Prakasam District News
-
కూటమి ప్రభుత్వం
రైతులకు అర్ధ రూపాయి విదల్చని యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వం ఏర్పడి అర్ధ సంవత్సరం దాటుతున్నా రైతులకు అర్ధ రూపాయి కూడా విదల్చకుండా మోసపు మాటలతో కాలం గడుపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలతోపాటు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి కలెక్టరేట్లలో అర్జీలు ఇచ్చామని చెప్పారు. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని మోసపు మాటలు చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటను విస్మరించారని, ట్రూ అప్ పేరుతో కరెంటు చార్జీలను అధికంగా పెంచారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే సదుపాయాన్ని కూడా తిలోదకాలుఇచ్చి పాతబకాయిలు కూడా కట్టాలని మెమోలు జారీ చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం విధానాలపై నెల 27వ తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని, పేదవారిని ఆర్థికంగా కుదేలు చేస్తున్న ఈ ప్రభుత్వం చర్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలతో ర్యాలీ చేపడుతున్నామని వెల్లడించారు. కూటమి నాయకులు విచ్చలవిడిగా బరితెగించి తక్కువ ధరలకు ఇసుక అమ్మకాలు జరిపే వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున ఇసుక నిలువలకు పాల్పడుతోందన్నారు. టన్ను ఇసుక రూ.1200 నుంచి రూ.1500కు అమ్ముతున్నారని అన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని, అప్పటికీ చర్యలు తీసుకోకపోతే ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి అయిన వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, నీటి నిలువ చేసుకునేందుకు ఖర్చుపెట్టాలని డిమాండ్ చేశారు. తాగు, సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు కేటాయించి వెలిగొండ టన్నెల్ ద్వారా నీరు పారేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే యర్రగొండపాలెం నుంచి ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడతామని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేస్తున్న తప్పిదాలే ప్రధాన కారణమన్నారు. మరోసారి కలెక్టర్‌తో కలిసి నీటి సమస్య, కమీషన్ల ప్రోత్సాహం గురించి చర్చిస్తానని చెప్పారు. రేషన్ మాఫియా, బెల్ట్ షాపులను కట్టడి చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సమస్యలపై కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నేడు జరిగిన జగనన్న జన్మదిన వేడుకలను చూస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా అన్నట్లు అనిపించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా ప్రజలు ముందుకొచ్చి కార్యక్రమాలు జరిపారని చెప్పారు. విద్యుత్ చార్జీలను పెంచి మాటతప్పిన పచ్చ పార్టీ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1100 కోట్లు కేటాయించి తాగు, సాగు నీరందించాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
వర్ధిల్లు నూరేళ్లు..
ప్రగతి ప్రదాతా..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తమ ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శనివారం ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పండుగలా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు కేక్ కట్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేలాది మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల బ్రహ్మానందరెడ్డి జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు రక్తదానం చేశారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ జగనన్న పుట్టిన రోజు వేడుకలను తెలుగు వారంతా ఘనంగా నిర్వహించారన్నారు. ప్రజల కోసం ప్రజల నుంచి పుట్టినవాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రజా నాయకుడి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోందన్నారు. జనం పక్షాన నిలిచి వారి సమస్యల కోసం పోరాడుతోందని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారన్నారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మళ్లీ సీఎం గా వైఎస్ జగన్ రావాలని కోరుకుంటున్నారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ జననేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ సంక్షేమ సారథి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఒంగోలు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరు కలిసికట్టు గా సమైక్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు నందకిషోర్, టాస్క్ఫోర్సు జిల్లా ఇన్చార్జ్ కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, తదితరులు జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా వేడుకలు ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. ● దర్శిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జగనన్న పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. 100 మంది వైఎస్సార్సీపీ అభిమానులు రక్తదానం చేశారు. అంతకుముందు గడియారం స్తంభం సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● టంగుటూరులో నిర్వహించిన జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ● మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. పొదిలి పట్టణంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి నివాసంలో కేక్ కట్ చేశారు. మార్కాపురం పట్టణంలో పాతబస్టాండ్ లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. తూర్పువీధిలో అన్నదానం చేశారు. మార్కాపురం పట్టణంలోని జంకె వెంకటరెడ్డి నివాసంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో అన్నా రాంబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ అలీబేగ్, మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగనన్న పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంట్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరలు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. ● కనిగిరిలో జగనన్న జన్మదిన వేడుకలను కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 4 వేల మందికి చీరలు పంపిణీ చేశారు. 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ● సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు రక్తదానం, అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చెవిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలకు చీరల పంపిణీ కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు హ్యాపీబర్త్‌డే జగనన్న అంటూ నినాదాలు నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం -
జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
త్రిపురాంతకం: జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సివిల్ సప్లై డీఎం జీ వరలక్ష్మి తెలిపారు. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఆమె మాట్లాడుతూ జిల్లాలో 13 రైస్‌మిల్లుల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. ఇప్పటి వరకు 1100 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. 150 మంది రైతులకు రూ.1.50 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. 50 శాతం రైతులకు చెల్లింపులు జరిగాయని, సకాలంలో చెల్లిస్తారన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలు పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరలక్ష్మి తెలిపారు. జిల్లా వైద్యాధికారిగా వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా తెలగతోటి వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ గా చేస్తున్నారు. గతంలో ఆయన ప్రకాశం జిల్లాలో ప్రాజెక్ట్ ఆఫీసర్ డిస్టిక్ట్ ట్రైనింగ్ టీమ్ (పీఓడీటీ)గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షునిగా కూడా చేశారు. అద్దంకికి చెందిన ఆయనకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి రవి ఆయనకు మాట ఇచ్చిఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమధ్య పూర్వ డీఎంహెచ్ఓ రత్నావళికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆమెకు రికమెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆమెకు ఆర్డర్ వేసిన కొద్ది సేపటికే రద్దు చేయడం చర్చనీయాంశం అయింది. మంత్రి రవి అభ్యంతరం చెప్పడం వల్లనే ఆమెకు ఇచ్చిన పోస్టింగ్ నిలిపేసినట్లు వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులు గుసగుసలాడారు. అప్పుడే వెంకటేశ్వరరావు వస్తారని ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లే ఇప్పుడు వెంకటేశ్వర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టానున్నారు. -
పేదల సంక్షేమానికి పాటుపడిన వైఎస్ జగన్
● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ ఒంగోలు వన్‌టౌన్: పేదల సంక్షేమం కోసం పాటు పడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నగర ఉపాధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన మహోన్నత వ్యక్తి జగన్ అని కొనియాడారు. 32 సంక్షేమ పథకాల ద్వారా పేదలను అక్కున చేర్చుకున్నారన్నారు. ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఏసుప్రభువు నేర్పింది ఒక మంచి జీవన విధానం, మంచి మార్గం అన్నారు. ప్రేమ, దయతో, కరుణతో ఉంటే ఎటువంటి కష్టాలు లేకుండా జీవించవచ్చని తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పే వ్యక్తి జగన్ కాదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. చంద్రబాబు సూపర్ 6 అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, ఏమీ చేయడంలేదన్నారు. కార్యక్రమం అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఎక్స్ జెడ్పీటీసీ లంకపోతు అంజిరెడ్డి, 11వ డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్, 14వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ ఇమ్రాన్, కోఆప్షన్ సభ్యురాలు ఎస్కె రషీదా, 15వ డివిజన్ ఇన్చార్జి మాసపల్లి రాజేష్, యరిచర్ల రాజు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కంభంలో చోరీ ●
● రూ.లక్షన్నర నగదు, వెండి వస్తువుల అపహరణ కంభం: ఓ ఇంట్లో దొంగలు పడి రూ.లక్షన్నర నగదు, మూడు వెండి గిన్నెలు అపహరించుకెళ్లిన సంఘటన కంభం పట్టణంలోని అంకాళమ్మవీధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కంభం సచివాలయం–2 సమీపంలో నివాసం ఉంటున్న గంజి చిన్నవెంకటేశ్వర్లు మార్కాపురంలో ఓ శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం తిరిగి ఇంటికి రాగా తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. మార్కాపురం క్లూజ్ టీమ్ సభ్యులు చేరుకుని వేలిముద్రలు సేకరించారు. బాధితుడు మాట్లాడుతూ అరటి గెలలు అమ్మగా వచ్చిన డబ్బును అప్పులు తీర్చే నిమిత్తం ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. ఊరికి వెళ్తూ వరండాలో తాళం చెవి దాచిపెట్టి వెళ్లామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కంభంలో చోరీలు అధికంగా జరుగుతుండటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. దామచర్ల అవినీతిపై లేఖాస్త్రం ● ఎమ్మెల్యే దామచర్లపై సీఎంకు ఫిర్యాదు ? సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమేరకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్న లేఖ రెండు రోజులుగా వాట్సప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. అయితే ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు సీఎంకు ఫిర్యాదు చేశారా? లేక ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు లేఖ సృష్టించి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా అనేది సందేహంగా మారింది. టీడీపీ అభిమానులే ఈ ఫిర్యాదు చేసి ఉంటే ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందన్నది తెలియాల్సి ఉంది. ఈ లేఖ విషయంపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ.5 లక్షల ఆస్తి నష్టం ముండ్లమూరు (దర్శి): పొగాకు బ్యారన్ దగ్ధమై రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితులు సుంకర బ్రహ్మానందరెడ్డి, సుంకర రమణారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. బ్యారన్లో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. లోపలున్న సామగ్రి, పొగాకు దగ్ధమైంది. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈలోగా మోటార్ల ద్వారా నీరు చల్లి మంటలు ఆర్పాలని ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. బ్యారన్‌తో పాటు పొగాకు పూర్తిగా దగ్ధమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
జననేతకు జేజేలు..
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు, ప్రజా సంక్షేమ సారథి జన్మదినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. వాడవాడలా కేక్ కటింగ్‌లు, సేవా కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జగనన్నకు జేజేలు అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. – సాక్షి, ఒంగోలు -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
● పారిశుధ్య పనులు నిర్వహించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు అర్బన్: పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యతని, అందరూ వారి నివాసాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా కోరారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్లో జేసీ రోణంకి గోపాలకృష్ణతో కలిసి పారిశుధ్య పనులను కలెక్టర్ నిర్వహించారు. స్వయంగా చీపుర్లు పట్టి కలెక్టరేట్లోని చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. జాయింట్ కలెక్టర్ కొడవలి చేతబట్టి కలుపు మొక్కలు తొలగించి చెత్తను టబ్‌లోకి ఎత్తి మున్సిపల్ ట్రాక్టర్ల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్లీన్ ప్రకాశం–గ్రీన్ ప్రకాశం నినాదంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల మూడో శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైల్స్ క్లియర్ చేసే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్ల నిర్వహణపై కూడా ప్రత్యేక దృషి సారిస్తామన్నారు. పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ చినఓబులేసు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
కంభం: రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కంభం రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కంభం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తించారు. అతని జేబులో ఒక హాస్పిటల్ రసీదు ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం అతని పేరు జి.ప్రకాష్ అని తెలిసింది. అతనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియరాలేదు. మృతుడు చామనచాయ రంగు కలిగి తెల్లని చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు నంద్యాల రైల్వే ఎస్సై (9440627653, 7702650514)కి సమాచారం ఇవ్వాలని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
దర్శి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన దర్శిలోని పొదిలి రోడ్డులో శనివారం జరిగింది. దర్శి పట్టణంలోని ఓ హోటల్లో పనిచేసే చల్లా శివప్రసాద్ (28) స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు సంతనూతలపాడు: బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, మహిళా ప్రాంగణం సంయుక్త ఆధ్యర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి సంతనూతలపాడులోని ఎండ్లూరు డొంక వద్ద గల మహిళా ప్రాంగణంలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 15 నుంచి 45 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ షేక్ బాషా (99630 05209)ను సంప్రదించాలని కోరారు. -
ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించడంలో రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. వ్యవసాయ, సివిల్ సప్లయిస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణతో కలిసి ధాన్యం సేకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని విక్రయించే క్రమంలో అధికారుల నుంచి ఇబ్బందులు పడినట్లు, వర్షాలతో పంట ఉత్పత్తులు కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు రైతుల నుంచి ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అధికారులు మరింత చుకుగ్గా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఎంత, ఇప్పటి వరకు ఎంత మోతాదులో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చారు, ఇంకెంత రావాల్సి ఉందనే అంశాలపై అధికారులకూ పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను జనవరి 15వ తేదీ నాటికి భర్తీ చేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమాలపై నమోదు చేస్తున్న కేసులపై ఆరా తీశారు. రేషన్ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడే వారికి భయం ఏర్పడేలా రైస్ మిల్లులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సివిల్ సప్లయిస్ డీఎం వరలక్ష్మి, డీఎస్ఓ పద్మశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ ఉపేంద్ర, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీళ్లివ్వండి సారూ..
● ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళల బైఠాయింపు పెద్దదోర్నాల: వారం రోజుల నుంచి తమ కాలనీలో తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్లు కూడా రావటం లేదంటూ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన మహిళలు శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ కాలనీకి కొళాయిల ద్వారా కానీ, ట్యాంకర్ల ద్వారా కానీ నీరు అందటం లేదని, నీరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఇక్కడ నుంచి కదలమని ఖాళీ బిందెలతో అక్కడే భీష్మించుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి శివకోటేఽశ్వరరావు కాలనీకి నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మహిళలకు నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు మాండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐక్య ఉద్యమాలతో ఆర్టీసీని కాపాడుకుందాం ఒంగోలు టౌన్: ఐక్య ఉద్యమాలతో ఆర్టీసీని కాపాడుకుందామని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యం.అయ్యపురెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా మహాసభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మహిళా కార్మికులకు డిపోలో సౌకర్యాలను కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వన్ బై 19 సర్క్యులర్‌ను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం.రమేష్, జివి కొండారెడ్డి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు ఎస్కె మీరావలి, పీరా వలి, బ్రహ్మయ్య, జీవి సుజాత, కాశీరత్నం, ఉప్పుటూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రివిజన్ వర్క్‌షాపు నిర్వహణ ఒంగోలు సిటీ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఛాత్రోపాధ్యాయులకు రివ్యూ, రివిజన్ వర్క్‌షాపు సబ్జెక్టు నిష్ణాతులతో శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించినట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వివిధ సబ్జెక్టులైన ఫిలాసఫీ, గణితం, ఆంగ్లం, సైకాలజీ తదితరాలకు సంబంధించిన కీలక అంశాలు, కాన్సెస్ట్ పై వర్క్‌షాపు నిర్వహించినట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు నిర్వహణలో సబ్జెక్టు నిపుణులుగా బిక్షాలురెడ్డి, ఎం.ఎన్.కె.శర్మ, పి.మెర్సిన్బాబు, వై.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు వ్యవహరించారు. అనంతరం సబ్జెక్టు నిపుణులంతా ప్రిన్సిపాల్ సామా సుబ్బారావును సన్మానించారు. జీజీహెచ్‌లో ఈఎన్జీ వైద్య పరికరం ఒంగోలు టౌన్: ఈఎన్టీ విభాగానికి సంబంధించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఎలక్ట్రానిస్టాగ్మోగ్రఫి(ఈఎన్జీ) వైద్య పరికరాలన్ని జీజీహెచ్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు పేర్కొన్నారు. శుక్రవారం జీజీహెచ్‌లో ఈఎన్జీ వైద్య పరికరాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈఎన్జీ పరికరం ప్రస్తుతం విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడలో మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమునకు సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ మాధవీలత, ఈఎన్టీ విభాగాధిపతి ప్రభాకర్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ జన్మదినాన సేవా కార్యక్రమాలు
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కఠారి శంకరరావు మాట్లాడుతూ ఈనెల 21న వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ముఖ్య అతిథిలుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం, 9.45 గంటలకు వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు నంద కిషోర్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బ్లడ్ డొనేషన్, 10 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 11.15 గంటలకు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాతాశిశు వైద్యశాలలో ప్రూట్స్, బ్రెడ్ పంపిణీ, 11.30 గంటలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు ముళ్లంగి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలోని బధిరుల పాఠశాలలో మిక్సీ, ఫ్రూట్స్ పంపిణీ, 11.45 గంటలకు 45 వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని సున్నపు బట్టీల వీధిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు 44 వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం, 2.30 గంటలకు చింతాయగారిపాలెంలో నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు కోఆప్షన్ సభ్యుడు రషీదానాగూర్, 33వ డివిజన్ అధ్యక్షుడు పందింటి కాశీరావు ఆధ్వర్యంలో ముంగమూరు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కటింగ్, 6 గంటలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు స్టీఫెన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో కేక్ కటింగ్, 6.30 గంటలకు కొత్తపట్నం మండలంలో పేద మహిళలకు చీరల పంపిణీ చేస్తారు. 8 గంటలకు వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. జగన్ జన్మదిన వేడుకలను వాడవాడలా చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు రొండా అంజిరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, భూమిరెడ్డి రమణమ్మ, పిగిలి శ్రీనివాసరావు, సాధం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు -
నాన్న పోయారు.. ఇంటికి రా కన్నా..!
ఒంగోలు టౌన్: తప్పిపోయిన కుమారుడి కోసం రెండున్నరేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తండ్రి గుండెపగిలింది. చివరి శ్వాస దాకా కుమారుడి ఆచూకీ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన ఆ పెద్దాయన గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రి ఆఖరి చూపుకై నా కుమారుడు వస్తాడని అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని అలాగే ఉంచి ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఒంగోలు పట్టణానికి చెందిన చాకిచర్ల గోవిందరావు(56) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ పౌరోహిత్యం కూడా చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు సంతానం. అమ్మాయి నాగ పావని ఎమ్మెస్సీ చేస్తోంది. కుమారుడు వెంకటశరత్‌కుమార్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతున్నాడు. 2022 సెప్టెంబర్‌లో కుమారుడు శరత్‌కుమార్ ప్యాసింజర్ రైల్లో నూజివీడు కళాశాలకు బయలుదేరాడు. రాత్రి కావడంతో కాలేజీలోకి రానివ్వరని విజయవాడ కృష్ణలంక జంక్షన్ వద్ద దిగాడు. విజయవాడలో ఉన్న పెదనాన్న గోపాలకృష్ణ ఇంటి చిరునామా అడిగేందుకు రైలు దిగిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడాడు. అంతే ఆ తర్వాత మళ్లీ ఫోన్ రాలేదు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచ్ఛాఫ్ అనే వస్తోంది. దాంతో విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు తీసుకోలేదు. ఒంగోలులో ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఇక్కడకు వచ్చి ఎస్పీ కార్యాలయంలో సెప్టెంబర్ 20న ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం గోవిందరావు, పద్మావతి దంపతులు పోలీసు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా శరత్ ఆచూకీ లభించకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గోవిందరావు ఉంటోంది.. అద్దె ఇల్లు కావడంతో మృతదేహాన్ని బ్రాహ్మణ ఆరామక్షేత్రంలో ఉంచారు. బిడ్డ ఇంకా వస్తాడేమోనన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట తప్పిపోయిన కుమారుడు కుమారుడిపై దిగులు పెట్టుకుని గుండెపోటుతో తండ్రి మృతి మృతదేహాన్ని అలాగే ఉంచి కుమారుడి కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు -
జీఎస్డీపీ వృద్ధి రేటే లక్ష్యంగా కృషి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు అర్బన్: జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. గ్రీవెన్స్ హాలులో శుక్రవారం వ్యవసాయ అనుంబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే మూడు నెలల స్థిర లక్ష్యాలను సాధించేందుకు శాఖల ఆధ్వర్యంలో మండలాలు, డివిజనల్ వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో అగ్రి డిప్ టెక్నాలజీ వినియోగంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు మేలు జరిగేలా తగిన సలహాలు, సూచనలు స్వీకరించి కౌలు రైతు చట్టం అమలు చేయాలన్నారు. డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పంట బీమా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తూ జిల్లాలో చేపట్టిన 21వ పశు గణన కార్యక్రమాన్ని 2025 జనవరి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. మంజూరైన మినీ గోకులం షెడ్లను డ్వామా శాఖతో సమన్వయం చేసుకుని సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1200 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేలా లక్ష్యం కాగా 748.26 ఎకరాల్లో ఇప్పటి వరకు పశుగ్రాసం పెంచినట్లు తెలిపారు. మత్స్యశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై మాట్లాడుతూ నిర్దేశించిన వృద్ధి రేటు సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్టు కింద మత్స్యకారులందరినీ రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సూక్ష్మ సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. దీనిలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ బేబిరాణి, హార్టీకల్చర్ అధికారి గోపిచంద్, ఏపీ ఎంఐపీ పీడీ రమణ, సహకార శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మద్దిపాడు: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మద్దిపాడు మండలంలోని దొడ్డవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోరబోయిన పాపారావు (30) వృత్తిరీత్యా కరెంటు పనులు చేస్తుంటాడు. శుక్రవారం తన పొలంలోకి నీరు పెట్టేందుకు చెరువు గట్టునున్న మోటార్‌ను రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టి చెరువు లో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పాపారావు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. స్థల వివాదం కేసులో నిందితులకు శిక్ష నాగులుప్పలపాడు: మండలంలోని మాచవరం గ్రామంలో ఓ స్థల వివాదం కేసులో నిందితులకు శిక్షపడినట్లు స్థానిక ఎస్ఐ బి.శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాల మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన మర్రావుల సుబ్బారావు అతని భార్యతో కలిసి 2018లో వారి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి గుంతలు తీస్తుండగా, అదేగ్రామానికి చెందిన మర్రావుల శ్రీనివాసరావు, అతని భార్య పార్వతి, కుమార్తె లక్ష్మి అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. గుంతలు తీయవద్దని గొడవకు దిగి సబ్బారావు, అతని భార్యపై దాడి చేయగా వారికి తీవ్రగాయాలై ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ పూర్తవగా, ఒంగోలు జేఎఫ్‌సీఎం ఎకై ్సజ్ కోర్టు జడ్జి కోమలివల్లి ఏ–1కు రెండేళ్ల జైలు, రూ.7 వేల జరిమానా, ఏ–2కు రూ.2 వేలు, ఏ–3కి రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్ఐ వివరించారు. ఆక్రమించింది బస్‌షెల్టర్ స్థలమే.. బేస్తవారిపేట: మండల కేంద్రమైన బేస్తవారిపేటలో సర్వే నంబర్ 283/1లో బస్‌షెల్టర్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 20 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ టీడీపీ నాయకుడు ప్రయత్నించినట్లు అధికారులు నిర్ధారించారు. శుక్రవారం ఒంగోలు ఆర్టీసీ ఏఈ టి.వెంకటేశ్వర్లు సమక్షంలో సర్వేయర్ సురేష్, వీఆర్వో ఇండ్లా శేఖర్‌రెడ్డి బస్ షెల్టర్ స్థలాన్ని కొలతలు వేశారు. ఆ 20 సెంట్ల స్థలంలోనే కొంతమేర ఆక్రమించేందుకు చిల్లకంప తొలగించడంతోపాటు మెరక తోలారని గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థలానికి హద్దులు గుర్తించిన ఆర్టీసీ అధికారులు చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం చంద్రశేఖర్, సీనియర్ ట్రాఫిక్ ఇన్పేక్టర్ రామానాయక్ పాల్గొన్నారు. కాగా రూ.లక్షల విలువైన స్థలాన్ని కబ్జాకోరుల పాలుకాకుండా ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నర్సింగ్ వృత్తి పవిత్రమైనది ● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు ఒంగోలు టౌన్: నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, అత్యంత నిబద్ధత, సహానుభూతితో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ప్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ సీటు లభిస్తుందని, వృత్తిలో రాణించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ సమయంలో డాక్టర్లు, సిబ్బంది సహకారంతో విజ్ఞానాన్ని పెంపొదించుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున సూచించారు. సేవలందించే సమయంలో స్నేహపూర్వకంగా ఉంటే రోగులు త్వరగా ఉపశమనం పొందుతారని చెప్పారు. అనంతరం విద్యార్థులకు యాప్రాన్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, ఆర్ఎంఓ మాధవీలత, డిప్యూటీ సూపరింటెండెంట్లు నామినేని కిరణ్, డి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
గ్రావెల్ తరలించేందుకు ఎన్ఎస్పీ కెనాల్ పూడ్చి మరీ రోడ్డు నిర్మాణం...
మద్దిపాడు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాకే తలమానికమైన గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు, చుట్టుపక్కల గ్రామాలు, పొలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ వద్ద గ్రావెల్ తవ్వకాలకు ఓ రోడ్డు నిర్మాణ సంస్థకు అడ్డదిడ్డంగా అధికారులు అనుమతులివ్వడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఇచ్చిన అనుమతులకు మించి.. ఏకంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకే ప్రమాదం వాటిల్లేలా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకునేంత వరకూ అధికారులు మొద్దునిద్రలో ఉండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకోవడంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్ల మత్తు కారణంగానే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని రిజర్వాయర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. 2 జేసీబీలు, 50కిపైగా టిప్పర్లతో వేల టన్నుల గ్రావెల్ తరలింపు... విజయవాడ నుంచి బెంగళూరుకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఏజీఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి భారీగా మట్టి, గ్రావెల్ అవసరం కాగా, గుండ్లకమ్మ డ్యాంలోని ఫుల్ రిజర్వింగ్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) లోపలివైపు మట్టి తవ్వి తరలించుకునేందుకు ఇరిగేషన్ ఎస్ఈ అనుమతులిచ్చినట్లు తెలుస్తుంది రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో అనుమతులిచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ, మద్దిపాడు మండల పరిధిలోని పాత గార్లపాడు, దొడ్డవరం రెవెన్యూ పరిధిలో ఉన్న పెయ్యాలతిప్ప కొండను తవ్వి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారు. రెండు పెద్ద జేసీబీలతో తవ్వకాలు జరిపి 50కిపైగా టిప్పర్ల ద్వారా వేల టన్నుల గ్రావెల్‌ను మాయం చేస్తున్నారు. జలాశయ నిర్మాణ సమయంలో ఇరిగేషన్ అధికారులు పెయ్యాలతిప్పపై ఎఫ్ఆర్ఎల్కు కొన్ని మీటర్ల దూరం వరకు హద్దురాళ్లు ఏర్పాటు చేసి తవ్వకాలు నిషేధించారు. కానీ, ఏజీఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు ఎఫ్ఆర్ఎల్ రాళ్లను సైతం పెకిలించి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. కరకట్టకు బలం తగ్గి గ్రామాలు మునిగే ప్రమాదం... గుండ్లకమ్మ జలాశయం కుడి కరకట్టకు దన్నుగా నిలిచిన పెయ్యాలతిప్ప కొండను ఆనుకుని జలాశయం లోపల వైపున్న గ్రావెల్ తవ్వుకోవడానికి ఇరిగేషన్ ఎస్ఈ అనుమతివ్వడంతో ఏజీఎస్ కన్స్ట్రక్షన్స్ వారు గ్రావెల్ తవ్వకాలు మొదలుపెట్టారు. కానీ, పెయ్యాలతిప్ప కొండను బయటవైపు (ఎఫ్ఆర్ఎల్ వెలుపల) కూడా తవ్వి గ్రావెల్ తరలిస్తుండటంతో జలాశయానికి కుడివైపు ఉన్న కరకట్టకు బలం తగ్గి జలాశయంలోని నీరు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. గతంలోనే పెయ్యాల తిప్ప నుంచి చుట్టుపక్కల గ్రామాల వారు గ్రావెల్ తరలించుకుపోయారు. గుండ్లకమ్మ జలాశయం నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో గ్రావెల్, మట్టి తరలించడాన్ని నిషేధించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు సైతం వారి అవసరాలకు గ్రావెల్, మట్టిని ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిషేధిత ప్రాంతంలోనే గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంపై సమీప గ్రామాల ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలను అడ్డుకున్న దొడ్డవరం గ్రామస్తులు... ప్రమాదకరస్థాయిలో గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంతో దొడ్డవరం గ్రామస్తులు గత బుధవారం టిప్పర్లను అడ్డుకున్నారు. హద్దులు నిర్ణయించకుండా జలాశయం అధికారులు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కూడా వెళ్లి తవ్వకాలను పరిశీలించి నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానని తెలిపారు. అయితే, అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ పరిధిలో కూడా ఉన్నప్పటికీ.. గ్రామస్తులు ఆందోళన చేసేంత వరకూ సంబంధిత అధికారులకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గుండ్లకమ్మ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే గ్రావెల్ తవ్వకాలకు అనుమతులిచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నప్పటికీ.. రెవెన్యూ పరిధిలో కూడా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ.. ఈ గ్రావెల్ తవ్వకాల వలన జలాశయం కుడి కరకట్ట బలహీనమై గండి పడే ప్రమాదం ఉందంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రైతుల పంట భూములకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ వారు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ రిజర్వాయర్‌ను నిలువునా ముంచేలా ఉన్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను కాపాడాలని, చుట్టుపక్కల గ్రామాలకు, పొలాలకు రక్షణ కల్పించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలతో కనుమరుగైపోతున్న పెయ్యాలతిప్పకొండ గుండ్లకమ్మ డ్యాం వద్ద ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు విజయవాడ – బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భారీగా తరలింపు ఇరిగేషన్ ఎస్ఈ అనుమతులు ఉన్నాయంటున్న నిర్వాహకులు ఎఫ్ఆర్ఎల్ లోపలే అనుమతులిచ్చినట్లు చెబుతున్న ఇరిగేషన్ అధికారులు ఎఫ్ఆర్ఎల్ వెలుపల కూడా తవ్వడంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు ముప్పు ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గుండ్లకమ్మ డ్యాం వద్ద అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలించేందుకు ఎన్ఎస్పీ కెనాల్‌ను కొంతమేర పూడ్చి మరీ గ్రావెల్ రోడ్డును ఏజీఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించింది. దీని గురించి కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అద్దంకి మండలంలోని ధేనువకొండ ఆర్అండ్బీ రోడ్డు మీదుగా వెళ్తూ మధ్యలో ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ గట్టుపై గ్రావెల్‌తో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర 15 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును దొడ్డవరం నుంచి పాత గార్లపాడు వెళ్లే డొంక రోడ్డుకు లింకు చేసుకుని మార్గం మధ్యలో ఉన్న చెరువు కట్టపై 45 అడుగుల వెడల్పు కలిగిన గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ఎస్పీ కాలువ గట్టు ఆక్రమించి రోడ్డు నిర్మించినా.. చెరువు కట్టపై 45 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు నిర్మించినా.. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వేసిన చెట్లకు ఇబ్బంది కలుగుతున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఔరంగబాద్ సర్పంచ్ కళావతి మృతి
కంభం: మండలంలోని ఔరంగబాద్ గ్రామ సర్పంచ్ వరికుంట్ల కళావతి(58) శుక్రవారం మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఔరంగబాద్ సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వగ్రామంలోనే శనివారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి హాజరై కళావతి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, నాయకులు రసూల్, వరికుంట్ల పెద్దకోటేశ్వరరావు, చేగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, హుస్సేన్‌బాష, సబ్బసాని సాంబశివారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నివాళులర్పించారు. వైఎస్ జగన్ కటౌట్ల తొలగింపు అమానుషంకంభం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కటౌట్‌ను తొలగించడం అమానుషమైన చర్య అని కంభం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి పేర్కొన్నారు. అభిమానంతో తాను ఏర్పాటు చేసిన కటౌట్లను తాడేపల్లి మున్సిపల్ అధికారులు అనుమతి లేదంటూ తొలగించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాటం మొదలుపెట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాధరణను ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పేపరు లీకవకుండా చూడాల్సింది ప్రభుత్వమే.. ● యూటీఎఫ్ నేతల డిమాండ్ ఒంగోలు సిటీ: పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూసుకోవడం పూర్తిగా ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం భవిష్యత్‌లో పరీక్ష పేపర్లను పాఠశాలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం కళ్లు తెరవాలని, అలాగే ప్రభుత్వ అధికారులు కక్ష పూరిత ధోరణి మానుకోవాలని జిల్లా శాఖ తరపున డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో పనిచేస్తున్న సిద్ధయ్య శెట్టి ప్రశ్నపత్రాలను పాఠశాలకు తీసుకువెళ్తూ మధ్యాహ్నం రంగంపేట వద్ద ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమన్నారు. సిద్ధయ్యశెట్టి తలుపులపల్లి జెడ్పీ హైస్కూల్లో బయలాజికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. యూటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ తరఫున ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదుపుతప్పిన ప్రైవేట్ స్కూల్ బస్సు సింగరాయకొండ: ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం సింగరాకొండ–పాకల రోడ్డులో చోటుచేసుకుంది. ఎంఇఓ కత్తి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. భాష్యం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాకల వెళ్లి 12 మంది విద్యార్థులను తీసుకుని సింగరాయకొండ వస్తూ అదుపుతప్పింది. విద్యార్థులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఎంఈఓ తెలిపారు. -
కొర్రపాటివారిపాలెం కొండ పరిశీలన
తాళ్లూరు: మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామంలోని కొండను తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ‘కొండను మింగిన అనకొండ’ శీర్షికన ఈ నెల 18 న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్థానిక తహశీల్దార్ సంజీవరావు గురువారం కొండను పరిశీలించి గ్రామంలో విచారణ చేపట్టారు. కొర్రపాటివారిపాలెం గ్రామ ప్రజల జీవాలకు ఆధారమైన కొండను అక్రమంగా తవ్వేయడంపై గ్రామ ప్రజలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పశువులకు ప్రధాన జీవనాధారమైన కొండను అక్రమంగా తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. అయితే గ్రామస్తులు కలుగజేసుకుని పూర్తి స్థాయిలో పరిష్కారం దొరక్కపోతే మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని గ్రామస్తులు ఆర్డీఓ ముందు భీష్మించారు. గ్రామప్రజలకు అండగా ఉండి, తగు న్యాయం చేస్తామని ఆర్డీఓ లక్ష్మీప్రసన్న హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించుకున్నారు. ఆమె వెంట సీఐ వై రామారావు, ఎస్ఐ మల్లికార్జునరావు, డీటీ ఇమ్మానియేల్‌రాజు గ్రామస్తులు ఉన్నారు. యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి ● స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ ఒంగోలు సిటీ: యువత తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ అన్నారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం, మాదక ద్రవ్యాల నిర్మూలనపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ఏడుకొండలు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగలు బాబోయ్ దొంగలు:
జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అన్నవరప్పాడు మొదటిలైనులో నివాసం ఉండే సూరేపల్లి వెలుగొండరావు నరసరావుపేటలో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యానికి ఈ నెల 5వ తేదీ వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూస్తే బీరువా తాళం పగులగొట్టి లోపల దాచి ఉంచిన 200 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీని విలువ రూ.16 లక్షల వరకు ఉంటుంది. గత నెలలో నగరంలోని గాంధీనగర్ 4వ లైనులో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. సాయంత్రం కామేపల్లి సుబ్బ రత్తమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు. అటుగా బురఖాలో వచ్చిన ఒక వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఏమరుపాటులో ఉన్న ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. అప్పటికే అక్కడ మరోవ్యక్తి మోటారు బైకు మీద వేచి చూస్తున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. మద్దిపాడు మండలంలో పెద్ద కొత్తపల్లికి చెందిన కాటా భారతి గత నెల 8వ తేదీ బెంగళూరులోని కుమారుడి వద్దకు వెళ్లారు. తిరిగి ఈ నెల 2వ తేదీ ఊరికి వచ్చి చూస్తే బీరువాలో దాచి ఉంచిన 5.5 సవర్ల బంగారు గొలుసు, సవర విలువ చేసే రెండు ఉంగరాలతో పాటుగా రూ.30 వేల నగదు మాయమైంది. మొత్తం రూ.3.5 లక్షలు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అగ్రిగోల్డ్ సొత్తు పచ్చదొంగల సొంతం
యర్రగొండపాలెం: అగ్రిగోల్డ్ సొత్తును పచ్చ దొంగలు దోచుకుంటున్నారు. తమను ఎవరు అడుగుతారన్న ధైర్యంతో వారు రెచ్చిపోతున్నారు. మండలంలోని వీరభద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న రాయవరం రెవెన్యూ మజరా గ్రామంలో అగ్రిగోల్డ్‌కు చెందిన 155 ఎకరాల భూమి ఉంది. అందులో జామాయిల్ చెట్లు పెంచారు. ఈ చెట్లు ఏపుగా పెరగడంతోపాటు ఇటీవల రైతులు బర్లీ పొగాకు ఎక్కువగా సాగు చేస్తున్నారు. పొగాకు ఆకును ఆరబెట్టేందుకు పందిర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఈ కారణంతో ఒక్కొక్క చెట్టు రూ.450 పలుకుతుంది. అంతేకాకుండా మార్కెట్లో జామాయిల్ విలువ టన్ను రూ.8 నుంచి రూ.10 వేల వరకు పలుకుతుందని పలువురు రైతులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జామాయిల్‌కు అధిక ధర పలుకుతుండటంతో టీడీపీ నేతకు కన్నుకుట్టింది. వెంటనే నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో కూలీలను రప్పించి టన్నుల కొద్దీ జామాయిల్ చెట్లను నరికించి లారీల్లో తరలించాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. రాయవరంతో పాటు మండలంలోని వెంకటాద్రిపాలెంలో 80 ఎకరాలు, కొలుకులలో 60 ఎకరాలు, త్రిపురాంతకం మండలంలోని దూపాడులో 120 ఎకరాలు, హసనాపురంలో 1000 ఎకరాలు, కంభంపాడులో 250 ఎకరాల ప్రకారం మొత్తం 1665 ఎకరాల్లో జామాయిల్ మొక్కలను పెంచారు. అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో పడటంతో ఆ చెట్లను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను సంరక్షించింది. బాధితులకు అండదండ అందించడంతోపాటు కొంత మేరకు నష్టపరిహారం కూడా అందించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడటంలో పూర్తిగా విఫలమైంది. ఆ సంస్థ బాధితులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ అండదండలు మెండుగా ఉన్నాయన్న పచ్చ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంలో భాగంగా కొంతమంది అగ్రిగోల్డ్ భూముల్లో వేసిన జామాయిల్ చెట్లను నరుక్కొని సొమ్ము చేసుకుంటుంటే, మరి కొంతమంది ఆ సంస్థకు చెందిన సింగరాయ హిల్స్ గ్రీన్ పవర్జెన్కో ప్రైవేట్ లిమిటెడ్ పేరు చెప్పుకొని భూములనే అమ్ముకుంటున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని అగ్రిగోల్డ్ ఆస్తులను రక్షించి తమకు న్యాయం చేయాలని పలువురు ఆ సంస్థ బాధితులు కోరుతున్నారు. రూ.లక్షల విలువైన జామాయిల్ చెట్లు నరికి తరలింపు పెద్ద సంఖ్యలో నెల్లూరు నుంచి కూలీలను రప్పించిన వైనం ఏ మాత్రం పట్టించుకోని అధికారులు -
పంటల బీమా నమోదుకు గడువు పెంపు
ఒంగోలు సబర్బన్: పంటల బీమా నమోదుకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బివై) పథకం కొన్ని పంటలకు ఈనెల 15వ తేదీతో బీమా ప్రీమియం చెల్లించే గడువు ముగిసింది. 2024–25 సీజన్‌కుగాను వరి, శనగ, జొన్న, మినుము, మొక్కజొన్న, ఎర్ర మిరప పంటలను నోటిఫై చేసిన విషయం తెలిసిందేనన్నారు. అయితే వరి పంటకు సంబంధించి బీమా నమోదుకు ఆఖరి తేదీ ఈ ఏడాది డిసెంబర్ 31కాగా మిగిలిన ఐదు పంటల బీమా నమోదుకు డిసెంబర్ 15వ తేదీతో గడువు ముగిసిందన్నారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం మిగతా పంటలకు కూడా బీమా నమోదు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిందని చెప్పారు. జిల్లాలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామన్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) సంప్రదించి నోటిఫై చేసిన వరి, శనగ, జొన్న, మినుము, మొక్కజొన్న, ఎర్రమిరప పంటలకు కూడా ప్రీమియం చెల్లించి పంటల బీమా నమోదు చేసుకోవాలని ఆయన రైతులను కోరారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు బీసీ సెల్ బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ నగిరికంటి శ్రీనివాసరావు డాక్టర్స్ వింగ్ చంద్రాగారి నందకిషోర్ దివ్యాంగుల విభాగం దొంతిరెడ్డి గోపాల్‌రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్ ప్రచార విభాగం కనపర్తి శేషారెడ్డి బూత్ కమిటీస్ పుట్టా వెంకటరావు ఆర్టీఐ వింగ్ చింతగుంట్ల సాల్మన్ వైఎస్సార్ టీయూసీ మిటికెల గురవయ్య క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఇసుకుల ఓబయ్య పంచాయతీరాజ్ వింగ్ నన్నెబోయిన రవికుమార్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ పల్లెబోయిన వెంకటరాజు యువజన విభాగం జీ శ్రీకాంత్‌రెడ్డి ఎస్సీ సెల్ జి.దేవప్రసాద్ వాణిజ్య విభాగం కొల్లా భాస్కర్ మహిళా విభాగం దుంపా రమణమ్మ రైతు విభాగం ఎం.బంగారుబాబు గ్రీవెన్స్ సెల్ పొలినేని కోటయ్య చేనేత విభాగం సోమ యానాదిశెట్టి -
నిద్దరోతున్న నిఘా
జిల్లాలో ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రయితే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రెక్కీ చేయడం, రాత్రి కన్నం వేయడం నిత్యకృత్యమైపోయింది. ఇంటికి తాళాలు వేసి ఉంటే చాలు తెల్లారేసరికల్లా ఇంట్లో నగదు, నగలు మాయమైపోతున్నాయి. దుకాణాలను కూడా వదిలి పెట్టడం లేదు. ఒకవైపు దొంగతనాలు జరుగుతున్నా అరికట్టని పోలీసులు.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారంటూ అడ్డగోలు కేసులు వేయించిన అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు టౌన్: జిల్లాలో దొంగల బెడద పెరిగిపోయింది. నిత్యం ఒక్కడో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. ఇటీవల ఒకే రోజు పొదిలిలో రెండు దుకాణాల్లో దొంగలు పడి దోచుకెళ్లారు. కంభంలో ఒకేరోజు మూడు దుకాణాల్లో దొంగలు పడ్డారు. ఒంగోలులోని రద్దీ ప్రాంతంలో ఒక హోటల్లో దొంగలు పడ్డారు. అలాగే ఒక ఇంట్లో దొంగలు పడి భారీగా దోచుకెళ్లారు. ఇలా ప్రతి రోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లో చోరీలతో ప్రజల్లో ఆందోళన: ఎక్కడో ఊరి బయట దొంగలు పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలు పడుతున్నారు. నగరం నడిబొడ్డున దర్జాగా చోరీలకు తెగబడుతున్నారు. పొదిలిలోని విశ్వనాథపురంలో ఆర్టీసీ బస్టాండు, దానికి సమీపంలోనే సినిమా హాలు ఉంది. దీంతో అక్కడ ఎప్పుడు చూసినా జనాలు తిరుగుతూనే ఉంటారు. అలాంటి చోట దొంగలు పడ్డారు. ఒకే రోజు రెండు దుకాణాల షెట్టర్లను పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. కోటి అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఏకంగా రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు. షఫి అనే వ్యక్తి దుకాణంలో కేవలం రూ.3 వేలు ఉంటే అవీ తీసుకెళ్లారు. అలాగే ఒంగోలులో కూడా రద్దీ ప్రాంతంలో దొంగలు పడడం సంచలనం సృష్టించింది. నగరంలోని అద్దంకి బస్టాండు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రైవేటు బస్సు ఏజన్సీలు ఉన్నాయి. అంతటి రద్దీ ప్రాంతంలో దొంగలు పడ్డారు. అద్దంకి బస్టాండ్‌లోని బిలాల్ హోటల్ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత మూసివేసి వెళ్లిన నిర్వాహకులు మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే బీరువా తెరచి ఉంది. వెనక తలుపులు పెకిలించి ఉండడంతో దొంగలు పడినట్లు నిర్ధారించుకున్న హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం దుకాణాలే టార్గెట్: ఇదిలా ఉండగా బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకొని కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత నెల 21వ తేదీ చీమకుర్తిలోని సీఎస్ఎన్ బంగారు దుకాణంలో పట్టపగలే దొంగలు చోరీకి తెగబడ్డారు. బంగారు ఉంగరం కావాలంటూ ఒక యువకుడు దుకాణానికి వచ్చాడు. కొన్ని రకాల మోడళ్లు చూపించాలని కోరాడు. ఒక ట్రేలో కొన్ని బంగారు ఉంగరాలు తీసుకొచ్చి చూపిస్తుండగా దుకాణదారునితో మాటలు కలిపాడు. రెండో కంట పడకుండా ట్రేలో ఉన్న బంగారు నగలను జేబులో వేసుకుని జారుకున్నాడు. అలాగే డిసెంబర్ 2వ తేదీ తాళ్లూరు మండలంలో తెలంగాణకు చెందిన తల్లీకూతుళ్లు ఒక బంగారు దుకాణంలో చోరీ చేసి పట్టుబడ్డారు. మండలంలోని తూర్పు గంగారంలో విష్ణు జ్యూయలరీలో చెవి కమ్మలు కావాలంటూ వచ్చిన ఆ జంట దొంగలు యజమాని కళ్లుగప్పి 6 జతల కమ్మలు తస్కరించారు. వాటి స్థానంలో తన వద్ద ఉన్న రోల్డ్‌గోల్డ్ కమ్మలను ఉంచారు. ఆ తరువాత ఈ విషయాన్ని గమనించిన దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. మోటారు బైకుల్లో పెట్రోలు... ఫ్రిజ్‌లో కూల్‌డ్రింక్స్‌లను కూడా... కంభం గ్రామంలో ఒకే రోజు మూడు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్బన్ కాలనీలోని సయ్యద్ మహబూబ్‌కు చెందిన దుకాణంలో తాళం పగులగొట్టి చేతికి అందిన వస్తువులను దోచుకెళ్లారు. చోరీ చేసి పోతూ పోతూ దారిలో కనిపించిన మోటారు బైకుల నుంచి పైపులు పీకేసి పెట్రోలు తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి కందులాపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే తర్లుపాడు రోడ్డులోని ఒక చిల్లర దుకాణం తాళాలు పగులగొట్టి రూ.8,500 నగదును తస్కరించారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉంచిన కూల్ డ్రింక్స్‌ను కూడా వదిలి పెట్టలేదు. దాని పక్కనే ఉన్న అల్లూరయ్య అనే వ్యక్తికి చెందిన వెల్డింగు షాపులో కూడా ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు. ఒకేరోజు రాత్రి మూడు దుకాణాల్లో చోరీ జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. యర్రగొండపాలెంలో దొంగల్లుడు యర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాల గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న ముండ్ల రామయ్య కొద్దిరోజులుగా అత్తారింట్లోనే ఉంటున్నాడు. బెట్టింగులకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో దొంగగా మారాడు. గ్రామస్తులు పనుల కోసం వెళ్లడం గమనించిన అతడు తీరిగ్గా రోజుకు నాలుగు ఇళ్ల చొప్పన ఎంపిక చేసుకొని దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. కేవలం మూడు రోజుల్లో 12 ఇళ్లకు కన్నం వేసి రూ.7 లక్ష వరకు దోచుకున్న రామయ్య మూడో కంటికి తెలియకుండా ఊరు వదిలి పారిపోయాడు. నిద్రపోతున్న పోలీసుల గస్తీ: జిల్లాలో జరుగుతున్న దొంగతనాలను గమనిస్తే పోలీసుల గస్తీ ఏమైందన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానదు. కంభంలో జరిగిన దొంగతనాలు దొంగలు తీరిగ్గా చేసినట్లు తేటతెల్లం అవుతోంది. అర్బన్ కాలనీలో దుకాణంలో చోరీ చేసిన దొంగలు ఆ తరువాత మోటారు బైకుల నుంచి పెట్రోలు దొంగలించారంటే అదే ప్రాంతంలో చాలా సేపు గడిపినట్లు తెలుస్తోంది. 6 నెలలుగా జిల్లాలో చోరీలు పెరిగిపోయాయి. రాత్రి 10 గంటల తరువాత ఎక్కడా పోలీసులు కనిపించడంలేదు. అసలే చలికాలం కావడంతో ప్రజలు ముసుగుతన్ని ఇళ్లలో పడుకుంటున్నారు. దానికి తోడు పోలీసుల గస్తీ లేకపోవడంతో దొంగలకు అలుసుగా మారిందన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో జోరుగా దొంగతనాలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట చోరీకి పాల్పడుతున్న దొంగలు శాంతి భద్రతల కంటే కక్షసాధింపు చర్యలపైనే పోలీసుల దృష్టి రాత్రివేళ గస్తీ నిల్ రోజుల తరబడి హైదరాబాద్‌లో ఇద్దరు ఎస్ఐలు: అసలే జిల్లాలో చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అయినా సరే మాకేవీ పట్టవన్నట్లున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఎప్పుడో సోషల్ మీడియాలో ఏదో కామెంట్ చేశారని ఇప్పుడు పోలీసులు హడావుడి చేయడం విమర్శల పాలవుతోంది. వైజాగ్, హైదరాబాద్, సత్తెనపల్లి, చిలకలూరిపేటలకు సోషల్ మీడియా కేసులపై పోలీసులను తిప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం మద్దిపాడు, నాగులుప్పలపాడు ఎస్ఐలను రోజుల తరబడి హైదరాబాద్ చుట్టూ తిప్పడం జనానికి విస్మయం కలిగించింది. ఇప్పటికై నా జిల్లాలో జరుగుతున్న చోరీలను అరికట్టి భద్రత, భరోసా కల్పించాలని జనం కోరుతున్నారు. -
అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి
ఒంగోలు టౌన్: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్ చేయాలని, పార్లమెంటు సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కుల విమోచన పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బి.రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేడ్కర్‌ను అవమానించడమంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని, దేశభక్తులను అవమానించినట్లే అని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఎన్నికై న మంత్రి రాజ్యాంగ నిర్మాతను కించపరచడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ సంఘటనను దేశ ప్రజలంతా ఖండించాలని కోరారు. సమాజంలో సర్వసమానతను కాంక్షించి అనేక పోరాటాలు చేసిన మహనీయుడు అంబేడ్కర్‌పై నోరు పారేసుకోవడం అమిత్‌షా దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నిరసనలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు మంచిగులపాటి శ్రీను, డీ వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో కె.రమాదేవి, చీకటి శ్రీనివాసరావు, కరిముల్లా, తిరుపతి రావు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.