పని ఏదైనా ఆయనకు పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీల విషయంలో రికమండేషన్లు గట్రా ఏమీ పనిచేయవు. ఆయన ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీ ఇచ్చుకున్నాక..ఆ పని ఎలా చేసినా ఆయన పట్టించుకోరు. నీరు–చెట్టు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనులు..ఇలా ఏ పనైనా ఆయన బినామీలు రంగంలోకి దిగుతారు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనిచేసేసి, కావాల్సినంత దండుకొని, ఇవ్వాల్సినంత పర్సంటేజీ ఇచ్చుకొని చేతులు దులుపేసుకుంటారు. ఇది కొండపిలో అభివృద్ధి పనుల పేరుతో సాగిన కమీషన్ల బాగోతం..! స్వయాన అధికార పార్టీ నేతలే ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగంగా విమర్శిస్తున్నారంటే అక్కడ ఎంత మేర ప్రజల సొమ్ము దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, కొండపి (ప్రకాశం): అభివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గంలో అధికార పార్టీ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా నియోజకవర్గంలో పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి టంగుటూరు మండలాలకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకులను ఎమ్మెల్యే స్వామి బినామీలుగా పెట్టుకొని వారితో కోట్లాది రూపాయల పనులు చేయించి భారీగానే జేబులు నింపుకున్నారన్న విమర్శ ఉంది. కొండపి మండలం గోగినేనిపాలెంలోనే సుమారు రూ.3 కోట్ల అభివృద్ధి పనులను తన బినామీ అయిన జరుగుమల్లి మండలం టీడీపీ నాయకుడు చేత చేయించడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక కుగ్రామంలోనే కోటిన్నర రూపాయల అభివృద్ధి పనులను తన బినామీతోనే ఎమ్మెల్యే చేయించారంటే..నియోజకవర్గం మొత్తం ఏ మేర జరిగిందో ఊహించుకోవచ్చని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రతి పనిలోనూ అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు దండుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఆ పని..ఈ పనని లేదు..ఏ పనైనా..
నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి, పొన్నలూరు, టంగుటూరు, కొండపి మండలాల్లో నలుగురు బినామీలను ఏర్పాటు చేసుకొని నీరు–చెట్టు, కొండపి రింగ్‌రోడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనుల అభివృద్ధి పేరుతో భారీగా ముడుపులు దండుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మహిళా ఎంపీపీ భర్త జరుగుమల్లి మండలం కామేపల్లి నుంచి చిరికూరపాడు మధ్య కోట్లాది రూపాయల ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణం పనులు టెండర్లు చేజిక్కించుకున్నాడు. అయితే వారు కూడా పర్సంటేజీ ఇవ్వాలని ఎమ్మెల్యే పనులను అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌రావు, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జిల్లా టీడీపీ నాయకులు ఎవరు చెప్పినా వినకపోవడంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో వారు ఎమ్మెల్యేకి పర్సంటేజీ ముట్టజెప్పి పనులు చేసుకున్నట్లు ప్రచారం. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి పనులకు పది పర్సంటేజీ చొప్పున లెక్కకట్టి కమీషన్‌లు వసూలు చేశాడు. ఈ కమీషన్ల బాగంతోనే నెల రోజులుగా ఎమ్మెల్యే స్వామి అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారానికి సైతం టీడీపీ నాయకులు డుమ్మా కొడుతున్నారు.
ఇసుకను దోచేశారు..
జరుగుమల్లి, కొండపి, సింగరాయకొండ మండలాల్లోని మూసి, పాలేరు, అట్లేరు, మన్నేరు నదుల నుంచి ఐదేళ్లలో లక్షల టన్నులను దోచుకొని కోట్లు దండుకున్నారు. ప్రధానంగా కొండపి నియోజకవర్గంలో నీరు చెట్టు పథకం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. 812 పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.50 కోట్లకు పైగా దండుకున్నారు. పాత పనులకే మెరుగులు దిద్ది ఉపాధి గుంతలకే నీరు చెట్టు పనులుగా కలరింగ్ ఇచ్చి కోట్లు వెనకేసుకున్నారు. ఇక ఉపాధి హామీ పథకం కూడా నేతలకు ఆదాయవనరుగా మారింది. సింగరాయకొండ, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు కొండలను ధ్వంసం చేసి కోట్లాది రూపాయలకు గ్రావెల్ అమ్ముకున్నారు. చెరువుల్లో మట్టి సైతం అమ్ముకుని అక్రమార్జన చేశారు.
దండుకుంది ఇలా..
నియోజకవర్గంలో ఐడీసీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పేరుతో రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు తూతూమంత్రంగా జరిగాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరు సరఫరా అయిన పాపాన పోలేదు. కొండపి రింగు రోడ్డు పనులకు ఆర్‌అండ్‌బీ నిధులు రూ.30 కోట్లకు పైగా మంజూరు కాగా పర్సంటేజీలు ఇచ్చుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేయడంతో మున్నాళ్లకే బీటీ రోడ్డు మరమ్మతులకు గురయ్యాయి. రూ.54 కోట్ల నిధులతో నియోజకవర్గంలో నిర్మించిన బ్రిడ్జి పనులు సైతం పర్సంటేజీలతో నాసిరకంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు నేతలకు కాసుల వర్షం కురిపించాయి. నాసిరకంగా నిర్మాణాలతో చేసిన పనుల్లో ఒక్కొక్కరు భారీగా జేబులు నింపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment