హత్నూర పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
- - ప్రతి నెలా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
- - హాస్టల్ సమస్యల పరిష్కారానికి విరాళాలు
- -పూర్వ విద్యార్థుల కన్వీనర్ పల్లె నరేందర్
సంగారెడ్డి మున్సిపాలిటీ :
తాము చదువుకున్న పాఠశాల నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాఠశాలలో చదవడం వల్లే తాము ఈ రోజు వివిధ రంగాల్లో స్థిరపడ్డాం.. మనకు జీవితం ఇచ్చిన స్కూల్‌కు చేయూత నివ్వాలనే ఆలోచన పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు వచ్చింది. అంతే 1991 నుంచి 2005 వరకు చదువుకున్న 1257 మంది పూర్వ విద్యార్థుల సమాచారం సేకరించారు.
అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యుల (హత్నుర సర్పంచ్)ను కలుపుకోని కమిటీ నియమించారు. అందులో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. హత్నూరలో పాఠశాల ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయినందున అందులో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి హాస్టల్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వ పరంగా హాస్టల్ అభివృద్ధికి వచ్చే నిధులుపై ఆధార పడకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను 1991 నుంచి 2005 వరకు చదువుకున్న విద్యార్థుల ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం పంపొందేలా అవసరమైన అవగాహన సదస్సులు చేపట్టాలని తీర్మానం చేశారు
. ప్రతి సంవత్సరం 25 మంది విద్యార్థులకు ప్రతి నెలా స్కాలర్ షిప్ ఇవ్వాలని, ఇందుకోసం కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్యక్షుడు రవీందర్ తెలిపారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్..
30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హత్నూర గురుకుల పాఠశాల ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది.. అక్కడ ఎటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఎలా సేకరించాలి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పూర్వ విద్యార్థులు సమీక్ష నిర్వహించారు. ఇందుకు గాను వివిధ హోదాల్లో ఉన్న వారితో పాటు కింది స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వారు సైతం తాము చదువుకున్న పాఠశాల ఆభివృద్ధి కోసం నెలనెలా తమకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
జమ చేసిన డబ్బులతో పాఠశాలను, సర్పంచ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి శంకరన్ జయంతి రోజు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థుల కన్వీనర్లు రాహుల్, కిరణ్, ప్రధాన కార్యదర్శి మోజెస్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.