మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
టీచర్లు లేక.. వలంటీర్లు రాక బడులకు తాళం
టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు..
విద్యార్థులున్న చోట టీచర్లు కరువు!
ఇదీ అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి
అల్లాదుర్గం(మెదక్): నాణ్యమైన విద్య, సకల సదుపాయాలతో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెప్పే మాటలు.. ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులు ఉన్న పాఠశాలలో టీచర్లు లేకపోవడం.. అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి.
మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు
అల్లాదుర్గం మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 22, జెడ్పీ పాఠశాలలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు 6 ఉన్నాయి. మండలంలో 10 పాఠశాలలకు టీచర్లే లేరు. విద్యా వలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు. 10 పాఠశాలల్లో 6 పాఠశాలల్లో మాత్రమే ఒక్కో వలంటీర్ విధుల్లో చేరారు. సీతానగర్ తండా, అప్పాజిపల్లి తండా, చౌటాక్‌తండా, నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలకు వలంటీర్ పోస్టులు మంజూరైనా ఎవరూ జాయిన్ కాలేదు. దీంతో ఆయా పాఠశాలలు మూతపడ్డాయి. ఏడుగురు విద్యావలంటీర్లు జాయిన్ కాలేదు. మండల పరిధిలోని పల్లెగడ్డ పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతిలో 1, మూడో తరగతిలో 1 విద్యార్థి ఉన్నారు. బుధవారం ఇద్దరు విద్యార్థులు రాకపోవడంతో ఉపాధ్యాయుడు మాత్రమే విధులకు హాజరయ్యారు. నీలకంఠిపల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదు.
రెడ్డిపల్లిలో ప్రస్తుతం 20 మందే..
రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల క్రితం 200 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లతో కళకళలాడింది. నేడు ఒక విద్యావలంటీర్, 20 మంది విద్యార్థులతో అధ్వానంగా మారింది. సీతానగర్ పాఠశాలలో 50 మందిపైగా విద్యార్థులు ఉండగా ఒక్క టీచర్ కూడా లేరు. ఒక వలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికైన ప్రభుత్వ పాఠశాలల్లో అమసరం మేరకు టీచర్లు, విద్యావలంటీర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.