
అందుబాటులో లేని ఇంటర్ పుస్తకాలు
♦ ‘ద్వితీయ’ ఆర్ట్స్ విద్యార్థులకు ప్రారంభం కాని బోధన
♦ సిలబస్‌లో మార్పుతో ఇంకా ప్రారంభం కాని ముద్రణ
♦ పరిశీలనలోనే నమూనా పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఈనెల 1న ప్రారంభం అయినా పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో పాఠ్యాంశాల బోధన జరగడం లేదు.
దీంతో విద్యార్థులు కాలేజీలకు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లో సిలబస్‌ను మార్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. కానీ, ఈ మార్పులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో దాదాపు 3 లక్షల మంది ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు పుస్తకాలు లేని పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ సిలబస్‌ను ఏప్రిల్ నెలలో ఖరారు చేసింది.
ఆ తరువాత పుస్తకాల రచన కోసం తెలుగు ఆకాడమీకి పంపించింది. అకాడమీ నెల రోజుల్లో పుస్తకాలను రాయించి, ఇంటర్మీడియెట్ బోర్డు, విద్యాశాఖ ఆమోదం కోసం పంపించింది. వారు అనుమతి ఇచ్చాకే ముద్రణను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో ఇంకొన్నాళ్లు విద్యార్థులు పుస్తకాలు లేకుండానే కాలేజీలకు ఊరకే వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు ఏదో ఒకటి చెబుతున్నా.. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం బోధన ప్రారంభమే కాలేదు.
మరోవైపు పాఠశాలల పుస్తకాల్లో చేసిన మార్పుల తరహాలోనే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఆర్ట్స్ గ్రూపుల పుస్తకాల్లోనూ మార్పులు చేశారు. అంతర్జాతీయ, జాతీయ చరిత్రతోపాటు తెలంగాణ చరిత్రపైనా కొత్తగా పాఠాలు పెట్టారు. పొలిటికల్ సైన్స్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, తెలంగాణలో పంటలు, వాణిజ్య పరిస్థితులపై పాఠ్యాంశాలను పొందుపరిచినట్లు తెలిసింది. ప్రస్తుతం నమూనా పుస్తకాలను విద్యాశాఖ పరిశీలన జరుపుతోంది. వివాదాలకు తావులేకుండా పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని, అందుకే ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.