పురపోరులో ఫ్యాన్ హోరు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఆరు మున్సిపాల్టీల్లో మొత్తం 169 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, అత్యధికంగా 84 వార్డులను గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రథమస్థానంలో నిలిచింది. టీడీపీ 73వార్డుల్లో విజయం సాధించి రెండో స్థానం పొందింది. పుంగనూరు, పలమనేరు మున్సిపాల్టీల్లో 24 వార్డుల చొప్పున ఉండగా, ఈ రెండింటిలోనూ వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పుంగనూరులో 17, పలమనేరులో 17 వార్డుల్లో గెలుపొందింది. చైర్మన్ల ఎన్నికకు అవసరమైన స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయింది. మదనపల్లె మున్సిపాల్టీలో మొత్తం 35 వార్డులకుగాను వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు సాధించింది. వైఎస్సార్‌సీపీ 17 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థులు 16 మంది గెలుపొందారు. కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతయింది. ఇక్కడ ఇద్దరు స్వతంత్రులు గెలవటంతో చైర్మన్ ఎన్నికలో వీరు కీలకం కానున్నారు.
దీనికి తోడు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కలిస్తే మదనపల్లెలో చైర్మన్ సీటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని వరించే అవకాశం ఉంది. పూతలపట్టు మండలంలోని పీ కొత్తకోట వద్ద వేము ఇంజనీరింగ్ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 11 గంటల కల్లాపూర్తయింది. ఒక్కో రౌండ్‌కు 10 వార్డుల చొప్పున అధికారులు పకడ్బందీగా ఓట్లలెక్కింపు చేపట్టారు. ఎన్నికల పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. మదనపల్లె వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి షమీమ్‌అస్లాం 972 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పలమనేరు, పుంగనూరు, పుత్తూరు,నగరిలో కూడా వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థులందరూ వార్డు సభ్యులుగా విజయం సాధించారు.
నగరి, పుత్తూరులో పోటాపోటీ....
నగరి, పుత్తూరు మున్సిపాల్టీల్లో వైఎస్సార్‌కాంగ్రెస్,తెలుగుదేశం పోటాపోటీగా వార్డులను గెలుచుకున్నారుు. నగరి మున్సిపాల్టీలో తెలుగుదేశం 13 వార్డులను గెలుచుకోగా, వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వీరి మద్దతు కూడగట్టుకున్నవారే చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీనికితోడు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు వేయనుండడంతో చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకునే అవకాశం ఎంత ఉందో, వైఎస్సార్‌సీపీకీ అంతే అవకాశం ఉంటుంది.
పుత్తూరు మున్సిపాల్టీలో తెలుగుదేశం 13 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ రెండు పార్టీలకు మధ్య రెండు స్థానాలే వ్యత్యాసం. నాలుగైదు వార్డుల్లో టీడీపీ స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించింది. నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో చివరివరకు ఉత్కంఠ నెలకొంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మొత్తం 35 వార్డులుండగా, తెలుగుదేశానికి 18 స్థానాలు వచ్చారుు. వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ ఇచ్చి 11 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మున్సిపాల్టీలో మాత్రమే కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించి బోణీకొట్టింది.
చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ విజయం
చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకుగాను అత్యధికంగా 33 డివిజన్లలో తెలుగుదేశం విజయం సాధించింది. స్వతంత్రులు 13 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఒకటో డివిజన్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు భార్య సీకే లావణ్య ఓటమిపాలయ్యారు. అత్యధిక స్థానాల్లో స్వతంత్రులు ఓట్లు చీల్చటంతో వైఎస్సార్‌సీపీ స్వల్ప ఓట్ల తేడాతో చాలా స్థానాల్లో ఓడింది. టీడీపీ మేయర్ అభ్యర్థి కఠారి అనురాధ విజయం సాధించారు.