ఒంగోలు టౌన్: హఠాత్తుగా తీవ్రమై గుండెపోటు వచ్చిన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తేగాని బతికించలేం..చాలా సందర్భాల్లో సత్వర చికిత్స అందకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణాలు సంభవిస్తున్నాయి. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కోట్లాది రూపాయిలు కేటాయించి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. తాజాగా పేదల గుండెకు రక్షణ ఇచ్చేందుకు ఇటీవల స్టెమీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
గుండెపోటు వచ్చిన వారి ఈసీజీలో మార్పులను వైద్య పరిభాషలో ఎస్టీ ఎలివేషన్ అంటారు. అందుకే ఈ కార్యక్రమానికి ఎస్టీ ఎలివేషన్‌లోని తొలి ఆంగ్లాక్షరాలతో స్టెమీ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న వంద మంది వైద్యులు, నర్సులకు గుండెకు సంబంధించి ప్రథమ చికిత్సలు, పరీక్షలు చేయడంలో శిక్షణ ఇచ్చారు. గుండెనొప్పితో ఆస్పత్రికి వచ్చిన రోగులకు తొలుత ఈసీజీ తీసి గుండె జబ్బును నిర్ధారిస్తారు. గుండెపోటు వచ్చిందని నిర్ధారణ జరిగితే వెంటనే ప్రథమ అవసరమైన చికిత్స చేస్తారు.
అక్కడి నుంచి దగ్గరలో ఉండే టెరిటరీ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ లోగా రిపోర్టును మొబైల్, రిఫరల్ లెటర్ ద్వారా సమాచారం అందిస్తారు. వెంటనే ఇంజక్షన్ చేసి ప్రాణాపాయం లేకుండా కాపాడతారు. ప్రస్తుతం జిల్లాలో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో స్టెమీ సౌకర్యం అందుబాటులో ఉంది. త్వరలోనే జిల్లా వ్యాపంగా ఏరియా ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్‌లో ఒంగోలు రిమ్స్‌లో స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 12 మందికి అత్యవసర వైద్యంతో ప్రాణాలను కాపాడారు.
త్వరలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు...
గుండెపోటు వచ్చిన రోగులను గుంటూరుకు రెఫర్ చేయాల్సి వస్తోంది. రిమ్స్‌లో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుతో ఇక్కడే యాంజియోగ్రామ్, స్టెంట్, బైపాస్‌లను పూర్తిగా ఉచితంగా చేయనున్నారు. రిమ్స్ కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్య సౌకర్యాలు ఉన్నాయి. కార్డియాలజిస్టుతో పాటుగా కార్డియాలజీ టెక్నీషియన్, ఈసీజీ, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారు. హౌస్‌సర్జన్లు, ట్రైనీ నర్సులు ఉన్నారు. మిగిలిన సిబ్బందిని కూడా భర్తీ చేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment