వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్‌పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్‌సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది.
గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి
జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు.
జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్‌కు 16,837 ఓట్లు వచ్చాయి.
అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్‌కు 0.76 శాతం ఓట్లు లభించాయి.
లోక్‌సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది.
జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్‌రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్‌లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్‌లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు.