వైఎస్‌ఆర్ సీపీ.. నిర్ణయాత్మక శక్తి
చైర్మన్ల ఎంపికలో వారే కీలకం
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజకీయాల్లో తనదైన లక్ష్యం, సిద్ధాంతాలతో వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కూడా పోరు బరిలో నిలచి తనవంతు పాత్రను పోషించింది. రాజకీయ సంక్లిష్టత ఉన్న తరుణంలో కూడా పార్టీ తన ముద్ర వేసేందుకు జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించి వ్యూహాత్మకంగా పార్టీకి ఊపునివ్వగలిగారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రమైన కల్వకుర్తి మునిసిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను పోటీలోకి దించి నిబద్దత ను చాటుకున్నారు. ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమై తలపడినప్పటికీ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపు కోనం పార్టీ శ్రేణులు సమష్టి కృషిచేసి గట్టి పోటీనిచ్చారు.
కల్వకుర్తిలోని 12వ వార్డు నుంచి జానకమ్మ టీఆర్ ఎస్ అభ్యర్థిపై, 15వ వార్డు నుంచి ఖుర్షీద్ బేగం బీజేపీ అభ్యర్థిపై , 20వ వార్డు నుంచి మహ్మద్ షాహిద్ కాంగ్రెస్ అభ్యర్థిపై, 5వ వార్డు నుంచి సౌజన్య టీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాగా, రాజకీయ సమీకరణల్లో భాగంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వైఎస్‌ఆర్ సీపీ నాయకురాలు శ్రావణికూడా టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలిచింది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలోని 36వ వార్డులో వైఎస్‌ఆర్ సీపీ నుంచి పోటీచేసి సమీప స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించి చైర్మన్ ఎంపికలో ప్రధాన భూమిక పోషించనున్నారు.