kondapi
-
Watch Live: టంగుటూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
దుష్ట సంప్రదాయానికి తెరలేపిన కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి
తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే చెల్లుతుంది. ఆయన శిష్యబృందం కూడా అదే దారిలో పయనిస్తోంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దుష్ట కుల రాజకీయానికి తెరలేపడంపై నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన 40 సంవత్సరాల నుంచి ఏ రోజూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయలేదు. కానీ, దళితులైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాదిగ ఆత్మీయ సమావేశం పెట్టి సరికొత్త కుటిల రాజకీయానికి ఎమ్మెల్యే స్వామి తెరతీయడంపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మాదిగలను పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. వైఎస్సార్ సీపీ తరఫున కొండపి నుంచి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుండటంతో మాల, మాదిగ అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇటీవల మంత్రి సురేష్ మాల, మాదిగ అని వేరు చేయకుండా సింగరాయకొండలో దళితుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాల, మాదిగలు తనకు రెండు కళ్లు లాంటివారని స్పష్టం చేశారు. టీడీపీకి మాదిగలు దూరమవుతున్నారని, అందుకు ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు. మాదిగల మనుగడను, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కొండపి నియోజకవర్గానికి మంత్రి సురేష్ వచ్చారని భావిస్తున్నామని మాదిగలు కూడా అంటున్నారు. కొండపికి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా మంత్రి సురేష్ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గమనించి మాదిగ సామాజికవర్గం టీడీపీకి దూరం అవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వామి.. ప్రస్తుతం దుష్ట కుల రాజకీయానికి తెరలేపారని మాదిగ సామాజికవర్గం ఆరోపిస్తోంది. ఇన్నాళ్లు మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. గత పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ మాదిగల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇప్పటివరకు సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించని ఏకై క ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎమ్మెల్యే స్వామి అని మాదిగలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారని మాదిగలు గుర్తుచేస్తున్నారు. కొండపిలో మంత్రి సురేష్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం మాదిగలపై టీడీపీ కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తోందని, ఇదే ప్రేమ మొదటి నుంచి చూపించి ఉంటే మాదిగలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్నందున టీడీపీకి మాదిగలు గుర్తుకురావడం బాధగా ఉందని మాదిగ సామాజికవర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేమని మాదిగలు తెలియజేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మాదిగ సామాజికవర్గం వారు ఉన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశానికి సుమారు రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాదిగలు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి మాదిగలు దూరంగా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలేగానీ.. ఈ విధంగా కుల విభజన రాజకీయాలు చేస్తే కలిసికట్టుగా టీడీపీకి, స్వామికి గుణపాఠం చెబుతామని దళితులు స్పష్టం చేస్తున్నారు. -
'జగనన్నకు కొండపిని కానుకగా ఇస్తా!' : ఆదిమూలపు సురేష్
ప్రకాశం/కొండపి: కొండపి సీటు గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడమే తన లక్ష్యమని, అందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపి మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సెమీ క్రిస్మన్ వేడుకలు, సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉండగా, అందులో 27 నియోజకవర్గాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందన్నారు. మిగిలిన వాటిలో రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీలోకి వచ్చారని, ఇక కేవలం కొండపి మాత్రమే ఉందని అన్నారు. ఈసారి కొండపి సీటును వైఎస్సార్ సీపీ తప్పకుండా కై వసం చేసుకుంటుందన్నారు. తాను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కొండపి అభ్యర్థిగా పోటీ చేస్తానని, జగనన్న వదిలిన బాణం తానని సురేష్ ఉద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అండదండలతో కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సెమీ క్రిస్మస్ కేకు, జగనన్న పుట్టినరోజు కేకును మంత్రి సురేష్ కట్ చేసి అందరికీ స్వయంగా తినిపించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బొక్కిసం ఉపేంద్ర, పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి మంత్రి సురేష్, ఆయన కుమారుడు విశాల్‌కు గజమాల వేసి సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మిడసల అశోక్, ఐ.కోటేశ్వరరావు, బి.రమేష్, ఎం.సాంబశివరావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, కొండపి మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, బొక్కిసం సుబ్బారావు, జేసీఎస్ మండల కన్వీనర్ గొట్టిపాటి మురళి, ఆరికట్ల హరినారాయణ, దివి శ్రీనివాసరావు, రావెళ్ల రాజీవ్, వేముల వెంకట ప్రసాద్, కోటు, సుబ్బయ్య, ఆల శ్రీనివాసులరెడ్డి, పోటు శ్రీనివాసరావు, మండల కొండయ్య, పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి, టంగుటూరు మండల అధ్యక్షుడు ఎం.రాఘవరెడ్డి, జరుగుమల్లి మాజీ ఎంపీపీ బెల్లం సత్యన్నారాయణ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, కొరకూటి వెంకటేశ్వర్లు, దుంపా అనిల్‌కుమార్‌రెడ్డి, శేషారెడ్డి, కనిగిరి డీఎస్పీ ఆర్.రామరాజు, సీఐలు పాండురంగారావు, దాచేపల్లి రంగనాఽథ్, ఎస్సైలు వై.నాగరాజు, టి.శ్రీరామ్, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు
కొండపి: ప్రకాశం జిల్లా కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ సమావేశంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోదరుడు సత్య పుట్టినరోజు వేడుకలు సైతం జరిపారు. ప్రధాన నాయకులు వచ్చే వరకు మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించారు. ఐటమ్ సాంగ్స్‌కు మహిళా డ్యాన్సర్లు చిందులేశారు. మహిళలతో టీడీపీ నాయకులు ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించటం చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
మా మంచి సైన్సు మాస్టార్
ఆయనో సైన్సు ఉపాధ్యాయుడు..ఉదయాన్నే పాఠశాలకు వచ్చి పిల్లలకు నాలుగు పాఠాలు చెప్పి తన పని అయిపోయిందనుకోలేదు. పిల్లల చేతిరాత శిక్షణ మొదలుకొని మూఢ నమ్మకాలపై అవగాహన, సమ్మర్ క్యాంపులు, సమాజంలోని రుగ్మతలపై నాటిక రచనలు, ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రశంసలతో పాటు అవార్డులు అందుకుంటూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కొండపి: కొండపికి చెందిన లక్కంతోటి వరప్రసాద్ రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం తంగెళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్సు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. చేతిరాత..మన తలరాత.. చేతిరాత బాగుంటే మన తలరాత బాగుంటుందంటారు పెద్దలు. అందుకే వరప్రసాద్ విద్యార్థుల చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటి వరకు చేతిరాత సక్రమంగా లేని 3 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని రాతను తీర్చిదిద్దారు. తాను పనిచేసిన పాఠశాలల్లోనే కాకుండా ఇతర పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సైతం సమ్మర్ క్యాంపులు పెట్టి మరీ శిక్షణ ఇస్తున్నారు. నాటికల ద్వారా చైతన్యపరుస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను బట్టబయలు చేసేలా ప్రజలకు కనువిప్పు కలిగేలా ఎయిడ్స్‌పై సమరం అంటూ నీ జీవితం–నీచేతిలోనే.. నాటికను రచించి పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్ శ్రీసత్యసాయి ఆడిటోరియంలో ఎయిడ్స్‌డే సందర్భంగా 2006 డిసెంబర్లో ప్రదర్శించారు. ఈ నాటికకు రచయితగా, డైరెక్టర్‌గా ప్రసాద్ యూనిసెఫ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. బేటిబచావో– బేటిపడావో కార్యక్రమంలో భాగంగా చదవనిద్దాం– ఎదగనిద్దాం అంటూ బాలికల విద్య గురించి ప్రకాశంజిల్లాలో ప్రథమస్థానం సాధించి, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రసంశాపత్రం అందుకున్నారు. బాలకార్మిక వ్యవస్థపై పోలీస్ బాబాయ్ శీర్షికన ఎన్టీఆర్ కళాపరిషత్‌లో 2010–11లో పిల్లలచేత వేయించిన నాటికకు రచయిత, దర్శకత్వం తదితర విభాగాల్లో మొత్తం 11 అవార్డులు అందుకున్నారు. అదే విధంగా వివిధ దినపత్రికల్లో ఆదివారం మ్యాగజైనన్లలో రచయితగా ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. క్రీడలకు ప్రోత్సాహం.. ప్రసాద్ చదువుకునే రోజుల్లో జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా ఆంధ్రజట్టుకు ప్రాతినిధ్యం వహించి 1995లో బంగారు పతకం సాధించారు. క్రీడల పట్ల మక్కువతో ఏటా తాను పనిచేస్తున్న పాఠశాలల్లోని క్రీడాకారులకు రూ.15 వేలు ఖర్చు చేసి క్రీడా దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందిస్తూ వారి విద్యార్థిభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ తోటి ఉపాధ్యాయులకు ప్రసాద్ ఆదర్శంగా నిలుస్తున్నారు. మ్యాజిక్ వెనుక లాజిక్.. సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢ నమ్మకాలు ఎన్నో. ఈ మూఢ నమ్మకాలకు విద్యార్థులను దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. చిన్నప్పటి నుండే చిన్నారుల్లో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించేలా మ్యాజిక్ వెనుక లాజిక్ అంటు సైన్సు ప్రయోగాల ద్వారా విద్యార్థులకు విషయాలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకు వస్తున్నారు. -
ఉచితం మాటున ఊడ్చేశారు..!
ఇదో ఘరానా దోపిడీ.. ఈ దోపిడీకి అనుమతి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.ఇంకేముంది టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వాగు కనిపిస్తే చాలు డేగల్లా వాలిపోయారు. రోజుకు వందల ట్రక్కుల చొప్పున ఐదేళ్లలో లక్షలాది ట్రక్కులను ఇసుకను అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇసుక ఉచితం అంటూ ప్రభుత్వ ప్రకటన టీడీపీ నేతలకు వరంగా మారి వారి దోపిడీకి రాజబాట పరిచినట్లయింది. సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): నియోజకవర్గంలోని మర్రిపూడి, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు మండలాలల్లో ఉన్న అట్లేరు, పాలేరు, మన్నేరు, ముసివాగుల్లో పచ్చనేతలు పాగా వేశారు. అక్రమంగా లారీలు, ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు ఇసుక తరలించి కోట్ల రూపాయలు దండుకున్నారు. నేతలు అధికారులతో కుమ్మకై తమకు ఇష్టానుసారంగా సీసీరోడ్లు, ఇటుకబట్టీలు, బ్రిడ్జిలు, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలకు ఇసుకను తరలించారు. కొండపి మండలంలో. కొండపి మండలంలోని అట్లేరు పరిదిలో ముక్కోరుపాలెం, తాటాకులపాలెం, వెంకుపాలెం, కొండపి, అనకర్లపూడి, పెరిదేపి, ముప్పవరం, చినవెంకన్నపాలెం గ్రామాల్లో జోరుగా ఇసుక అక్రమంగా తరలించారు. సిమెంట్బ్రిగ్స్లకు సైతం వందల ట్రిప్పులు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల వేడి రోజురోజుకు ఉత్కంఠం రేపుతున్న తరుణంలో అక్రమార్కుల పనులు సులవు అయింది. పచ్చనేతల కనుసందానంలో ఇసుక దందా యథేచ్ఛగా నడుస్తుంది. సింగరాయకొండ మండలంలో.. పాతసింగరాయకొండ, శానంపూడి గ్రామాల పరివాహక ప్రాంతంలో మన్నేరు వ్యాపించి ఉంది. అక్రమార్కులు ఈ ప్రదేశంలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం రెండు వేల ట్రిప్పుల ఇసుకను ట్రాక్టర్లు, లారీలకు నింపి తరలిస్తున్నారు. రూర్బన్ పథకం కింద వందకోట్లు మంజూరుకావడంతో సీసీరోడ్లు వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి ఈ ఇసుకునే తరలిస్తున్నారు. మన్నేరులో ఇసుక అడుగంటి మట్టి బయటపడింది. దీంతో భూగర్భజలాలు అండుగంటాయి. పొన్నలూరు మండలం... మండలంలోని ముప్పాళ్ల, కొత్తపాలెం, ఉప్పలదిన్నే, రావులకొల్లు, బాలిరెడ్డిపాలెం, కల్లూరివారిపాలెం, కొత్తపాలెం గ్రామాల పరివాహాక ప్రాంతాలు కలుపుకుంటూ పాలేరు ఉంది. ఈ పాలేరు నుంచి ఇసుక అక్రమంగా నిత్యం తరలిస్తూ ఇష్టానుసారంగా క్వారీల్లో పెద్దపెద్ద గుంటలు ఏర్పాటుచేసుకుని ట్రాక్టర్ల సాయంతో రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకకు మంచి గిరాకీ ఉంది. ట్రక్కు ఇసుక రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. మన్నిక ఉన్న ఈ ఇసుకపై పచ్చనేతల కన్ను పడింది. ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది. మర్రిపూడి మండలం మండలంలోని చిలంకూరు ముసివాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రోజుకు 20 నుంచి 50 ట్రిప్పులు ఇసుకను రేయింబవళ్లు చీమకుర్తి మండలం చీమలమర్రి, భూసరపల్లి, రావిపాడు, పులికొండ, గ్రామాలతో పాటు పొదిలి, చీమకుర్తి, దర్శి తదితర మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి ముసివాగు పరివాహాక ప్రాంతంలో సాగుచేసిన వరి దాదాపు 250 ఎకరాలల్లో వాడు, ఎండుముఖం పట్టింది. అన్నీ తెలిసినా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరించడం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ముసివాగులో ఏర్పాటు చేసి రక్షతమంచినీటి పధకం సంబందించిన పైపులైన్లు సైతం ద్వంసం చేశారు. ఎక్కడపడితే అక్కడ విచక్షణా రహితంగా పెద్దపెద్ద గోతులు తీసి తమ అవసరాలకు అణగుణంగా మలుసుకుంటున్నారు. పచ్చనేతల అండతో ఈ దందా నడుస్తోంది. జరుగుమల్లిమండలం.. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా తరలుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జిల్లా అధికారులు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారెవ్వరూ పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దీంతో పాలేరులో ఇసుక తవ్వకాలు ఆపారు. అడుగంటిన భూగర్భజలాలు ముసినది పరివాహాక ప్రాంతంలో వరి పంట దాదాపు 250 ఎకరాల్లో సాగుచేశారు. అయితే యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి ఏటి వెంట ఉన్న బోర్లు సైతం వట్టిపోయాయి. పట్టించుకొని అధికారులు.. ఇసుక అక్రమార్కుల ఆగడాలుఐదేళ్లుగా కొనసాగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖాధికారుల్వెవరూ పట్టించుకోలేదు. రోజుకు 20 నుంచి 50 ట్రక్కుల ఇసుక దర్శి, మర్రిపూడి, చీమకుర్తి తదితర మండలాలకు అక్రమంగా తరలుతున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మర్రిపూడి పంచాయతీ పరిదిలోని గంగపాలెం చెరువులో, అంకేపల్లి పంచాయతీ పరిధిలోని గంజిపాలెం వాగులో ఇసుక అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. అయినా ఇప్పటి వరకు ఒక ట్రాక్టర్‌ను సైతం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. అట్లేరులో ఇసుక ఖాళీ మండలంలోని అట్లేరు పరిధిలోని గ్రామాల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఈ తంతు నడుస్తోంది. అట్లేరు ఇసుక ఖాళీ అయింది. మట్టిబయటపడింది. దీంతో భూగర్బజలాలు అడుగంటాయి. తాగునీరు తీవ్రరూపం దాల్చింది. అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలి. - నర్శింహారావు, అనకర్లపూడి -
తాగు, సాగునీటిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, కొండపి (ప్రకాశం): నియోజకవర్గంలో సాగు, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు లేకపోవడంతో రైతుల ఇక్కట్లు చెప్పేవీ కావు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటి ఇక్కట్లును తీరుస్తానని వైఎస్సార్సీపీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వెంకయ్య అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చేసే అభివృద్ధి పనులను సాక్షిలో ముచ్చటించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువ జరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కరువు కాటాలతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వైద్యునిగా ప్రజలకు సుపరిచతం.. పేదల వైద్యునిగా నియోజకవర్గంలో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. లాభపేక్షలేకుండా సేవా భావంతో వైద్య వృత్తిలో ముందుకు పోతున్నా. అదే తరహ రాజకీయాల్లో సైతం పాటిస్తా. అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవే పరామర్ధంగా ప్రజలకు సేవ చేస్తా. కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తా. వంద పడకల వైద్యశాల మంజూరుకు కృషి కొండపిలోని 30 పడకల వైద్యశాలలో రోగులకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు. వైద్యాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత 30 పడకల వైద్యశాలను 100 పడకలుగా పదోన్నతి కల్పించి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందేలా చూస్తా. అంతర్గత డ్రైనేజీ ఏర్పాటు చేస్తా.. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. సైడు కాలువల నిర్మాణం సక్రమంగా లేదు. దీంతో వర్షం నీరు పారే వీల్లేక చిరు జల్లులకే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. బురద రోడ్లపై నడవాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లు తటాకాల్లా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తా. కొండపిలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం చేయిచి ప్రజలకు మురుగు సమస్య పరిష్కారం చేయిస్తాం. ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి.. ఓవీ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎమ్మెల్యే స్వామి ఐదేళ్లలో రోడ్డు విస్తరణను పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణ పనులు జరగ్గా తరుచూ వాహన ప్రమాదాలు జరిగి ఐదేళ్లలో 20 మందికి పైగా మృతి చెందారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. పొన్నలూరు మండలంలో ముత్తరాసుపాలెం నుంచి పరుచూరివారిపాలెం వరకు సుమారు 16 కిలోమీటర్ల ఓవీ రోడ్డు విస్తరణ పనులు చేయించి కొండపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 50గ్రామాల పైగా ప్రజల ఇబ్బందులు తీరుస్తాం. చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు చేదోడు నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట మూసి, పాలేరుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తా. వర్షాకాలంలో సముద్రం పాలయ్యే నీటిని ఆపి రైతుల వ్యవసాయ అవసరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. కొండపిలో అట్లేరు మీద ఆగిపోయిన చెక్‌డ్యాం పనులు సైతం పూర్తి చేసి 200 ఎకరాల భూములకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తాం.. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటి తాగి వందల మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది కిడ్నీ వ్యాధితో ప్రమాదపుటంచున ఉన్నారు. ప్రధానంగా మర్రిపూడి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రజలకు మంచినీరు అందించటం ద్వారా కిడ్నీ వ్యాధులను దూరం చేయవచ్చు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే మంచినీటి సమస్య తీరుతుంది. గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయించి తాగునీరు అందిస్తాం. టీడీపీ పాలన మొత్తం దోపిడీమయం టీడీపీ హయాంలో పాలకులు ప్రకృతి వనరులను దోచుకున్నారు. ఇసుక, మట్టి ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. ముఖ్య నాయకులకు పర్సంటేజీలు కుదరక సంగమేశ్వరం పనులు నిలిచిపోయాయి. మండలానికి ఒకరిద్దరు చొప్పున కోటరి ఏర్పాటు చేసుకుని ప్రజల సొమ్మును స్వాహా చేశారు. సంగమేశ్వరం పూర్తితో రైతుకు ఊతం నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తోంది. నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్ట్ లేకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ హయంలో పొన్నలూరు మండలంలో చెన్నిపాడు వద్ద పాలేరుపై సంగమేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. అయితే టీడీపీ పాలనలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తొలి ప్రాధన్యతగా సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయించి రైతన్నలకు కానుకగా అందిస్తా. ప్రాజెక్టు పూర్తితే 9,500 ఎకరాలకు సాగునీరు, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల్లోని సుమారు 15 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా. నియోజకవర్గంలో సాగు, తాగునీరు ప్రధాన సమస్యలు. కనీసం మూసికి సాగర్‌నీరు అందిస్తే మూసి ఒడ్డున ఉన్న గ్రామాల్లో సమస్యలు తీరుతాయి. అత్యంత ప్రధానమైన ఓవీ రోడ్డు ఇప్పటి వరకు వేయలేదు. అధికారంలోకి వస్తే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాను. నియోజకవర్గానికి సాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – కాకి వీరచంద్ర ఖర ప్రసాద్, బీఎస్పీ అభ్యర్థి -
రోడ్డేస్తూ.. నిధులు నొక్కేస్తూ..
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): రూపాయి..రెండు రూపాయలు కాదు..ఏకంగా రూ.80 లక్షలు..అందులో రూ.40 లక్షలు దాతలు ఇచ్చినవి.. మరో రూ.40 లక్షలు రూర్బన్ నిధులు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారో..ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ పనులకు ఓ పద్ధతి పాడు ఉండదు. ఇక నాణ్యత అనేది బూతద్దం వేసి వెతికినా కనిపించదు. కాంట్రాక్టర్ ఏం చేసినా ఎవ్వరూ అడ్డుచెప్పరు. పనులను పర్యవేక్షించే అధికారులు లేరు..బాధ్యత వహించే ప్రజాప్రతినిధులు కనిపించరు. సింగరాయకొండలో జాతీయ రహదారిని దాతల సహాయంతో స్మార్ట్ రోడ్డుగా నిర్మించేందుకు సుమారు రూ.40 లక్షలకుపైగా నిధులు వసూలు చేశారు. ఆ నగదుతో రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయకుండానే అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు రూర్బన్ పథకం కింద సుమారు రూ.40 లక్షలు నిధులు మంజూరు చేయించి అదే రోడ్డును తారుతో వెడల్పు చేయడంతో పాటు, మధ్యలో డివైడర్‌ను నిర్మిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో కమీషన్ల కారణంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో..? మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాతల సహాయంతో గ్రామాల్లో స్మార్ట్ రోడ్లు నిర్మించి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న జాతీయరహదారిని వెడల్పు చేయడంతో పాటు మధ్యలో డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు సుమారు రూ.40 లక్షల అవసరమవుతుందని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రకారం మండలంలోని ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, దాతల నుంచి నిధులు సమీకరించే పనిచేపట్టారు. ఓ పక్క నిధులు సమీకరిస్తూనే మరో పక్క రోడ్డు పనులు చేపట్టారు. నిధులు సేకరణ పూర్తయినా రోడ్డు మాత్రం ఇరువైపులా తవ్వి కంకర వేసి రోలింగ్ చేసి వదిలేశారు. ఇప్పుడు మరలా అదే రోడ్డుకు మరల రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో సుమారు 1.20 కిలోమీటర్ల దూరం స్టేట్ బ్యాంకు దగ్గర నుంచి పాకల రోడ్డు వరకు ఇరువైపులా తారురోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఇటీవల టెండర్లు వేసిన కాంట్రాక్టరు పనులు ప్రారంభించాడు. అయితే రోడ్డు వెడల్పుకు రూ.18 లక్షలు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.22 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా డివైడర్ నిర్మాణం.. డివైడర్ నిర్మాణంపై కూడా ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ నిర్మించే చోట గతంలో ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించాల్సి ఉంది. అప్పుడే డివైడర్ మధ్యలో మొక్కలు వేసినపుడు అవి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రైల్వేస్టేషన్ రోడ్డులో వేసినట్లు రోడ్డు తొలగించకుండానే డివైడర్ నిర్మిస్తుండటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పు చేయటంతో లారీల వంటి వాహనాలను రోడ్డు పై నిలుపుతున్నారని, దీనికి తోడు డివైడర్ కారణంగా రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అధికారుల పనితీరును విమర్శిస్తున్నారు. నాసిరకంగా అభివృద్ధి పనులు.. ఎట్టకేలకు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారని అందరు ఆనందపడ్డారు. అయితే వీరి ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి మొదట రోడ్డు మార్జిన్లో ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్‌ఫారాలను తొలగించి దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ తరువాతే రోడ్డు పనులు ప్రారంభించాలి. కానీ అవేమి చేయకుండా రోడ్డు పనులు చేపట్టారు. దీంతో అజాగ్రత్తగా ఉంటే విద్యుత్ ట్రాన్స్‌ఫారాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభించగా..మొదట జేసీబీతో రోడ్డును తవ్విన తర్వాత క్యూరింగ్ చేయకుండా తూతూ మంత్రంగా రోలింగ్ చేసి వదిలేశారు. తరువాత ఒకటిన్నర నెలల తరువాత రోడ్డు మార్జిన్లలో ఉన్న మట్టి పైనే నీటితో నామమాత్రంగా క్యూరింగ్ చేసి తరువాత తారు చల్లి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన తారులో నాణ్యత లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసిన తరువాత రోజే తారు లేచిపోతుందని మోటార్‌సైకిల్ స్టాండ్ వేస్తేనే గుంటలు పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాక రోడ్డు నిర్మాణం కూడా ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో సిమెంట్ రోడ్డు కన్నా తారు రోడ్డు ఎత్తుగా ఉంటుందని, దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు రోడ్డు పై నిలిచి రోడ్డు ధ్వంసమయ్యే అవకాశ ముందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు అధ్వానంగా ఉన్నాయి జాతీయరహదారి అభివృద్ధి పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. నాసిరకం తారు వాడుతున్నారు. దీన్ని ఎవ్వరూ పట్టించుఐకోవడం లేదు. దీనికి తోడు మార్జిన్లో వేసే రోడ్డు ఎత్తుగా ఉంది. దీంతో చిన్న వర్షానికి కూడా రోడ్డు పై నీరు నిలిచి రోడ్డు పాడయ్యే అవకాశం ఉంది. - తెనాలి రామస్వామి, సింగరాయకొండ నాణ్యత లోపించింది జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. కొత్తగా వేసిన రోడ్డుపై మోటారుసైకిల్ స్టాండు వేస్తేనే గుంట పడుతుంది. రోడ్డు మార్జిన్లలోని విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డు ఎన్నికల కోసం వేస్తున్న రోడ్డులాగా ఉంది తప్ప ప్రజలకొరకు వేస్తున్న రోడ్డులా లేదు. - షేక్ లియాఖత్, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్, సింగరాయకొండ -
పని చేసుకో.. పర్సంటేజీ ఇచ్చుకో..
పని ఏదైనా ఆయనకు పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీల విషయంలో రికమండేషన్లు గట్రా ఏమీ పనిచేయవు. ఆయన ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీ ఇచ్చుకున్నాక..ఆ పని ఎలా చేసినా ఆయన పట్టించుకోరు. నీరు–చెట్టు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనులు..ఇలా ఏ పనైనా ఆయన బినామీలు రంగంలోకి దిగుతారు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనిచేసేసి, కావాల్సినంత దండుకొని, ఇవ్వాల్సినంత పర్సంటేజీ ఇచ్చుకొని చేతులు దులుపేసుకుంటారు. ఇది కొండపిలో అభివృద్ధి పనుల పేరుతో సాగిన కమీషన్ల బాగోతం..! స్వయాన అధికార పార్టీ నేతలే ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగంగా విమర్శిస్తున్నారంటే అక్కడ ఎంత మేర ప్రజల సొమ్ము దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, కొండపి (ప్రకాశం): అభివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గంలో అధికార పార్టీ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా నియోజకవర్గంలో పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి టంగుటూరు మండలాలకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకులను ఎమ్మెల్యే స్వామి బినామీలుగా పెట్టుకొని వారితో కోట్లాది రూపాయల పనులు చేయించి భారీగానే జేబులు నింపుకున్నారన్న విమర్శ ఉంది. కొండపి మండలం గోగినేనిపాలెంలోనే సుమారు రూ.3 కోట్ల అభివృద్ధి పనులను తన బినామీ అయిన జరుగుమల్లి మండలం టీడీపీ నాయకుడు చేత చేయించడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక కుగ్రామంలోనే కోటిన్నర రూపాయల అభివృద్ధి పనులను తన బినామీతోనే ఎమ్మెల్యే చేయించారంటే..నియోజకవర్గం మొత్తం ఏ మేర జరిగిందో ఊహించుకోవచ్చని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రతి పనిలోనూ అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు దండుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ పని..ఈ పనని లేదు..ఏ పనైనా.. నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి, పొన్నలూరు, టంగుటూరు, కొండపి మండలాల్లో నలుగురు బినామీలను ఏర్పాటు చేసుకొని నీరు–చెట్టు, కొండపి రింగ్‌రోడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనుల అభివృద్ధి పేరుతో భారీగా ముడుపులు దండుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మహిళా ఎంపీపీ భర్త జరుగుమల్లి మండలం కామేపల్లి నుంచి చిరికూరపాడు మధ్య కోట్లాది రూపాయల ఆర్అండ్బీ రహదారి నిర్మాణం పనులు టెండర్లు చేజిక్కించుకున్నాడు. అయితే వారు కూడా పర్సంటేజీ ఇవ్వాలని ఎమ్మెల్యే పనులను అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌రావు, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జిల్లా టీడీపీ నాయకులు ఎవరు చెప్పినా వినకపోవడంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో వారు ఎమ్మెల్యేకి పర్సంటేజీ ముట్టజెప్పి పనులు చేసుకున్నట్లు ప్రచారం. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి పనులకు పది పర్సంటేజీ చొప్పున లెక్కకట్టి కమీషన్లు వసూలు చేశాడు. ఈ కమీషన్ల బాగంతోనే నెల రోజులుగా ఎమ్మెల్యే స్వామి అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారానికి సైతం టీడీపీ నాయకులు డుమ్మా కొడుతున్నారు. ఇసుకను దోచేశారు.. జరుగుమల్లి, కొండపి, సింగరాయకొండ మండలాల్లోని మూసి, పాలేరు, అట్లేరు, మన్నేరు నదుల నుంచి ఐదేళ్లలో లక్షల టన్నులను దోచుకొని కోట్లు దండుకున్నారు. ప్రధానంగా కొండపి నియోజకవర్గంలో నీరు చెట్టు పథకం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. 812 పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.50 కోట్లకు పైగా దండుకున్నారు. పాత పనులకే మెరుగులు దిద్ది ఉపాధి గుంతలకే నీరు చెట్టు పనులుగా కలరింగ్ ఇచ్చి కోట్లు వెనకేసుకున్నారు. ఇక ఉపాధి హామీ పథకం కూడా నేతలకు ఆదాయవనరుగా మారింది. సింగరాయకొండ, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు కొండలను ధ్వంసం చేసి కోట్లాది రూపాయలకు గ్రావెల్ అమ్ముకున్నారు. చెరువుల్లో మట్టి సైతం అమ్ముకుని అక్రమార్జన చేశారు. దండుకుంది ఇలా.. నియోజకవర్గంలో ఐడీసీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పేరుతో రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు తూతూమంత్రంగా జరిగాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరు సరఫరా అయిన పాపాన పోలేదు. కొండపి రింగు రోడ్డు పనులకు ఆర్అండ్బీ నిధులు రూ.30 కోట్లకు పైగా మంజూరు కాగా పర్సంటేజీలు ఇచ్చుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేయడంతో మున్నాళ్లకే బీటీ రోడ్డు మరమ్మతులకు గురయ్యాయి. రూ.54 కోట్ల నిధులతో నియోజకవర్గంలో నిర్మించిన బ్రిడ్జి పనులు సైతం పర్సంటేజీలతో నాసిరకంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు నేతలకు కాసుల వర్షం కురిపించాయి. నాసిరకంగా నిర్మాణాలతో చేసిన పనుల్లో ఒక్కొక్కరు భారీగా జేబులు నింపుకున్నారు. -
ఒక్క మండలం.. ఆరుగురు అభ్యర్థులు
సాక్షి, కొండపి (ప్రకాశం): కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం ఎమ్మెల్యేల ఖిల్లాగా మారింది. గత ఎన్నికల్లో ఈ మండలానికి చెందిన ఐదుగురు అభ్యర్థులు జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేయగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆ సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిది టంగుటూరు మండలం కొణిజేడు గ్రామం కాగా, అదే నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న దామచర్ల జనార్దనరావుది, కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిది టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామం. అదేవిధంగా కొండపి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తున్న డాక్టర్ మాదాసి వెంకయ్యది టంగుటూరు మండలం కారుమంచి గ్రామం కాగా, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుది టంగుటూరు గ్రామమే. కనిగిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బుర్రా మధుసూదనయాదవ్‌ది కూడా టంగుటూరు మండలం శివపురం గ్రామం కావడం విశేషం. ఒకే మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పలు పార్టీల తరఫున పోటీలో ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిలో డాక్టర్ మాదాసి వెంకయ్య మినహా మిగిలిన ఐదుగురూ 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేయడం కొసమెరుపు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - డి బి వీరాంజనేయస్వామి
-
వైఎస్సార్ సీపీదే విజయం
కొండపి, న్యూస్‌లైన్: స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో విసృ్తతంగా పర్యటించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రచార రథంపై అభ్యర్థులతో కొండపి వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఆదిఆంధ్రకాలనీలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన జెడ్పీటీసీ అభ్యర్థిని పోకూరి పద్మావతి, కొండపి-1 అభ్యర్థిని రావులపల్లి సుబ్బమ్మ, కొండపి-2 అభ్యర్థిని కడియం కోటేశ్వరమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం దాసిరెడ్డిపాలెం, గొడుగులపాలెంలో అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. గొడుగులపాలెంలో జూపూడి సమక్షంలో గొట్టిపాటి మురళి ఆధ్వర్యంలో సంఘ నాయకులు కొర్నెలు, కొండలరావు, పొదిలి రాజారత్నం, ముగల సుబ్బయ్య, ముగల ప్రకాశం, పొదిలి యోహాను, ముగల దావీదు, సురేష్‌లతో పాటు 200 మంది కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జూపూడి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాను గాలి జోరుగా వీస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు గాడిలో పడతాయని, పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు పాలనను ప్రజలు నెమరువేసుకుని ఇప్పటికీ భయభ్రాంతులు చెందుతున్నారన్నారు. జగనన్న ఐదు పథకాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందటం ఖాయమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకునిగా విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న జగన్మోహన్రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేయనుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉపేంద్ర, ఎఫ్‌సీఐ మెంబర్ రావెళ్ల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, ఢాకా పిచ్చిరెడ్డి, వల్లంరెడ్డి రమణారెడ్డి, భువనగిరి సత్యన్నారాయణ, గుజ్జుల బాలకోటిరెడ్డి, పల్లె శివరావు పాల్గొన్నారు. -
విజిలెన్స్ దాడులు
కొండపి, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఐ. భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు ముందుగా కొండపిలోని 28వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. మిడ్డే మీల్స్‌కు సంబంధించిన ఇన్‌వార్డ్సు, అవుట్‌వార్డ్సు రిజిస్టర్లు లేవు. స్టాక్ కంటే 742 కేజీల బియ్యం ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 1వ నంబర్ దుకాణంలో మిడ్‌డేమీల్స్‌కు చెందిన 146 కేజీల బియ్యాన్ని రికార్డులో చూపించలేదు. 6ఏ కేసు నమోదు చేశారు. నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ రేషన్ దుకాణాలను మండలస్థాయి అధికారులు నిత్యం తనిఖీ చేయాలని చెప్పారు. డీలర్లు సమయపాలన పాటించి.. మెరుగైన సేవలు అందించాలన్నారు. బిల్లులు లేకుండా మధ్యాహ్న భోజన బియ్యాన్ని డీలర్లకు తరలిస్తున్న గోడౌన్ డీటీపై జేసీకి లిఖిత పూర్వక ఫిర్యాదు అందించనున్నట్లు తెలిపారు. దాడుల్లో దర్శి ఈడీటీ, సింగరాయకొండ ఈడీటీ బ్రహ్మయ్య, యేసుదాసు ఆర్ఐ డేవిడ్‌రాజ్ పాల్గొన్నారు. కాగా అధికారుల దాడులతో డీలర్లు చెమటలు పోస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను వినియోగదారులకు సరిగా రేషన్ అందించలేదు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని గాభరా పడుతున్నారు. అధికారులు నేరుగా కార్డుదారుల వద్దకు వచ్చి రేషన్ అందుతున్నాయా లేదా.. అని సమాచారం అడుగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమ బాధలు తొలగాలని ఆకాంక్షిస్తున్నారు. కనిగిరిలో.. కనిగిరి,న్యూస్‌లైన్: మార్కాపురానికి చెందిన విజిలెన్స్ అధికారులు రెండు రేషన్ దుకాణాలు, రెండు బియ్యం దుకాణాలను తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు సహాయ సరఫరా అధికారి ఆర్. కోటయ్య తెలిపారు. కనిగిరి, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో 10 రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీరి వెంట ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఎ. వేణుగోపాల్, ఎఫ్ఐ ఎస్. చంద్రశేఖర్ ఉన్నారు. అధికారుల రాక ముందుగానే పసిగట్టిన చాలామంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేశారు.