టీడీపీ ఖాతాలో ఆ ‘రెండు’
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో యల మంచిలి,నర్సీపట్నం మున్సిపాల్టీలను టీడీపీ దక్కించుకుంది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఆ పార్టీ మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. యలమంచిలి మున్సిపాల్టీలో 23 వార్డులకు 20వార్డులను చేజిక్కించుకుంది. వైఎస్సార్‌సీపీ మూడు వార్డుల్లో గెలుపొందింది. నర్సీపట్నంలో 27వార్డులకు టీడీపీకి 18 చోట్ల అనుకూల ఫలితాలు వచ్చా యి. వైఎస్సార్‌సీపీ ఆరింట విజయకేతనం ఎగురవేసింది.
మార్చి 30న ఈ రెండు పట్టణాల్లో పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్లలెక్కింపు చేపట్టారు. నర్సీపట్నంలో 27 వార్డులకు టీడీపీ 18, వైఎస్సార్‌సీపీ 6, కాంగ్రెస్ ఒకటి, సీపీఐ ఒకటి, టీడీపీ మద్దతుదారు మరో స్థానంలో విజయం సాధించారు. యలమంచిలి మున్సిపాల్టీలో మొత్తం 24 వార్డులకు ఒకటి ఏకగ్రీవం కావడంతో 23చోట్ల పోలింగ్ నిర్వహించారు. టీడీపీ 20 వార్డులను దక్కించుకుంది. వైఎస్సార్‌సీపీ మూడు వార్డుల్లో విజయ సాధించింది.
సంస్థాగత సమస్యలున్నా దీటైన పోటీ : మున్సిపల్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సింహభాగం వార్డుల్లో దీటైన పోటీ ఇచ్చింది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం తొలిసారి. మున్సిపల్ ఎన్నికలనాటికి వైఎస్సార్‌సీపీ వార్డు ,బూత్ స్థాయి కమిటీలను పూర్తిగా నియమించలేదు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల నియామకం కూడా ఊపందుకోలేదు. ఇటువంటి సంస్థాగత ఏర్పాట్లు నిర్మాణం సమయంలో అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయి. పైగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వెస్సార్‌సీపీ ప్రజలపక్షాన పలు సమస్యలపై పోరాటంలో నిమగ్నమైంది.
ఇలా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న సమయంలో ఈ ఎన్నికలు సవాల్‌గా నిలిచా యి. అయినప్పటికీ అనుభవానికి మించి పోరాడింది. ఫలితంగా రెండు మున్సిపాల్టీల్లో టీడీపీతో పోటాపోటీగా నిలిచింది. టీడీపీ పలు వార్డుల్లో కేవలం సింగిల్ డిజిట్ మెజార్టీతోనే ఒడ్డున పడింది. సీట్ల పరంగా వ్యత్యాసం కనిపించినా చాలాచోట్ల టీడీపీకి దగ్గరగా వైఎస్సారీసీపీకి ఓట్లు పోలయ్యాయి. యలమంచిలి పట్టణం13వ వార్డులో 4 ఓట్లు, 19వ వార్డులో 3 ఓట్లు, 4వ వార్డులో 77 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నర్సీపట్నం 15వ వార్డులో 28 ఓట్లు, 19వ వార్డులో 16ఓట్లతో టీడీపీ గట్టెక్కింది. మరోపక్క వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన వార్డుల్లో అత్యధిక మెజార్టీ దక్కింది. నర్సీపట్నం నాలుగో వార్డులో 207, 11వ వార్డులో 177, 12వ వార్డులో 315, 16వ వార్డులో 753, 18వ వార్డులో 251 ఓట్ల చొప్పున అత్యధిక మెజార్టీ దక్కించుకుంది. యలమంచిలిలో మొత్తం పోలయిన 25,867 ఓట్లకు వైఎస్సార్‌సీపీ 10,460 ఓట్లు దక్కించుకుంది. టీడీపీకి 15,044ఓట్లు వచ్చాయి. నర్సీపట్నంలో పోలయిన మొత్తం 33,574 ఓట్లుకు వైఎస్సార్‌సీపీకి 12,009, టీడీపీకి 18,049 ఓట్లు దక్కాయి.