టీడీపీని వీడని విభేదాలు
సాక్షి, విజయవాడ : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది తెలుగుదేశం నేతల పరిస్థితి. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో తెలుగుదేశం నేతలు తమ విజయాలపై తరచితరచి లెక్కలు వేసుకుంటున్నారు. ఒక వైపు ఓటమి చెందుతామేమోనన్న అనుమానం వెంటాడుతున్నా, మరో వైపు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ గెలుపు తమదేనంటూ సవాళ్లు విసురుతున్నారు. జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీచిందని పరిశీలకులు ప్రకటిస్తుండడంతో నేతలు అంతర్మథనానికి లోనవుతున్నారు.
గెలుస్తామంటూనే....
టీడీపీ అభ్యర్థులు తాము గెలుస్తామంటూనే మరోకవైపు ఎన్నికల్లోతమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించామని, వారిపై చర్యలకు సిఫార్సులు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే టీడీపీలో అభ్యర్థులకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వెన్నుపోటు పోడిచే కంటే ఒక అభ్యర్థికి మరోక అభ్యర్థివెన్ను పోటు పోడుచుకున్నారనే ప్రచారం పార్టీ నేతల నుంచి వస్తోంది. ఎన్నికల వేళ సమష్టిగా పోరాడాల్సిన నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు.
అంతేకాకుండా ఎవరికి వారు తమ ఓటు వేయించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. రెండవది వారికి పడే విధంగా ప్రయత్నాలు చేయలేదనే ఆ పార్టీ వర్గాల నుంచే వాదన వినబడుతోంది. ఈ లెక్కన టీడీపీ అధినేత ప్రక్షాళన ప్రారంభించాల్సి వస్తే తొలుత అభ్యర్థుల నుంచే ప్రారంభించాలని, ఆ తరువాతనే ఆ పార్టీ కోసం పనిచేసే ఇతర నేతలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం కలసి పనిచేయగలుగుతారా?.....
స్థానిక సంస్థలు, అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఒకేసారి రావడంతో నేతల మధ్య విబేదాలు బాగా ముదిరాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించి, భంగపడిన నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్దగా పనిచేయలేదు. తామంటే లెక్కలేనప్పుడు తాము ఎందుకు పనిచేయాలనే భావనలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. నేతల మధ్య మనస్పర్థలు తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ నేతలంతా కలసి పనిచేయగలరా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.