బో‘ధనాస్పత్రి’
– సర్వజనాస్పత్రికి డబ్బు జబ్బు
– వైద్యం కోసం వస్తే ‘చేతివాటం’ చూపుతున్న సిబ్బంది
– కాన్పు అయితే రూ.1000 వరకు వసూళ్లు
– అత్యవసర కేసులు ‘ప్రైవేట్’కు తరలింపు
అనంతపురం మెడికల్ : పెద్దాస్పత్రికి ‘డబ్బు జబ్బు’ చేసింది. ఈ రోగాన్ని నయం చేయాల్సిన సర్వజనాస్పత్రి యాజమాన్యం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ‘వ్యాధి’ ముదురుతున్న వేళ ‘ఆపరేషన్’ చేయాల్సిన ఉన్నతాధికారులు ‘మాటల’తో మాయ చేస్తున్నారు. ఫలితంగా పేదోడికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొంది. కింది స్థాయి సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు ఎవరికి వారు దోచుకోవడమే పరమావధిగా పని చేస్తుండడంతో నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
బిడ్డ పుట్టినా డబ్బు ఇవ్వాల్సిందే !
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం సురక్షితమని ప్రభుత్వం చెబుతుంటే ఆ ప్రసవంలోనూ కాసుల కక్కుర్తి పడుతున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రి (సర్వజనాస్పత్రి)లోని లేబర్ వార్డులో ఈ అవినీతి వ్యవహారం జోరుగా సాగుతోంది. ఆడబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే రూ.1000 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఫిర్యాదులు వెళ్లినా యాజమాన్యం కఠిన వైఖరి అవలంభించడం లేదు. కాన్పుల గదిలో కొందరు సిబ్బంది కనీసం జాలి కూడా చూపని పరిస్థితి.
సిజేరియన్ అంటే పండగే!
గర్భిణులకు సిజేరియన్ చేయాల్సి వస్తే సిబ్బందికి పండగే. ఆపరేషన్ థియేటర్ వరకు స్ట్రెచర్‌పై తీసుకెళ్లాలంటే రూ.100, సిజేరియన్ తర్వాత బిడ్డను శుభ్రం చేయాలంటే మరో రూ.200 తప్పనిసరి. అక్కడి నుంచి లేబర్ వార్డుకు తీసుకెళ్లాలంటే మరో రూ.100, డ్రస్సింగ్ చేయాలంటే ఇంకో రూ.100.. ఇలా ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి దోపిడీ చేస్తున్నారు.
వార్డుల్లో సిబ్బంది తీరే వేరు
సర్వజనాస్పత్రిలోని సర్జికల్, ఆర్థో వార్డుల్లో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది పోయి రోగులను భయభ్రాంతులకు గురి చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులతో ములాఖత్ అయి కేసులను బయటి ఆస్పత్రులకు పంపించేస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు హౌస్ సర్జన్లూ సహకరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
అధికారుల వైఖరిపై విమర్శలు
సర్వజనాస్పత్రిలో అడుగడుగునా దోపిడీ జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా ఇక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న చాలా మంది వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కారణంతోనే ఎవరూ దీనిపై దృష్టి సారించడం లేదని సాక్షాత్తూ వైద్యవర్గాలే చెబుతుండడం కొసమెరుపు.
ఇబ్రహీం ప్రాణం తీశారు!
ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఇబ్రహీం (8) రెండ్రోజుల క్రితం ఎద్దులబండిపై ఆడుకుంటూ కింద పడడంతో గాయపడ్డాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకొస్తే అత్యవసర విభాగంలో పరీక్షించి సర్జికల్ వార్డులో అడ్మిషన్ చేశారు. అయితే ఇక్కడి హౌస్‌సర్జన్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకులు కుమ్మక్కై కుటుంబ సభ్యుల్లో భయాందోళన సృష్టించారు. ఇక్కడ డాక్టర్లు లేరంటూ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేశారు. అయితే శుక్రవారం రాత్రే ఆ బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యుఒడికి చేరాడు. శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరువల్ల ఇలా ఎందరో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.