పేదింటి బిడ్డకు విదేశీ విద్య.. ‘అమెరికా వెళ్తుందని ఊహించలేదు’ | - | Sakshi
Sakshi News home page

పేదింటి బిడ్డకు విదేశీ విద్య.. ‘అమెరికా వెళ్తుందని ఊహించలేదు’

Published Mon, Sep 4 2023 1:26 AM | Last Updated on Mon, Sep 4 2023 1:03 PM

- - Sakshi

ప్రకాశం: వారిది రెక్కాడితే కానీ.. డొక్కాడని పేద కుటుంబం. తమ కుమార్తె బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అయితే ఇంటర్‌ సెకండియర్‌లోనే అమెరికా వెళ్లి తమ కుమార్తె చదువుతుందని కలలో కూడా ఊహించలేదు. అమెరికాకు వెళ్లారని ఎవరైనా చెబితే వినడమే తప్ప తమ కుమార్తె స్వయంగా అమెరికాకు వెళ్తుందని కళాశాల ప్రిన్సిపల్‌ చెప్పేదాకా తెలియదు. రాష్ట్ర విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల చదువుకు, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా పేదింటి అమ్మాయి అమెరికా చదువుకు ఎంపికై ంది.

కెన్నడీ లూగర్‌ –యూత్‌ ఎక్సేంజ్‌ అండ్‌ స్టడీ (కేఎల్‌–వైఈఎస్‌) కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా అందులో మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థిని దారా నవీన ఎంపికై ంది. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెందిన దారా కేశయ్య, ఆదిలక్ష్మమ్మల కుమార్తె నవీన 1 నుంచి 4వ తరగతి వరకూ స్వగ్రామమైన పుచ్చకాయలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. 5 నుంచి ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ వరకూ రాయవరం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోంది.

10వ తరగతిలో 541 మార్కులు రాగా, ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ విభాగంలో 470 కి గానూ 418 మార్కులు సాధించింది. విదేశీ విద్య పథకం కింద ఎంపికై న నవీన అమెరికాలోని మేరీ ల్యాండ్స్‌ స్టేట్‌లో డెల్టాస్‌ విల్‌ ప్రాంతంలోని హైపాయింట్‌ హైస్కూల్‌లో 10 నెలల పాటు చదువుకోనుంది. ఇందుకయ్యే ఖర్చంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష రూపాయల చెక్కుతోపాటు ట్యాబ్‌, విమాన టికెట్స్‌ను అందించారు. కెన్నడీ లూగర్‌–యూత్‌ ఎక్సేంజ్‌ అండ్‌ స్టడీ ప్రోగ్రాంను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది.

ఇందులో ఎంపికై న విద్యార్థులు 10 నెలల పాటు అక్కడే చదువుకుంటారు. ఒక్కొక్క విద్యార్థికి నెలకు 200 డాలర్లను స్టైఫండ్‌గా అందిస్తారు. రాబోయే పదిరోజుల్లో ఆమెరికాకు వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, బ్యాగ్‌లు, దుస్తులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులు ఎంపిక కాగా మన రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.

అమెరికా వెళ్తుందని ఊహించలేదు..
తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, కేశయ్యలు మాట్లాడుతూ తమ కుమార్తె దేశాలు దాటి అమెరికాకు వెళ్తుందన్న ఆలోచనే సంతోషాన్నిచ్చిందని తెలిపారు. పెద్ద చదువులకు అమెరికాకు వెళ్తుంది అనుకున్నామే కానీ ఇంటర్‌లోనే అమెరికాకు వెళ్తుందని ఊహించలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement