వీరన్న ఊపిరితిత్తిల్లోంచి బాణం తీస్తున్నవైద్యులు
‘ఊపిరి’ పోశారు
Published Fri, Sep 16 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
– పెద్దాసుపత్రిలో ఇద్దరికి క్లిష్టతరమైన ఆపరేషన్లు
– ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయిన బాణం
–విజయవంతంగా తొలగించి ప్రాణం పోసిన వైద్యులు
– నిమొనెక్టమి వ్యాధిగ్రస్తుడికి పాడైన ఉపిరితిత్తి తొలగింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు పెద్దాసుపత్రిలో ప్రాణాప్రాయస్థితిలో ఉన్న ఇద్దరికి అరుదైన చికిత్స చేసి ప్రాణం పోశారు. అన్నదమ్ముల గొడవలో ఓ వ్యక్తి ఛాతిలోకి బాణం చొచ్చుకుపోయింది. దీనిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించి అతడికి ప్రాణం పోశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దమంతనాల తాండకు చెందిన వీరన్న గత ఆదివారం తమ్ముడితో గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో అతని తమ్ముడు వీరన్నపై బాణం వదిలాడు. అది కాస్తా అతని కుడిభుజం నుంచి ఊపిరితిత్తిలోకి చొచ్చుకుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అదే రోజు రాత్రి 11 గంటలకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వైద్యబృందంతో కలిసి బాణాన్ని విజయవంతంగా తొలగించి ప్రాణం పోశారు. చాలా ప్రమాదకర పరిస్థితిల్లో వచ్చిన అతనికి వెంటనే ఆపరేషన్ చేయడంతో ప్రాణం దక్కింది.
ఒక ఊపిరితిత్తి తీసేసి ప్రాణం పోశారు
దీర్ఘకాలంగా దగ్గు, గళ్లపడటం, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు ఊపిరితిత్తి తొలగించి ప్రాణం పోశారు. అనంతపురంకు చెందిన బాలాజి నిమొనెక్టమి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతని ఊపిరితిత్తి పూర్తిగా పాడైపోయింది. అతనికి గత సోమవారం డాక్టర్ ప్రభాకర్‌రెడ్డితో పాటు సర్జరీ వైద్యురాలు డాక్టర్ కవిత, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, భాస్కర్‌లు కలిసి పాడైపోయిన ఊపిరితిత్తిని తొలగించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, అతని ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఒక ఊపిరితిత్తి ఉన్నా అతను జీవించగలిగేలా ఆపరేషన్ చేశామన్నారు. ఈ రెండు క్లిష్టతరమైన ఆపరేషన్లు ప్రాంతీయ కార్డియోథొరాసిక్ విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో చేయడం గర్వంగా ఉందన్నారు.
సిబ్బందిని నియమిస్తే బైపాస్ సర్జరీలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రాంతీయ కార్డియోథొరాసిక్ విభాగాన్ని గత జులై 11వ తేదిన రాష్ట్ర ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అయితే సిబ్బందిని నియమించకుండానే దీనిని ప్రారంభించడంతో పూర్తిస్థాయిలో వైద్యసేవలు రోగులకు అందడం లేదు. అయినా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి సర్జరీ, అనెస్తెషియా వైద్యుల సహాయంతో ప్రస్తుతం ఊపిరితిత్తులకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విభాగానికి అవసరమైన సిబ్బందిని డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా నియమించుకోవాలని డీఎంఈతో పాటు మంత్రి కామినేని సైతం అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వద్ద పెండింగ్‌లో ఉంది. వెంటనే ఆ ఫైలుకు మోక్షం లభిస్తే పెద్దాసుపత్రిలోనే గుండె బైపాస్ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని వైద్యులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement