హోరాహోరీగా సాగిన పురపోరు | election war between tdp,ysrcp | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా సాగిన పురపోరు

Published Tue, May 13 2014 1:42 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

హోరాహోరీగా సాగిన పురపోరు - Sakshi

హోరాహోరీగా సాగిన పురపోరు

జిల్లాలో హోరాహోరీగా సాగిన పురపోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ చెరి సగం వార్డులు సాధించాయి. 218 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 104, టీడీపీ 104 గెలుచుకున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో టీడీపీ, మూడు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగుర వేశాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో రెండూ చెరి సగం వార్డులు సాధించడంతో హంగ్ ఏర్పడింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో మట్టికరిచింది. ఆ పార్టీకి జిల్లాలో ఒకే ఒక్క వార్డు దక్కింది.    - సాక్షి, మచిలీపట్నం

జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ జయకేతనం..
తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జగ్గయ్యపేట మున్సిపాలిటీలో  వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 27 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 17 వార్డుల్లోనూ, టీడీపీ అభ్యర్థులు 10 వార్డుల్లోనూ గెలుపొందారు. మొత్తం టౌన్‌లో 29,602 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 13,724 ఓట్లు, టీడీపీ అభ్యర్థులకు 14,048 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు 119, బీజేపీ అభ్యర్థులకు 175, సమైక్య తెలుగు రాజ్యం అభ్యర్థులకు 656, స్వతంత్ర అభ్యర్థులకు 704ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పట్టణంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకంటే టీడీపీ అభ్యర్థులకు సుమారు 300ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకున్న వైఎస్సార్‌సీపీకే జగ్గయ్యపేట పురపాలక పీఠం దక్కింది. దీంతో జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జగ్గయ్యపేట అసెంబ్లీ అభ్యర్థి సామినేని ఉదయభాను, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
 
 నూజివీడు మున్సిపాల్టీలోనూతనశకం
 నూజివీడు మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో నూతన శకం మొదలైంది. నూజివీడు మున్సిపాలిటీలో మొత్తం 30వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీ 22, టీడీపీ 7, స్వంతంత్ర అభ్యర్థి ఒక వార్డును దక్కించకున్నారు. నూజివీడు మున్సిపాలిటీలో 29,018 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 15,074, టీడీపీకి 11,843 ఓట్లు లభించాయి. టీడీపీ కంటే 4,750ఓట్లు అదనంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు దక్కాయి. దీంతో వైఎస్సార్‌సీపీ  అసెంబ్లీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు కేడర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి.
 
 పెడనలో నైతిక విజయం
 టీడీపీకి పెట్టని కోట పెడన మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ దెబ్బకు బీటలు వారింది. రెండు పర్యాయాలుగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్‌గా నెగ్గుకొస్తున్న టీడీపీ నాయకుడు బొడ్డు వేణుగోపాలరావు ప్రస్తుత ఎన్నికల్లో 10వ వార్డులో పరాజయం పాలయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  వీరంకి నర్శింహా రావు 46ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల నాటికి వైఎ స్సార్‌సీపీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, బందరు అసెంబ్లీఅభ్యర్థి పేర్ని నాని సమన్వయంతో  బండారు ఆనందప్రసాద్‌ను బరిలో దించడంతో సమీకరణలు మారాయి. నువ్వా నేనా అనే రీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరి11వార్డులు గెలుచుకున్నాయి. 11వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 319, టీడీపీకి 319ఓట్లు వచ్చి టై అయ్యింది. దీంతో లాటరీ తీయడంతో టీడీపీకి ఆధిక్యత లభించింది. రెండు పార్టీలకు చెరో 11వార్డులు రాగా, 11వ వార్డే డ్రా కావడంతో అంతా 11-11-11 అని చర్చించుకున్నారు. మొత్తం 19,293 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీ 9,666, టీడీపీకి 8,984, కాంగ్రెస్/స్వతంత్ర అభ్యర్థులకు 682 ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి సుమారు700ఓట్లు అదనంగా రావడం విశేషం.
 
గుడివాడ గుండెలో వైఎస్సార్‌సీపీ పదిలం..
గుడివాడ గుండెలో వైఎస్సార్‌సీపీకి పదిలమైన చోటు దక్కింది. తాజామాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)కి వెన్నంటి ఉండే గుడివాడ పట్టణ ఓటర్లు ఆయన గతంలో టీడీపీలో ఉండగా ఆ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీలోకి రావడంతో ఆయనకు మద్దతుగా నిలిచి పురపాలక పగ్గాలు వైఎస్సార్‌సీపీకే అప్పగించడం విశేషం. గుడివాడ మున్సిపాలిటీలో 36వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీకి 21, టీడీపీకి 15 వార్డులు దక్కాయి. పట్టణంలో 71,752 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 36,156 ఓట్లు, టీడీపీకి 33,893 , కాంగ్రెస్‌కు 110, సీపీఎంకు 73, బీఎస్పీకి 38ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి 2,263 ఓట్లు అదనంగా రావడం విశేషం.
 
బందరులో స్వల్ప ఓట్లతో గట్టెక్కిన టీడీపీ

జిల్లా కేంద్రమైన బందరులో టీడీపీకి విజయం దక్కినా చాలా వార్డుల్లో నామ మాత్రపు మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కింది. ఒక్కో వార్డుకు రెండు వేల నుంచి నాలుగు వేల ఓట్లు ఉండే వార్డుల్లో కేవలం 5 నుంచి 15ఓట్ల మెజార్టీతో నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. 2వ వార్డులో 2ఓట్ల మెజార్టీ ,4వ వార్డులో 13 ఓట్లు, 9వ వార్డులో 15ఓట్లు, 12వ వార్డులో 8 ఓట్లు తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. పట్టణంలోని 42వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీ 11వార్డులు, టీడీపీ 29వార్డులు, కాంగ్రెస్ 1, మరో వార్డు ఫలితం తేలాల్సి ఉంది. పట్టణంలో మొత్తం 89,201 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 39,031, టీడీపీకి 43,939, కాంగ్రెస్‌కు 3,195 ఓట్లు వచ్చాయి.  
 
అయితే మున్సిపల్ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల నాటికి ఉండే అవకాశం లేదని, ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే పేర్ని వెంకట్రామయ్య(నాని)కి పరిస్థితి అనుకూలంగానే ఉంటుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 30వ వార్డులో ఈవీఎం సాంకేతిక లోపం కారణంగా ఫలితాన్ని ప్రకటించలేదు. ఇదే వార్డులో మరో ఈవీఎంలో ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 40ఓట్లు ఆధిక్యత వచ్చినట్టు సమాచారం. కాగా, ఈవీఎం సాంకేతిక లోపం కారణంగా ఈ ఫలితాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.
 
 ఉయ్యూరులో చెరి సగం..
 ఉయ్యూరు నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. దీంతో రెండు పార్టీలకు చెరో సగం వార్డులు దక్కాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీ 9, టీడీపీ 9 వార్డులు గెలుచుకున్నాయి. కాగా, ఇద్దరు స్వతంత్రులు గెలుపొందగా వారు చెరో పార్టీలో చేరారు. దీంతో పదేసి వార్డులు గెలుచుకుని సమాన బలం సాధించడంతో పాలక పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై ఫలితం డ్రా అయ్యింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఉయ్యూరు నగర పంచాయతీ పాలకవర్గం ఎన్నిక  ఉంటుందని,  అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేల  ఓట్లు కీలకంగా ఉంటాయనిఅంటున్నారు.  మొత్తం 24,076 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 9,332, టీడీపీకి 9,422ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీకి కేవలం 90 ఓట్లు మాత్రమే  ఎక్కువ వచ్చాయి.
 
తిరువూరులో టీడీపీకి 300ఓట్లే మిగులు
తిరువూరు నగర పంచాయతీలో 12వార్డులు గెలుచుకుని పాలకపగ్గాలు చేపట్టే అవకాశం దక్కించుకున్న టీడీపీకి వైఎస్సార్‌సీపీ కంటే అదనంగా వచ్చింది కేవలం 300ఓట్లు మాత్రమే. ఇక్కడ మొత్తం 20,131ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 7,851, టీడీపీకి 8,155ఓట్లు వచ్చాయి. అంటే 304ఓట్లు అదనంగా టీడీపికి వచ్చాయి. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో టీడీపీకి 12, వైఎస్సార్‌సీపీకి 7, సీపీఎంకు ఒక వార్డు దక్కాయి.
 
 నందిగామ దేశం పరం...

 నందిగామ నగర పంచాయతీగా ఏర్పడిన తొలి ఎన్నికల్లో టీడీపీకి పాలకపగ్గాలు దక్కాయి. మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 8, టీడీపీ 12వార్డులు వచ్చాయి. మొత్తం 25,110ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 10,453, టీడీపీకి 11,429, స్వతంత్రులకు 3,474ఓట్లు వచ్చాయి. టీడీపీకి సుమారు వెయ్యి ఓట్లు అదనంగా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement