విశాఖ విద్య: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ ప్రయోగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు (డీఎస్‌వో), ఎస్‌సీఈఆర్టీ, యునిసెఫ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, సమగ్ర శిక్ష విభాగాలకు చెందిన నోడల్ అధికారులతో కూడిన బృందాన్ని మహారాష్ట్రలోని పుణే సమీపాన పాబల్ అనే గ్రామంలో ఉన్న విజ్ఞాన ఆశ్రమానికి పంపించింది.
కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న విజ్ఞాన ఆశ్రమంలోని సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన ఫ్యాబ్ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక వర్క్‌షాప్‌లో ఈ బృందం పాల్గొన్నది. నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో నిపుణుల అనుభవాలు, సూచనలు తెలుసుకోవడంతోపాటు ఫ్యాబ్ ల్యాబ్‌లో స్థానికంగా లభించే ముడిసరుకుతో విద్యార్థులు వినూత్న పరికరాలను ఎలా తయారు చేయాలి... అవి స్థానిక ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి... అనే అంశాలపై జిల్లా సైన్స్ అధికారులు అధ్యయనం చేయనున్నారు.
అనంతరం జిల్లా సైన్స్ అధికారుల నేతృత్వంలో అన్ని జిల్లాల్లోనూ డివిజన్, మండలాల వారీగా పాఠశాలల్లో సదస్సులు ఏర్పాటుచేసి ఫ్యాబ్ ల్యాబ్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ నమూనాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు ఇతర రాష్ట్రాలకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని ఉమ్మడి విశాఖ, కృష్ణా జిల్లాల సైన్సు అధికారులు కప్పాల ప్రసాద్, మైనం హుస్సేన్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల ల్యాబ్‌లలో ఉత్తమ ఫలితాలు
రాష్ట్రంలోని 713 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యాన ఇప్పటికే అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణితం వంటి అంశాల్లో విద్యార్థులను వినూత్న ఆలోచనలవైపు మళ్లించేలా తర్ఫీదు ఇస్తున్నారు.
ఈ ల్యాబ్‌ల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి ‘నాడు–నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా ఇంగ్లిష్ మీడియం చదువుతోపాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులు రాణించేలా పాఠశాలల్లోని ల్యాబ్‌లు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment