మంత్రి సురేష్‌ను గజమాలతో సన్మానిస్తున్న నాయకులు
ప్రకాశం/కొండపి: కొండపి సీటు గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడమే తన లక్ష్యమని, అందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపి మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సెమీ క్రిస్మన్ వేడుకలు, సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉండగా, అందులో 27 నియోజకవర్గాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందన్నారు. మిగిలిన వాటిలో రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీలోకి వచ్చారని, ఇక కేవలం కొండపి మాత్రమే ఉందని అన్నారు. ఈసారి కొండపి సీటును వైఎస్సార్ సీపీ తప్పకుండా కై వసం చేసుకుంటుందన్నారు. తాను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కొండపి అభ్యర్థిగా పోటీ చేస్తానని, జగనన్న వదిలిన బాణం తానని సురేష్ ఉద్వేగంగా మాట్లాడారు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అండదండలతో కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సెమీ క్రిస్మస్ కేకు, జగనన్న పుట్టినరోజు కేకును మంత్రి సురేష్ కట్ చేసి అందరికీ స్వయంగా తినిపించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బొక్కిసం ఉపేంద్ర, పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి మంత్రి సురేష్, ఆయన కుమారుడు విశాల్‌కు గజమాల వేసి సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు.
పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మిడసల అశోక్, ఐ.కోటేశ్వరరావు, బి.రమేష్, ఎం.సాంబశివరావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, కొండపి మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, బొక్కిసం సుబ్బారావు, జేసీఎస్ మండల కన్వీనర్ గొట్టిపాటి మురళి, ఆరికట్ల హరినారాయణ, దివి శ్రీనివాసరావు, రావెళ్ల రాజీవ్, వేముల వెంకట ప్రసాద్, కోటు, సుబ్బయ్య, ఆల శ్రీనివాసులరెడ్డి, పోటు శ్రీనివాసరావు, మండల కొండయ్య, పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి, టంగుటూరు మండల అధ్యక్షుడు ఎం.రాఘవరెడ్డి, జరుగుమల్లి మాజీ ఎంపీపీ బెల్లం సత్యన్నారాయణ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, కొరకూటి వెంకటేశ్వర్లు, దుంపా అనిల్‌కుమార్‌రెడ్డి, శేషారెడ్డి, కనిగిరి డీఎస్పీ ఆర్.రామరాజు, సీఐలు పాండురంగారావు, దాచేపల్లి రంగనాఽథ్, ఎస్సైలు వై.నాగరాజు, టి.శ్రీరామ్, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment