commissions collect
-
Karnataka assembly elections 2023: 40 శాతం కమీషన్లు కన్పించడం లేదా?
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు క్రితం అడ్డదారిలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో విజయపుర జిల్లాలోని ఇండి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అందరూ కొనియాడుతూ ఉంటారని అలాంటప్పుడు ఆయనకు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతీ పనికి 40% కమీషన్లు తీసుకుంటూ ఉంటే కర్ణాకటను అభివృద్ధికే నమూనాగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్లు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతితో కంపెనీలు హైదరాబాద్, చైన్నై వైపు వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఓట్ల కోసం తాను రాలేదని, వారి భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసమే వచ్చానంటూ ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు. -
‘కాసు’క్కూర్చున్నారు!
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన విధులు నిర్వహిస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో వీరి అవసరం చాలా ఉంది. సరిగ్గా దీనినే తమకు అనుకూలంగా మార్చుకున్నారు విజయవాడ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది. కాంటాక్ట్ ముగిసిన గ్రూపులు కొనసాగాలన్నా.. కొత్త గ్రూపులను తీసుకోవాలన్నా కమీషన్లు దండుకుంటూ కార్మికుల పొట్టగొడుతున్నారు. పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అవినీతి కంపు కొడుతోంది. నగరాన్ని శుభ్రం చేసేందుకు నియమించుకున్న పారిశుద్ధ్య కారి్మకుల నుంచి ఈ విభాగంలోని శానిటరీ మేస్త్రీ, ఇన్స్పెక్టర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందినకాడికి దండుకుంటూ వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. కరోనా కట్టడిలో తొలి వరుసలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామక గడువు ముగిసిందని వారిని కొనసాగించాలంటే తమకు సొమ్ములు ముట్టజెప్పాలని లేదంటే తొలగిస్తామంటూ వార్డులో విధులు నిర్వహించే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని కారి్మకులు ఆరోపిస్తున్నారు. పాత గ్రూపు కొనసాగింపునకు ఒక్కో గ్రూపుకు రూ. 50 వేలు, కొత్త గ్రూపు రిజి్రస్టేషన్‌కు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదనపు సిబ్బంది నియామకంలోనూ.. ►కోవిడ్ నియంత్రణకు అదనంగా 20 శాతం వర్కర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో నూతన వర్కర్ల నియామకానికీ భారీ స్థాయిలో ముడుపులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. ►నగరంలో ఇటీవల 20 గ్రూపుల ద్వారా 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరిగింది. ►ఇవన్నీ సీఎంఈవై, డ్వాక్రా గ్రూపుల ద్వారా నియమించాలని మార్గదర్శకాలుండగా కొంత మంది అత్యుత్సాహ శానిటరీ మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు మనుగడలో లేని గ్రూపుల ద్వారా నియామకాన్ని చేపట్టి అందుకు కార్మికుల నుంచి రూ. లక్షల్లో వసూళ్లు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ►మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వీఎంసీ ప్రత్యేకంగా టీఎల్ఎఫ్(టౌన్ లెవల్ ఫెడరేషన్)లకు నిర్వహణ బాధ్యతలు ఇస్తోందన్న సమాచారంతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు మరింత దూకుడు పెంచి నిర్ణీత గడువు విధించి మరీ వసూళ్లు చేస్తున్నారని, గడువులోగా ఇవ్వకపోతే పొదుపు సంఘాల రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లైతే బినామీ గ్రూపులు నిర్వహిస్తున్నారని, గ్రూపులకు సంబంధించి ఎలాంటి రికార్డులైనా, లావాదేవీలైనా, తీర్మానాలైనా వారి నియత్రణలోనే ఉంటున్నాయని తెలుస్తోంది. అవినీతి రాజ్యమేలుతోంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో అవినీతి రాజ్యమేలుతుంది. జలగల్లా కొంత మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్నారు. చాలా మంది ఇన్స్పె క్టర్లు పొదుపు సంఘాల తీర్మానాల పుస్తకాలు, రిజిస్ట్రార్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్‌బుక్‌లను స్వా«దీనం చేసుకుని వాటిని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టీఎల్‌ఎఫ్‌లకు బాధ్యతలు ఇస్తే కొంతమేర నష్టనివారణ జరగే అవకాశం ఉంది. – ఎం.డేవిడ్, సీఐటీయూ నాయకుడు చర్యలు తీసుకుంటాం.. పారిశుద్ధ్య కార్మికుల కొనసాగింపు, కొత్త గ్రూపుల నియామకంలో అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – షాలినీదేవి, సీఎంవోహెచ్–వీఎంసీ -
మట్కా మాయ
సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): రూపాయికి 80 తగులుతుందని ఆశపెడుతూ పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మట్కా జూదం సాగుతుంది. మట్కా తగలడం మాటేమోగాని, మట్కా రాపిస్తున్న ఏజెట్లు మాత్రం రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. మట్కా జిల్లాలో చాపకింద నీరులో వ్యాప్తి చెందుతుంది. దీని మాయలోపడి అనేక మంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో మట్కానడుపుతున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు చెట్లకింద, కాలనీలు, ఫౌంహౌజ్ల్లో మట్కా రాసే ఏజెట్లు సెల్ఫోన్లు ఇంటర్నెట్లతోపాటు బహిరంగంగా మట్కా రాస్తున్నారు. ఒక సారి ఈ రొచ్చులో దిగితే బయట పడడం కష్టం, ఒక మట్కా చార్టు పెట్టుకుని అంకెలగారడీ చేసుకుంటూ ఉండాల్సిందే. వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు విద్యార్థులు సైతం దీనికి అలవాటుపడి బయటపడలేక పోతున్నారు. పోలీసులకు సవాలుగా మట్కా మట్కా ఉచ్చులోపడి వందలాది కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మట్కాను నియంత్రించాల్సిన పోలీసులశాఖ కిందిస్థాయి అధికారులు మట్కా ఏజెంట్ల వద్ద నెల వారి మాముళ్లు తీసుకుని ఉరుకుంటున్నారని సమాచారం, పోలీసులకు మాముళ్లు ఇవ్వని ఏజెంట్లను గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారే తప్ప నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మట్కా అంటే పోలీసులకు ఒకరిద్దరు మాత్రమే గుర్తుకు వచ్చి వారిని పట్టుకుని గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని సమాచారం. జిల్లాలోని సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట తదితర పట్టణాలు గ్రామాల్లో మట్కా జోరుగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం. గల్లీకో మట్కా ఏజెంట్.. సదాశివపేట పట్టణంలో పోలీసులకు ఐదారు మంది మాత్రమే మట్కా ఏజెంట్లు ఉన్నారని అనుకుంటూ వారి వద్దకే కానిస్టెబుళ్లు వెళ్లి నెలనెల మాముళ్లు తీసుకుంటున్నారని సమాచారం. కాని పట్టణంలో గల్లీకో మట్కా ఏజెంట్లు తయారై మట్కా రాపిస్తున్నారు. మట్కా జూదం సదాశివపేట పట్టణంలో విచ్చల విడిగా బహిరంగంగా కొనసాగుతున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ రహస్యమే. -
పని చేసుకో.. పర్సంటేజీ ఇచ్చుకో..
పని ఏదైనా ఆయనకు పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీల విషయంలో రికమండేషన్లు గట్రా ఏమీ పనిచేయవు. ఆయన ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సిందే. పర్సంటేజీ ఇచ్చుకున్నాక..ఆ పని ఎలా చేసినా ఆయన పట్టించుకోరు. నీరు–చెట్టు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనులు..ఇలా ఏ పనైనా ఆయన బినామీలు రంగంలోకి దిగుతారు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పనిచేసేసి, కావాల్సినంత దండుకొని, ఇవ్వాల్సినంత పర్సంటేజీ ఇచ్చుకొని చేతులు దులుపేసుకుంటారు. ఇది కొండపిలో అభివృద్ధి పనుల పేరుతో సాగిన కమీషన్ల బాగోతం..! స్వయాన అధికార పార్టీ నేతలే ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగంగా విమర్శిస్తున్నారంటే అక్కడ ఎంత మేర ప్రజల సొమ్ము దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సాక్షి, కొండపి (ప్రకాశం): అభివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గంలో అధికార పార్టీ సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా నియోజకవర్గంలో పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి టంగుటూరు మండలాలకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకులను ఎమ్మెల్యే స్వామి బినామీలుగా పెట్టుకొని వారితో కోట్లాది రూపాయల పనులు చేయించి భారీగానే జేబులు నింపుకున్నారన్న విమర్శ ఉంది. కొండపి మండలం గోగినేనిపాలెంలోనే సుమారు రూ.3 కోట్ల అభివృద్ధి పనులను తన బినామీ అయిన జరుగుమల్లి మండలం టీడీపీ నాయకుడు చేత చేయించడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక కుగ్రామంలోనే కోటిన్నర రూపాయల అభివృద్ధి పనులను తన బినామీతోనే ఎమ్మెల్యే చేయించారంటే..నియోజకవర్గం మొత్తం ఏ మేర జరిగిందో ఊహించుకోవచ్చని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రతి పనిలోనూ అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు దండుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ పని..ఈ పనని లేదు..ఏ పనైనా.. నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి, పొన్నలూరు, టంగుటూరు, కొండపి మండలాల్లో నలుగురు బినామీలను ఏర్పాటు చేసుకొని నీరు–చెట్టు, కొండపి రింగ్‌రోడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ పనుల అభివృద్ధి పేరుతో భారీగా ముడుపులు దండుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ఒక మహిళా ఎంపీపీ భర్త జరుగుమల్లి మండలం కామేపల్లి నుంచి చిరికూరపాడు మధ్య కోట్లాది రూపాయల ఆర్అండ్బీ రహదారి నిర్మాణం పనులు టెండర్లు చేజిక్కించుకున్నాడు. అయితే వారు కూడా పర్సంటేజీ ఇవ్వాలని ఎమ్మెల్యే పనులను అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌రావు, టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జిల్లా టీడీపీ నాయకులు ఎవరు చెప్పినా వినకపోవడంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో వారు ఎమ్మెల్యేకి పర్సంటేజీ ముట్టజెప్పి పనులు చేసుకున్నట్లు ప్రచారం. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి పనులకు పది పర్సంటేజీ చొప్పున లెక్కకట్టి కమీషన్లు వసూలు చేశాడు. ఈ కమీషన్ల బాగంతోనే నెల రోజులుగా ఎమ్మెల్యే స్వామి అభ్యర్థిత్వాన్ని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారానికి సైతం టీడీపీ నాయకులు డుమ్మా కొడుతున్నారు. ఇసుకను దోచేశారు.. జరుగుమల్లి, కొండపి, సింగరాయకొండ మండలాల్లోని మూసి, పాలేరు, అట్లేరు, మన్నేరు నదుల నుంచి ఐదేళ్లలో లక్షల టన్నులను దోచుకొని కోట్లు దండుకున్నారు. ప్రధానంగా కొండపి నియోజకవర్గంలో నీరు చెట్టు పథకం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. 812 పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.50 కోట్లకు పైగా దండుకున్నారు. పాత పనులకే మెరుగులు దిద్ది ఉపాధి గుంతలకే నీరు చెట్టు పనులుగా కలరింగ్ ఇచ్చి కోట్లు వెనకేసుకున్నారు. ఇక ఉపాధి హామీ పథకం కూడా నేతలకు ఆదాయవనరుగా మారింది. సింగరాయకొండ, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు కొండలను ధ్వంసం చేసి కోట్లాది రూపాయలకు గ్రావెల్ అమ్ముకున్నారు. చెరువుల్లో మట్టి సైతం అమ్ముకుని అక్రమార్జన చేశారు. దండుకుంది ఇలా.. నియోజకవర్గంలో ఐడీసీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పేరుతో రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు తూతూమంత్రంగా జరిగాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరు సరఫరా అయిన పాపాన పోలేదు. కొండపి రింగు రోడ్డు పనులకు ఆర్అండ్బీ నిధులు రూ.30 కోట్లకు పైగా మంజూరు కాగా పర్సంటేజీలు ఇచ్చుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేయడంతో మున్నాళ్లకే బీటీ రోడ్డు మరమ్మతులకు గురయ్యాయి. రూ.54 కోట్ల నిధులతో నియోజకవర్గంలో నిర్మించిన బ్రిడ్జి పనులు సైతం పర్సంటేజీలతో నాసిరకంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు నేతలకు కాసుల వర్షం కురిపించాయి. నాసిరకంగా నిర్మాణాలతో చేసిన పనుల్లో ఒక్కొక్కరు భారీగా జేబులు నింపుకున్నారు. -
అడిగినంత ఇచ్చుకో.. అడ్డగోలుగా చేసుకో
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టు పనుల్లో తన కమీషన్‌తో పాటు అధికారుల వాటా తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లకు తెగేసి చెబుతున్నారు. తనకు కమీషన్లు ఇవ్వకపోతే పనులు మొదలుపెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా టెండర్లో పనులు దక్కించుకుంటే.. సదరు కాంట్రాక్టర్ తనను కలిసేదాకా పనులు మొదలుపెట్టకుండా చూడాలని అధికారులకు సైతం హుకుం జారీచేస్తున్నారు. ఫలితంగా అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సదరు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం కమీషన్ ఇచ్చామనే ధైర్యంతో పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వారిని అధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి. టెండర్ దక్కించుకున్న ‘సాధారణ’ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడదామనుకుంటే.. ఎమ్మెల్యేను కలిసిన తర్వాతే ముందుకు సాగాలని నేరుగా అధికారులే చెబుతుండడంతో ఏమి చేయాలో వారికి పాలుపోవడం లేదు. సదరు ఎమ్మెల్యేను కలిస్తే.. అధికారుల వాటా కూడా కలిపి మొత్తం తనకే ఇవ్వాలని తేల్చిచెబుతుండడంతో కాంట్రాక్టర్లు నోరెళ్లబెడుతున్నారు. ఒకవేళ ఇచ్చేందుకు నిరాకరిస్తే నెలల తరబడి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కాంట్రాక్టర్లతో పాటు అధికారులు వాపోతున్నారు. కక్కలేక..మింగలేక.. వాస్తవానికి ప్రభుత్వ శాఖలో ఏ పని చేయాలన్నా అధికారులకు అంతో ఇంతో కమీషన్ ఇచ్చుకోవడం రివాజుగా మారింది. ఇక అధికార పార్టీ నేతలకు కమీషన్ల వ్యవహారానికి వస్తే స్థానిక నేత వ్యవహారశైలిని బట్టి ఉంటుంది. అయితే, జిల్లాలో మాత్రం ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఏ పనికి టెండర్ పిలిచినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆయన్ను కలిసిన తర్వాతే ముందుకు వెళ్లే పరిస్థితి. గతంలో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆయన్ను కలిసి.. ఆయన చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్లారు. రోడ్డు పనులతో పాటు వివిధ బిల్డింగ్‌ల నిర్మాణం విషయంలోనూ ఇదే పరిస్థితి. మునిసిపాలిటీలో చేపడుతున్న కాంట్రాక్టు పనులు కూడా ఇతరులకు ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇతరులకు దక్కినా.. సబ్ కాంట్రాక్టు కింద తాము చెప్పిన వారికే ఇవ్వాలని అంటున్నారని తెలుస్తోంది. పైగా సదరు సబ్ కాంట్రాక్టర్ల నుంచి ముందుగానే కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. వారు ఎటువంటి నాణ్యత లేకుండా పనిచేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించాల్సి వస్తోంది. అటువైపు వెళితే ఒట్టు! అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీస నాణ్యత లేకుండానే పనులు కానిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం అటువైపుగా చూడడం లేదు. వాస్తవానికి అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి.. టెండర్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా, లేదా అనేది చూడాలి. ఒకవేళ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే నోటీసు జారీచేయాలి. అయితే, సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న ఏ పనులనూ అధికారులు పరిశీలించే సాహసం చేయడం లేదు. -
బో‘ధనాస్పత్రి’
– సర్వజనాస్పత్రికి డబ్బు జబ్బు – వైద్యం కోసం వస్తే ‘చేతివాటం’ చూపుతున్న సిబ్బంది – కాన్పు అయితే రూ.1000 వరకు వసూళ్లు – అత్యవసర కేసులు ‘ప్రైవేట్’కు తరలింపు అనంతపురం మెడికల్ : పెద్దాస్పత్రికి ‘డబ్బు జబ్బు’ చేసింది. ఈ రోగాన్ని నయం చేయాల్సిన సర్వజనాస్పత్రి యాజమాన్యం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ‘వ్యాధి’ ముదురుతున్న వేళ ‘ఆపరేషన్’ చేయాల్సిన ఉన్నతాధికారులు ‘మాటల’తో మాయ చేస్తున్నారు. ఫలితంగా పేదోడికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొంది. కింది స్థాయి సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు ఎవరికి వారు దోచుకోవడమే పరమావధిగా పని చేస్తుండడంతో నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డ పుట్టినా డబ్బు ఇవ్వాల్సిందే ! ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం సురక్షితమని ప్రభుత్వం చెబుతుంటే ఆ ప్రసవంలోనూ కాసుల కక్కుర్తి పడుతున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రి (సర్వజనాస్పత్రి)లోని లేబర్ వార్డులో ఈ అవినీతి వ్యవహారం జోరుగా సాగుతోంది. ఆడబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే రూ.1000 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఫిర్యాదులు వెళ్లినా యాజమాన్యం కఠిన వైఖరి అవలంభించడం లేదు. కాన్పుల గదిలో కొందరు సిబ్బంది కనీసం జాలి కూడా చూపని పరిస్థితి. సిజేరియన్ అంటే పండగే! గర్భిణులకు సిజేరియన్ చేయాల్సి వస్తే సిబ్బందికి పండగే. ఆపరేషన్ థియేటర్ వరకు స్ట్రెచర్‌పై తీసుకెళ్లాలంటే రూ.100, సిజేరియన్ తర్వాత బిడ్డను శుభ్రం చేయాలంటే మరో రూ.200 తప్పనిసరి. అక్కడి నుంచి లేబర్ వార్డుకు తీసుకెళ్లాలంటే మరో రూ.100, డ్రస్సింగ్ చేయాలంటే ఇంకో రూ.100.. ఇలా ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి దోపిడీ చేస్తున్నారు. వార్డుల్లో సిబ్బంది తీరే వేరు సర్వజనాస్పత్రిలోని సర్జికల్, ఆర్థో వార్డుల్లో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది పోయి రోగులను భయభ్రాంతులకు గురి చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులతో ములాఖత్ అయి కేసులను బయటి ఆస్పత్రులకు పంపించేస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు హౌస్ సర్జన్లూ సహకరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల వైఖరిపై విమర్శలు సర్వజనాస్పత్రిలో అడుగడుగునా దోపిడీ జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా ఇక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న చాలా మంది వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కారణంతోనే ఎవరూ దీనిపై దృష్టి సారించడం లేదని సాక్షాత్తూ వైద్యవర్గాలే చెబుతుండడం కొసమెరుపు. ఇబ్రహీం ప్రాణం తీశారు! ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఇబ్రహీం (8) రెండ్రోజుల క్రితం ఎద్దులబండిపై ఆడుకుంటూ కింద పడడంతో గాయపడ్డాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకొస్తే అత్యవసర విభాగంలో పరీక్షించి సర్జికల్ వార్డులో అడ్మిషన్ చేశారు. అయితే ఇక్కడి హౌస్సర్జన్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకులు కుమ్మక్కై కుటుంబ సభ్యుల్లో భయాందోళన సృష్టించారు. ఇక్కడ డాక్టర్లు లేరంటూ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేశారు. అయితే శుక్రవారం రాత్రే ఆ బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యుఒడికి చేరాడు. శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరువల్ల ఇలా ఎందరో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.