పాత పుస్తకం.. కొత్త పాఠం!
♦ ఈ విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కొత్త తరగతులు
♦ పుస్తకాలు సమకూర్చడంపై విద్యాశాఖ మల్లగుల్లాలు
♦ ప్రస్తుతం ముద్రణ షురూ, పంపిణీకి మరింత సమయం
♦ పాతపుస్తకాల సేకరణకు సిద్ధమవుతున్న అధికారులు
♦ జిల్లాలో అవసరమైన పుస్తకాలు: 20,62,012
♦ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి: 43,954
♦ మార్చి 21లోపు అందాల్సినవి: 20,18,058
♦ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విద్యావిధానం
ఉపాధ్యాయులను, విద్యార్థులను అయోమయంలో పడేసింది. సాధారణంగా జూన్ రెండో వారంలో విద్యాసంవత్సరం మొదలయ్యేది. కానీ ప్రస్తుతం మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని స్పష్టం చేసింది. మార్చి 15లోపు పరీక్షలు పూర్తిచేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని ఆదేశించింది. ఈక్రమంలో అటు వార్షిక పరీక్షల నిర్వహణతోపాటు కొత్త విద్యాసంవత్సర ప్రారంభానికి పాఠశాల యాజమాన్యాలు సమాయత్తమవుతున్నాయి. అయితే కొత్త తరగతిని ప్రారంభించేలోపు విద్యార్థులకు అందే పాఠ్య పుస్తకాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే ఈ ఏడాది తరగతులు పూర్తి చేసుకున్న వారి పుస్తకాలను కింది తరగతి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలిస్తుందో లేదోనని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటి పరిధిలో 3.45 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి సంవత్సరం సగటున 20.62 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ వద్ద కేవలం 43,954 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యేటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. మూడో వారం నాటికి విద్యార్థుల చేతిలో కొత్తపుస్తకాలు కనిపించేవి. ఈ ఏడాది విద్యాసంవత్సరం మూడు నెలల ముందుకు జరగడంతో పాఠ్యపుస్తకాల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. మరో పక్షం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. సాధారణంగా పుస్తకాల స్టాకు జిల్లా గోదాములకు చేరితే వాటిని కనిష్టంగా పక్షం రోజుల్లో మండలాలకు చేర్చవచ్చు. ప్రస్తుతం పాఠపుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. ముద్రణ పూర్తయి.. జిల్లా గోదాములకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి నూతన పాఠ్య పుస్తకాలు అందడం కష్టమే.
పాత పుస్తకాలే దిక్కు..
ఈనెల 15వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ తర్వాత వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోపు పాఠ్యపుస్తకాలు అందడం కష్టమని భావించిన విద్యాశాఖ పాతపుస్తకాల సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈమేరకు మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ముగించుకున్న విద్యార్థుల నుంచి పాఠ్యపుస్తకాలు సేకరించి.. వాటిని కొత్త తరగతిలో అడుగుపెట్టే వారికి అందజేయాలని ఆయన సూచించారు. దీంతో కొత్త విద్యాసంవత్సరం పాత పుస్తకాలతోనే ప్రారంభం కానున్నట్లు అవగతమవుతోంది.