general hospital
-
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
24 గంటలు.. 19 కాన్పులు
సాక్షి,నెహ్రూ సెంటర్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 19 ప్రసవాలు జరిగాయని, వాటిలో 15 సాధారణ, 4 సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసవాల్లో అధిక రిస్క్ కేసులు కూడా ఉన్నాయని, కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సాధారణ కాన్పులను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఈ విజయం సాధించారని వివరించారు. కాన్పుల విభాగం అధిపతి డాక్టర్ బి.వెంకట్రాములు ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు అలేఖ్య, శస్త్ర చికిత్స డ్యూటీ నిపుణులు శైలజ, శ్రావణి, మత్తు విభాగం వైద్యులు శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్ సేవలందించారని తెలిపారు. వారందరనీ కలెక్టర్ శశాంక అభినందించారని పేర్కొన్నారు. -
Nandyal: అత్యాధునికంగా సర్వజనాసుపత్రి
బొమ్మలసత్రం: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. ఈ కోవలోనే నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడంతో పాటు వివిధ విభాగాలకు ప్రత్యేక గదులను నిర్మించింది. ఆసుపత్రి ఏర్పాటైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఆధునీకరించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాల ద్వారా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాల్లో దాదాపు 23 రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. ఇవే కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 గదులను నిర్మించారు. ఇదే సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. అందుబాటులోకి ఆధునాతన వైద్యం నంద్యాల జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల రూపుదిద్దుకుంటోంది. స్థానిక సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే ఓపీ భవనం, జిరియాట్రిక్ భవనం, డీఈఐసీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి రోజు 1,400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని పాడుబడిన భవనంలోనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆసుపత్రి రూపురేఖలు మార్చేయడంతో ఆపరేషన్ థియేటర్లో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ శస్త్ర చికిత్సలన్నీ ఇక్కడే.. ఆర్థో విభాగం: చేతులు, కాళ్లలో విరిగిన ఎముకలకు సర్జరీ, ఎముకలకు రాడ్లు, ప్లేట్లు అమర్చడం చేస్తారు. జనరల్ సర్జరీ విభాగం: హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్, పైల్స్, పిస్టులా, కొలొసెక్టమి, పారాటిడ్, పర్ఫరేషన్, లంప్ బ్రిస్ట్, సింపుల్ థైరాయిడ్, లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు. ఈఎన్టీ విభాగం: అడినో టోన్సిలెక్టోమీ, టింపోనిప్లాస్టి, మిరిన్గోటోమి, సెప్టోప్లాస్టి, ఫెస్, టర్బినో ప్లాస్టి తదితరాలు. అధునాతన యంత్రాలు.. ఉపయోగాలు ► ఎండోస్కోపి యంత్రం: ఈ యంత్రాన్ని రూ.20 లక్షలతో ఏర్పాటు చేశారు. కడుపు లోపలి భాగంలోని అల్సర్, క్యాన్సర్ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది. ► లాప్రోస్కోపి : ఈ యంత్రం దాదాపు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 లక్షలతో ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. కోత లేకుండా శరీరంపై చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ► సీఏఆర్‌ఎం : ఈ యంత్రం ఖరీదు రూ.12 లక్షలు. ఆపరేషన్ తర్వాత ఎముకలు సరైన క్రమంలో అమర్చినట్లు నిర్ధారించుకుంటారు. ► హారిజాంటల్ ఆటోక్లేవ్: ఈ యంత్రాల ఖర్చు రూ.11 లక్షలు. 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు, బట్టలపై క్రిములను నశింపజేస్తాయి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్: ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఈ యంత్రం ద్వారా రోగికి కృత్తిమ ఆక్సిజన్ అందిస్తారు. ఈ యంత్రం ఖరీదు రూ.50వేలు. అవసరానికి తగిన విధంగా ప్రత్యేక గదులు ► సీఎస్ఎస్డీ గది: ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రీ మెటీరియల్‌ను ఆసుపత్రిలో అవసరమయ్యే గదులకు పంపుతారు. ► సెప్టిక్ ఓపి గది: శరీరంలోని గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్ అయితే వారికి ఈ గదిలో చికిత్సలు అందిస్తారు. ► స్టాఫ్ నర్సులు, సర్జరీ వైద్యుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు. ► ప్రీ అనస్తీషియా గది: అనస్తీషీయా డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. ► థియేటర్లో సిలిండర్ స్టోర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలకు ప్రత్యేక గదులు. ► పీజీ విద్యార్థులకు అవసరమయ్యేలా స్టూడెంట్ డెమో గది. ► అనస్తీషియా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు. ► ఆపరేషన్ తరువాత శుభ్రం చేసిన నీటిని డర్టీకారిడార్ ద్వారా బయటకు పంపేందుకు డిస్పోజల్ జోన్. ► ఆపరేషన్ థియేటర్లో మందులు నిల్వకు డ్రగ్స్ స్టోర్. ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించాం నాలుగు నెలలుగా ఆపరేషన్ థియేటర్లో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. రోగులకు శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేస్తాం. ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. – ప్రసాదరావు, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, నంద్యాల -
బర్త్ కంపానియన్.. భర్త సమక్షంలో పురుడు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలో ఓ గర్భిణీకి భర్త సమక్షంలో ‘బర్త్ కంపానియన్’విధానంలో కాన్పు చేశారు వైద్యులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెచ్‌వోడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి, గాయత్రి, స్టాఫ్‌నర్స్ అరుణ నూతన విధానంలో శ్రీలత(23) అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ సమయంలో ఆమె భర్తను లేబర్‌రూం లోనికి పిలిపించారు. ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో గర్భిణీలో భయం, ఒత్తిడి, ఆందోళన ఉంటుందని, ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదని వైద్యసిబ్బంది తెలిపారు. అందుకే భర్తగానీ, మనసుకు దగ్గరైనవారుగానీ ఆమె చెయ్యి పట్టుకోవడం, తల నిమరడం వంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్ త్వరగా విడుదలై నొప్పులు ఎక్కువగా వచ్చి త్వరగా సుఖప్రసవం అవుతుందని వివరించారు. ఈ విధానంలో శిశువు బొడ్డుతాడును తండ్రితో కత్తిరించడం ద్వారా అతడు గొప్ప అనుభూతిని పొందడమే కాకుండా భార్య ప్రసవవేదనను దగ్గరుండి చూస్తే, ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పుగదిలోకి గర్భిణులు తమ భర్త, అమ్మ, అత్త, చెల్లి.. ఇలా ఇష్టమైనవారిలో ఒకరిని అనుమతిస్తామని చెబుతున్నారు. ఈ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉండగా, మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తున్నారు. -
జిల్లా ఆస్పత్రికి వెళ్లినా అంతే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లికి చెందిన గర్భిణికి కాళ్లు, ఒంటినొప్పులు ఎక్కువగా ఉండటంతో గురువారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో గర్భిణికి పీపీఈ కిట్ వేసి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో సహా ఎక్కడికక్కడే కాన్పులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. ఈనెల 25న అచ్చంపేట ఆస్పత్రిలో ఘటన నేపథ్యంలో.. జిల్లా ఆస్పత్రి నుంచి గర్భిణి తరలింపు విమర్శలకు తావిస్తోంది. దీనిపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం వివరణ కోరగా.. ఆస్పత్రి వచ్చిన గర్భిణికి కరోనా పాజిటివ్‌తో పాటు రక్తం తక్కువగా ఉండటంతో హైరిస్కు కేసుగా భావించి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా తరలించామని చెప్పారు. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్‌లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్‌లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్‌ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
చెమటలా కారుతున్న రక్తం
నల్లగొండ టౌన్: కోట్ల మందిలో ఒకరికి యుక్త వయస్సులో వచ్చే జబ్బు (హెమటైడ్రోసిస్)గా చెబుతున్న ఓ వ్యాధిని నయం చేసిన ఘనత నల్లగొండ జిల్లా మెడికల్ కళాశాల జనరల్ ఆస్పత్రికి దక్కింది. మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడేనికి చెందిన వి.వెంకట్‌రెడ్డి కుమారుడు శంకర్‌రెడ్డి (11)కి మనిషికి చెమటకారినట్టు శరీర భాగాల నుంచి రక్తం కారేది. 2017 ఆగస్టు నుంచి ఆ విద్యార్థి శరీరంలోని ముఖం, చెంపలు, చేతులు, కాళ్ల మీద నుంచి రక్తం కారడం మొదలైంది. నిత్యం పది నుంచి పదిహేనుసార్లు ఇలా జరిగే ది. వెంకట్‌రెడ్డి తన కుమారుడిని నల్లగొండ, హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెండేళ్ల పాటు తిప్పారు. రూ. లక్షలు ఖర్చు చేసినా.. వైద్యులు నయం చేయలేకపోయారు. వ్యాధి నిర్ధారణ ఇలా.. 2018 డిసెంబర్లో తన గ్రామానికే చెందిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సురేశ్‌రెడ్డికి తన కుమారుడి వ్యాధిని గురించి వెంకట్‌రెడ్డి వివరించారు. శంకర్‌రెడ్డికి ఆస్పత్రిలో పలురకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు గత రి పోర్టులను పరిశీలించారు. చివరకు ఇంటర్నెట్లో వైద్యరంగానికి చెందిన లిటరసీలో సెర్చ్ చేయడంతో వ్యాధి గురించి తెలిసింది. విద్యార్థి హెమటైడ్రోసిస్‌తో బాధపడుతున్నట్లు సురేశ్‌రెడ్డి నిర్ధారణకు వచ్చారు. జనరల్ ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికి త్స ప్రారంభించారు. వ్యాధి నుంచి వారం రోజుల్లో విద్యార్థి కోలుకుంటున్నట్లు గుర్తించి అవుట్ పేషంట్‌గా చికిత్స అందించారు. నాలుగు నెలల తర్వాత శంకర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా వాటి కళ్లుగప్పి మరీ చోరీ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు, ప్రజలు, రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రికి వివిధ ప్రాంతాల నుంచి రోజూ ఓపీకి 3వేల మంది దాకా, ఇన్‌పేషంట్లుగా, 1500 మంది చేరుతుంటారు. రోజూ 8 వేల మంది దాకా సహాయకులు వస్తుంటారు. వీరితో పాటు వైద్యులు, నర్సులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిసి 2,500 మంది దాకా పనిచేస్తున్నారు. ఇన్ని వేల మంది తిరుగుతున్న ఆస్పత్రిలో సెక్యూరిటీ అధ్వాన్నంగా ఉంది. సెక్యూరిటీ కోసం గత ప్రభుత్వం ఆసుపత్రిలో జై బాలాజీ సెక్యూరిటి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ ఐదు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కొంత మంది ఉద్యోగం మానేశారు. ఉన్న వారిలో అధిక శాతం నిరాశానిస్పృహలతో పనిచేస్తున్నారు. వరుస దొంగతనాలతో ఆందోళన ఆస్పత్రిలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ఓపీ టికెట్లు ఇచ్చే ప్రాంతంలో డబ్బులు తస్కరిస్తున్నారు. ఒక్కో రూపాయి పోగుచేసుకుని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని వచ్చిన వారి బ్యాగ్‌లను లాఘవంగా బ్లేడ్‌తో కట్ చేసి పర్సులు దొంగిలిస్తున్నారు. ఇదే విధం గా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, గైనకాలజి, పీడియాట్రిక్స్, ఎక్స్‌రే విభాగం, అల్ట్రాసౌండ్, సిటి స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్‌ల వద్ద దొంగలు మాటు వేసి మరీ చోరీకి పాల్పడుతున్నారు. ఇవేగాక వార్డులో చికిత్స పొందుతున్న వారి వద్దకు వైద్యులుగా వైద్యసిబ్బందిలాగా వెళ్లి డబ్బులు, సెల్ఫోన్లు చోరీ చేస్తున్నారు. సీసీ కెమెరాల తీగలు కత్తిరించి... ఆస్పత్రిలో రక్షణకు, దొంగతనాలు, గొడవల నివారణకు గాను లక్షల రూపాయలు వెచ్చించి 185 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు కెమెరాలు మార్చారు. అయితే కెమెరా కంట పడితే దొరికిపోతామని దొంగలు వాటి తీగలు కట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రిలోని 185 కెమెరాల్లో 35కి పైగా కెమెరాలు పనిచేయడం లేదు. ప్రధానంగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో తీగలు వరుసగా కట్ చేస్తున్నారు. దీంతో చోరీ ఘటనలు చూసే అవకాశం లేకుండా పోతోందని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీ సంఘటనలు జనరల్ సర్జరీ విభాగంలో సెకండియర్ పీజీ చదువుతున్న డాక్టర్ ప్రవీణ్ గత శనివారం రాత్రి 12.30 గంటలకు హాస్టల్‌కు వచ్చి తన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్(ఏపీ39 ఎఫ్ 0809)ను బయట లాక్ చేసి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీని విలువ దాదాపు రూ.2లక్షలు. మూడు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో హౌస్‌సర్జన్ చేస్తున్న డాక్టర్ సతీష్ గత నెల 29వ తేదీన క్యాజువాలిటి ఎదురుగా బైక్‌ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చేలోగా బైక్ కనిపించలేదు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రితో పాటు ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ దొంగ చోరీ చేసినట్లు గుర్తించారు. అయితే అందులో దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఓర్వకల్లుకు చెందిన రామక్క తన భర్తకు చికిత్స చేయించేందుకు గత నెల 18న ఆసుపత్రికి వచ్చారు. ఓపీ కౌంటర్వద్ద ఓపీ టికెట్ తీసుకుని బయటకు వచ్చేలోగా చేతి కవర్లోని డబ్బులను తస్కరించారు. కవర్‌ను బ్లేడ్‌తో కత్తిరించి, అందులోని డబ్బుల కవర్‌ను చోరీ చేశారు. దీంతో ఆమె రోదిస్తూ ఇంటికి వెళ్లిపోయింది. నందికొట్కూరుకు చెందిన ధనుంజయ కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 26న ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలని రాశారు. స్కానింగ్ చేయించుకుని బయటకు వచ్చేలోగా అతని తమ్ముని వద్ద ఉన్న పర్సును దొంగలు కొట్టేశారు. -
పేరుకు పెద్దాస్పత్రి!
తూప్రాన్: అది పేరుకు పెద్దాస్పత్రి.. అందుతున్న సేవలు మాత్రం అంతంతే. అరకొర సిబ్బంది, అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే రోగులు, వారి సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో తూప్రాన్ డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రతి డివిజన్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 50 పడకల ఆస్పత్రులను మంజూరు చేశారు. జిల్లాలో తూప్రాన్, నర్సాపూర్‌లో ఈ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే 2018 జనవరి 17న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. ఆస్పత్రిలో తగిన వైద్య పరికరాలు లేక, మౌలిక సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్య గతంలో తూప్రాన్‌లో పీహెచ్సీ కొనసాగిన సందర్భంలో నిత్యం రోగుల సంఖ్య 100లోపు మాత్రమే ఉండేది. 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిత్యం 350 మంది వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. నెలకు సుమారు 11 వేల మంది ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం సరైన వైద్యులు లేక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యుల వివరాలు ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న వైద్యులు, వివిధ విభాగాలకు సిబ్బంది మొత్తం కలిపి 52 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే నియమితులవడం గమనార్హం. ఆస్పత్రిలో దంతవైద్యుడు ఉన్నప్పటికీ చికిత్స కోసం ఉపయోగించాల్సిన సామగ్రి లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల వైద్యురాలు ఉద్యోగంలో చేరిన వారం రోజులకే ప్రసూతి సెలవుపై వెళ్లింది. ఆస్పత్రి ప్రారంభించిన ఏడాదిన్నర తర్వాత నెల రోజుల క్రితం ఆస్పత్రి ఆవరణలో సరైన మౌలిక వసతులు లేకుండానే మార్చూరీ గదిని ప్రారంభించారు. రాత్రివేళ కరెంటు పోతే.. సెల్‌ఫోన్ లైటే గతి రాత్రివేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడితే ఇక అంతే సంగతులు. రోగులు, చిన్నపిల్లలు, బాలింతలు అంతా అంధకారంలో మగ్గాల్సిందే. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రికి వచ్చిన వారికి సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లే దిక్కవుతున్నాయి. అసలే మండుతున్న ఎండలకు తోడు కరెంటు పోతే ఉబ్బరంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు ఆపరేషన్లు చేయాల్సి ఉండగా రాత్రి 9 గంటలకు వైద్యులు అంతా సిద్ధం చేసుకున్నారు. 8.30 గంటలకు గాలిదుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆపరేషన్లను మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సిబ్బంది కొరత వాస్తవమే.. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉంది వాస్తవమే. నియామకం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు జరగలేదు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించలేకపోతున్నాం. ఆస్పత్రిలో జనరేటర్ లేని కారణంగా కరెంటు సరఫరాలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం– డాక్టర్ అమర్‌సింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కాన్పు కోసం వస్తే కాదన్నారు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి సిబ్బంది ఓ నిండు గర్భిణికి వైద్య సాయం అందించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కాన్పు కోసం వచ్చిన ఆ మహిళను హైదరాబాద్ వెళ్లాలంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వగా.. బయటకు రాగానే నొప్పులు తీవ్రమై ఆ గర్భిణి ఆస్పత్రి ముఖద్వారం వద్దే ప్రసవించిన ఘటన ఇది. మహబూబ్‌నగర్ ధన్వాడ మండల కేంద్రానికి చెందిన బాలకిష్టమ్మను కాన్పు కోసం మంగళవారం ఉదయం ధన్వాడ పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడి సిబ్బంది జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి పంపించారు. దీంతో సాయంత్రం 5 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలకిష్టమ్మకు వైద్యం చేయాల్సిందిగా కుటుంబీకులు కోరినా అక్కడి వైద్యులు, సిబ్బందిని స్పందించలేదు. బుధవారం ఉదయం బాలకిష్టమ్మకు 2 సూదులు ఇచ్చి శిశువు బరువు తక్కువగా ఉన్నందున హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. తాము పేద వాళ్లమని, హైదరాబాద్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నందున ఇక్కడే ప్రసవం చేయాలని కోరినా నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కలసి బాలకిష్టమ్మను ఆమె భర్త బాలస్వామిని ఆస్పత్రి బయటకు పంపారు. బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లో బాలకిష్టమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. మళ్లీ ఆమె భర్త లేబర్ రూంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరినా స్పందించలేదు. ఉదయం 11 సమయంలో అక్కడ ఉన్న మహిళల సాయంతో బాలకిష్టమ్మ ఆస్పత్రి ముఖద్వారం వద్దే మగశిశువుకు జన్మనిచ్చింది. మీడియా సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా బాలకిష్టమ్మ, శిశువును ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. హైదరాబాద్ వెళ్లాలని సూచించినా వెళ్లలేదు.. దీనిపై జిల్లా జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరిం టెండెంట్ డాక్టర్ జీవన్‌ను వివరణ కోరగా, బాలకిష్టమ్మకు బుధవారం ఉదయం ఉమ్మ నీరు పోతుంటే లేబర్ రూంకు తరలించి పరీక్షలు చేయగా శిశువు బరువు తక్కువగా ఉన్నట్లు తేలిందని, దీంతో హైదరాబాద్ నిలోఫర్‌కు వెళ్లాలని సూచించినా వాళ్లు వెళ్లకుండా అక్కడే ఉన్నారని తెలిపారు. దీంతో నొప్పులు తీవ్రమై ప్రసవించిందన్నారు. శిశువు బరువు తక్కువగా ఉండడంతో చికిత్స చేస్తున్నామని చెప్పారు. -
నవరత్నాలు
శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం ఆరు కావొచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్దపెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటోవాలాలు.‘‘ఏంది సత్యం, రేచలమ్మగారికి పాలు పొయ్యడానికా?’’ అని అడిగాడు జానీ.‘‘ఔనన్నా..! ఇప్పటికే ఆలస్యం అయింది’’ అన్నాడు సత్యం.‘‘ఏం తిప్పలు సత్యం? మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్లి పోయవచ్చుగా! గేదెను తోలుకెళ్లి ఆవిడగారి ముందు పిండాలా?’’ అన్నాడు జానీ నవ్వుతూ.‘‘ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు. తను చూస్తుండగా పిండాలంటుంది’’ అన్నాడు సత్యం.నల్ల సత్యం రేచల్ ఇంటి గేటు తీసుకుని గేదెను లోపలకి తోలుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.‘‘అమ్మగారూ! అమ్మగారూ..!’’ అని తలుపు తట్టాడు.ఎవరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. ‘‘అమ్మగారూ.. అమ్మగారూ..!’’ అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్లాడు సత్యం. ఎవరూ పలకడం లేదు.‘ఎవరూ లేరా ఏంది?’ అనుకుంటూ బెడ్రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తురు మడుగులో చచ్చిపడుంది.సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. ‘‘అమ్మగార్ని చంపేశారు’’ అంటూ అరవసాగాడు. శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధి జనంతో నిండింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియమ్స్ చర్చిఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్లకి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలానగర్. రేచల్ హత్యవార్త తెలియగానే ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు.రేచల్‌ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువ లేదు. పదివేలు పోయి ఉండొచ్చునన్నాడు విలియమ్స్. బంగారు నగలు ఏమీలేవు ఇంట్లో. అంతా లాకర్లో పెట్టామని కూడా చెప్పాడు.రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు దుర్మార్గులు అని వాపోయారంతా.రేచల్కి అరవై ఏళ్లున్నా చాలా ఆరోగ్యంగా ఉంది. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తనే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్‌లో ఉన్న మొక్కలే ఆ విషయం చెబుతాయి.‘‘రేచల్కి డెయిరీ మిల్క్ అంటే ఇష్టం ఉండదు. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవంటుంది. ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ మిల్క్‌నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు’’ అని పోలీసులకు చెప్పాడు విలియమ్స్. రేచల్ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు పోలీసులు. ‘‘సార్! రేచల్ హత్య డబ్బు, నగలు దొరుకుతాయని దొంగలు చేశారని నాకు అనిపించడం లేదు’’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథ్. ‘‘ఇంకెవరు చేసి ఉంటారు? ఆమె భర్త ఫాస్టర్. ఆయనకు శత్రువులు ఉంటారా?’’అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్.‘‘ఎందుకుండరు సార్? ఆయనేమైనా అజాతశత్రువా? నేరాలు డబ్బు కోసం, ఆడవాళ్ల వ్యవహారంలో, ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్!’’ అన్నాడు రంగనాథ్.ప్రవీణ్, రంగనాథ్‌లు వెళ్లేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులున్నారు. విలియమ్స్ వాళ్లని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.‘‘విలియమ్స్ గారూ! చెప్పండి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్యను హత్య చేసేంత పగబట్టిన వాళ్లు?’’ అడిగాడు ప్రవీణ్.విలియమ్స్ తల అడ్డంగా ఊపాడు.‘‘లేదండీ! మాకు శత్రువులు ఎవరు ఉంటారు?’’ అన్నాడు.‘‘శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకోవద్దు సార్! ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య మీ ఆస్తి పంపకాలు జరిగాయనీ, కొడుకు, కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.విలియమ్స్ ఇన్స్పెక్టర్వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆల్ఫ్రెడ్ డాక్టర్. గుంటూరు జనరల్ హాస్పిటల్లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనుక అగ్రహారంలో ఓ పాత బిల్డింగ్ ఉంది. వెయ్యి గజాల్లో చిన్నచిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగ్ తనకు రాసివ్వమన్నాడు పెద్దోడు. తను డాక్టర్ కనుక ఆ బిల్డింగ్ పడగొట్టి హాస్పిటల్ కడతానన్నాడు. చిన్నోడిని రెంటచింతలలో ఉన్న పది ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నోడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్‌లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తరఫు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయమని బలవంతపెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయం అంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే! ‘అంతు తేలుస్తాను’ వంటి మాటలు వాడింది’’ చెప్పాడు విలియమ్స్. ‘‘చివరికి ఎలా పరిష్కారం చేశారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘నేను చెప్పినట్టు బిల్డింగ్ పెద్దోడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్లు విల్లు రాసి, మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేస్తాం’’ అని రేచల్ బెదిరించింది. ‘‘ఆ తర్వాత ఏం జరిగింది?’’‘‘ఆల్ఫ్రెడ్ తమ్ముడికి నచ్చజెప్పాడు. మీరు ఇప్పట్లో గుంటూరు రారు. బెంగళూరులో స్థిరపడతారు. ఇక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు కట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరి సగం పంచుకుందామన్నాడు. హెన్రీ కూడా అన్న మాట విన్నాడు. ఆ బిల్డింగ్ ఆల్ఫ్రెడ్‌కి రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం. దీనికి వత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘కోపం ఉంటే ఉంటుంది కానీ అత్తను చంపేంత ఉందని అనుకోను’’ అని నిట్టూర్చాడు విలియమ్స్.‘‘అయితే దొంగలు చేసిన హత్యే అని నమ్ముతున్నారా?’’‘‘నా నమ్మకంతో పనేముంది? నేరస్తుడిని ఆ జీసస్ బయటపెడతాడు’’ అని విలియమ్స్ దేవుణ్ని తలుచుకున్నాడు.‘‘మీకు ఒక కూతురు కూడా ఉంది కదా? ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి పది లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికే అని విల్లు రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘మీ అల్లుడు ఏం జాబ్ చేస్తాడు?’’‘‘మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. ఏదో బిజినెస్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఏటుకూరు రోడ్డులో జిన్నింగ్ మిల్లును లీజుకు తీసుకొని నడుపుతున్నాడు’’ చెప్పాడు విలియమ్స్. జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కి పిలుపు వచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్లి ఆయన్ని కలిశాడు. ‘‘ఇన్స్పెక్టర్ గారూ! రేచల్ బాడీ పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు ఆమె కుడిచెయ్యి గుప్పిట మూసుకొని ఉంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్లు తెరిచి చూస్తే, ఈ రింగ్ బయటపడింది’’ పోస్మార్టమ్ రిపోర్టుతో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.ఇన్స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది . ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయల్దేరాడు ఇన్స్పెక్టర్.నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఇన్స్పెక్టర్! మీకు ఈ రింగ్ ఎక్కడిది?’’ అడిగాడు విలియమ్స్.‘‘చెప్పండి! ఈ ఉంగరం ఎవరిది?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్.‘‘ఈ రింగ్ మా అల్లుడు చార్లెస్ది’’ అన్నాడు. చార్లెస్‌ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు.‘‘మిస్టర్ చార్లెస్! మీ అత్త రేచల్‌ని ఎందుకు మర్డర్ చేశారు?’’ కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. ‘‘మా అత్తను నేను మర్డర్ చేశానా? నో.. సార్!... నో.. నేను చెయ్యలేదు’’ వెలవెలపోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్.‘‘మమ్మల్ని బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు. కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మీ ఉంగరం ఆమె చేతిలోకి వచ్చింది. మీరు అది గమనించలేదు. ఎక్కడో జారిపోయిందని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీరువాలో డబ్బు తీసుకొని బట్టలను చిందరవందరగా పడేశారు’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తలవంచుకొని చెప్పసాగాడు. ‘‘సార్! మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ. కూతురు పరాయిది. పది లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం? ఇంకేంది మీకిచ్చేది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా భాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్‌ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. నా భార్యకు కూడా ఇచ్చి ఉంటే, పెద్ద బామ్మర్ది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్‌కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే. చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం నా భార్యకు రాశారు. తదనంతరం అంటే ఎప్పుడు? వాళ్లు పోయాక? ఇప్పట్లో పోతారా? ఏ ఇరవై ఏళ్ల తర్వాత సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం. అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చజెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను’’ చెప్పాడు చార్లెస్.‘‘చార్లెస్! మీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కాదా? కోర్టుకి వెళ్లి న్యాయం పొందాల్సింది. హత్యలు పరిష్కారం కావు?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.‘‘నవరత్నాలు అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు. కానీ అవే నిన్ను జైలుపాలు చేశాయి’’ చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. - వాణిశ్రీ -
మూడోసారి మంటలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ /సర్పవరం : కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మరోసారి మంటలు వ్యాపించాయి. ఈసారి ప్రత్యేక నవజాతి శిశు అత్యవసర చికిత్సా కేంద్రంలో మంటలు చేలరేగాయి. శిశువులకు ఆక్సిజన్ అందించే సీపీఎఫ్ మిషన్ అగ్నికి మాడి మసి అయిపోయింది. తక్షణమే అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే 30 మంది శిశువులున్న వార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకునేది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని శిశువులతో పరుగులు సోమవారం రాత్రి ఏడు గంటల మధ్యలో ప్రత్యేక నవజాత శిశు అత్యవసర చికిత్సా కేంద్రం సీపీఎఫ్ మిషన్ షార్ట్ సర్క్యూట్‌కు గురై మంటలు వ్యాపించాయి. శిశువులకు ఆక్సిజన్ అందించే మీషీన్లో మంటలు చెలరేగడంతో శిశువులతో కలిసి తల్లులు ఆందోళనతో బయటికి పరుగులు తీశారు. ప్రమాదాలను అదుపు చేసే సీఓ2, డీసీపీ వంటి పరికరాలు లేకపోవడంతో వెంటనే మంటలు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీసిన శిశువులు, బాలింతల ఆర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణ దద్దరిల్లింది. తమ ప్రాణాలు పోయేవని శిశువులను పట్టుకుని తల్లులు రోదిస్తుంటే చూసిన ప్రతి ఒక్కర్నీ కదిలించడమే కాకుండా కంటతడిపెట్టించింది. ఆ సమయంలో ఆ వార్డులో 30 మంది శిశువులతో బాలింతలున్నారు. మంటలు ఏ మాత్రం వ్యాపించినా వార్డులో భారీ ప్రమాదం జరిగేది. మూడోసారి... ఇరవై ఐదు రోజుల్లో జీజీహెచ్‌లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం మూడోసారి. గత కొన్ని రోజుల క్రితం మందుల సరఫరా విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏసీలు, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ముందులు కాలి బూడిదయ్యాయి. పది రోజుల క్రితం మానసిక వికలాంగుల ఓపీ పక్కన, బ్లడ్ బ్యాంక్‌కు ఆనుకుని ఉన్న రికార్డు రూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బ్లడ్ బ్యాంకు, ఎక్స్‌రే విభాగానికి చెందిన ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి. తాజాగా సోమవారం ప్రత్యేక నవజాత శిశువు అత్యవసర చికిత్సా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆసుపత్రిని తలుచుకుంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో పిల్లల వార్డులో, ఎక్స్‌రే విభాగం దగ్గర, సర్టికల్ వార్డు పై అంతస్తులో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదే నిర్లక్ష్యం... చిన్నారులు చనిపోతున్నా, తల్లులు మృతి చెందుతున్నా...ఆసుపత్రిలో ప్రమాదాలు సంభవిస్తున్నా... అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. కలెక్టర్ పట్టించుకోరు...ఆసుపత్రి అధికారులు సీరియస్‌గా తీసుకోరు...వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘సర్కారీ’ వైద్యం విస్తృతం
జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి. రోగులకు ఆన్లైన్ వసతులు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే అన్ని విభాగాల వైద్యసేవలు ఆన్లైన్లో కొనసాగనున్నాయి. వార్డుల్లోనే రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు తీస్తారు. నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలోనే ఈ–ఆస్పత్రి విధానం లో సేవలందిస్తున్న ఏకైక దవాఖానా మన జిల్లా ఆస్పత్రే. గతేడాది నుంచి ‘ఈ– విధానం’ అందుబాటులోకి రాగా, ఈ సేవలను మరింత విస్తరించనున్నారు. మొన్నటివరకు రోగులు కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. రిజిస్ట్రేషన్ ఒకచోట, వైద్య సేవలు మరో చోట అందిస్తుండ గా, ప్రస్తుతం ఆ పద్ధతి మార నుంది. ఇప్పు డు అన్ని విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కలగనుంది. ప్రతి విభాగంలో .. ఏడంతస్తుల ఆస్పత్రిలో ఒక్కో అంతస్తులో ఒక్కో విభా గంలో సేవలందిస్తున్నారు. మొదటి అంతస్తులో గైనిక్, కంటి విభాగాలు, రెండో అంతస్తులో జనరల్ మెడిసిన్, చిన్న పిల్లల వార్డు, మానసిక వైద్య నిపుణులు, టీకాల విభాగం, మూడో ఫ్లోర్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, నాలుగో ఫ్లోర్ లో టీబీ, ఆయుర్వేదిక్, నాచురోపతి, ఐదో అంతస్తులో ఏఆర్టీ సెంటర్, ఆరో ఫ్లోర్లో చెవి, దంత వైద్య విభాగాలు, ఏడో ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్ ఉన్నాయి. అయితే, ఆయా విభాగాలన్నింటికీ గతంలో ఒక్కచోటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. త్వరలోనే అన్ని విభాగాల వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయి. రోగి నేరుగా తమకు కావాల్సిన విభాగానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే, ఆ వెంటనే వైద్యసేవలు అందిస్తారు. అంతా ఆన్లైన్లోనే.. రోగి సంబంధిత విభాగంలో పేరు నమోదు నుంచి చికిత్సల వరకు మొ త్తం వివరాలన్నీ ఆన్లైన్లో నమోదవు తాయి. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి అతనికి అందించిన వైద్య సేవలు, వివిధ పరీక్షల వివరాలు వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. పేషెంట్‌కు కేటాయించే నెంబర్ ఆధా రంగా ఆస్పత్రిలో ఎక్కడి నుంచైనా ఆయా వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో మాదిరిగా రక్త పరీక్షలకు, ఎక్స్‌రేకు ఆయా విభాగాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ఆస్పత్రిలో లోకల్ ఏరియా నెట్వర్క్ (లాన్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో ఆయా విభాగాలు ఎక్కడ ఉన్నాయో రోగికి తెలిసేలా ప్రవేశ మార్గంలోనే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్ఫర్మేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నలుగురు సిబ్బంది రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. త్వరలో అందుబాటులోకి.. త్వరలోనే అన్ని విభాగాల్లో పేర్ల నమోదు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా సత్వర వైద్య సేవలు అందుతాయి. రోగులకు అందించే అన్ని వైద్యసేవలను ఆన్లైన్లో పొందుపరుస్తాం. రోగులకు మరింత చేరువచేస్తాం. – డాక్టర్ బన్సీలాల్, ఈ–ఆస్పత్రి ఇన్చార్జి రోగులకు ఇబ్బందులు లేకుండా.... ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపరుస్తున్నాం. అన్ని విభాగాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వైద్య సేవలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ప్రభుత్వాస్పత్రి సిబ్బందా.. మజాకా!
- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - పోస్టుమార్టం చేయకుండానే మృతదేహం అప్పగింత - తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలంటూ ఫోన్ - ఒక రోజు ఆలస్యంగా అంత్యక్రియలు - వైద్య సిబ్బంది తీరుపై బంధువుల ఆగ్రహం ఆస్పరి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండానే బంధువులకు అప్పగించి తర్వాత దాన్ని తిరిగి తెప్పించిన కర్నూలు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై తీవస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈనెల 6న ఆస్పరికి చెందిన రాళ్లదొడ్డి మాబుసాబ్ పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మాబుసాబ్‌ను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కొలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో వైద్యులు మాబుసాబ్ మృతి చెందినట్లు రశీదు ఇచ్చి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. అనంతరం వారు మృతదేహాన్ని ఆస్పరికి తీసుకొచ్చారు. సమాచారం తెలియడంతో కడచూపు కోసంబంధువులందరూ వచ్చారు. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రి నుంచి మాబుసాబ్ బంధువులకు ఫోన్ వచ్చింది. ‘నాన్ ఎంఎల్సీ కేసు అనుకుని మీకు మృతదేహాన్ని అప్పజెప్పాం. అది ఎంఎల్సీ కేసు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలి తిరిగి కర్నూలుకు తీసుకురండి. వెంటనే పోస్టుమార్టం చేసి పంపుతాం’ అంటూ వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అయితే ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మంగళవారం పోస్టుమార్టం చేసి మృతేదేహాన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు ఒక రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. -
కోల్డ్‌వార్
– స్టాఫ్‌నర్సులు వర్సెస్ హౌస్‌సర్జన్స్ – విధుల విషయంలో భేదాభిప్రాయాలు – ఓపీ, వార్డు విధులు బహిష్కరించిన వైనం – తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు – వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ – ఎంబీబీఎస్ విద్యార్థులే డాక్టర్లయిన పరిస్థితి – మధ్యాహ్నం వరకు రోగులను డిశ్చార్జ్ చేయని వైనం అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్ల మధ్య కోల్ట్‌వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నా తాజాగా బహిర్గతమైంది. ఐదు నెలలు కావస్తున్నా స్టైఫండ్ అందడం లేదంటూ హౌస్ సర్జన్లు మంగళవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సైఫ్ఖాన్తో పాటు కొందరు హౌస్సర్జన్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి బకాయిలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఫలితంగానే దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికొచ్చి మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. డాక్టర్లయి ఉండి ఇలా చేయడం మంచిది కాదని, రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ‘స్టైఫండ్’ డిమాండ్ పక్కకు జరిగి విధుల విషయం తెరమీదకొచ్చింది. క్యాజువాలిటీ మొదలు వార్డులు, ఓపీ వరకు తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని హౌస్సర్జన్లు అన్నారు. అయితే స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంజెక్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించడం ఇతరత్రా డ్యూటీల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు చాలా మంది తమకన్నా తక్కువగానే డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చివరకు ఆర్ఎంఓతో పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు హౌస్‌సర్జన్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విధుల బహిష్కరణతో రోగుల కష్టాలు వాస్తవానికి హౌస్సర్జన్లు నల్లబ్యాడ్జీలతో కాసేపు నిరసన తెలుపుతామని చెప్పి ఏకంగా ఓపీ, వార్డు విధులను బహిష్కరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోయారు. దీంతో ఓపీ, వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ గదుల్లో ఒక్కో డాక్టర్ మాత్రమే ఉండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులే వైద్యుల అవతారం ఎత్తి సేవలు అందించారు. ఓపీల్లో నిత్యం ఇద్దరు చొప్పున హౌస్సర్జన్లు విధుల్లో ఉంటారు. వీరు అందుబాటులో లేకపోయే సరిసరికి పరిస్థితి అధ్వానంగా మారింది. డిశ్చార్జ్ కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ ఆస్పత్రిలో నిత్యం పదుల సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవుతుంటారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అష్టకష్టాలు పడ్డారు. ఎఫ్ఎం వార్డులో సుమారు 20 మందిని డిశ్చార్జ్ చేయగా వారంతా హౌస్సర్జన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు 12 గంటల తర్వాత స్టాఫ్‌నర్సులు సమస్యను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఓ హౌస్‌సర్జన్‌ను కేటాయించి.. డిశ్చార్జ్ ప్రక్రియను పూర్తి చేయడం కన్పించింది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని వార్డుల్లోనూ నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఆస్పత్రిలో పరిస్థితి ఇంత వరకు రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 97 మంది వరకు హౌస్సర్జన్లు విధులు నిర్వర్తిస్తుండగా ఏప్రిల్ నెల నుంచి వీరికి స్టైఫండ్ రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగానే ఇప్పుడు విధుల బహిష్కరణ వరకు వచ్చింది. -
పెద్దాసుపత్రిలోని పలు ఘటనలపై విచారణ
సాక్షి, అమరావతి ఇటీవల కర్నూలు పెద్దాసుపత్రిలో జరిగిన పలు ఘటనలపై విచారణ మొదలైంది. వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్) డా.కె.బాబ్జిని ఈ ఘటనలపై విచారణకు ఆదేశించారు. ప్రధానంగా కర్నూలు పెద్దాసుపత్రిలో కరెంటు లేకపోవడంతో 20 మంది చనిపోవడం, ఎలుకల నివారణలో భాగంగా ఒక్కో ఎలుకను పట్టుకునేందుకు రూ.25 వేలు చెల్లించడం, బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీకి నిధులు ఇప్పించేందుకు మంత్రి కామినేని పేషీ నుంచి ఫోన్లు వెళ్లడం తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైనా విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.బాబ్జిని నియమించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో డా.బాబ్జి మంగళవారం కర్నూలు పెద్దాసుపత్రిలో విచారణ చేపట్టారు. -
పెద్దాస్పత్రిలో మళ్లీ విద్యుత్ కోత
- అరగంటపాటు అంతరాయం కర్నూలు(హాస్పిటల్): పెద్దాస్పత్రిలో విద్యుత్ అంతరాయం కొనసాగుతూనే ఉంది. గత నెల నుంచి 21వ తేదీ నుంచి ఈ సమస్య ఆసుపత్రిని వెన్నాడుతోంది. సోమవారం ఉదయం సైతం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆసుపత్రిలోని పవర్ కంట్రోల్‌రూం వద్ద ఉదయం 10 గంటల సమయంలో ఫీజు పోయింది. దీంతో బూత్బంగ్లా, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కేవలం ఐసీయూ, ఓటీలకు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగింది. అరగంట పాటు విద్యుత్ పోవడంతో మళ్లీ ఏదైనా సమస్య తలెత్తిందా అన్న ఆందోళన వైద్యులు, స్టాఫ్‌నర్సుల్లో నెలకొంది. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను గుర్తించి.. పరిష్కరించారు. దీంతో వైద్యులు, రోగులు ఊపిరిపీల్చుకున్నారు. -
పెద్దాసుపత్రికి రూ.3.35 కోట్లు మంజూరు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం రూ.3.35కోట్లు మంజూరు చేస్తూ జీవో-384 జారీ చేశారు. ఈ నిధులను ఆసుపత్రిలో సివిల్ పనులకు వినియోగించనున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధుల నుంచి ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. -
పెద్దాసుపత్రిలో విద్యుత్ సమస్యపై గౌరు ఆగ్రహం
- మంత్రి కామినేని శ్రీనివాస్ తొలగింపునకు డిమాండ్ - సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వెల్లడి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నాలుగైదు రోజులుగా పెద్దాసుపత్రిలోని కొన్ని వార్డులకు నెలకొన్న విద్యుత్ సమస్యపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, బాలింతలుండే వార్డులకు కరెంట్ లేకపోవడంతో తీవ్ర అవస్థలుపడుతున్నారని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా చేసి మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్దాసుపత్రిలో కరెంట్ లేక రోగులు పడుతున్న అవస్థలను నాలుగురోజుల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు దృషికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళలు చేపడతామని ఆయన హెచ్చరించారు. -
డిశ్చార్జ్ కార్డు మారింది..పసిప్రాణం పోయింది
–పెద్దాసుపత్రిలో దారుణం –జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన పాప తల్లిదండ్రులు కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇచ్చే డిశ్చార్జ్ కార్డు మారిపోయింది. ఒకరికి ఇవ్వాల్సిన చికిత్సను మరొకరికి రాసివ్వడంతో ఆ మందులు వాడి ఓ పసిపాప ప్రాణం కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ తల్లిదండ్రులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయమై ఆరు వారాల్లోపు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన రామమద్ది, లక్ష్మిదేవికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక్కతే కూతురు బి.అనూష(8నెలలు). ఈ పాపకు గత ఫిబ్రవరి 20వ తేదిన దగ్గు, ఆయాసం రావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నపిల్లల విభాగంలో వైద్యులు పరిశీలించి అడ్మిషన్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం పాపకు ఆరోగ్యం కుదుట పడటంతో మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ సమయంలో అనూష పేరుతో ఇవ్వాల్సిన డిశ్చార్జ్ కార్డును ఎండి ఇబ్రహీం(18 నెలలు) అనే చిన్నారిది ఇచ్చారు. ఈ బాలుడు ఇదే చిన్నపిల్లల విభాగంలో వాంతులు, విరేచనాలతో ఫిబ్రవరి 27వ తేదిన అడ్మిషన్(ఐపీ నెం.11490) పొంది మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్ అయ్యాడు. ఇద్దరూ ఒకేరోజు డిశ్చార్జ్ కావడంతో ఒకరి డిశ్చార్జ్ కార్డు మరొకరికి ఇచ్చారు. అనూషకు ఇచ్చిన డిశ్చార్జ్ కార్డులో దగ్గు, ఆయాసం తగ్గే మందులు కాకుండా వాంతులు, విరేచనాలు తగ్గే మందులు ఇచ్చారు. అనూష తండ్రి రామమద్ది ఈ విషయం తెలియక మందులు తీసుకుని ఇంటికి వెళ్లి పాపకు వాడుతూ వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత పాపకు తిరిగి ఆయాసం పెరిగి.. మార్చి 7వ తేదిన రాత్రి గళ్ల ఎక్కువగా పడటం, విరేచనాలు అధికంగా కావడంతో భయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ పాప అదే నెల 11వ తేదీన మృతిచెందింది. డిశ్చార్జ్ సమయంలో ఇతర బాలుని మందులు తమ పాపకు రాయడం, వాటిని వాడటం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. ఈ మేరకు వారు ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. స్పందించిన హక్కుల కమిషన్ ఆరు వారాల్లో తమకు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరికి నోటీసులు జారీ చేసింది. -
అమ్మా..మేమేం పాపం చేశాం!
- ఇద్దరు శిశువుల ఆక్రందన - తల్లిదండ్రులు ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం సూచన కర్నూలు(హాస్పిటల్): ‘అమ్మా...మేమేమి మీకు అన్యాయం చేశాం. మమ్ముల్ని ఇలా వదిలేసి వెళ్లిపోయారు. మేము మీకు ఎలా భారమయ్యాము. ఆడపిల్లలమని వదిలేశారా..? అమ్మా మీరు కూడా ఆడవారే కదా.. మమ్మల్ని కరుణించి ఇంటికి తీసుకెళ్లండి ప్లీజ్’ అని దీనంగా వేడుకుంటున్నట్లుగా ఉంది కర్నూలులోని శిశుగృహలో ఉన్న ఇద్దరు చిన్నారుల దీనగాథ. ఈ ఇద్దరు శిశువులకు శిశుగృహ మేనేజర్ మెహతాజ్ పేర్లు పెట్టారు. లక్ష్మీదేవి అనే 16 రోజుల శిశువును గత నెల 29వ తేదీన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో ఉన్న ఎన్ఐసీయూ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పాప బరువు తక్కువగా ఉంది. గొంతు వద్ద వాపు వచ్చింది. దీంతో అక్కడి వైద్యులు వైద్యులు పాపకు తగిన వైద్యం చేసి శిశుగృహకు తరలించారు. మరో పాప శారదకు 18 నెలలు. ఈ పాపను గత నెల 30వ తేదీన స్థానిక బళ్లారిచౌరస్తా సమీపంలోని ఓ వైన్‌షాప్ వద్ద ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి అనుమానస్పదంగా ఎత్తుకుని తిరుగుతుంటే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పాపను సీఐ నాగరాజరావు శిశుగృహహ అధికారులకు అప్పగించారు. వీరిద్దరినీ తగిన ఆధారాలతో గుర్తించి తల్లిదండ్రులు తీసుకెళ్లాలని, లేకపోతే 30 రోజుల తర్వాత సీడబ్ల్యుసీ తీర్మానం ద్వారా అనాథలుగా నిర్ణయించి, చట్టపరంగా దత్తత కోసం ఆన్లైన్లో కోరిన దంపతులకు సీనియారిటీ ప్రకారం ఇస్తామని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం శుక్రవారం తెలిపారు. -
మహిళ గుండెలో 97 కణితులు
–విజయవంతంగా తొలగించిన పెద్దాసుపత్రి వైద్యులు –కూరగాయలు శుభ్రం చేయని ఫలితం కర్నూలు(హాస్పిటల్): కూరగాయలు, మాంసం కడగకుండా తినడంతోఓ మహిళ గుండెలో 97 కణితులు ఏర్పడ్డాయి. వాటిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించి ఊపిరిపోశారు. వివరాలను మంగళవారం ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. కల్లూరు మండలంలోని వెంగన్నబావి సమీపంలో నివసిస్తున్న పెద్దక్క(65) 10రోజుల క్రితం గుండెలో నొప్పి, గుండెదడతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. కార్డియాలజి విభాగంలో ఆమెకు 2డీ ఎకో, సిటీస్కాన్ పరీక్షలు నిర్వహించగా ఆమె గుండెలో 97 కణితులు ఉన్నట్లు బయటపడింది. దీంతో మంగళవారం ఆ మహిళకు ఆపరేషన్ చేసి కణితులు తొలగించినట్లు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సాధారణంగా పొట్టేలు, మేకలు కడగని కూరగాయలను తింటాయి. కూరగాయలపై ఉండే క్రిములు వాటి జీర్ణాశయంలోకి వెళ్లి ఎకినోకోకస్ గ్రాన్యులోసస్ ఆర్గానిజం అనే క్రిమి తయారవుతుంది. అది పెరిగి పెద్దవై వాటి మలం ద్వారా బయటకు వస్తాయన్నారు. ఇవి ఇతర ఆహార పదార్థాలపై వాలుతాయన్నారు. ఇలాంటి కూరగాయలను ప్రజలు కడగకుండా తినడంతో అవి మానవశరీరంలోకి ప్రవేశించి కణితులను సృష్టిస్తాయ’ని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కణితులు 70 శాతం కాలేయంలో, 28 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయని, కానీ పెద్దక్కకు గుండె మధ్యలో వచ్చాయన్నారు. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. -
దిష్టిబొమ్మతో శవయాత్ర
కర్నూలు(హాస్పిటల్): వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు.. కాంట్రాక్టర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్ మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కనీస వేతనాలు ఇవ్వాలని 18 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా.. కాంట్రాక్టర్, అధికారులు స్పందించడం లేదన్నారు. వేతనాలు పెంచకుండా కార్మికుల కడుపుకొడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సి. రమణ, ఎస్. యేసు, రామునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నల్లన్న, నరసింహులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
హృదయాలయం
- జీజీహెచ్‌లో మూడు రోజుల్లో ముగ్గురికి గుండె ఆపరేషన్లు కర్నూలు (హాస్పిటల్): రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అరుదైన గుండెశస్త్రచికిత్సలకు వేదికైంది. మూడు రోజుల్లో మూడు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రాణం పోశారు. ఇందులో ఒకరు జీవిత ఖైదు పడిన ఖైదీ, మరొకరు బాలింత కూడా ఉండటం విశేషం. ముగ్గురికీ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. వివరాలను బుధవారం ఆసుపత్రిలోని కార్డియోథొరాసిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్రరెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే ‘ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దాపురానికి చెందిన ఆర్. వెంటకరెడ్డి(72) ఒక కేసు విషయంలో జీవితఖైదును అనుభవిస్తున్నాడు. ఆయనకు కొరనరి ఆర్టరి డిసీస్ అనే గుండెజబ్బు ఉండటంతో గుండెనొప్పి, ఆయాసంతో బాధపడేవాడు. ఆయనకు గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయి. దీనికితోడు గుండె సైతం ఫుట్‌బాల్ అంత సైజులో పెరిగింది. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఆయనకు జైళ్ల శాఖ నుంచి అనుమతి తీసుకుని కర్నూలులోనే బీటింగ్ హార్ట్ సర్జరీ నిర్వహించాం. బాలింతకు అరుదైన గుండెజబ్బు ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన జి. మాదన్న భార్య సువర్ణ(25)కు ఏడు నెలల పాప ఉంది. బాలింత అయిన ఆమె పాపకు రోజూ పాలివ్వాలి. ఇదే సమయంలో ఆమెకు అరుదైన మైట్రల్ స్టెనోసెస్ అనే గుండెజబ్బు వచ్చింది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం తమ వద్దకు వచ్చింది. గత నెల 29వ తేదీన ఆమెకు క్రాస్ క్లాంప్, స్కిన్ టు స్కిన్ అనే విధానంలో ఆపరేషన్ నిర్వహించాం. రాష్ట్రంలో తొలి గుండెశస్త్రచికిత్స కోడుమూరుకు చెందిన గిడ్డయ్య(45)కు అయోటిక్ స్టెటోసిస్ అనే గుండెవ్యాధి ఉంది. ఆయనకు వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి. ఆయనకు ఛాతి ఎముకలు కట్ చేయకుండా ఈ నెల 1వ తేదీన అరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేశాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి విదానం వల్ల రోగికి తక్కువగా నొప్పి ఉండి, త్వరగా కోలుకునే అవకాశం ఉంది. నెలరోజుల్లోనే ఆయన వంద కిలోల బరువు కూడా ఎత్తే సామర్థ్యం వస్తుంది. -
నేడు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు వైద్య పరీక్షలు
కర్నూలు: పోలీసు శాఖ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ తెలిపారు. ఇటీవల కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన 56 మంది ఆస్పత్రి చార్జీల నిమిత్తం రూ.1500 నగదు, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా ఎస్పీ సూచించారు. -
‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి
- డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు పీఎంను ఆహ్వానిస్తాం - ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(హాస్పిటల్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఊపిరిపోసే ఎక్మో చికిత్సా యంత్రాన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్‌జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని కళాశాలలోని కార్డియాలజీ విభాగంలో ఎక్మో చికిత్సపై వర్క్‌షాప్ నిర్వహించారు. అమెరికాకు చెందిన డాక్టర్ పూబోని సునీల్‌కుమార్, బృందం సభ్యులు కలిసి ఎక్మో చికిత్సా విధానం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఎంతో ఖరీదైన దన్నారు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న రోగికి చికిత్స అందిస్తే 60 నుంచి 70 శాతం సక్సెస్ రేటు ఉందని వైద్యుల మాటలను బట్టి తెలుస్తోందన్నారు. కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చదువుకున్న కళాశాల అభివృద్ధికి కృషి యూకేకు చెందిన ఎక్మో చికిత్సా నిపుణులు డాక్టర్ పూబోని సునీల్‌కుమార్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్నానని, కళాశాల అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచిస్తుంటానని అన్నారు. 2003లో ఓసారి ఎక్మో చికిత్సపై ఈ కళాశాలలో వర్క్‌షాప్ నిర్వహించానని, ఇప్పుడు ఈ ప్రక్రియ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పరికరాలు, ఎలా పనిచేస్తుందనే విషయాలపై చర్చిస్తామన్నారు. ఎక్మో చికిత్స కార్డియాలజీ కార్డియోథొరాసిక్, పీడియాట్రిక్, అనెస్తెషియా వైద్యులు చేయాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో ఎక్మో ఏర్పాటు చేస్తే సాంకేతికంగా తమ వైపు నుంచి ప్రోత్సాహమందిస్తామన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఆధునిక విధానమన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలోని 13 బోధనాసుపత్రుల వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్మో చికిత్సా విధానంపై డాక్టర్ పూబోని సునీల్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్. వెంకటరమణ, రేడియాలజి విభాగాధిపతి డాక్టర్ ఒ.జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా క్షయను నిర్మూలించాలి
కర్నూలు(హాస్పిటల్): సమష్టికృషితో క్షయ వ్యాధిని నిర్మూలిద్దామని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కేంద్రం అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ హెచ్ఐవీ, డయాబెటీస్ ఉన్న వారికి చాలా మందికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి సోకుతుందని చెప్పారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని, కానీ ఆరేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి వస్తే ఇతరులకు సోకదన్నారు. క్షయతో జీవనప్రమాణాలు తగ్గుతాయన్నారు. ఊపిరితిత్తులకే గాకుండా అన్ని అవయవాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ క్షయ పూర్తిగా నిర్మూలించగలిగే జబ్బన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐఎంఏ కర్నూలు అధ్యక్షుడు కైప శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితమే క్షయ ఉందని, కాలక్రమేణా ఈ వ్యాధికి మెరుగైన వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో మరణాల సంఖ్య తగ్గిందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మీనాక్షి మహదేవ్ మాట్లాడుతూ టీబీ మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయని చెప్పారు. అనంతరం క్షయ నిర్మూలనలో విశేష సేవలందించిన డాక్టర్ సుశీల్ ప్రశాంత్, ల్యాబ్‌టెక్నీషియన్ బి. వెంకటేశ్వర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జె. శ్రావణ్‌కుమార్, డి. మౌలాలితో పాటు బెస్ట్ డాట్ ప్రొవైడర్ అంగన్వాడీ వర్కర్‌గా మీనాక్షి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. చివరగా క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన పీజీ వైద్య విద్యార్థులు శశిభరత్కుమార్రెడ్డి, సరితశ్యాముల్(ప్రథమ), పి.కళ్యాణి, శాంతికుమారి(ద్వితీయ), ఎ. గోపీచంద్, సాయికిరణ్(తృతీయ), టి. వినీత, సర్ఫరాజ్, ప్రభావతి, ఇ. వెంకటేశ్వర్లకు జ్ఞాపికలు అందజేశారు. -
పెద్దాసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అరుదైన గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఓ మహిళకు ప్రాణం పోశారు. నందికొట్కూరుకు చెందిన కైరున్‌బీ (55) కొంత కాలంగా ఆయాసం, ఛాతిలో నొప్పితో బాధపడేది. ఇటీవల ఆమె ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకుంది. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి ఆమెను పరీక్షించి గుండె కవాటాల మధ్య జెల్లీ ట్యూమర్ ఏర్పడిందని గుర్తించి, కార్డియోథొరాసిక్ విభాగానికి రెఫర్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఆమెకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా తక్కువ మందిలో అరుదుగా మహిళలకు ఇలాంటి సమస్య ఏర్పడుతుందన్నారు. ట్యూమర్‌ను ముట్టుకోకుండా ఎంతో చాకచక్యంగా దాని మొదలును మాత్రం కట్ చేసి తొలగించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా అరుదన్నారు. ఓబులమ్మ అనే మహిళకు క్లిష్టమైన పద్ధతిలో ఆధునిక పేస్‌మేకర్‌ను సీనియర్ రెసిడెంట్, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్‌రెడ్డి అమర్చినట్లు తెలిపారు. -
బో‘ధనాస్పత్రి’
– సర్వజనాస్పత్రికి డబ్బు జబ్బు – వైద్యం కోసం వస్తే ‘చేతివాటం’ చూపుతున్న సిబ్బంది – కాన్పు అయితే రూ.1000 వరకు వసూళ్లు – అత్యవసర కేసులు ‘ప్రైవేట్’కు తరలింపు అనంతపురం మెడికల్ : పెద్దాస్పత్రికి ‘డబ్బు జబ్బు’ చేసింది. ఈ రోగాన్ని నయం చేయాల్సిన సర్వజనాస్పత్రి యాజమాన్యం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ‘వ్యాధి’ ముదురుతున్న వేళ ‘ఆపరేషన్’ చేయాల్సిన ఉన్నతాధికారులు ‘మాటల’తో మాయ చేస్తున్నారు. ఫలితంగా పేదోడికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొంది. కింది స్థాయి సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు ఎవరికి వారు దోచుకోవడమే పరమావధిగా పని చేస్తుండడంతో నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డ పుట్టినా డబ్బు ఇవ్వాల్సిందే ! ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం సురక్షితమని ప్రభుత్వం చెబుతుంటే ఆ ప్రసవంలోనూ కాసుల కక్కుర్తి పడుతున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రి (సర్వజనాస్పత్రి)లోని లేబర్ వార్డులో ఈ అవినీతి వ్యవహారం జోరుగా సాగుతోంది. ఆడబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే రూ.1000 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో ఫిర్యాదులు వెళ్లినా యాజమాన్యం కఠిన వైఖరి అవలంభించడం లేదు. కాన్పుల గదిలో కొందరు సిబ్బంది కనీసం జాలి కూడా చూపని పరిస్థితి. సిజేరియన్ అంటే పండగే! గర్భిణులకు సిజేరియన్ చేయాల్సి వస్తే సిబ్బందికి పండగే. ఆపరేషన్ థియేటర్ వరకు స్ట్రెచర్‌పై తీసుకెళ్లాలంటే రూ.100, సిజేరియన్ తర్వాత బిడ్డను శుభ్రం చేయాలంటే మరో రూ.200 తప్పనిసరి. అక్కడి నుంచి లేబర్ వార్డుకు తీసుకెళ్లాలంటే మరో రూ.100, డ్రస్సింగ్ చేయాలంటే ఇంకో రూ.100.. ఇలా ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి దోపిడీ చేస్తున్నారు. వార్డుల్లో సిబ్బంది తీరే వేరు సర్వజనాస్పత్రిలోని సర్జికల్, ఆర్థో వార్డుల్లో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది పోయి రోగులను భయభ్రాంతులకు గురి చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులతో ములాఖత్ అయి కేసులను బయటి ఆస్పత్రులకు పంపించేస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు హౌస్ సర్జన్లూ సహకరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల వైఖరిపై విమర్శలు సర్వజనాస్పత్రిలో అడుగడుగునా దోపిడీ జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా ఇక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న చాలా మంది వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కారణంతోనే ఎవరూ దీనిపై దృష్టి సారించడం లేదని సాక్షాత్తూ వైద్యవర్గాలే చెబుతుండడం కొసమెరుపు. ఇబ్రహీం ప్రాణం తీశారు! ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఇబ్రహీం (8) రెండ్రోజుల క్రితం ఎద్దులబండిపై ఆడుకుంటూ కింద పడడంతో గాయపడ్డాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకొస్తే అత్యవసర విభాగంలో పరీక్షించి సర్జికల్ వార్డులో అడ్మిషన్ చేశారు. అయితే ఇక్కడి హౌస్సర్జన్లు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకులు కుమ్మక్కై కుటుంబ సభ్యుల్లో భయాందోళన సృష్టించారు. ఇక్కడ డాక్టర్లు లేరంటూ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేశారు. అయితే శుక్రవారం రాత్రే ఆ బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యుఒడికి చేరాడు. శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బంది తీరువల్ల ఇలా ఎందరో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
స్వైన్‌ఫ్లూ పంజా
జిల్లాలో పెరుగుతున్న కేసులు - ఇప్పటికే నలుగురికి నిర్ధారణ - డోన్‌లో ఒకరి మృతి - మేల్కొనని వైద్య ఆరోగ్య శాఖ - కేఎంసీలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు కర్నూలు(హాస్పిటల్): స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్నూలు నగరంలో ప్రకాశ్‌నగర్‌కు చెందిన ఒకరు, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన ఒకరు, మిడుతూరుకు చెందిన ఒకరు, డోన్ పట్టణానికి చెందిన ఒకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో డోన్‌కు చెందిన మహిళ ఇటీవల మరణించింది. ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌కు వెళ్లి రావడంతో ఇన్ఫెక్షన్కు లోనుకాగా.. ఒకరు చెన్నై నుంచి వచ్చిన సోదరుని కారణంగా ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యాధి జిల్లాలో 2010లో ఒకరికి, 2012లో ఆరుగురికి, 2014లో ఒకరికి సోకగా 2015లో ఏకంగా 32 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 9 మంది మృతి చెందారు. 32 మందిలో కర్నూలు నగరానికి చెందిన 11 మంది ఉండగా.. మిగిలిన వారిలో పెద్దతుంబళం, డోన్, దేవనకొండ, చిప్పగిరి, సి.బెళగల్, లద్దగిరి, ఆస్పరి, ఎమ్మిగనూరు, హుసేనాపురం గ్రామాలకు చెందిన వారున్నారు. గత సంవత్సరం కృష్ణానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకగా, ఈ సంవత్సరం నెల రోజుల్లోనే నలుగురు వ్యక్తులకు వ్యాధి సోకడం.. వీరిలో ఒకరు మృతి చెందడటం ఆందోళన కలిగిస్తోంది. నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ వ్యాధి విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కరపత్రాలు ఆశాలు, ఏఎన్ఎంలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో అవి ప్రజలకు చేరుతున్నాయా లేదా అని పరిశీలించే వారు కరువయ్యారు. దీనికితోడు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితి. ఇందుకు సంబంధించిన మాస్ మీడియా సైతం మొద్దు నిద్రపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలలో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్క్‌లు అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ కారణంగా వ్యాధి లక్షణాలతో వచ్చే రోగులను చూసి వైద్యులు, సిబ్బంది ఆందోళనకు లోనవుతున్నారు. కేఎంసీలోనే వైద్య పరీక్షలు స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణకు గతంలో పూణే ల్యాబ్‌కు గళ్లను సేకరించి పంపించేవారు. ఆ తర్వాత ఇలాంటి పరీక్షలు హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుతం తిరుపతిలో ఈ పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 8వ తేది నుంచి కర్నూలు మెడికల్ కాలేజీలోనూ హెచ్ఎన్ ఎన్‌వన్ ఇన్ఫ్లూయంజా ఎ రియల్‌టైమ్ పీసీఆర్ టెస్ట్ మిషన్‌గా పిలిచే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల వ్యాధి నిర్ధారణ తక్కువ సమయంలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. అయితే స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉందని తేలితే మాత్రం కేవలం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నెం.95 మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. కానీ వైద్యులకే తగినంతగా ఈ మాస్క్‌లు అందుబాటులో ఉంచలేదు. ఈ కారణంగా రెండు సాధారణ మాస్క్‌లను కలిపి రక్షణ పొందుతున్నారు. అరకొరగా స్వైన్‌ఫ్లూ నివారణ వ్యాక్సిన్లు జిల్లా వ్యాప్తంగా 85 పీహెచ్‌సీలు, 20 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణకు కేవలం 100 వాయిల్స్ మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 50 ఇవ్వగా.. నంద్యాల, ఆదోనికి 10 వాయిల్స్ చొప్పున పంపిణీ చేశారు. జిల్లా మొత్తంగా 1800 ఒసల్టమివిర్ 75 ఎంజి మాత్రలను అందుబాటులో ఉంచారు. ఈ మాత్రలను వ్యాధికి గురైన రోగికి రోజుకు రెండు పూటలా ఐదురోజులు, వ్యాధికి గురికాకుండా ఉండేందుకు పక్కనున్న వారికి, వ్యాధిగ్రస్తునికి వైద్యం చేసేవారికి రోజుకు ఒకటి చొప్పున 10 రోజుల పాటు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. మూడు వైరస్ల కలయిక స్వైన్‌ఫ్లూ హెచ్వన్ ఎన్‌వన్ ఇన్ఫ్లూయింజా మూడు రకాల వైరస్ల కలయికతో స్వైన్‌ఫ్లూ వస్తుంది. పందులు, పక్షులు, మనుషుల నుంచి ఈ కొత్త వైరస్ ఉద్భవించింది. పందుల నుంచి ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ వైరస్లు విజృంభిస్తుంది. సాధారణ జలుబు, దగ్గుతో పాటు ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం, వాంతులు, విరేచనాలు అధికంగా వస్తే స్వైన్‌ఫ్లూ లక్షణాలుగా భావించి సమీప ఆసుపత్రిలో చేరాలి. షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు కర్ఛీఫ్ అడ్డం పెట్టుకోవడం, చల్లగాలికి తిరగకపోవడం చేయాలి. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు వాడినా ఫలితం ఉంటుంది. – డాక్టర్ పి.అజయ్‌కుమార్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు -
మిడుతూరు మహిళకు స్వైన్‌ఫ్లూ
కర్నూలు(హాస్పిటల్): నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం ఈమెను కుటుంబ సభ్యులు ఊపిరితిత్తుల పనితీరులో సమస్య రావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను పరిశీలించి టీబీసీడీ వార్డులో చేర్పించారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించి నిర్ధారణ కోసం వైద్యపరీక్షలు చేయించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు సోమవారం ఆసుపత్రి అధికారులకు నివేదిక అందింది. దీంతో ఆమెను పేయింగ్‌బ్లాక్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే డోన్‌లో ఓ మహిళ స్వైన్‌ఫ్లూ సోకి మరణించింది. ఈమెతో పాటు కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వ్యక్తులకు ఈ వ్యాధి సోకిన విషయం విదితమే. -
రోగి బంధువుపై సెక్యూరిటీ సిబ్బంది దాడి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సొంతూరి మహిళను పరామర్శించేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా చావబాదారు. బాధితుని కథనం మేరకు.. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మోహన్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరింది. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు మోహన్‌గౌడ్ వచ్చాడు. ఆమె పరిస్థితి విషమంగా కనిపించడంతో చికిత్స చేయాలని వైద్యులను బతిమిలాడాడు. దీంతో వైద్యసిబ్బందికి, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మోహన్‌గౌడ్‌ను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో మోహన్‌గౌడ్ చెవి కొద్దిగా తెగిపోయింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌గౌడ్ కుటుంబసభ్యులు క్యాజువాలిటి బయట ధర్నా చేశారు. బాధితుడు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎదురుగానే తనను తీవ్రంగా కొట్టారని, కొట్టిన వారిని శిక్షించాలని కోరారు. -
వణుకు
స్వైన్‌ఫ్లూ పడగ నీడలో కర్నూలు –ఒకరికి వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ –పెద్దాసుపత్రిలో చికిత్స –అందుబాటులో లేని ప్రత్యేక మాస్క్‌లు –సిద్ధం కాని ఐసోలేషన్ వార్డు స్వైన్‌ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందేననే ఆందోళన అధికమైంది. ఈ కారణంగా సాధారణ జలుబుతో రోగి వచ్చినా ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది కూడా బెంబేలెత్తుతున్నారు. ఇక వ్యాధి లక్షణాలతో ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ యేడాది ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన ఒకరు, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన ఒకరు వ్యాధి బారిన పడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో వ్యాధి అధికంగా ఉండటంతో వ్యాపార, ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ భయంతో సాధారణ జలుబు, దగ్గు వచ్చినా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇప్పటికే వ్యాధిపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరపత్రాలు, వాల్ పోస్టర్లు అతికించి చేతులు దులుపుకుంటోంది. పెద్దాసుపత్రిలో పూర్తికాని ప్రత్యేక వార్డు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం పేయింగ్ బ్లాక్‌లో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడినప్పుడంతా అధికారులు అప్రమత్తమై ఈ వార్డును తెరుస్తున్నారు. అయితే ఈసారి ఒక రోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా అతన్ని ఏఎంసీలోని ఆర్ఐసీయూలో ఉంచారు. ఐసోలేషన్ వార్డులో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఏర్పాటు కాకపోవడంతో ఇంకా ప్రారంభించలేదు. ఫలితంగా ఏఎంసీలో సాధారణ రోగుల మధ్యే స్వైన్‌ఫ్లూ రోగిని ఉంచడంతో వైద్యులు, సిబ్బందితో పాటు ఇతర రోగులు ఆందోళనకు లోనవుతున్నారు. దీనికితోడు ఆసుపత్రిలో తగినంతగా 95వ నెంబర్ ప్రత్యేక మాస్క్‌లు లేకపోవడంతో వైద్యులు సైతం చికిత్స చేయడానికి జంకుతున్నారు. కనీసం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికైనా ఈ మాస్క్‌లు తెప్పించాలని వారు కోరుతున్నారు. స్వైన్‌ఫ్లూ ఎలా వ్యాపిస్తుందంటే.. ఇది హెచ్1, ఎన్1 అనే ఇన్‌ఫ్లూయాంజా ఏ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. ఇది ‘ఫ్లూ’ మాదిరిగానే ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగంలో సోకటం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంభవిస్తుంది. వ్యాధి లక్షణాలు ః తీవ్రమైన తలనొప్పి, జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఎడతెరపి లేని దగ్గు, ఒళ్లునొప్పులు, చలి, వాంతులు, శ్వాస తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వ్యాధి నివారణ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువ నీటిని, ద్రవపదార్థాలను తాగాలి. శుభ్రమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. తగినంత నిద్ర అవసరం. నోటికి 95వ నెంబర్ మాస్కులు అవసరం. వ్యాధిగ్రస్తులు వాడిన టవాళ్లు, కర్చీఫ్‌లు ఇతరులు వాడరాదు. రద్దీగల ప్రదేశాల్లో తిరగరాదు. షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులు బయట తిరగకుండా ఉంటే మంచిది. ప్రధానంగా బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, షుగర్, కిడ్నీ, ఎయిడ్స్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ల కోసం ఆర్డర్ పెట్టాం ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నాం. సెంట్రల్ ఆక్సిజన్ వర్క్ కాస్త పెండింగ్ ఉంది. ప్రస్తుతానికి ఒక స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తున్ని ఏఎంసీలోని ఆర్ఐసీయూలో ఉంచాం. వ్యాధిగ్రస్తుల కోసం వెంటిలేటర్లు, యాంటివైరల్ మాత్రలు వసల్టామివిర్ ట్యాబ్లెట్లు 75 మి.గ్రా. 1000, సిరప్లు 20 బాటిళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 200 మాస్క్‌లు ఉన్నాయి. ఇంకా 2వేలు కావాలని ఆర్డర్ పెట్టాం. –డాక్టర్ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
రక్త కన్నీరు..!
పెద్దాస్పత్రిలో కిడ్నీ రోగుల వెతలు - ఏ పనీ చేయలేకపోతున్న బాధితులు - అత్తెసరు సౌకర్యాలతో దినదిన గండం - శాశ్వత పరిష్కారానికి డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన కర్నూలు(హాస్పిటల్): ఒకటి కాదు.. రెండు కాదు.. వారానికి మూడు సార్లు డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకోవాలి. ఇలా నెలకు 12 సార్లు, సంవత్సరానికి 144 సార్లు.. ప్రతిసారీ రక్తం తగ్గిపోవడమో, ఐరన్‌లోపం ఏర్పడమో జరుగుతుంది. దీనివల్ల వారికి ఏ పనీ చేతకాదు. జీవితం మంచానికే పరిమితం. కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉద్దానం, సింగోటం, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలే కాదు.. కర్నూలు జిల్లాలోని కిడ్నీ బాధితులనూ ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు పక్కనున్న అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి ప్రాంతాల నుంచి కూడా కిడ్నీ బాధితులు చికిత్స కోసం వస్తారు. వారికి ఆసుపత్రిలోని నెఫ్రాలజి విభాగం సేవలందిస్తుంది. ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేందుకు బీ బ్రాన్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. ఇందులో 20 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. కొత్తగా ఆసుపత్రికి 6 మిషన్లు వచ్చాయి. ప్రస్తుతం 25 మిషన్లు రోగులకు మూడు షిఫ్ట్‌లలో డయాలసిస్ చేస్తున్నాయి. రోజుకు ఇక్కడ 30 నుంచి 40 మందికి డయాలసిస్ చేస్తారు. ప్రస్తుతం స్టేజ్–5లో 104 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్దాసుపత్రిలో ఆరేళ్లుగా కిడ్నీ బాధితుల వివరాలు సంవత్సరం ఓపీ ఐపీ డయాలసిస్ చేయించుకుంటున్న వారు 2011 4,095 978 13,371 2012 5,380 992 12,939 2013 8,621 1228 15,893 2014 9,821 1240 17721 2015 5,036 1,224 16,675 2016 4,472 1,403 14,858 కిడ్నీ బాధితుల డిమాండ్లు ఇవీ...! 1. డయాలసిస్ కోసం పెద్దాస్పత్రిక వచ్చే ప్రతిసారీ రోగితో పాటు సహాయకునికి ఉచిత బస్సు పాస్ ఇవ్వాలి. 2. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. 3. కిడ్నీ రోగులకు చేసే ఫిస్టులా ఆపరేషన్లు ఒకసారి ఫెయిలైనా రెండోసారి కూడా ఎన్టీఆర్ వైద్యసేవలో ఉచితంగా చేయాలి. 4. రోగి అవసరాన్ని బట్టి ప్రతి డయాలసిస్‌కు ఒకసారి బ్లడ్ ఇంజెక్షన్, ఐరన్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇవ్వాలి. 5. డయాలసిస్‌కు వచ్చిన రోజు రోగితో పాటు సహాయకునికి ఆహారం ఉచితంగా ఇవ్వాలి. 6. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాత డయాలసిస్ మిషన్లు మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలి. అక్కడ సిబ్బంది కొరత లేకుండా చూడాలి. రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఆయాసంతో బాధపడే డయాలసిస్ రోగులకు ఉచితంగా నెబిలైజేషన్ పరికరాలు అందించాలి. 7. ప్రభుత్వమే దాతల ద్వారా మూత్రపిండాలు సేకరించి రోగులకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు చేయాలి. ప్రయాణ ఖర్చులకే నెలకు రూ.4వేలు –రాజానందబాబు, ఎమ్మిగనూరు కిడ్నీ ఫెయిలై నేను నాలుగు సంవత్సరాలుగా బాధపడుతున్నా. నేనో ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా.. వ్యాధి వచ్చిన తర్వాత మానేశా. నా భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్ఽ. ఆమె సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. నేను, నాతో పాటు ఒకరు డయాలసిస్‌కు కర్నూలు రావాలంటే నెలకు రూ.4వేలు ప్రయాణ చార్జీలకే అవుతుంది. వైద్యసేవ కింద 10 సార్లు వస్తే ఒక్కసారే టీఏ ఇస్తున్నారు. ఫిస్టులా ఆపరేషన్ ఉచితంగా చేయాలి –శ్రీనివాస్, కర్నూలు నేను గతంలో అపోలో సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసేవాన్ని. కిడ్నీ ఫెయిల్ కావడంతో ఉద్యోగం మానేశా. నాకు వైద్యసేవ కార్డు లేదు. సీఎంసీఓ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్నా. కానీ ప్రతి 10 డయాలసిస్‌లకు ఒకసారి సీఎంసీఓ లెటర్‌ను రెన్యూవల్ చేయించుకోవాలి. వైద్యసేవ కింద కిడ్నీ రోగులకు ఒకసారి ఫిస్టులా ఆపరేషన్ ఫెయిలైతే రెండోసారి ఉచితంగా చేయరు. దీనికి మళ్లీ రోగికి రూ.40వేలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే ఉచితంగా చేయాలి. ఏ పనీ చేయలేకపోతున్నా...! –జి.నరేష్, పోదొడ్డి, ప్యాపిలి మండలం మాది వ్యవసాయ కుటుంబం. నాకు 21 ఏళ్లు. రెండేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. చిన్న వయస్సులోనే రావడంతో ఏ పనీ చేయలేకపోతున్నా. ఆసుపత్రిలో ఎరిట్ప్రొటీన్(బ్లడ్ ఇంజెక్షన్), ఐరన్ ఇంజక్షన్లు రోగి అవసరం మేరకు ప్రతిసారీ ఇవ్వాలి. వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయాలి. ఏ పనీ చేయకపోతున్న మాకు నెలకు రూ.5వేల భృతి ఇవ్వాలి. ఉచిత బస్‌పాస్ ఇవ్వాలి –ప్రకాశం, సి.బెళగల్ మాది సి.బెళగల్ మండం కొండాపురం. నాకు ఒక ఎకరం పొలం ఉంది. వ్యవసాయంతో పాటు కూలీ పనిచేసుకునేవాన్ని. సంవత్సరం కిందట కిడ్నీ ఫెయిలైంది. అప్పటి నుంచి వారంలో మూడు రోజులు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాలి. వచ్చిన ప్రతిసారీ ప్రయాణ ఖర్చులు రూ.200 అవుతోంది. ప్రభుత్వం ఉచిత బస్సు పాస్‌ను కిడ్నీ బాధితులకు ఇస్తే కొంత సాంత్వన కలుగుతుంది. -
భవనంపై నుంచి కింద పడి..
యువకుడి మృతి - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని న్యూ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సుంకన్న గౌండా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు నల్లబోతుల సురేష్(21) నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజిలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో గతంలో సెంట్రింగ్ పనికి వెళ్లేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనితో పాటు ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న గైనకాలజీ విభాగం(ఎంసీహెచ్ భవనం)లో ఐదో అంతస్తు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అందరూ పని ముగించుకుని కిందకు దిగారు. చీకటి పడటంతో సురేష్ సైతం కిందకు దిగే ప్రయత్నం చేస్తుండగా అదుపు తప్పి ఐదో అంతస్తు నుంచి కిందకు పడ్డాడు. వెంటనే తలపగలి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కాలేజికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో మేనమామ ఊరికి వెళ్తానని సురేష్ చెప్పినా ఈ రోజు ఒక్కరోజు వెళ్లిరా అని తాను పంపించడంతోనే పనికి వచ్చి ఇలా మృత్యువుపాలయ్యాడని తల్లి శ్యామలమ్మ కన్నీటి పర్యంతమైంది. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సౌకర్యాలు కల్పించక పోవడంతో యువకుడు చీకట్లో కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటల సమయంలో చీకటి పడటం, లైట్లు ఏర్పాటు చేకపోవడంతో ప్రమాదం జరిగింది. -
వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడి బలి
- మూత్రం రావడం లేదని తెలిపినా పట్టించుకోని సిబ్బంది - రాత్రంతా నరకయాతన అనుభవించి మృతి - నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన నూనెపల్లె: వైద్యుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పలుకరించే నాథుడు కరువయ్యారు. పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపించినా అక్కడి సిబ్బంది గుండె కరుగలేదు. ప్రాణం పోయిన తర్వాత మా తప్పేమి లేదని తప్పుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అక్కలపల్లె గ్రామానికి చెందిన నర్రా చిన్న అల్లూరెడ్డి (42) దినసరి కూలీ. శుక్రవారం గిద్దలూరు పట్టణంలో పనులు ముగించుకుని ఇంటి వస్తుండగా ఓ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా అక్కడి వైద్యులు సిటీ స్కానింగ్‌కు సూచించడంతో శనివారం నంద్యాలకు వచ్చారు. పట్టణంలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్ మిషన్ పనిచేయక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి పక్కటెముకలు విరిగాయని ధ్రువీకరించి అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో మూత్రం రాక అల్లూరెడ్డి పొట్ట ఉబ్బింది. రాత్రి 11 గంటల సమయంలో సమస్య తీవ్రం కా వడంతో వైద్యులు, నర్సుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించ లేదు. ఉదయం విధులకు హాజరైన నర్సుల పరిసి్థతిని వివరించగా సూచించగా డ్యూటీ డాక్టర్ వస్తారని చెప్పింది. ఉదయం 10 గంటల సమయలో అల్లూరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించలేదని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తంతో ఆందోళనకు దిగారు. భర్త మృతితో భార్య సుబ్బలక్ష్మమ్మ రోదిస్తూ సొమ్మసిల్లి పడి పోయింది. మృతుడికి ముగ్గురు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు వివాహమైంది. విచారణ చేస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్, సూపరింటెండెంట్, నంద్యాల ఆసుపత్రి అల్లూరెడ్డికి పక్కటెముకలు విరగడంతో ఆసుపత్రిలో చేర్చుకున్నాం. మొదట పరిస్థితి బాగానే ఉంది. రాత్రి సమయంలో వైద్యం అందని విషయంపై విచారణ చేస్తాం. డ్యూటీలో ఉన్న సిబ్బంది, డాక్టర్ నుంచి వివరాలు తెలుసుకుని, మృతుడి కటుంబనికి న్యాయం చేస్తాం. -
కన్నా.. భయపడకు..!
- విద్యుత్ సౌకర్యానికి నోచుకోని మహిళా ఆసుపత్రి - చీకటిలోనే మహిళ ప్రసవం ఓ మహిళ కడుపుతో ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి రండి.. తల్లీబిడ్డా క్షేమమంటూ వైద్య సిబ్బంది ఇంటికొచ్చి చెప్పారు. నెల నెలా వచ్చి ఆరోగ్య సలహాలు చెప్పారు. బిడ్డ భద్రం అంటూ ఎన్నో సూచనలు ఇచ్చారు. గర్భిణుల విషయంలో ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా అని ఆశ్చర్యపోయింది. తీరా ఆసుపత్రికి వెళ్తేగానీ అధికారుల తీరు ఆమెకు అర్థం కాలేదు. గర్భంలో ఉన్న తన బిడ్డకు చీకటి ప్రపంచాన్ని పరిచయం చేయాల్సి వస్తుందని. ప్రసవ వేదనలోనే ‘కన్నా భయపడకు’ అంటూ పేగు తట్టి బిడ్డకు గుండె ధైర్యాన్నిచ్చింది. అందమైన లోకంలోకి అడుగుపెట్టిన శిశువుకు చీకటే స్వాగతం పలికింది. - జూపాడుబంగ్లా పారుమంచాల మహిళా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పేరుకే 24గంటల ఆసుపత్రి. సౌకర్యాలు అంతంత మాత్రమే. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సుహాసిని ప్రసవవేదనతో ఆసుపత్రికి చేరుకుంది. అయితే కాన్పుల వార్డులో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఽస్టాఫ్‌నర్సు సుప్రజ టార్చిలైట్లు, సెల్ఫోన్ల వెలుతురులోనే మహిళకు ప్రసవం చేయాల్సి వచ్చింది. సుఖప్రసవంలో జన్మించిన మగ శిశువుకు శ్వాస ఆడకపోవటంతో వెంటనే 108లో నందికొట్కూరుకు తరలించారు. ఏటా ఆసుపత్రి అభివృద్ధికి రూ. లక్షల్లో నిధులు మంజూరవుతున్నా కనీసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వైద్యుల నిర్లక్ష్యాన్ని నిదర్శనంగా నిలుస్తోంది. నా చేతుల్లో ఏమి లేదు: మహేశ్వర ప్రసాద్, వైద్యాధికారి ఆసుపత్రిలోని కాన్పుల వార్డుకు విద్యుత్ సౌకర్యం లేక చాలా రోజులైంది. ఇన్వర్టర్ ఏర్పాటు చేసినా పని చేయడం లేదు. విద్యుత్ ఏర్పాటు విషయం నా చేతిలో లేదు. -
పనిచేయని ‘క్యాష్ ..పాస్’
కర్నూలు(హాస్పిటల్): పెద్దాస్పత్రిలో క్యాష్..పాస్ పేరుతో డెబిట్‌కార్డులపై నగదు పంపిణీ కార్యక్రమం ఒక్కరోజుకే పరిమితమైంది. నగదు లేక రోగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రెండు వారాల క్రితం జిల్లా అధికారులు కౌంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం రెండు గంటలు మాత్రమే ఇది పనిచేసింది. ఆ తర్వాత బ్యాంకు అధికారులు రాలేదు.. కౌంటరూ తెరవలేదు. ప్రజలు మాత్రం.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గాకుండా కనీసం పెద్దాసుపత్రిలోనైనా నగదు దొరుకుతుందని ఆశించి వచ్చి భంగపడుతున్నారు. -
పెద్ద ఆసుపత్రి భవనం నుంచి పడి ఇద్దరికి గాయాలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనంపై నుంచి పడి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రమాదానికి లోనై వారూ ఆసుపత్రి పాలయ్యారు. వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న స్వామిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాడు. ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లో ఉన్న మొదటి అంతస్తులో ఆయనను వైద్యులు ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు చిన్నత్త వెంకటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి గురువారం పేయింగ్ బ్లాక్‌కు వచ్చింది. స్వామిరెడ్డి భార్య స్వర్ణలతతో మాట్లాడుతూ గదిలోని బాల్కనికి చేరుకుంది. బాల్కనికి ఉన్న గ్రిల్‌కు ఆనుకుని మాట్లాడుతుండగా అప్పటికే తుప్పు పట్టిన గ్రిల్ కాస్తా విరిగిపోయింది. వెంటనే ఇద్దరూ అదుపు తప్పి కిందపడ్డారు. కుటుంబసభ్యులు స్పందించి చికిత్స నిమిత్తం క్యాజువాలిటీకి తరలించారు. వెంకటేశ్వరమ్మకు కాలు, చేయి విరగ్గా, స్వర్ణలతకు వెన్నుపూసకు గాయమయ్యింది. వీరికి ఎక్స్‌రే, సిటిస్కాన్ తీయించి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గ్రిల్ విరిగి తమ వారు కింద పడి గాయాల పాలయ్యారని కుటుంబసభ్యులు ఆరోపించారు. -
సీమలో తొలిసారిగా బీటింగ్ హార్ట్ సర్జరీ
–పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు గుండె పనిచేస్తుండగానే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళాలను విజయవంతంగా సరిచేశారు. వివరాలను సోమవారం ఆసుపత్రిలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్కు చెందిన తిరుపాల్‌నాయక్(42) నెలరోజుల క్రితం గుండెపోటుతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాడు. కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆయనకు ప్రథమ చికిత్స అందించి, అనంతరం యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. గుండెకు రక్తం సరఫరా చేసే మూడునాళాల్లో ఒకటి మూసుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. అన్ని రకాల వైద్యపరీక్షల అనంతరం గత శనివారం కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహ్మద్అలి నేతృత్వంలో గుండె కొట్టుకుంటుండగానే బైపాస్ సర్జరీ చేశారు. డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీటింగ్ హార్ట్ సర్జరీ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. హార్ట్‌లంగ్ మిషన్ సహాయం లేకుండానే ఆఫ్మిషన్ పద్ధతిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. వెంట్రుకవాసి కంటే సన్నటి దారంతో 8 కుట్లు వేశామన్నారు. రోగికి 12.30 గంటలకు ఆపరేషన్ పూర్తయితే సాయంత్రం 4.30 గంటలకే వెంటిలేటర్ తొలగించామన్నారు. ఇలాంటి ఆపరేషన్‌లో రక్తస్రావం తక్కువగా ఉంటుందని, నొప్పి కూడా ఎక్కువగా ఉండదన్నారు. అందువల్ల రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలున్న వారికి ఇలాంటి ఆపరేషన్ ఎంతో ఉపయోగకరమన్నారు. ఎన్టిఆర్ వైద్యసేవ పథకం కింద ఈ ఆపరేషన్‌ను రోగికి ఉచితంగా చేశామని, అదే ప్రైవేటులో అయితే రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ విభాగం ప్రారంభమైన రెండు నెలలు కూడా కాకముందే 19 గుండెశస్త్రచికిత్సలు చేశామని, అందులో 12 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఉన్నాయన్నారు. ఈ విభాగంలో అన్ని రకాల వసతులు, సదుపాయాలు, మందులు ఉన్నాయి కాబట్టే ఇలాంటి శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని వివరించారు. సమావేశంలో కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రి ప్రగతికి ‘గ్రీన్’ సిగ్నల్
–అత్యవసర పరికరాల కోసం రూ.5.5కోట్లు –ఆసుపత్రిలో పచ్చదనం పెంపునకు రూ.50లక్షలు –అవుట్‌సోర్సింగ్‌లో స్ట్రెచ్చర్ బాయ్స్ నియామకం - తీర్మానాలకు ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రగతికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్..గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచించిన అజెండాలోని తీర్మాలన్నింటికీ ఆమోదం తెలిపారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం మోర్టాన్హాల్లో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన జరిగింది. వర్కింగ్ చైర్మన్ జి. మంజునాథరెడ్డి, సభ్యులు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కె. అనురాధ, కె. మహేష్‌గౌడ్, ఎం. శ్రీనివాసులు, పి. రవికుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన సభ్యుల ఎన్నికకు జీవో రావడంతో సమావేశం నిర్వహించడం ఆలస్యమైందన్నారు. గత సమావేశంలో 17 తీర్మానాలు చేశామని, అందులో 10 పూర్తి చేశామన్నారు. ఆసుపత్రిలో గార్డెనింగ్ కోసం రూ.50లక్షలు మంజూరు చేస్తామని, పనులను మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. రెండురోజుల్లో ఇందుకు సంబంధించి రూ.25లక్షలు బదిలీ చేస్తామన్నారు. ధోబీఘాట్, క్యాంటీన్లకు సంబంధించి అగ్రిమెంట్ డిసెంబర్లో ముగుస్తుందని, ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆసుపత్రులో పందులను పెంచి పోషించేది ఇక్కడి సిబ్బందే అని తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు వెనుకాడబోమన్నారు. ఆసుపత్రిలోని రోగులకు ఇకపై ప్యాకింగ్ చేసిన బ్రెడ్‌నే ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం ఆసుపత్రిలో జరిగే అభివృద్ధి, సమస్యలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇకపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, వచ్చే సమావేశం జనవరిలో ఉంటుందన్నారు. కొత్తగా చేసిన తీర్మానాలు ఇవే...! 1. రిపేరిలో ఉన్న మూడు ఆర్వో ప్లాంట్ల మరమ్మతు 2. అవుట్సోర్సింగ్ విధానంలో స్ట్రెచ్చర్ బాయ్స్ నిర్వహణ 3. అత్యవసర పరికరాల కొనుగోలుకు రూ.5.5కోట్లు మంజూరు 4. ఆసుపత్రి ముందుగా ఉన్న షాపులను తొలగించి, వాటి స్థానంలో ఆసుపత్రి ఆవరణలో ఓ చోట నిర్మాణం 5. సీటీ సర్జరీ కార్పస్ ఫండ్‌కు రూ.5లక్షలు 6. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద 250 కేవీ జనరేటర్ కొనుగోలు 7. ఏఎంసీ విభాగానికి 10 వెంటిలేటర్ల కొనుగోలు 8. ఎన్టీఆర్ వైద్యసేవలో చికిత్స పొందే రోగులు ఖర్చు పెట్టే మొత్తం తిరిగి చెల్లింపు 9. బ్లడ్‌బ్యాంకులో అవుట్సోర్సింగ్ సిబ్బంది రెన్యువల్ 10. రెండువారాల్లో ఆసుపత్రి నుంచి పందులు, కుక్కలు తరలింపు 11. త్వరలో పార్కింగ్ టెండర్ 12. ప్రైవేటు సంస్థల సహకారంతో ఆసుపత్రిలోని ఐదు ఎకరాల్లో ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా సోలార్‌ప్లాంట్ ఏర్పాటు -
చిన్నారికి ప్రాణం పోశారు
- పుట్టుకతోనే అతుక్కున్న అన్నవాహిక, శ్వాసకోశ నాళాలు – పాలు కూడా తాగలేని దయనీయ స్థితి – ఆపరేషన్ ద్వారా ఊపిరి పోసిన వైద్యులు – పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స కర్నూలు (హాస్పిటల్): పుట్టుకతోనే ఆ చిన్నారికి అన్నవాహిక, శ్వాసకోశ నాళాలు అతుక్కుని జన్మించింది. దీంతో పాలు తాగినా అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి పొరపోయి ప్రాణం పోసే పరిస్థితి. ఆరు నెలల పాటు చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ప్రముఖ ఆసుపత్రులన్నీ తిరిగారు. చివరకు పెద్దాసుపత్రికి రావడంతో వైద్యులు గుర్తించి ఆపరేషన్ ద్వారా ప్రాణం పోశారు. సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన మోహన్, లక్ష్మీదేవి దంపతులకు ఆరు నెలల క్రితం జహీర్ జన్మించాడు. బాబుకు పుట్టుకతోనే అన్నవాహిక, శ్వాసనాళం కలయికతోనే జన్మించాడు. ఆరు నెలల పాటు ఆ శిశువును ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులకు చూపించినా సమస్యను గుర్తించలేకపోయారు. గత నెల 10వ తేదీన బాబును తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి తీసుకొచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగాచార్యులైన డాక్టర్ జె.వీరాస్వామి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జి. చలపతి, డాక్టర్ కె. నరసింహరావు, డాక్టర్ జీబీ రమణ పరిశీలించారు. అన్ని రకాల పరీక్షలు చేసి బాబుకు పుట్టుకతోనే అన్నవాహిక, శ్వాసనాళం కలిసి ఉన్నట్లు గుర్తించారు. గత నెల 22వ తేదీన తమతో పాటు అనెస్తెటిస్ట్ డాక్టర్ అనిత కలిసి ఆ బాబుకు ఆపరేషన్ ద్వారా మూడు గంటల పాటు శ్రమించి అన్నవాహిక, శ్వాసనాళం వేరుచేశారు. బాబు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వీరాస్వామి, డాక్టర్ చలపతి మాట్లాడుతూ ఇలాంటి వ్యాధిని వైద్యపరిభాషలో హెచ్ టైప్ ఆఫ్ ట్రాకీ ఓసోఫోగల్ ఫిస్టులా అంటారని తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేయకపోతే ఈ శిశువు ఊపిరితిత్తుల్లోకి క్షయం చేరి చెడిపోతాయన్నారు. ఈ రకమైన వైకల్యం 80వేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సను చేయడం రాయలసీమలోనే ఇదే మొదటిసారన్నారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒక శిశువు చిన్న బ్యాటరీని మింగిన తర్వాత అన్నవాహిక, శ్వాసనాళం కలిసి పోయిందన్నారు. దీనివల్ల బిడ్డకు శ్వాసకోశంలో క్షయంతో ఈ ఆసుపత్రిలోనే చేరిందని తెలిపారు. ఈ బిడ్డకు వ్యాధిని గుర్తించి తగిన శస్త్రచికిత్స చేశామన్నారు. -
క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు
పెద్దాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కామినేని –ఏపీఎంఎస్ఐడిసి ఈఈ బదిలీకి సిఫారసు కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. సోమవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా పెద్దాసుపత్రిని తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆసుపత్రిలోని ఓపీ టికెట్ కౌంటర్ విభాగాలను పరిశీలించారు. రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా అవసరమైనన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ నుంచి సూపర్‌స్పెషాలిటీ విభాగాలను పరిశీలించారు. మధ్యలో పాత సర్జికల్ వార్డులు శిథిలావస్థలో కనిపించడం, పైపులైన్ పనులు జరుగుతుండటాన్ని ఆయన గమనించారు. పనులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్వహణ పనుల కోసం రూ.3.5కోట్లు విడుదల చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదంటూ మండిపడ్డారు. పాతభవనాలన్నీ కూలగొట్టాలని చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఎక్కడంటూ ఆరా తీశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖ ఎండీతో ఫోన్లో మాట్లాడారు. మీ అధికారుల పనితీరు ఏం బాగాలేదని, మీరే వచ్చి ఒకసారి పనులు పరిశీలించాలని చెప్పారు. వెంటనే ఈఈ ఉమాశంకర్‌ను రీకాల్ చేసి మారుమూల ప్రాంతానికి బదిలీ చేయాలంటూ ఫోన్లో ఆదేశించారు. అనంతరం ఆయన సూపర్‌స్పెషాలిటీ విభాగాలను సందర్శించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేజ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు. -
ఆ.. పిల్లలే కదా!
చిన్నారులకు అరకొర వైద్యం – పెద్దాసుపత్రిలో వైద్యుల కొరత – పడకలు 80.. చిన్నారులు 200లకు పైగానే.. – పోస్టులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం - సహనాన్ని పరీక్షిస్తున్న పరికరాలు - విమర్శలకు తావిస్తున్న ప్రభుత్వ తీరు అప్పుడే జన్మించిన శిశువు మొదలు.. 12 ఏళ్ల పిల్లల వరకు చికిత్స పొందే పెద్దాసుపత్రి చిన్న పిల్లల విభాగంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. వైద్యులు.. పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడం చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. పడకలకు మించి చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడున్న వైద్య పరికరాలు కూడా వైద్యుల సహనాన్ని పరీక్షిస్తుండటం గమనార్హం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇందులో నాల్గవ యూనిట్‌ను ఎంసీఐ తనిఖీలకు ఏర్పాటు చేసుకున్నా ప్రభుత్వం నుంచి అనుమతి రాని పరిస్థితి. మొత్తం మూడు యూనిట్లకు కలిపి మూడు ప్రొఫెసర్, రెండు అసోసియేట్, ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం రెండు ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ప్రతిరోజూ ఓపీకి 300 మందికి పైగానే చిన్నపిల్లలు చికిత్స కోసం వస్తారు. అందులో రోజూ 30 నుంచి 40 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ప్రతి యూనిట్‌కు 20 పడకలు చొప్పున నాలుగు యూనిట్లకు 80 పడకలు ఉండగా.. ఇక్కడ చేరే చిన్నపిల్లలు మాత్రం 200 వందలకు పైగానే ఉంటున్నారు. అనుమతిలేని ఎన్ఎస్యూఐ, పీఐసీయూ చిన్నపిల్లల విభాగంలో ఇన్సెంటివ్ కేర్ చికిత్స కోసం ఏర్పాటు చేసిన పీఐసీయూకు, ఏడాదిలోపు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌యూఐలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతివ్వలేదు. ఇక్కడ వైద్యులు, పారా మెడికల్, సిబ్బంది పోస్టులనూ మంజూరు చేయలేదు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ విభాగం వైద్యులే ఇక్కడా సేవలందిస్తున్నారు. ఎన్ఐసీయూలో ముగ్గురు వైద్యులు, 50 మంది సిస్టర్లు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడి వైద్య పరికరాలు సైతం పాతబడిపోయి వైద్యుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎస్‌సీఎన్‌యూలోనూ ఇదే పరిస్థితి నవజాత శిశువుల ఆరోగ్యం కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఎస్‌సీఎన్‌యూలోనూ వైద్యుల కొరత వేధిస్తోంది. ఇక్కడ ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో చిన్నపిల్లల విభాగం వైద్యులే ఇక్కడా సేవలందిస్తున్నారు. ఇక్కడ 20 పడకలు మంజూరు కాగా నిత్యం 50 నుంచి 60 మంది చిన్నారులు చికిత్స అందుకుంటారు. ఈ కారణంగా ఒక ఇంక్యుబేటర్, వార్మర్లలో ఇద్దరు, ముగ్గురు శిశువులకు చికిత్స అందించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం చిన్నపిల్లల విభాగంలో అవసరమైనంత వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని, అవసరమైన పరికరాలు పంపాలని మూడేళ్లుగా ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా లేదు. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా వైద్యులు ఎంతో సహనంతో సేవ చేస్తున్నారు. –డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ -
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు రద్దు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు అందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా, పత్రికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారంగా ఉద్యోగులను నియమించుకున్నారని ఫిర్యాదులు రావడంతో గత సంవత్సరం ఆసుపత్రిలో పనిచేసే 29 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి తొలగించారు. తమను అక్రమంగా తొలగించారంటూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు పట్ల అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. -
పెద్దాసుపత్రిలో అరుదైన గుండె శస్త్ర చికిత్స
– మూడించుల గాటుతో గుండె ఆపరేషన్ – ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలో ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్ మరోసారి ఘనత సాధించింది. ఇక్కడి వైద్యులు అరుదైన గుండె ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించారు. పెళ్లి కావాల్సిన ఓ యువతికి పెద్దగాటు పెట్టకుండా మూడించుల గాటుతో గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం మొదటిసారని వైద్యులు ప్రకటించారు. దీంతో పాటు ఓ గిరిజన బాలికకు సైతం ఓపెన్‌హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. వివరాలను సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి సమక్షంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి వివరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన సాయిప్రియ(16) హద్రోగ సమస్యతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందన్నారు. ఆమెకు మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీని ఆదివారం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే గొంతు కింద నుంచి కడుపు వరకు పెద్దగా కోసి చేస్తారని, కానీ సాయిప్రియకు పెళ్లి కావాల్సి ఉండటంతో గాటు కనిపించకుండా ఛాతీ కింద భాగంలో మూడించుల గాటు పెట్టి ఆపరేషన్ చేశామన్నారు. అలాగే ఆత్మకూరు మండలం పాలెంచెరువు గ్రామానికి చెందిన భారతమ్మ(13) అనే బాలిక జన్మతః గుండెకు రంధ్రం ఏర్పడి బాధపడుతుండటంతో ఆమెకు సైతం ఓపెన్‌హార్ట్ సర్జరీ ఆపరేషన్ చేశామన్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి శనివారం రూ.4లక్షల విలువైన పరికరాలు వచ్చాయన్నారు. దీంతో ఆదివారం ఆపరేషన్ చేయడానికి వీలు కలిగిందని ఆయన తెలిపారు. ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. సాయిప్రియకు చేసిన ఆపరేషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిసారి నిర్వహించామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ రెండు, మూడుచోట్ల మాత్రమే ఇలాంటి సర్జరీ చేశారని తెలిపారు. బెంగళూరులో అయితే రూ.3లక్షలకు పైగా ఈ సర్జరీకి వసూలు చేస్తారని వివరించారు. వచ్చే ఆదివారం డబుల్ వాల్యు రీప్లేస్మెంట్ సర్జరీలు చేయనున్నట్లు తెలిపారు. పారామెడికల్ సిబ్బంది లేకపోవడమే సమస్య ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగానికి పారామెడికల్ సిబ్బంది లేకపోవడం సమస్యగా మారిందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా నియమించుకోవాలని డీఎంఈ లేఖ పంపించారన్నారు. జిల్లా కలెక్టర్ ఈ పోస్టుల నియామకానికి త్వరగా ఉత్తర్వులు ఇస్తే రోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫర్ఫూజనిస్ట్లను పిలిపించి ఆపరేషన్ చేస్తున్నామన్నారు. ఇక్కడే సిబ్బంది నియమిస్తే వారానికి మూడు, నాలుగురోజులు ఆపరేషన్లు చేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో న్యూరోసర్జన్ డాక్టర్ డబ్లు్య. సీతారామ్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, అనెస్తీషియా వైద్యులు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు. -
రేపు వరల్డ్ హార్ట్ డే ఉత్సవాలు
– కేఎంసీలో వైద్యవిజ్ఞాన సదస్సు – సునయనలో అవగాహన సదస్సు కర్నూలు(హాస్పిటల్): వరల్డ్ హార్ట్ డే ఉత్సవాలను ఈ నెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు కార్డియాలజిస్టు, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 గంటలకు కళాశాలలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్డియో సీఎంఈ–2016 సదస్సు ప్రారంభమవుతుందన్నారు. అడ్వాన్సెస్ ఇన్ కార్డియాక్ ఇమేజింగ్‌పై డాక్టర్ షేక్ మౌలాలి(విజయవాడ), రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్‌పై డాక్టర్ ఎస్. శరత్చంద్ర(హైదరాబాద్), హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సర్జరీపై డాక్టర్ ఆర్వీ కుమార్(హైదరాబాద్), డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ కరొనరి సిండ్రోమ్‌పై డాక్టర్ పి. రమేష్‌బాబు(విజయవాడ) ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సునయన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ హాజరవుతారన్నారు. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ టు సేవ్ హ్యూమన్ లైఫ్ అనే అంశంపై విజయవాడకు చెందిన డాక్టర్ పి. రమేష్‌బాబు వివరిస్తారన్నారు. స్టేట్ అవార్డు గ్రహీత కె. అంజలిచే కూచిపూడి నృత్యం, స్వరసామ్రాట్ డాక్టర్ శరత్చంద్ర బృందంచే సంగీత విభావరి కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి రాయలసీమ జోన్ ఐజీ ఎన్. శ్రీధర్‌రావు, డీఐజి బీవీ రమణకుమార్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర్, డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలి పాల్గొన్నారు. -
‘ఊపిరి’ పోశారు
– పెద్దాసుపత్రిలో ఇద్దరికి క్లిష్టతరమైన ఆపరేషన్లు – ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయిన బాణం –విజయవంతంగా తొలగించి ప్రాణం పోసిన వైద్యులు – నిమొనెక్టమి వ్యాధిగ్రస్తుడికి పాడైన ఉపిరితిత్తి తొలగింపు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు పెద్దాసుపత్రిలో ప్రాణాప్రాయస్థితిలో ఉన్న ఇద్దరికి అరుదైన చికిత్స చేసి ప్రాణం పోశారు. అన్నదమ్ముల గొడవలో ఓ వ్యక్తి ఛాతిలోకి బాణం చొచ్చుకుపోయింది. దీనిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించి అతడికి ప్రాణం పోశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దమంతనాల తాండకు చెందిన వీరన్న గత ఆదివారం తమ్ముడితో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో అతని తమ్ముడు వీరన్నపై బాణం వదిలాడు. అది కాస్తా అతని కుడిభుజం నుంచి ఊపిరితిత్తిలోకి చొచ్చుకుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వైద్యబృందంతో కలిసి బాణాన్ని విజయవంతంగా తొలగించి ప్రాణం పోశారు. చాలా ప్రమాదకర పరిస్థితిల్లో వచ్చిన అతనికి వెంటనే ఆపరేషన్ చేయడంతో ప్రాణం దక్కింది. ఒక ఊపిరితిత్తి తీసేసి ప్రాణం పోశారు దీర్ఘకాలంగా దగ్గు, గళ్లపడటం, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు ఊపిరితిత్తి తొలగించి ప్రాణం పోశారు. అనంతపురంకు చెందిన బాలాజి నిమొనెక్టమి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతని ఊపిరితిత్తి పూర్తిగా పాడైపోయింది. అతనికి గత సోమవారం డాక్టర్ ప్రభాకర్‌రెడ్డితో పాటు సర్జరీ వైద్యురాలు డాక్టర్ కవిత, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, భాస్కర్లు కలిసి పాడైపోయిన ఊపిరితిత్తిని తొలగించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, అతని ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఒక ఊపిరితిత్తి ఉన్నా అతను జీవించగలిగేలా ఆపరేషన్ చేశామన్నారు. ఈ రెండు క్లిష్టతరమైన ఆపరేషన్లు ప్రాంతీయ కార్డియోథొరాసిక్ విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో చేయడం గర్వంగా ఉందన్నారు. సిబ్బందిని నియమిస్తే బైపాస్ సర్జరీలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రాంతీయ కార్డియోథొరాసిక్ విభాగాన్ని గత జులై 11వ తేదిన రాష్ట్ర ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే సిబ్బందిని నియమించకుండానే దీనిని ప్రారంభించడంతో పూర్తిస్థాయిలో వైద్యసేవలు రోగులకు అందడం లేదు. అయినా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి సర్జరీ, అనెస్తెషియా వైద్యుల సహాయంతో ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విభాగానికి అవసరమైన సిబ్బందిని డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ ద్వారా నియమించుకోవాలని డీఎంఈతో పాటు మంత్రి కామినేని సైతం అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వద్ద పెండింగ్‌లో ఉంది. వెంటనే ఆ ఫైలుకు మోక్షం లభిస్తే పెద్దాసుపత్రిలోనే గుండె బైపాస్ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. -
అనాథ పిల్లల కోసం ‘ఊయల’
కర్నూలు(హాస్పిటల్): అనాథ పిల్లల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. పీఐసీయులో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను భారంగా భావించేవారు వారిని ఆసుపత్రిలోని ఊయలలో పడుకోబెట్టి వెళ్లవచ్చన్నారు. వారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూలో సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నపిల్లల విభాగానికి అదనంగా 10 ఏసీలు, 40 పడకలు అవసరం ఉందన్నారు. మందుల కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు లేకుండా మాతాశిశు భవనాన్ని ఎందుకు ప్రారంభించారని, దీనిపై ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తానన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
పెద్దాసుపత్రి నాడి దొరకదంతే!
‘ఓపి’కుంటేనే చికిత్స – ఒక్క రోజులే అన్నీ అంటే కష్టం – డాక్టర్ పరీక్షించేది ఒక రోజు – వైద్య పరీక్షలు మరోరోజు.. చికిత్స ఇంకోరోజు – చుక్కలు చూస్తున్న రోగులు – అదష్టం ఉంటే సరి.. లేదంటే? – పెద్దాసుపత్రిలో వైద్యం దైవాధీనం – కోడుమూరు మండలానికి చెందిన ఎల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత శనివారం సర్జరీ విభాగానికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. స్కానింగ్ వద్ద ఆమెను సెప్టెంబర్ 4న రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. – కష్ణగిరి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మద్దయ్య జ్వరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వచ్చాడు. వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి వైద్యులు ఓపీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఎవరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు. – కోసిగి ప్రాంతానికి చెందిన మారెప్ప కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష రాశారు. అక్కడికి వెళితే.. పరీక్ష చేసేందుకు రెండు వారాల తర్వాత రావాలని గడువు విధించారు. – కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అస్తవ్యస్తంగా మారిన ఓపీ విధానానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 మందికి పైగా రోగులు ఓపీ చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో సగానికి పైగా సాధారణ వ్యాధులతో వచ్చే వారే. వీరందరికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చికిత్స అందిస్తే సరిపోతుంది. కానీ అక్కడ వైద్యులు లేక, ఉన్నా నమ్మకం లేక పెద్దాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని గ్రామీణ ఆసుపత్రుల్లోని వైద్యులు సాధారణ వ్యాధులకూ చికిత్స చేయకుండా పెద్దాసుపత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోతున్నారు. చికిత్స కోసం ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు. ఓపీ టికెట్ కావాలంటే ఓపికుండాల్సిందే.. ఆసుపత్రిలో ఓపీ టికెట్ ఇచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దే స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అత్యవసర వైద్యం కోసం ఒకటి, ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరీక్షల కోసం రుసుము వసూలు చేసేందుకు మరో కౌంటర్ ఉంది. వీటితో పాటు స్త్రీవ్యాధులు, గర్భిణిలకు చికిత్స, చిన్నపిల్లల వ్యాధులకు మాతాశిశు భవనం వద్ద ప్రత్యేకంగా ఓపీ కౌంటర్ నిర్వహిస్తున్నారు. అయితే వందలాదిగా వచ్చే రోగులకు ఈ కౌంటర్లలో అందే సేవలు సరిపోవడం లేదు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఓపీ టికెట్లు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆసుపత్రికి వచ్చేలోపు సమయం మీరిపోతుంది. ఫలితంగా వీరు ఓపీ టికెట్ తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అదనంగా మరిన్ని ఓపీ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికీ ‘పరీక్షే’.. ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు రోగులకు పరీక్షే. ఓపీ చికిత్సకు వచ్చిన రోగులకు వైద్యులు పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాస్తారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కొన్ని అదే రోజు రిపోర్ట్ ఇస్తారు. కానీ రిపోర్ట్ తీసుకుని వచ్చేలోగా వైద్యులు ఓపీ విభాగంలో ఉండటం లేదు. ఇక ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకుని వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ రిపోర్ట్లు పట్టుకుని ఆసుపత్రిలో వైద్యుల కోసం తిరిగే వారు నిత్యం కనిపిస్తారు. రోగులను వెనక్కి పంపొద్దని ఆదేశాలు ఓపీ చికిత్సకు వచ్చే రోగులు ఇతర ఓపీ దినాల్లో వచ్చినా వారిని వెనక్కి పంపకుండా చికిత్స చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఇందుకు సంబంధించి సర్కులర్‌ను బుధవారం జారీ చేస్తాం. దీనివల్ల ఓపీకి వచ్చే రోగులు రిపోర్ట్లు తీసుకువచ్చి వెనక్కి వెళ్లకుండా చికిత్స చేయించుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. – డాక్టర్ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
దాతలచే పెద్దాసుపత్రి అభివృద్ధి
–ఏపీహెచ్ఆర్డీఐకి ప్రతిపాదన –ఎన్టిఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ కర్నూలు(హాస్పిటల్): కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా, కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను దాతలచే అభివృద్ధి చేయాలని ఆసుపత్రి ఎన్టీఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ మేరకు ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్సిట్యూట్(ఏపీహెచ్ఆర్డీఐ)కి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు గుంటూరు జిల్లా బాపట్లలో ఏపీహెచ్ఆర్డీఐ ఆధ్వర్యంలో ‘హెల్త్ కేర్ ఇన్ ఇండియా–స్ట్రాటెజిక్ పర్సెస్పెక్టీవీస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారన్నారు. సదస్సుకు మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వైద్యాధికారులు హాజరయ్యారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులను ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశంపె చర్చించారన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డీఎన్బీ కోర్సు ద్వారా స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని సూచించారన్నారు. డీఎన్బీ కోర్సు పీజీ, డీఎం,ఎంసీహెచ్ స్థాయి కోర్సుతో సమానమని ది గజిట్ ఆఫ్ ఇండియాలోనే పేర్కొన్నారని తెలిపారు. ఆ దిశగా వైద్యులు డీఎన్బీ ద్వారా స్పెషాలిటి కోర్సులు చేయాలని సూచించారు. దీంతో పాటు ఫైబర్ గ్రిడ్‌తో ఇంటర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ రోగులను పరిశీలించి, వివరాలను ఆన్లైన్ ద్వారా జిల్లా కేంద్రంలోని స్పెషలిస్టు వైద్యులకు పంపించి, వారి ద్వారా వైద్యసేవలు అందించేందుకు సైతం ప్రతిపాదనలు చేస్తున్నారన్నారు. -
పెద్దాసుపత్రిలో ఇది ‘క్యాజువల్’
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వలి గుండె సంబంధ సమస్యతో అల్లాడిపోతున్నాడు. జొహరాపురానికి చెందిన శ్రీరాములు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుల పత్తా లేదు. 8.30 గంటలు దాటినా వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. సమయం గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన అధికమవుతోంది. క్షణ.. క్షణం నరకమే. కాస్త సూటూబూటూ వేసుకొని ఎవరు కనిపించినా డాక్టరే వచ్చారేమోననే ఆతత. ప్రాణం విలువ అలాంటిది. ఈ విషయం తెలిసిన వైద్యులేమో నింపాదిగా నిర్ణీత సమయానికి గంట తర్వాత అక్కడికి చేరుకోవడం చూస్తే పెద్దాసుపత్రిలో వైద్య సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతోంది. కర్నూలు(టౌన్): ఐదు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. రోగుల ప్రాణం వీరికి పూచిక పుల్లతో సమానం. కొందరు వైద్యులు వృత్తిని దైవంగా భావిస్తున్నా.. మరికొందరి తీరు ఆసుపత్రి పరువును బజారున పడేస్తోంది. ఇక్కడి వైద్యులు నాడి పడితే.. మొండి వ్యాధులు కూడా నయమవుతాయనే ప్రఖ్యాతి.. క్రమంగా మసకబారుతోంది. విధులకు సక్రమంగా హాజరు కావాలని.. సమయ పాలనే పాటించాలనే విషయం ఇక్కడ కొందరికే వర్తిస్తుంది. ప్రధానంగా అత్యవసర విభాగంలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రాణాపాయ స్థితిలోని రోగులు వచ్చే ఈ విభాగంలో ప్రాణం పోతోందంటే కూడా స్పందించని దయనీయ పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రి ఇద్దరు రోగులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి రాగా.. ఒక్క వైద్యుడు కానీ, స్టాఫ్ నర్సులు కానీ అందుబాటులో లేరు. రాత్రి 8 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉన్నా.. వీరి జాడ లేకపోయింది. అక్కడి పరిస్థితిని రోగుల కుటుంబ సభ్యులు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డిల దష్టికి తీసుకెళ్లారు. ఇరువురూ వెంటనే అక్కడికి చేరుకొని వాస్తవ పరిస్థితిని సూపరింటెండెంట్‌కు ఫోన్లో తెలియజేశారు. ఆయన ఆదేశాలతో సీఎస్ఆర్ఎం శ్రీనివాసులు క్యాజువాలిటీకి చేరుకొని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాదాపు గంట తర్వాత ప్రత్యక్షమైన వైద్యులు రోగుల సేవకు ఉపక్రమించడం గమనార్హం. పత్తాలేని డ్యూటీ డాక్టర్ రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ మంజుల 9 గంటల వరకు కూడా విధుల్లోకి రాకపోవడం గందరగోళానికి తావిచ్చింది. అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు క్యాజువాలిటీ మంచాలన్నీ రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం పట్ల రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం సమాధానం చెప్పేందుకు పీజీ వైద్యులు కూడా లేకపోవడం చూస్తే ఈ అత్యవసర విభాగం ఏ స్థాయిలో సేవలందిస్తుందో అర్థమవుతుంది. చస్తే కానీ పట్టించుకోరా.. సామాన్య రోగులను పెద్దాసుపత్రిలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ క్యాజువాలిటీలో కూడా రోగులను పట్టించుకోకపోవడం చూస్తే అత్యవసరం వైద్యం ఏ స్థాయిలో చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. రోగులను తరలించేందుకు బాయ్‌లు కూడా లేరని.. ఇంజెక్షన్ చేసేందుకు నర్సింగ్ విద్యార్థులు కూడా అందుబాటులో లేకపోవడం చూస్తే పెద్దాసుపత్రి పరిస్థితి ఎలా తయారయిందో తెలుస్తోందన్నారు. -
కార్డియాలజి విభాగ పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజి విభాగాన్ని శనివారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల బృందం పరిశీలించింది. ఇటీవలే ఈ విభాగానికి రెండు డీఎం సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇక్కడి వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు డాక్టర్ శ్రీనివాసులు(గుంటూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల), డాక్టర్ సుబ్బారెడ్డి(ఉస్మానియా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ వీరికి పూర్తి వివరాలు అందించారు. -
కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తాం: పరీకర్
బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిని ప్రారంభించిన రక్షణ మంత్రి ఆర్మీ అధికారులు రోడ్లు మూసేస్తున్నారు.. ఇళ్లు కూలుస్తున్నారు: ఎంపీ మల్లారెడ్డి ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా అంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డులో ఆర్మీకి, సాధారణ ప్రజలకు మధ్య నెలకొన్న సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైనికాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. బొల్లారంలో పునర్నిర్మించిన 30 పడకల కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మల్లారెడ్డి.. రోడ్ల మూసివేత, మిలిటరీ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు సీఈవో వ్యవహార శైలి తదితర అంశాలను పరీకర్ దృష్టికి తెచ్చారు. ‘‘కంటోన్మెంట్‌లోని ప్రజలు కొంతకాలంగా భయాందోళనలకు గురవుతున్నారు. మిలిటరీ వాళ్లు రోడ్లను మూసేస్తున్నారు. ఇళ్లు కూల్చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్నట్లుగా పరిస్థితి నెలకొంది. పన్నులు వసూలు చేస్తున్న సీఈవో ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. మసీదు, చర్చిలకు కూడా వెళ్లలేని విధంగా రోడ్లు బంద్ చేయడం ఎందుకు? ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా? పన్ను చెల్లిస్తూ పరాయి వాళ్లలా బతకాలా’’ అని ప్రశ్నించారు. తర్వాత పరీకర్ మాట్లాడుతూ.. ‘‘కంటోన్మెంట్ బోర్డులో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మిలిటరీ దళాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. మిలిటరీ వ్యక్తులు శత్రువులు కాదు. దేశం కోసం పనిచేసే వారికి ప్రశాంత వాతావరణం అవసరం. అదే సమయంలో స్థానికంగా నివసించే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మంత్రి కె. తారకరామారావుతో చర్చించా. త్వరలోనే సమస్యలకు పరిష్కారం కనుగొంటాం’’ అని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రెండో దశకు కంటోన్మెంట్‌లోని రక్షణ భూములు ఇవ్వాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు వేరేచోట భూములు కేటాయించాలన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కంటోన్మెంట్ బోర్డులోని రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని పరీకర్‌ను కోరారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, కనకారెడ్డి, సీఈవో సుజాత గుప్తా, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య విధాన పరిషత్ విజిలెన్స్ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ, మౌలిక సౌకర్యాల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగం, క్యాజువాలిటీ, మందుల సబ్ స్టోర్స్, మెటర్నిటీ లేబర్ వార్డు, మెటర్నిటీ వార్డును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాలకు చెందిన పత్తి లక్ష్మి అనే గర్భిణిని వైద్యసిబ్బంది పనితీరు, అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వ పథకాల గురించి అడిగారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అయితే ఎన్ని డబ్బులు ఇస్తారో తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథాకాలకు సంబంధించిన వాటి గురించి సిబ్బందిని ప్రశ్నించగా వాటి గురించి తెలియదని చెప్పారు. వైద్య సిబ్బందికే అవగాహన లేకపోతే ప్రజలకు ఎలా వివరిస్తారని, ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఓపీ విభాగంలో ఔట్ పేషెంట్లకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని రెఫరల్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాల రిజిస్టర్‌ను గురించి ప్రశ్నించారు. రిజిస్టర్ చూపించడంలో అందులో ఈ వివరాలు లేకపోవడంతో మండిపడ్డారు. కనీసం రాత్రి వాడిన మందుల వివరాలు ఎక్కడ రాశారో చెప్పాలని కోరగా వాటి వివరాలు రిజిస్టర్లో వెతుకుతూ కాలయాపన చేశారు. మందుల స్టోర్ ఎక్కడుందని అడిగి ఫ్రీజ్ను తనిఖీ చేశారు. ఫ్రీజ్‌లో 361 నెంబర్‌తో ప్లడ్ శాంపిల్ ఉండగా, దానికి సంబంధించిన వివరాలు అడిగితే సిబ్బంది సమాధానం చెప్పలేదు. ప్రైవేటు ఆస్పత్రికి సంబంధించిన శాంపిల్ ఇక్కడ భద్రపర్చినట్లు తెలుస్తోంది. మూతలు ఓపెన్ చేసిన, సగం వరకు మాత్రమే వాడిన మందులు ఉండటాన్ని గమనించి ఎందుకు ఇలా ఉంచారని, ఖర్చుతో కూడిన విలువైన మందులు వృథా చేయడంపై వివరణ కోరారు. ఫ్రీజర్‌లో ఎక్స్పైరీ అరుున మందులు ఉండటంపై వివరణ ఇవ్వాలని కోరారు. లక్షల రూపాయల విలువైన మందులు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, నర్సులు బాధ్యతగా పనిచేయడం లేదని, అందుకు ఆర్ఎంఓ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోందని, హోటల్ నిర్వహణ ఇంతకంటే బాగా ఉంటుందని సిబ్బందిని హోటల్ సర్వర్‌తో పోల్చారు. సబ్ స్టోర్‌లో స్టాక్ రిజిస్టర్లో ఎక్కడా ఆర్ఎంఓ సంతకం లేదని, స్టోర్స్‌ను తనిఖీ చేసిన దాఖలాలు కనిపించడం లేదని మండిపడ్డారు. మూడు నెలల నుంచి స్టోర్స్‌లో రికార్డులు రాయకపోతే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎవరి పనులు వారు చేసుకోవాలని బాధ్యత మరిచి ప్రవ ర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డులోని టాయిలెట్స్‌ను పరిశీలించి రూ.10 బల్బు పెట్టలేని దుస్థితిలో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర ఖర్చుల కోసం లక్షల నిధులు ఉన్నా వాటిని వాడుకోవడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది పనితీరు, వసతుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణలో పూర్తిగా లోపం కనిపిస్తోందన్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని, ఓపీలో కీలకమైన రిజిస్టర్ లేదని పనిష్మెంట్ కంటే సమస్య పరి ష్కారం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు. సిబ్బం ది కొరత ఉంద ని, డ్రైనేజీ నిర్మా ణం సరిగ్గా లేదని, పారిశుధ్యం మరింత మెరుగుపడాలన్నారు. త్వరలోనే మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభం అవుతుందన్నారు. దీంతో సిబ్బంది కొరత తీరి మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర ఖర్చుల కోసం రూ.28 లక్షల 72 వేల నిధులు ఉన్నాయని తెలిపారు. -
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ: నడిగూడెం మండలంలోని నారాయణపురం క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వివరాలు...రెండు ద్విచక్ర వాహనాలు నారాయణపురం క్రాస్ వైపుకు వస్తుండగా మలుపు తిరిగే ప్రయత్నంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సిరిపురానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. (నడిగూడెం) -
రోగులకు ‘సంగీత చికిత్స’
కొచ్చి: మెళ్లో స్టెతస్కోపుతో వైద్యం చేయాల్సిన డాక్టర్లంతా తమ గానమాధుర్యంతో రోగులకు చికిత్స చేశారు. ఈ సంఘటన బుధవారం కొచ్చిలోని జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని డాక్టర్ల బృందమంతా కలసి పాతపాటలు పాడుతూ రోగులకు వైద్యం చేశారు. కళలు, సంగీతం నాణ్యమైన జీవనాన్ని పెంపొందిస్తుందని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ సంగీత చికిత్సను ప్రారంభించారు. కేరళకు చెందిన ‘కొచ్చి బియోన్నల్ ఫౌండేషన్ (కేబీఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఈ ప్రాజెక్టు చేపట్టింది.