ప్రలోభాల పర్వం.. | TDP Offering Cash For Votes In Prakasam | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పర్వం..

Published Sat, Apr 6 2019 10:59 AM | Last Updated on Sat, Apr 6 2019 11:08 AM

TDP Offering Cash For Votes In Prakasam - Sakshi

సాక్షిప్రతినిధి, ఒంగోలు: పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.  గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా  ఓట్ల కొనుగోలుకు సిద్ధ పడుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తం అంటూ గుత్త బేరాలకు దిగుతున్నారు. కాదు.. కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపులు వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. సమావేశాలు పెట్టి మరీ మహిళలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. ఓటకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

మొత్తంగా ఓట్లు పొందేందుకు అధికార పార్టీ నేతలు అన్ని రకాల ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఇంటింటి ప్రచారం కన్నా...అధికార పార్టీ నేతలు ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాల రాజకీయం మితిమీరింది. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో చిన్న ఉద్యోగులను, గిరిజన కాలనీలను టార్గెట్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇక గ్రామాల్లో డ్వాక్రా మహిళలను టార్గెట్‌ చేశారు. నగదు అందచేసి వారి ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు.

అందులో భాగంగా డ్వాక్రా మహిళల అకౌంట్ల నంబర్లు తీసుకుని టీడీపీ నాయకులు గ్రూపుకు రూ.10 వేల చొప్పున పలు అకౌంట్లకు జమ చేశారు. పలు మండలాల్లో మహిళలకు మీటింగ్‌ ఏర్పాటు చేసి వచ్చిన వారికి వెయ్యి రూపాయల నగదు అందచేశారు. ప్రధానంగా మహిళల ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవికాక మత్స్యకార గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇందు కోసం ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు. మత్స్యకార గ్రామాలను కొంటున్న పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవి కాక కందుకూరులో పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఓట్లు వేయించేందుకు నగదు ముట్ట చెప్పడానికి స్కెచ్‌ వేశారు.

అధికారుల సాయంతో ప్రలోభాలు
ఒంగోలు నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాలకు భారీగా నగదు పంపించి కొనే ప్రయత్నాలు చేశారు. ఇందులో ఇంటిలిజెన్స్‌ పోలీసు సిబ్బంది పాత్ర ఉంది. టీడీపీ నాయకులతో కలిసి ఇంటిలిజెన్స్‌ సిబ్బంది అధికార పార్టీకి ఓట్లు కొనుగోలు చేయించేందుకు సిద్ధపడుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిఘా విభాగం పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే కింది స్థాయి సిబ్బంది వ్యవహారం నడిపిస్తున్నారు. ఇక చీరాల నియోజకవర్గంలో పోలీసు శాఖ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. చీరాల రూరల్‌లోని పలు కాలనీలను అధికార పార్టీ నేతలు నగదు పెట్టి ఇప్పటికే కొనుగోలు చేసినట్లు సమాచారం. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తూ  ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు.

మద్యం సైతం ఈ నియోజకవర్గంలో ఏరులై పారుతోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున  పోటీ చేస్తున్న శిద్దా రాఘవరావు తన సొంత నియోజకవర్గమైన దర్శిలో ఓటుకు రూ.3 వేలకు తగ్గకుండా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు కూడా వెనకాడనట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంటు పరిధిలో గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి తదితర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలను సాగిస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి నేతలను, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు.

కాలనీలు, గ్రామాల్లో గుత్త మొత్తంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. నేతల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొండపిలో టీడీపీ అభ్యర్థి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి భారీగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు డబ్బులు ఎర చూపి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోనే అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థి సామాజికవర్గంతో పాటు డబ్బును ఎర చూపి ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు డబ్బులు విచ్చల విడిగా ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

టీడీపీ మద్దతుదారులుగా అధికారులు..
ఎన్నికల వేళ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి..న్యాయంగా వ్యవహరించాల్సిన అధికారులు కాస్తా...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. నగదు పంపిణీ, పార్టీల మార్పు రాయబారాలు కూడా అధికారులే నడుపుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. టీడీపీ నాయకులు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటì ప్రచారాన్ని కూడా కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు. సీడీపీఓలు, వైద్యాధికారులు తమ కింది స్థాయి సిబ్బంది అయిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్ల పోస్టల్‌ బ్యాలెట్‌లు టీడీపీ అభ్యర్థులకే అందచేయాలని చెబుతున్నారు. ఓటు తీసుకున్న వెంటనే టీడీపీ నాయకులకే బ్యాలెట్‌లు ఇచ్చేయండని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రజాస్వామ్యం అపహాస్యం... 
ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. పేదలను, గిరిజనులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. తమకు ఓటు వేయకుంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఇంటలిజెన్స్‌ విభాగం సిబ్బంది అయితే ఒంగోలు, చీరాలలో అన్నీ తామై తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే  కొనుగోలు చేస్తూ ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తీరుమారాలంటున్న ఓటర్లు...
ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరిగేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ అభ్యర్థుల అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రశాంతంగా ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ కఠినంగా వ్యవహరించి అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుని ప్రశాంత వాతావరణం కల్పించాలని  కోరుతున్నారు.

మౌనంగా ఈసీ...
ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మా త్రం అలాలేదు. అధికారపార్టీ అభ్యర్థులు  అధి కారులను పార్టీ కార్యకర్తలుగా మార్చారు. నగదు, మద్యం భారీగా ఖర్చు చేస్తున్నారు. రాజకీయ బెదిరింపులు ప్రలోభాల పర్వం అధికమైంది. టీడీపీ అభ్యర్థులకు అండగా అధికారులు పనిచేస్తున్నా వారి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement