచ్చితమైన, విశాల దృక్ఫథంతో, శాస్త్రీయంగా ఇవ్వాలని హిందూ వర్గాలు చేస్తున్న పదేళ్ల పోరాటం ఫలించింది. హిందుత్వం, భారతదేశం గురించి అమెరికా పాఠ్యాంశాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు కాలిఫోర్నియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎస్‌బీఈ) అంగీకారం తెలిపింది. రెండు పాఠ్యాంశాల పద్దతిని సైతం కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరస్కరించింది. అంటే గ్రేడ్స్ కే6-గ్రేడ్స్ 6-8 వరకూ అన్ని పాఠ్యాంశాల్లోనూ హిందువులు, భారత దేశ చరిత్రను సమగ్రంగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని అమెరికా హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శాంతారామ్ అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ నాగరికత, హిందుత్వం గురించిన నిజానిజాలు అమెరికన్లకు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. -
పుస్తకం లేని చదువులు
కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధిస్తామనే అధికారుల మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే అరకొర సౌకర్యాల మధ్య చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు కనీసం పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కళాశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా విద్యార్థుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించేది. అయితే ఈ ఏడాది ఇంత వరకు కాలేజీల్లో పాఠ్యాంశాలు అధ్యాపకులు బోధిస్తున్నా ఇంటి దగ్గర చదువుకునేందుకు పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పుస్తకాలు లేని కారణంతో చాలా కాలేజీల్లో అధ్యాపకులు కూడా తాము బోధించిన అంశాలకు నోట్స్ ఇవ్వకపోవడంతో స్లిప్ టెస్ట్‌లు రాసేందుకు సైతం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు పబ్లిషర్స్ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న వారు వాటిని కొనుగోలు చేయలేక పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నారు. దీంతో తక్కువ మార్కులు రావడం, ఫెయిల్ అవుతుండడంతో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని కళాశాలల్లో మాత్రమే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన వారి నుంచి తిరిగి ఇప్పించుకుని అందజేశారు. మొదటి ఏడాది విద్యార్థులకు గత ఏడాది మిగిలిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ రూపంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రం పుస్తకాలు అందాయి. ప్రతిపాదనలు కోరని ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 42 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 10 వేల మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేళ్లుగా ప్రభుత్వం సకాలంలో పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. ఈ కారణంతోనే ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు వెనుకబడుతున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలవుతున్నా నేటికీ ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కోసం విద్యాశాఖ ఇండెంట్ కోరలేదు. ఆర్ట్స్ విద్యార్థులు ఇతర పుస్తకాలను చదువుతూ కొంత మేరకు గడుపుతున్నా సైన్సు గ్రూప్‌ల వారు మాత్రం ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలపైనే ఆధారపడుతుండడం, ఇంత వరకు పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై తీవ్ర ప్రభావం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠ్య పుస్తకాల ముద్రణ నిలిపివేత! వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మీడియట్ సిలబస్‌లో సమూలమైన మార్పులు చేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగానే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం పుస్తకాల ముద్రణకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంతో కొన్ని పబ్లిషర్స్ అడ్డగోలుగా పాఠ్యపుస్తకాల ధరలు పెంచి విద్యార్థులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. పాత పుస్తకాలతో సర్దుబాటు చేశాం ఇంటర్ మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగాం. గతేడాది మిగిలిన పుస్తకాలతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి సేకరించి మొదటి సంవత్సరం విద్యార్థులకు కొంత మేరకు సర్దుబాటు చేశాం. వచ్చే ఏడాది నుంచి సిలబస్ మార్పులు జరుగుతుండడంతోనే పాఠ్య పుస్తకాలను ఇవ్వలేదు. – సుబ్రమణ్యేశ్వరరావు, డీవీఈఓ -
విద్యార్థుల కోసం పుస్తకాలపై ‘1098’
వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో, బయట విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరించింది. వేధింపులకు గురి చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు పాఠ్య పుస్తకాల వెనుక భాగంలో టోల్ ఫ్రీ నంబర్ ‘1098’ను ముద్రించినట్లు తెలిపింది. పాఠశాలల్లో సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 18004257462 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. సర్వ శిక్షా అభియాన్, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో సమస్యలపై 18004253525 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
పాఠాలు లేటేనా...!
⇒ఇంకా 10 శాతం కూడా జిల్లాకు రాని పాఠ్యపుస్తకాలు ⇒ సకాలంలో పంపిణీపై సందిగ్ధత ⇒ఆలస్యంతో ఏటా తిప్పలే.. ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉచిత పాఠ్యపుస్తకాలు ఈసారి కూడా సకాలంలో జిల్లాకు వచ్చే అవకాశాలు కనిపించపోవడమే. విద్యాశాఖ అంచనాల మేరకు ఈ సంవత్సరంలో 15 లక్షల పైచిలుకు పుస్తకాలు జిల్లాకు అవసరం కాగా.. కేవలం 80 వేలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి. గతేడాది పుస్తకాలు ఆలస్యం కావడం వల్ల పాఠ్యాంశాలు డిసెంబర్ నాటికి పూర్తి కాలేదు. ఈసారైనా పుస్తకాలు సమయానికి వస్తాయో..? రావో..? అన్న సందిగ్ధం నెలకొంది. తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈఏడాది కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే సూచనలు కనిపించడం లేదు. తరగతులు, మీడియంల వారీగా జిల్లాకు ఈ ఏడాది 15 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 80 వేల బుక్స్ మాత్రమే అందాయి. ఇంకా 14 లక్షలకుపైబడి పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉండడంతో ఎదురుచూపులు తప్పలేదు. సరఫరా ఇలా.. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం వేసవి సెలవులకు ముందస్తుగానే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో అన్న అంచనాలతో జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల అచ్చుకు ప్రభుత్వం టెండర్‌ను పిలిచి ప్రింటింగ్ ప్రెస్‌కు కేటాయిస్తుంది. ప్రింటింగ్ అయిన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీటిని జిల్లాలోని 66మండలాల్లో ఉన్న మండల వనరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలలు పునఃప్రారంభం(జూన్ 13వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ. విద్యాశాఖ నివేదిక ఇలా.. జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఉర్దు మీడియం పాఠశాలలున్నాయి. దీనికితోడు సంస్కృత మీడియం పాఠశాలలు ఒకట్రెండు ఉన్నట్టు సమాచారం. అన్ని తరగతులు, మీడియాలకు సంబంధించి జిల్లాకు మొత్తం 18,55,583 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. గత ఏడాది పుస్తక విక్రయ కేంద్రంలో 3,25,571పాఠ్యపుస్తకాలు మిగులులో ఉన్నాయి. ఇవి పోను 15,30,012పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు 9వ తరగతి తెలుగు మీడియానికి సంబంధించిన బయాలజి, ఫిజిక్స్, 8వ తరగతికి సంబంధించి తెలుగు రీడర్, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ బుక్స్ సహా మొత్తం 79,627 పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 14,50,385 పాఠ్యపుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. అనుకున్న తేదీలోపు దశల వారీగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయనిని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో సకాలంలో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ప్రతియేటా ఇబ్బందులే.. పాఠశాలల పునఃప్రారంభంలోపే పుస్తకాలను చేరవేస్తామని ప్రభుత్వం ఏటా ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా గత ఏడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధన అందించాలంటే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు ఉండి తీరాలి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరిగితేనే డిసెంబరు ఆఖరుకల్లా పాఠ్యాంశాలను పూర్తి చేసి రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగాలంటే పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పుస్తకాలు రాలేదా.. ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: పాఠ్య పుస్తకాల సరఫరాకు సంబంధించిన సమస్యలు, సమా చారాన్ని అందించేందుకు 18004257462 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాకపోయినా, ఏమైనా సబ్జెక్టుల పుస్తకాలు రావాల్సి ఉన్నా ఈ నంబర్ ని సంప్రదించాలని కోరారు. మండల కేంద్రాలకు వచ్చే పాఠ్య పుస్తకాల్లో తమకు అవసరమైన పుస్తకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లదేనన్నారు. -
హత్నూర పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
- ప్రతి నెలా విద్యార్థులకు స్కాలర్షిప్లు - హాస్టల్ సమస్యల పరిష్కారానికి విరాళాలు -పూర్వ విద్యార్థుల కన్వీనర్ పల్లె నరేందర్ సంగారెడ్డి మున్సిపాలిటీ : తాము చదువుకున్న పాఠశాల నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాఠశాలలో చదవడం వల్లే తాము ఈ రోజు వివిధ రంగాల్లో స్థిరపడ్డాం.. మనకు జీవితం ఇచ్చిన స్కూల్‌కు చేయూత నివ్వాలనే ఆలోచన పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు వచ్చింది. అంతే 1991 నుంచి 2005 వరకు చదువుకున్న 1257 మంది పూర్వ విద్యార్థుల సమాచారం సేకరించారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యుల (హత్నుర సర్పంచ్)ను కలుపుకోని కమిటీ నియమించారు. అందులో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. హత్నూరలో పాఠశాల ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయినందున అందులో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి హాస్టల్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా హాస్టల్ అభివృద్ధికి వచ్చే నిధులుపై ఆధార పడకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను 1991 నుంచి 2005 వరకు చదువుకున్న విద్యార్థుల ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం పంపొందేలా అవసరమైన అవగాహన సదస్సులు చేపట్టాలని తీర్మానం చేశారు . ప్రతి సంవత్సరం 25 మంది విద్యార్థులకు ప్రతి నెలా స్కాలర్ షిప్ ఇవ్వాలని, ఇందుకోసం కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్యక్షుడు రవీందర్ తెలిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్.. 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హత్నూర గురుకుల పాఠశాల ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది.. అక్కడ ఎటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఎలా సేకరించాలి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పూర్వ విద్యార్థులు సమీక్ష నిర్వహించారు. ఇందుకు గాను వివిధ హోదాల్లో ఉన్న వారితో పాటు కింది స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వారు సైతం తాము చదువుకున్న పాఠశాల ఆభివృద్ధి కోసం నెలనెలా తమకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. జమ చేసిన డబ్బులతో పాఠశాలను, సర్పంచ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి శంకరన్ జయంతి రోజు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థుల కన్వీనర్లు రాహుల్, కిరణ్, ప్రధాన కార్యదర్శి మోజెస్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పుస్తకాలు ఎప్పుడిస్తారు సారూ..
సర్కారు స్కూళ్లకు ఇంకా అందని దైన్యం పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు పూర్తి బోధించడం కష్టమంటున్న ఉపాధ్యాయులు చదువులో వెనుకబడుతున్న విద్యార్థులు నర్సాపూర్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇంత వరకు పలు తరగతులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సర్కారు బడులకు అందలేదు. దీంతో ఒకటి నుంచి పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మెజార్టీ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందించడం లేదు. కొన్ని మండలాల్లోని పాఠశాలలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు వచ్చారుు. మిగతా చోట్ల మాత్రం అరకొరగానైనా ఇవ్వలేదు. ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా? ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ కానందున పదవ తగరతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నారుు. ఉత్తమ ఫలితాల సాధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నెలలు గడుస్తున్నా పుస్తకాలు రాకపోతే ఫలితాలెలా సాధ్యమంటున్నారు. ఇప్పటికీ అందని పాఠ్య పుస్తకాలు ఇవే.. పాఠశాలలు తెరిచి రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు అందని పాఠ్య పుస్తకాలు లిస్టు భారీగానే ఉంది. పదవ తరగతి గణితం, బయో సైన్సు, ఫిజికల్ సైన్సు పాఠ్య పుస్తకాలు ఇంత వరకు జిల్లాలోని అనేక మండలాలకు సరఫరా కాలేదు. 9వ తరగతి ఆంగ్లం, గణితం, బయో మెడికల్ సైన్సు, సాంఘీకం, ఈవీఎస్ పాఠ్య పుస్తకాలు అందలేదు. 8వ తరగతి బయో సైన్సు, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాలు, 6, 7వ తరగతుల హిందీ, 5వ తరగతి ఎన్విరాల్మెంట్ సైన్సు పుస్తకాలతోపాటు ఒకటి నుంచి మూడు తరగతులకు చెందిన పలు రకాల పుస్తకాలు సైతం రాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయా తరగతుల్లో పాసైన విద్యార్థుల పాత పుస్తకాలు సేకరించి పలువురు విద్యార్థులకు అందచేయడంతోపాటు ఉపాధ్యాయులు సైతం పాత పుస్తకాలతోనే పాఠాలు బోధిస్తున్నారు. పాత పుస్తకాలు అందరికీ సరిపడా దొరకడం లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పుస్తకాలు తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో ఉపాధ్యాయులు ఏ రోజుకారోజు పాఠం బోధించగానే దానికి సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులనడిగి జవాబులు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటారు. అప్పటి వరకు బోధించిన పాఠంపై విద్యార్థులకు ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకుంటారు. అంతేగాక ప్రాజెక్టు వర్కును సైతం ఇస్తారు. ఈ విధానంలో పాఠ్య పుస్తకాలు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠ్య పుస్తకాలు లేకుంటే విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్కు పూర్తి చేయలేరని, ప్రాజెక్టు వర్క్‌లను సైతం పూర్తి చేయలేరని చెబుతున్నారు. ప్రాజెక్టు వర్క్‌లకు మార్కులు వేసే విధానం అమలులో ఉండడంతో పుస్తకాలు లేక ప్రాజెక్టు వర్క్‌లు పూర్తి చేయకపోతే మార్కులు వేయలేని పరిస్థితులు ఉత్పన్నమవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. కాగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకుండా ప్రభుత్వం పరోక్షంగా విద్యార్థులకు నష్టం కలిగిస్తోందనే ఆరోపణలు వస్తున్నారుు. -
ఒక్క బుక్కు వచ్చింటే ఒట్టు
♦ బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం ♦ అందని పాఠ్యపుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. సకాలంలో వారికి పాఠ్యపుస్తకాలు అందించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నారు. ఇంటర్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు తెరుచుకున్నాయి. కానీ అవసరమైన పాఠపుస్తకాలు మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎన్ని పుస్తకాలు కావాలంటే జిల్లావ్యాప్తంగా ఇంటర్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 1,00,118 పుస్తకాలు అవసరమని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదికిచ్చారు. అక్కడి నుంచి ఇంతవరకు అతీగతీ లేదు. నేరుగా గోడౌన్‌కు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటర్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నేరుగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు చేరుకుంటాయి. సంబంధిత పుస్తకాలను అక్కడి నుంచి ఆర్ఐవో కార్యాలయానికి తరలించుకుని ఇక్కడ నుంచి కళాశాలల వారికి పంపిణీ చేయనున్నారు. ఈ తతంగమంతా జరగాంటే కొంత సమయం పడే అవకాశాలున్నాయి. రాగానే పంపిణీ చేస్తాం ప్రభుత్వం నుంచి పాఠపుస్తకాలు రాగానే కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. దాదాపుగా వారంలోపే పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాలు రాగానే అలస్యం లేకుండా కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రమౌళి, డివీఈవో, కడప.