
కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తాం: పరీకర్
కంటోన్మెంట్ బోర్డులో ఆర్మీకి, సాధారణ ప్రజలకు మధ్య నెలకొన్న సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు.
బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిని ప్రారంభించిన రక్షణ మంత్రి
ఆర్మీ అధికారులు రోడ్లు మూసేస్తున్నారు.. ఇళ్లు కూలుస్తున్నారు: ఎంపీ మల్లారెడ్డి
ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా అంటూ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డులో ఆర్మీకి, సాధారణ ప్రజలకు మధ్య నెలకొన్న సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సైనికాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. బొల్లారంలో పునర్నిర్మించిన 30 పడకల కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మల్లారెడ్డి.. రోడ్ల మూసివేత, మిలిటరీ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు సీఈవో వ్యవహార శైలి తదితర అంశాలను పరీకర్ దృష్టికి తెచ్చారు.
‘‘కంటోన్మెంట్‌లోని ప్రజలు కొంతకాలంగా భయాందోళనలకు గురవుతున్నారు. మిలిటరీ వాళ్లు రోడ్లను మూసేస్తున్నారు. ఇళ్లు కూల్చేస్తున్నారు. పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా పరిస్థితి నెలకొంది. పన్నులు వసూలు చేస్తున్న సీఈవో ఇళ్లను కూడా కూల్చేస్తున్నారు. మసీదు, చర్చిలకు కూడా వెళ్లలేని విధంగా రోడ్లు బంద్ చేయడం ఎందుకు? ఇక్కడి ప్రజలు తీవ్రవాదులా? పన్ను చెల్లిస్తూ పరాయి వాళ్లలా బతకాలా’’ అని ప్రశ్నించారు. తర్వాత పరీకర్ మాట్లాడుతూ.. ‘‘కంటోన్మెంట్ బోర్డులో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు మిలిటరీ దళాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. మిలిటరీ వ్యక్తులు శత్రువులు కాదు. దేశం కోసం పనిచేసే వారికి ప్రశాంత వాతావరణం అవసరం. అదే సమయంలో స్థానికంగా నివసించే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మంత్రి కె. తారకరామారావుతో చర్చించా. త్వరలోనే సమస్యలకు పరిష్కారం కనుగొంటాం’’ అని చెప్పారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రెండో దశకు కంటోన్మెంట్‌లోని రక్షణ భూములు ఇవ్వాలని, అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు వేరేచోట భూములు కేటాయించాలన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కంటోన్మెంట్ బోర్డులోని రోడ్లు, ఇతర సమస్యలు పరిష్కరించాలని పరీకర్‌ను కోరారు. కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, కనకారెడ్డి, సీఈవో సుజాత గుప్తా, రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.