సర్కారు బడి.. అమెరికా చదువు
అమెరికా విద్యావిధానం తరహాలో యాప్, టీవీ ఆన్ వీల్స్‌కు రూపకల్పన
► సర్కారీ బడి.. గవర్నమెంటు స్కూలా అంటూ తేలికైన భావం.. అక్కడ విరిగిన కుర్చీలు.. ఒరిగిన బెంచీలు.. పగిలిన పైకప్పులు.. ఇక పిల్లల చదువుల సంగతి చెప్పనక్కర్లేదు.. దాదాపుగా ఎవరికైనా ఇదే ఒపీనియన్..
► ఓసారి గండి మైసమ్మ దుండిగల్ మండలం మల్లంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి చూడండి.. అక్కడ విద్యార్థులు టీవీల్లో పాఠాలు వింటుంటారు.. ట్యాబ్‌లు చేతపట్టుకుని.. యాప్‌ల సాయంతో పాఠాలను అభ్యసిస్తూ ఉంటారు..
తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఓ ఎన్నారై కల ఇక్కడ సాకారమవుతోంది.. నగరంలోని ప్రగతినగర్‌కు చెందిన దుబ్బాక నిఖిల్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. అక్కడే స్థిరపడ్డారు. భారత్‌తో పోలిస్తే అమెరికాలో విద్యాబోధన ఎంతో మెరుగ్గా ఉంటుందనేది నిఖిల్ అభిప్రాయం. అక్కడ బట్టీ విధానం ఉండదు. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను అక్కడే ప్రాక్టికల్స్‌లా చేసేస్తుంటారు. ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని గుర్తించిన నిఖిల్... చిరు ప్రయత్నంగా అమెరికా విధానాన్ని ఇక్కడ కూడా ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం రెండేళ్లు శ్రమించారు. దాంతోపాటు ట్యాబ్‌ల్లో ఆఫ్‌లైన్‌లో వీడియోలు చూసుకొనేలా పాఠ్యాంశాల యాప్‌లు రూపొందించారు.
ముఖ్యంగా మ్యాథ్స్‌లో ఫార్ములాలు, హిందీ, ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీ, సైన్స్, సోషల్ సబ్జెక్టుల అంశాలతో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా తన సొంత ఖర్చుతో యాప్‌లు రూపొందించారు. దీనికితోడు... బ్లూటూత్ కనెక్షన్‌తో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లను అనుసంధానం చేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పేలా టీవీ ఆన్ వీల్స్‌ను తయారు చేశారు. అలాగే.. ప్రగతినగర్‌లోని పీపుల్స్ ప్రాజెక్ట్ ట్రస్ట్, గుమ్మడిదలలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లోని విద్యార్థులకూ ట్యాబ్‌లను అందజేశారు.
– హైదరాబాద్
భవిష్యత్తులో మరిన్ని
అమెరికాలో చదువుకు మన దేశంలో చదువులకు ఎంతో తేడా ఉంది. ఇక్కడ ఎక్కువగా పిల్లలతో బట్టీ పట్టిస్తారు. దాని వల్ల వారికి ఉపయోగం ఉండదు. పాఠ్యాంశాలు వంటబట్టవు. ముఖ్యంగా కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం టీవీ ఆన్ వీల్స్, యాప్‌లను రూపొందించా. దాతలు సహకరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తా.
– నిఖిల్‌రెడ్డి