ఉత్కంఠ
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికల సందడికి తెరపడింది. ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనే. మరో 24 గంటల్లో భవితవ్యం తేలనుండటంతో అభ్యర్థులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు. అయితే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్‌ను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేయడం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు ఉత్కంఠకు లోనైన అభ్యర్థులు మరో రోజు గడిస్తే ఫలితం వెలువడనుండటంతో గుండెలు చిక్కబట్టుకుని ఎదురుచూస్తున్నారు.
గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిమానం చూరగొన్న వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమైంది. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఓంటరిగానే అన్ని వార్డులకు పోటీ చేయగా.. టీడీపీ 41 వార్డులు, ఎంఐఎం 8 వార్డుల్లో పోటీ చేశాయి. అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో కాంగ్రెస్ 8 వార్డులకే పరిమితమైంది. ఆదోనిలో 41 వార్డులు ఉండగా.. వైఎస్‌ఆర్‌సీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది.
కాంగ్రెస్ 39 స్థానాల్లో, టీడీపీ 40, బీజేపీ 8, ఎంఐఎం 14 సీపీఎం 3, సీపీఐ 6 స్థానాల్లో పోటీ చేశాయి. సీపీఐ, బీజేపీ సొంతంగానే బరిలో నిలవడంతో ఓట్ల చీలిక భయం టీడీపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎమ్మిగనూరులో 33 వార్డులు ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో నిలిచాయి. అదేవిధంగా సీపీఎం 4, సీపీఐ 3, ఎస్‌డీపీఐ 8.. బీజేపీ, లోక్‌సత్తా ఒక్కో స్థానాల్లో పోటీ చేశాయి. డోన్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. రెండింటిని ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. టీడీపీ, బీజేపీ, సీపీఐ కలిసి బరిలో నిలిచినా.. విజయావకాశాలు వైఎస్‌ఆర్‌సీపీకే అధికమనే చర్చ జరుగుతోంది.
నందికొట్కూరులో 22 వార్డులు ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అన్ని స్థానాలకు పోటీ చేయగా.. రాయలసీమ పరిరక్షణ సమితి తరఫున 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇకపోతే ఆళ్లగడ్డ నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బరిలో నుంచి తప్పుకుంది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ హవా కనిపిస్తోంది. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది. గూడూరులోనూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు టీడీపీ పోటీనివ్వలేకపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడుతుందనే చర్చ కొనసాగుతోంది.
రెండు గంటల్లో ఫలితం
జిల్లాలోని మున్సిపల్, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్నూలు శివారులో నందికొట్కూరు రహదారిలోని వెంకాయపల్లె సమీపంలో ఉన్న సెయింట్ జోసఫ్ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో మున్సిపాలిటీకి వార్డులను బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను.. ఆ తర్వాత ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కించనున్నారు. ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్లను ఖరారు చేయనున్నారు. ఆయా వార్డుల్లోని మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పోలైన ఓట్లతో సరిపోల్చుకుని ఫలితం వెల్లడించనున్నారు. ఈ ప్రక్రియంతా కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.