సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పేదరికం సమసిపోవాలంటే దానికి విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనడానికి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గతనెలలో 15 రోజులపాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అమెరికా పర్యటన ద్వారా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి మీకు ఆ అనుభవాలు ఉపయోగపడతాయి.
ప్రపంచస్థాయికి ఎదగాలన్న కోరిక మీకు మరింత గట్టిపడుతుంది. ఈ పర్యటన మీ మనసులో ఒక ముద్ర వేస్తుంది. ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? ఎంత వెనుకబడి ఉన్నాం? అనేది అర్థమవుతుంది. ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. మనం చాలా వెనుకబడి ఉన్నాం.. ప్రపంచంతో మనం పోటీపడి నిలబడాలి. అప్పుడే మన బతుకులు మారతాయి. ఇందుకు చదువు ఒక్కటే సాధనం’ అని విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. విద్య అనే సాధనం ద్వారా పెద్ద పెద్ద కలలను కనాలని సూచించారు. ఆ కలల నుంచే వాస్తవాలు సాకారం అవుతాయన్నారు.
ఇప్పటి నుంచే తెలుసుకోవాలి..
విద్యార్థులు చూసిన కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 350 కాలేజీల్లో 21 కోర్సుల్లో సీటు సాధిస్తే ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం జగన్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సంబంధిత కాలేజీల్లో ఫీజులు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ ఉంటాయన్నారు. వీటిలో సీటు తెచ్చుకుంటే జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా రూ.1.25 కోట్ల వరకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ‘సీఈవో వంటి స్థాయికి వెళ్లాలంటే ప్రతిభ, నైపుణ్యం ఉండాలి. మనం చదివే చదువులవల్లే ఇవి వస్తాయి. ప్రపంచ అత్యుత్తమ కాలేజీల్లో చదువుకోవడం ద్వారా మీ నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు మీకు మంచిస్థానాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి.
తద్వారా మీ జీవితాలు మారతాయి. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం కోసం, సీటు సాధించేందుకు మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’ అని సీఎం జగన్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ‘మీకు ఆసక్తి ఉన్న కోర్సు ఏంటి? ప్రపంచంలో ఈ కోర్సును అందిస్తున్న అత్యుత్తమ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి?’ అనేది ఇప్పటి నుంచే తెలుసుకోవాలని సూచించారు. ఆ కాలేజీల్లో సీటు రావాలంటేం ఏయే పరీక్షల్లో ఎన్ని మార్కులు రావాలో కూడా తెలుసుకోవాలన్నారు. జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్ వంటి పరీక్షలు ఏమున్నాయో.. వాటికి ఎలా సన్నద్ధం కావాలో తెలియాలన్నారు.
జీఆర్‌ఈ, జీమ్యాట్‌లకు కూడా ఉచిత శిక్షణ
టోఫెల్‌కు ఎలా తీసుకువచ్చామో.. అలాగే జీఆర్‌ఈ, జీమ్యాట్‌లకు కూడా మెటీరియల్, ఉచిత శిక్షణను విద్యార్థులకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొలంబియా యూనివర్సిటీ, వార్టన్, ఎల్‌ఎస్‌ఈ, ఇన్‌సీడ్.. ఇలాంటి యూనివర్సిటీలు, కాలేజీలు 350 ఉన్నాయని.. వీటిలో సీటు సాధించాలని హితబోధ చేశారు. ఆ కాలేజీల్లో కోర్సులు పూర్తి చేశాక విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయన్నారు.
ఇది సాకారమైతే మీ, మీ కుటుంబాల బతుకులు మారడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారవుతారన్నారు. అంతేకాకుండా మీ స్థాయిలో మరో పది మందికి సహాయపడొచ్చని విద్యార్థులకు సీఎం హితబోధ చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. ‘ఇక్కడున్న ఈ పిల్లలు చిన్నప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాలని కలలు కని ఉంటారు.. చాలా మందికి సీట్లు వచ్చాయి. ఆ విజన్ అక్కడితో పూర్తయ్యింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నుంచి తర్వాత ఎక్కడికి అనేది విజన్ కావాలి’ అని సీఎం పేర్కొన్నారు.
పాఠ్య ప్రణాళికలోకి 1,800 సబ్జెక్టులు
మన పాఠ్యప్రణాళికలో లేని 1,800 సబ్జెక్టులను పాఠ్యప్రణాళికలోకి తెస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎంఐటీ, హార్వర్డ్ వంటి యూనివర్సిటీ నిపుణులతో తయారు చేయించిన సబ్జెక్టులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎడెక్స్‌తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఈ కోర్సులు చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ కూడా లభిస్తుందన్నారు.
ఈ కోర్సులు నేర్చుకోవాలని.. దీనివల్ల ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ‘మీరు ఇలా విదేశాలకు వెళ్లి బయటి ప్రపంచం చూసినప్పుడు మరింత కష్టపడాలన్న స్ఫూర్తి మీలో కలుగుతుంది. ఈ పర్యటన మీకు మాత్రమే కాకుండా, మీ వల్ల ఇతరులకు కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఒక స్థాయిలో ఉన్న మనం బాగా కష్టపడటం ద్వారా మరో స్థాయికి చేరుకుంటాం. మన కష్టమే మనల్ని పై స్థానాలకు తీసుకెళుతుంది. మీ అందరికీ అభినందనలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
పర్యటన ఎలా జరిగింది?
అమెరికాలో పర్యటించిన విద్యార్థులు శివలింగమ్మ, చంద్రలేఖ, గణేశ్, జ్యోత్స్న, రాజేశ్వరి, గాయత్రి, రిషితారెడ్డి, యోగీశ్వర్, షేక్ అమ్మాజాన్, మనస్వినిలతోపాటు వారి తల్లిదండ్రులను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), కొలంబియా యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ‘ఆణిముత్యాలు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 126 మంది విద్యార్థులను గుర్తించి వారికి పోటీపరీక్ష నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల భాషా పరిజ్ఞానాన్ని పరిశీలించి అమెరికా పర్యటనకు 10 మందిని ఎంపిక చేశామని సీఎంకు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం.. అమెరికా పర్యటన ఎలా జరిగిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజనం డైరెక్టర్ నిధి మీనా, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఐక్యరాజ్యసమితి సభ్యులు ఉన్నవ షకిన్ కుమార్, మంగ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అదృష్టంగా భావిస్తున్నా..
ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నేను మహిళా సాధికారత, బాలికా విద్యపై ప్రసంగించాను. మీ విజన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మాకు చక్కటి అవకాశం కల్పించారు.. థ్యాంక్యూ సార్. – రాజేశ్వరి, విద్యార్థిని
అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశమిచ్చారు..
మాకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించారు. విద్యా వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన మార్పులన్నీ వివరించాం. మేం విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదు.. కానీ మీరు సాధ్యం చేశారు. మీరు చెప్పిన ‘వన్ చైల్డ్.. వన్ టీచర్.. వన్ పెన్.. వన్ బుక్.. కెన్ చేంజ్ ద వరల్డ్’ మాటకు తిరుగులేదు.. మీ నమ్మకాన్ని నిలబెడతాం సార్. – అల్లం రిషితారెడ్డి, విద్యార్థిని
యూఎన్‌వోను మీ వల్ల నిజంగా చూడగలిగా..
నేను యూఎన్‌వో గురించి సోషల్ బుక్స్‌లో చదువుకున్నాను. దాన్ని మీ వల్ల నిజంగా చూడగలిగాను. థ్యాంక్యూ సార్. ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుందనేది నేను అమెరికాలో వివరించాను. – వంజివాకు యోగీశ్వర్, విద్యార్థి
ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలబెట్టారు..
కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అక్కడంతా ఆశ్చర్యపోయారు. మేం ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలబెట్టారు. – సామల మనస్విని, విద్యార్థిని
మీ గొప్ప ఆలోచన వల్లే..
విద్యావ్యవస్థలో చాలా మంచి మార్పులు తెచ్చారు. మీ గొప్ప ఆలోచన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ రోజు మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉందంటే అది మీ వల్లే. థ్యాంక్యూ సీఎం సార్. – షేక్ అమ్మాజాన్, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment