గంగపాలెం చెరువులో పొక్లెయిన్ సాయంతో తోడుతున్న ఇసుక
ఇదో ఘరానా దోపిడీ.. ఈ దోపిడీకి అనుమతి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.ఇంకేముంది టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వాగు కనిపిస్తే చాలు డేగల్లా వాలిపోయారు. రోజుకు వందల ట్రక్కుల చొప్పున ఐదేళ్లలో లక్షలాది ట్రక్కులను ఇసుకను అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇసుక ఉచితం అంటూ ప్రభుత్వ ప్రకటన టీడీపీ నేతలకు వరంగా మారి వారి దోపిడీకి రాజబాట పరిచినట్లయింది.
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): నియోజకవర్గంలోని మర్రిపూడి, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు మండలాలల్లో ఉన్న అట్లేరు, పాలేరు, మన్నేరు, ముసివాగుల్లో పచ్చనేతలు పాగా వేశారు. అక్రమంగా లారీలు, ట్రాక్టర్లలో దూర ప్రాంతాలకు ఇసుక తరలించి కోట్ల రూపాయలు దండుకున్నారు. నేతలు అధికారులతో కుమ్మకై తమకు ఇష్టానుసారంగా సీసీరోడ్లు, ఇటుకబట్టీలు, బ్రిడ్జిలు, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలకు ఇసుకను తరలించారు.
కొండపి మండలంలో.
కొండపి మండలంలోని అట్లేరు పరిదిలో ముక్కోరుపాలెం, తాటాకులపాలెం, వెంకుపాలెం, కొండపి, అనకర్లపూడి, పెరిదేపి, ముప్పవరం, చినవెంకన్నపాలెం గ్రామాల్లో జోరుగా ఇసుక అక్రమంగా తరలించారు. సిమెంట్‌బ్రిగ్స్‌లకు సైతం వందల ట్రిప్పులు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల వేడి రోజురోజుకు ఉత్కంఠం రేపుతున్న తరుణంలో అక్రమార్కుల పనులు సులవు అయింది. పచ్చనేతల కనుసందానంలో ఇసుక దందా యథేచ్ఛగా నడుస్తుంది.
సింగరాయకొండ మండలంలో..
పాతసింగరాయకొండ, శానంపూడి గ్రామాల పరివాహక ప్రాంతంలో మన్నేరు వ్యాపించి ఉంది. అక్రమార్కులు ఈ ప్రదేశంలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం రెండు వేల ట్రిప్పుల ఇసుకను ట్రాక్టర్లు, లారీలకు నింపి తరలిస్తున్నారు. రూర్బన్ పథకం కింద వందకోట్లు మంజూరుకావడంతో సీసీరోడ్లు వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి ఈ ఇసుకునే తరలిస్తున్నారు. మన్నేరులో ఇసుక అడుగంటి మట్టి బయటపడింది. దీంతో భూగర్భజలాలు అండుగంటాయి.
పొన్నలూరు మండలం...
మండలంలోని ముప్పాళ్ల, కొత్తపాలెం, ఉప్పలదిన్నే, రావులకొల్లు, బాలిరెడ్డిపాలెం, కల్లూరివారిపాలెం, కొత్తపాలెం గ్రామాల పరివాహాక ప్రాంతాలు కలుపుకుంటూ పాలేరు ఉంది. ఈ పాలేరు నుంచి ఇసుక అక్రమంగా నిత్యం తరలిస్తూ ఇష్టానుసారంగా క్వారీల్లో పెద్దపెద్ద గుంటలు ఏర్పాటుచేసుకుని ట్రాక్టర్‌ల సాయంతో రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకకు మంచి గిరాకీ ఉంది. ట్రక్కు ఇసుక రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. మన్నిక ఉన్న ఈ ఇసుకపై పచ్చనేతల కన్ను పడింది. ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగింది.
మర్రిపూడి మండలం
మండలంలోని చిలంకూరు ముసివాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రోజుకు 20 నుంచి 50 ట్రిప్పులు ఇసుకను రేయింబవళ్లు చీమకుర్తి మండలం చీమలమర్రి, భూసరపల్లి, రావిపాడు, పులికొండ, గ్రామాలతో పాటు పొదిలి, చీమకుర్తి, దర్శి తదితర మండలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి ముసివాగు పరివాహాక ప్రాంతంలో సాగుచేసిన వరి దాదాపు 250 ఎకరాలల్లో వాడు, ఎండుముఖం పట్టింది. అన్నీ తెలిసినా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరించడం మండలంలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ముసివాగులో ఏర్పాటు చేసి రక్షతమంచినీటి పధకం సంబందించిన పైపులైన్‌లు సైతం ద్వంసం చేశారు. ఎక్కడపడితే అక్కడ విచక్షణా రహితంగా పెద్దపెద్ద గోతులు తీసి తమ అవసరాలకు అణగుణంగా మలుసుకుంటున్నారు. పచ్చనేతల అండతో ఈ దందా నడుస్తోంది.
జరుగుమల్లిమండలం..
జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా తరలుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జిల్లా అధికారులు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారెవ్వరూ పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దీంతో పాలేరులో ఇసుక తవ్వకాలు ఆపారు.
అడుగంటిన భూగర్భజలాలు
ముసినది పరివాహాక ప్రాంతంలో వరి పంట దాదాపు 250 ఎకరాల్లో సాగుచేశారు. అయితే యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి ఏటి వెంట ఉన్న బోర్లు సైతం వట్టిపోయాయి.
పట్టించుకొని అధికారులు..
ఇసుక అక్రమార్కుల ఆగడాలుఐదేళ్లుగా కొనసాగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖాధికారుల్వెవరూ పట్టించుకోలేదు. రోజుకు 20 నుంచి 50 ట్రక్కుల ఇసుక దర్శి, మర్రిపూడి, చీమకుర్తి తదితర మండలాలకు అక్రమంగా తరలుతున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మర్రిపూడి పంచాయతీ పరిదిలోని గంగపాలెం చెరువులో, అంకేపల్లి పంచాయతీ పరిధిలోని గంజిపాలెం వాగులో ఇసుక అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. అయినా ఇప్పటి వరకు ఒక ట్రాక్టర్‌ను సైతం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు.
అట్లేరులో ఇసుక ఖాళీ
మండలంలోని అట్లేరు పరిధిలోని గ్రామాల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఈ తంతు నడుస్తోంది. అట్లేరు ఇసుక ఖాళీ అయింది. మట్టిబయటపడింది. దీంతో భూగర్బజలాలు అడుగంటాయి. తాగునీరు తీవ్రరూపం దాల్చింది. అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలి.
- నర్శింహారావు, అనకర్లపూడి
Comments
Please login to add a commentAdd a comment