TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’! | delay in distribution of textbooks telangana | Sakshi
Sakshi News home page

TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’!

Published Sat, Jun 10 2023 2:19 AM | Last Updated on Sat, Jun 10 2023 2:42 PM

delay in distribution of textbooks telangana - Sakshi

ఓ జిల్లా కేంద్రంలో  గుట్టలుగా పడివున్న పాఠ్య పుస్తకాలు 

సాక్షి, హైదరాబాద్‌: స్కూళ్లు తెరిచేలోగా పాఠశా లలకు పాఠ్య పుస్తకాలు చేరుస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యాచరణకు ఆమడ దూరంలో ఉంది. మరో రెండురోజుల్లో స్కూళ్లు తెరుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా పాఠశాళలకు చేరలేదు. ముద్రణ పూర్తయిన పుస్తకాలు ఎక్కడిక క్కడే ఉండిపోయాయి. వాటిని విద్యార్థులకు అందించే బాధ్యత హెచ్‌ఎంలదే అని విద్యాశాఖ చెబుతుండగా తమకేం సంబంధం లేదని హెచ్‌ఎంలు స్పష్టం చేస్తుండటంతో పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. పుస్తకాలను గుట్టలుగా పడేయడంతో కొన్నిచోట్ల ఎలుకలు కొడుతున్నాయి. సరైన సదు పాయం లేని స్కూళ్లలో వర్షం వస్తే తడిసిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ నెల 12న స్కూళ్లు తెరుచుకోనుండగా ఇప్పుడు హడావుడి చేసినా నెలాఖరుకు కూడా వాటిని పంపడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

100 శాతం పూర్తికాని ముద్రణ
విద్యాశాఖ అడకమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 15 నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు ప్రారంభించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, ఇంకా 1,57,48,270 పుస్తకాలు అందించాలి. ఇందులో ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకాలు ముద్రించారు. వీటిని జిల్లా కేంద్రాలకూ చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాల ముద్రణ పూర్తి కావలసి ఉండటంతో.. ఇప్పుడున్నవి పంపిణీ చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత ఏర్పడనుంది.

రవాణా టెండర్లు ఏమయ్యాయి?
ముద్రణ అనంతరం జిల్లా కేంద్రాలకు చేరిన పుస్తకా లను హెచ్‌ఎంలు తమ పాఠశాలలకు తీసుకు వెళతారు. ఇందుకయ్యే ఖర్చంతా ముందుగా హెచ్‌ఎంలే భరించి ఆ తర్వాత విద్యాశాఖకు బిల్లులు పెట్టి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా బిల్లులు రాలేదని హెచ్‌ఎంలు అంటున్నారు. ఈ కారణంగా వారు పుస్తకాలు తీసుకెళ్లట్లేదు. దీంతో పుస్తకాల రవా ణాకు టెండర్లు పిలవాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. టెండర్లు ఆహ్వానించే గడువు కూడా ఈ నెల 15 వరకూ పెట్టారు. అయితే ఇప్పటివరకు ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా టెండర్లు పిలవలేదు. దీంతో టెండర్లు దాఖలయ్యేదెప్పుడు? ఖరారు చేసేదెప్పుడు? టెండర్‌ దక్కించుకున్న సంస్థ పుస్తకాలు చేరవేసేదెప్పుడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బడులు తెరిచాక పుస్తకాలు అందించకపోతే పిల్లలకు పాఠాలు చెప్పేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పుస్తకాలు లేకుంటే ఎలా..?
పుస్తకాల చేరవేతకు టెండర్లు పిలవమని ఉన్నతాధికారులు చెప్పినా, అది అమలుకు నోచుకోవడం లేదు. జూన్‌ 12న స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు అందకపోతే బోధనకు ఇబ్బంది అవుతుంది. డీఈవోలు తక్షణమే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలి. వంద శాతం పుస్తకాలు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
–పి.రాజా భానుచంద్ర ప్రకాశ్‌
(తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement