కొండపి, న్యూస్‌లైన్: స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో విసృ్తతంగా పర్యటించారు.
స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రచార రథంపై అభ్యర్థులతో కొండపి వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఆదిఆంధ్రకాలనీలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన జెడ్పీటీసీ అభ్యర్థిని పోకూరి పద్మావతి, కొండపి-1 అభ్యర్థిని రావులపల్లి సుబ్బమ్మ, కొండపి-2 అభ్యర్థిని కడియం కోటేశ్వరమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం దాసిరెడ్డిపాలెం, గొడుగులపాలెంలో అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
గొడుగులపాలెంలో జూపూడి సమక్షంలో గొట్టిపాటి మురళి ఆధ్వర్యంలో సంఘ నాయకులు కొర్నెలు, కొండలరావు, పొదిలి రాజారత్నం, ముగల సుబ్బయ్య, ముగల ప్రకాశం, పొదిలి యోహాను, ముగల దావీదు, సురేష్‌లతో పాటు 200 మంది కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జూపూడి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాను గాలి జోరుగా వీస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు గాడిలో పడతాయని, పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. చంద్రబాబు పాలనను ప్రజలు నెమరువేసుకుని ఇప్పటికీ భయభ్రాంతులు చెందుతున్నారన్నారు.
జగనన్న ఐదు పథకాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందటం ఖాయమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకునిగా విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేయనుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉపేంద్ర, ఎఫ్‌సీఐ మెంబర్ రావెళ్ల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆరికట్ల వెంకటేశ్వర్లు, ఢాకా పిచ్చిరెడ్డి, వల్లంరెడ్డి రమణారెడ్డి, భువనగిరి సత్యన్నారాయణ, గుజ్జుల బాలకోటిరెడ్డి, పల్లె శివరావు పాల్గొన్నారు.